ఫిడేలు రాగమ్బులు.. బాంబులు

  • 771 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

తెలుగు సాహిత్యంలో ఒక భూకంపం, ఒక సునామీ, ఒక బాంబుల వర్షం.. ఒక ఏకే 47 విధ్వంసం - వెరసి ‘ఫిడేలు రాగాలు డజన్‌’. ముఖపత్రం నుంచి ముగింపు పుట వరకూ ఎన్నో సంప్రదాయాలకు ‘పుటం’ పెట్టే విచిత్రాలు! ఇవన్నీ ఎగసిపడ్డ కవితా సంపుటి పేరు ‘ఫిడేలు రాగాల డజన్‌’. చిత్రమేంటంటే ముఖపత్రం మీద ఫిడేలు బొమ్మ తప్ప ఆ అక్షరాలు లేవు. రాగాల డజన్‌ అని మాత్రమే ఉంటుంది. దీని అంకితమూ ప్రత్యేకమే. అందులో ‘‘మృణాళినికి, కాదు కళ్యాణికి.. కాదు ఇరువురకు’’ అని రాశారు. 
కవులందరికీ
ఎవరి (అభి)మతాలు వారికి ఉంటాయి. కవిగా పఠాభిది రెటమతం. అరాచక వాదానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరకదుగాక దొరకదు. ఎందరో పెద్దల మాట ఇది! ‘‘ఇది రాగాల డజన్‌ కాదు రోగాల డజన్‌ అనాలి’’ అని బెజవాడ రామచంద్రారెడ్డి తిట్టిపోశారు. అయితే మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం ఇచ్చిన చలం చిత్రంగా పఠాభిని పైకెత్తేశారు. ‘‘తెలుగు దేశాన ఈ రాగాల డజను/ డజను దెబ్బలుగా/ అరడజన్‌ పూలుగాను/ వేయి కన్నీటి చుక్కలు వేడిగాను/ నూరు వెక్కిరింపు నాలికల్‌/ జాచినట్లు/ దిక్కుదిక్కుల పకపకల్‌/ వెకవెకల్‌ పగిలి/ చెవుల ఘోషించి కలవరపరచగలవు’’ అని చలం కలం ధ్రువపత్రం ఇచ్చేసింది. మరి మహాకవి శ్రీశ్రీ మాత్రం తక్కువ అన్నారా? ఫిడేల్‌ రాగాల డజన్‌ చదివి ‘విచిత్రమే సౌందర్యం.. సౌందర్యమే విచిత్రం!’ అనేశారు. ఆ మాటకొస్తే పఠాభి అన్న పేరే విచిత్రం! ఆయన పేరు పట్టాభి రామరెడ్డి. పేరులోనే పెన్నిధి అంటారు. తన విచిత్రమైన ధాటిని చూపించడానికి పట్టాభి రామరెడ్డి ‘పఠాభి’ అయిపోయారు. పైగా తన ఆత్మకథ కూడా విచిత్రంగా చెప్పుకున్నారు. ‘‘నాకు విచిత్రంబగు భావాలు కలవు/ నాకన్నులందున టెలిస్కోపులు/ మయిక్రాస్కోపులున్నవి’’ అని చెప్పేశారు. కవితాప్రియులకు విచిత్రాలు చూపించాలంటేే ‘ఫిడేలు రాగాల డజన్‌ చూడర బాబూ చూడర బాబూ’ అనాల్సిందే. 
      ఈ కవితా సంపుటిలో ఆత్మాశ్రయ కవిత్వం ఉంది. తెలుగు కవుల ఆత్మాశ్రయ ధోరణి చూస్తే కవులు వాళ్లను వాళ్లు గొప్పగా చేసుకోవడమో, తక్కువగా అంచనా వేసుకోవడమో కనిపిస్తుంది. ‘‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’’ అన్నది విప్లవకవి శ్రీశ్రీ ఆత్మాశ్రయమైతే, ‘‘నాకుగాదులు లేవు నాకుషస్సులు లేవు, దిగిరాను దిగిరాను దివి నుండి భువికి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’’ అన్నవి భావకవితా పితామహుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆత్మాశ్రయం! కవిత్వంలో కవే పాత్రధారిగా కనిపిస్తాడనుకుంటాం. కానీ పఠాభి ఆత్మాశ్రయం పద్ధతే వేరు! వెక్కిరింపు పఠాభికి మహా ఇంపు! ‘‘అక్కడక్కడ ఈ పద్యాలలో/ వచ్చునట్టి పఠాభి అను పేరుగల పాత్రకు/ గ్రంథకర్తకు ఏమాత్రం సంబంధం లేదని/ గమనింపు’’ అని వెటకారం చేశారు. ‘‘కృష్ణపక్షంలోని ‘కృష్ణ’కును దాని గ్రంథకర్త నామంలోని ‘కృష్ణ’కును ఎలా సంబంధం లేదో అలాగే’’ అన్నారు వెటకారంగా.
అసలు పఠాభి వేరు
శ్రీశ్రీ వ్యక్తిత్వంలోని లోపాలు అందరికీ తెలుసు. అనుమానం ఉన్నవాళ్లు శ్రీశ్రీ ఆత్మకథ ‘అనంతం’ చదివితే సరి! అయితే వాటిని పట్టించుకోకుండా ‘నువ్వు రాసిన కవితలు గుబాళిస్తుంటే నువ్వు తాగి పారేసిన సీసాలకంపు మాకెందుకు’ అని కాళోజీ లాంటి వాళ్లు అన్నారు కూడా! ఇదంతా ఎందుకంటే పఠాభి సాహిత్యపరంగా, వ్యక్తిత్వపరంగా తననొక అరాచకవాదిగా చిత్రించుకున్నా, నిజజీవితంలో అందుకు పూర్తి విరుద్ధంగా గొప్ప విలువలు పాటించిన వ్యక్తి. పఠాభి వ్యవహారాల్లో ఆయన కవిత్వం వేరు.. వ్యక్తిత్వం వేరు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు.... 
      ఆత్మకథ అనే గేయంలో ‘‘నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రల్తో/ పద్యాలనడుముల్‌ విరగదంతాను’’ అని రాశారు. పద్యాలను వ్యతిరేకించేవాళ్లందరికీ ఏడున్నర దశాబ్దాల నుంచి ఇంతకు మించిన ఆయుధం లేదు. కానీ పఠాభి హృదయం అది కాదు. ఆయన పద్యప్రేమికుడు. నేను 1978 నుంచి కొన్నేళ్ల పాటు పఠాభి రచనల మీద పరిశోధన చేశాను. అందులో భాగంగా  ఓసారి హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఆయన్ను కలిశాను. ఓ పద్యగ్రంథాన్ని ఆసక్తిగా చదువుతున్నారు. ‘‘పద్యాల మీద మీకున్న వ్యతిరేకత మారిపోయిందా?’’ అని అడిగాను. ‘‘అలాంటిదేమీ లేదు. ఫిడేల్‌ రాగాల డజన్‌ రాసేటప్పుడూ వ్యతిరేకత లేదు’’ అన్నారు. పైగా పద్యాలంటే నాకు ఇష్టం అనేశారు. 
      తన ఆశయాలకు వ్యతిరేకంగా అరాచకవాదిలో పరకాయప్రవేశం చేసి ఆయన ఫిడేలు రాగాల డజన్‌ రాశారు. పఠాభి తానే ప్రతి నాయకుడి పాత్ర ధరించి విశృంఖల ప్రేమికుడి అవతారమెత్తారు. ‘సీత’ గేయంలో... ‘‘రామయ్యగా వుంటకు ఎలా యిష్టం వుంటుంది?/ రామయ్యగా వుండే దానికంటే/ రావణుని గావాలని నా వాంఛ/ పది మూతులతోను, నీ పెదవులను/ మృదుశరీరమును, వదనమును అదుముతాను/ ఇరవయి కళ్ల సంకెళ్లతో నిన్ను/ నిరతము బందీ చేస్తాను/ ఇరవయి లావు చేతుల్తో నిన్ను/ నా పక్షానికి లాగుకొని/ చిక్కని కవుగిలింతలో/ అయిక్యం చేసుకొంటాను నిను.. నాలో సీతా!’’ అన్నారు. తన మీద తానే బురద చల్లుకున్న పఠాభి నిజజీవితంలో స్వచ్ఛమైన ప్రేమికుడు. ఇతర మతానికి చెందిన స్నేహలతను ప్రేమించి, వందలకోట్ల ఆస్తి రాకపోయినా ఫర్వాలేదని చెప్పి తెగించి, ఎదిరించి పెళ్లిచేసుకున్న ఆదర్శప్రాయుడు. ఆయన మహావదాన్యుడు తిక్కవరపు రామిరెడ్డి కుమారుడు. ‘‘మీ నాన్నగారు మంచివారని అందరూ అంటారు కదా!’’ అని పఠాభిని అడిగాను. ‘‘అవును మా నాన్నగారు అందరికీ మంచివారే.. నాకు తప్ప’’ అన్నారాయన.
      పఠాభి నిజజీవితంలో అద్భుత సంస్కారవంతుడు. కోడిగుడ్డు సైతం ముట్టని శాకాహారి. విశృంఖల కాముకత్వానికి ప్రతీకలైన ‘ఆరోజు, కామాక్షి కోక’లాంటి గేయాలను చదివితే, పఠాభేనా వీటిని రాసిందని ఆయన్ను దగ్గరగా తెలిసినవారు ఆశ్చర్యపడతారు.
కాలాన్ని దాటి...
పఠాభి కాలం కన్నా ముందుండి ఇప్పటి అవలక్షణాలను ఎప్పుడో తన కవిత్వంలో చూపించారు. ‘‘ఇంగ్లీష్‌ భాషాభాండారంలో నుండి/ బందిపోటుజేసి కావాల్సిన/ మాటల్ను దోస్తాను/ నా యిష్టం వచ్చినట్లు జేస్తాను’’ అన్న పఠాభి దుస్సాధ్య కాంపిటీషన్, హంగ్రీకనులు, హయిహీలుయాన వంటి సమాసాలు వాడారు. ‘ఫిడేలు రాగాల డజన్‌’లో పఠాభి మానవీయ కోణం ఉంది. ‘‘సర్వమబద్ధం/ కానీ నీవుమటుకు నిష్ఠురమగు నిజానివి/ నీడపడనటువంటి నిర్మలమగు నిజానివి’’ అని వేశ్య గురించి ప్రస్తావిస్తూ ఓ కవితలో అంటారు: అంతేకాదు ‘‘నీవు సంఘానికి/ వేస్టు పేపర్‌ బాస్కెట్‌వా!’’ అని అడుగుతారు. ‘‘మష్టుమషాణము పడవేయబడునట్టి దిబ్బవా?’’ అని సానుభూతి చూపిస్తారు. ‘మరీనా’ కవితలో ‘‘సమూహమంతా కరిగిపోయింది, మిగిలింది/ సమాజములోని ‘మడ్డి’మటుకు/ అన్నం ముద్దకయి కక్కుర్తి పడి/ శరీరాన్ని సవారికిచ్చే జవరాళ్లు’’ అని సానుభూతి చూపించారు. ‘‘తొమ్మిదణాల సినిమా టిక్కెటునకు/ తమ బహిర్దేహము మీద/ యాత్ర చేయుటకు హక్కునిచ్చే/ కొందరాంగ్లోఇండియన్‌ అభాగినులు’’ అని ‘జాబిల్లి’ కవితలో ఆక్రోశించారు. పఠాభి ‘ఫిడేల్‌ రాగాల డజన్‌’ను రాసింది చౌకబారు సుఖాలకు అలవాటుపడాలని ఉపదేశం ఇవ్వడానికి కాదు అది కాదు.. కూడదన్నదే అందులోని అసలు సిసలు సందేశం.
      పఠాభి భావ కవిత్వాన్ని వ్యతిరేకించారు. ‘‘భావకవిన్‌ కాన్నేనహంభావ కవిని’’ అనేశారు. ఆయన నోబెల్‌ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ప్రత్యక్ష శిష్యుడు. శాంతినికేతన్‌లో చదువుకున్నారు. పఠాభిలోని వాస్తవిక దృష్టి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కవిత్వ ధోరణిని సైతం వ్యతిరేకించేట్టు చేసింది. పఠాభిలో మహాపండితుడు కూడా ఉన్నాడు. ‘‘క్రాస్వర్డు పజిల్స్‌లాగున్న/ నీకన్నులను సాల్వ్‌చేసే మహాభాగ్యం/ ఏ మానవునిదో కదా’’ అనే పఠాభి పలుకులు ‘‘నజానేభోక్తారం కమిహసముపస్థాస్యతివిధిః’’ అనే కాళిదాసు శ్లోకానికి అనువాదమని కురుగంటి సీతారామయ్య పేర్కొన్నారు.
సమాజాన్ని చూసి... 
ప్రత్యక్ష అనుభవం లేకుండా ఒట్టి పుస్తక పాండిత్యం కుమ్మరించడం పఠాభికి సుతరామూ ఇష్టం ఉండదు. ‘వసంతం’ కవితలో ఇలా ఎగతాళి చేస్తారు... ‘‘నేటి పత్రికలోన/ ప్రచురింపబడ్డ పండితోత్తముని పద్యాలు/ చదివినావా ఋతురాజునుగూర్చి!/ తాలాశ్వత్థ హింతాలనారికేళన్యగ్రోథ/ జంబీరపున్నాగ పలాశరసాల సాలాదివృక్షాలు చిగిర్చినాయంట!/ నవ్వొస్తున్నది నాకీ పండితుడు/ అమరమ్ములోని వనౌషధి వర్గాన్నంతా/ గుప్పించి విడిచినందులకు ఒక్క వృక్షాన్ని కూడా స్వయంగా చూచిన పాపానపోడు’’!! 
      పఠాభి కవిత్వంలో పొడుపు కథలు ఉండవు. అన్నీ ఎత్తిపొడుపు కథలే. సమాజంలోని దుస్థితిని చూసి దానిని రూపుమాపాలని పఠాభి కలం పట్టారు తప్ప మరింత విషం చిమ్మడానికి కానేకాదు. 1972లో ఈ పుస్తకానికి పఠాభి రాసిన పీఠిక వల్ల ఆ విషయాలు తేటతెల్లమవుతాయి. ‘ఫిడేలు రాగాల డజన్‌’ రచనకు పూర్వరంగాన్ని అందులో ఆయన వెల్లడించారు. ‘‘కలకత్తాలో ఉన్న వేలం వెర్రి వ్యాపార కార్యకలాపాలు, చిత్పూర్‌రోడ్డులోని వేశ్యావాటికలు, విపరీతమైన దురాశతో అమాయకత్వాన్ని దోపిడీ చేసే తీరు నన్ను బాగా కలతపెట్టాయి... నేను పడుకుని కిటికీలోంచి బయటకు చూస్తే నిండు పున్నమి చంద్రుడు పొగతో నిండిపోయిన ఆకాశంలోంచి దొంగచాటుగా దోబూచులాడుతున్నట్టు కనిపించింది. భావ కవిత్వంలోనూ, ప్రబంధాలలోనూ, ఠాగూర్‌ గీతాలలోనూ నేను చదివిన ఉపమ, ఉత్ప్రేక్ష లాంటి వివిధ అలంకారాలు హఠాత్తుగా అర్థరహితంగా మారినట్టు అనిపించింది. ఆ క్షణంలోనే నా దృక్పథం ఏమిటో, ఏ రకంగా దాడి చేయాలో స్ఫురించింది. అదే ఈ గ్రంథానికి ప్రాతిపదిక. నాలో నేనే దుఃఖిస్తున్నట్టుగా తోచింది. నిజానికి నా మనసు ‘‘అశాంతి నికేతన్‌గా ఉంది’’ అని బాధపడ్డారు.
      అయితేనేం కవి అంతరంగం గ్రహించని కవిపండితలోకం పఠాభి మీద దుమ్మెత్తిపోసింది. పఠాభి ధోరణిని అరాచకమైన విశృంఖలత్వం అని కవి కోకిల దువ్వూరి రామిరెడ్డి విమర్శించారు. అంతేకాదు పఠాభి కవిత్వాన్ని జామెట్రీ కవిత్వం అని ముద్రవేశారు. ‘‘వలపు పస్తులతో నవసి మతి చెడిన యువకుని ఉన్మత్త ప్రలాపములుగా నాకు స్ఫురించినది’’ అని ఆయన విమర్శించారు. ఏం చేస్తాం బాణం వేయడంలో ఎవరి కోణం వారిది.
      పఠాభికి ప్రత్యేక రాజకీయ భావాలున్నాయి. ఆయన సోషలిస్టు నాయకుడు కూడా! ‘‘ఎవర్నని యనుకొంటిరో మీరు నన్ను!/ నేను పఠాభిని.../ కాంగ్రెస్‌ రాష్ట్రపతి స్థానానికి కోసం/ బాబూ సుబాసు బోసుతో పోటీ చేసి/ ఓడిపోయిన డాక్టర్‌ పట్టాభిని/ గాన్నేను, మరో పఠాభిని’’ అని ఆత్మకథలో చెప్పుకున్నాడు. ఈ కవితలో తాను సోషలిస్టునని తిట్టకండనీ అన్నారు. 
ఉపమా పట్టాభిరామస్య
పఠాభి వర్ణనలు అతినవ్యంగా ఉంటాయి. 75 సంవత్సరాల కిందట రాసినా ఇప్పటికీ అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ‘ఉపమా కాళిదాస’తోపాటు పట్టాభిరామస్య’ అని కూడా అనాలి. జాబిల్లిని పట్టుకుని ‘‘కనిపిస్తావు నీవు/ స్పెన్సర్స్‌ కంపెనీ/ లేక వయి టవేసులోకి/ దారితప్పి ప్రవేశించి/ తందరాడుచున్న సరిబేసిగ్రామస్తున్లాగ’’ అనేశారు.
      పోలీసు కవిత అద్భుతమైంది. ‘‘ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ భరతనాట్యంబాడుచున్న ప్రశాంత ప్రకాశ ముఖంబుతోడి నటర్షి చూడామణిలాగా కన్పిస్తున్నాడు!’’ అంటారు. ఎంత గొప్ప పోలిక. ‘‘ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నటరాట్టులాగా మృత్యుజయ నృత్యంబును సల్పుచుంటాడు సతతము’’ అని కూడా అన్నారు. దృశ్యసాక్షాత్కారం పఠాభి కవితలోని విశిష్ట జీవలక్షణం. పోలీసు కవిత, కామాక్షికోక.. ప్రతి కవిత ఇందుకు గొప్ప నిదర్శనాలు.
      ‘ఆరోజు’లో ‘‘ప్రాచీ దిశ సూర్య చక్రం రక్తవర్ణంతో/ కన్పట్టింది.. ప్రభాత రేజరు నిసినల్లని/ చీకట్ల గడ్డంబును షేవ్‌ జేయన్‌ కత్తిగాటట్టుల’’ అంటారు. ఇలాంటి ఉపమానాలను ఎవరైనా కనీసం ఊహించగలరా!
      పఠాభి ఊహలు ఎంచక్కా గుసగుసలాడతాయి! ‘‘యలక్ట్రిక్‌ దీపాలకుమల్లే ఈ మూన్లయిటుక్కూడా/ స్విచ్చుండిన ఎంత బాగుండును’’ అంటారు ‘కామాక్షికోక’లో. ఫిడేలు పాశ్చాత్యవాద్యం. దానిమీద పఠాభి కవితా నైవేద్యం!
అక్షరాలతో ఆటలు
శబ్దాలను చిత్ర విచిత్రంగా రాసి ‘అచ్చోసి’ దేశం మీదికి వదలడం పఠాభి విద్య. మొదట్లో చిత్రగుప్త పత్రికలో ‘‘అడ్డము తిరిగెను అవనీస్థలి/ తలక్రిందులైనది ధరణీతలమ్ము’’ అని అచ్చులో చిత్రాలుచేసి గందరగోళం పట్టించిన మేధావికి పదాలను ఖండఖండాలు చేయడం ఎంతపని! ‘ఫిడేలు రాగం’ కవితలో ‘‘పదప్‌ రేమికులు/ ఇన్‌గ్‌ లీష్టానివి, నన్‌నున్జేపట్‌ట వద్‌దని/ గద్‌దిన్చినా కూడ, స్‌వీట్‌ హార్‌ట్‌’’ అంటూ రాసేసి బుర్రల్తో ఆడుకున్నారు. ‘‘మయ్డియరాగ్రా! మీ వారన్దరు సనాతనా చార్‌యుల్‌ ముఖమ్విరిచి, ఇన్‌ గ్‌ లీష్టానిని నన్‌నున్జే పట్‌టవట్‌దని గద్‌ దిన్చి నా కూడ నీవు మహా సాహసన్తో, రుమాన్‌టిక్‌గా మ్‌యారేజ్జేసుకొన్‌నావు గదా! స్‌ వీట్‌ హార్‌ ట్‌!’’... ఇది శాసనాల భాష కాదు, పఠాభి శాసన భాష! కవులు నిరంకుశులు (కవయః నిరంకుశాః) అంటారు. పఠాభి కన్నా నిరంకుశుడు తెలుగు సాహిత్యం మొత్తం మీద దొరకడు.
      శ్లేషపట్టు ఉన్న భట్టుమూర్తి వసుచరిత్ర ఆహాఓహో అనిపించింది. పిల్ల వసుచరిత్రలు ఎన్నో పుట్టుకొచ్చాయి. అయితే ‘పన్‌’డితుడైన కవి పఠాభి ఒక్కడే. అందుకే ఆయన రాసిన ‘ఫిడేలు రాగాల డజన్‌’ లాంటిది మళ్లీ పుట్టలేదు. అయితే పఠాభి ప్రభావం మాత్రం కొందరు కవులు, రచయితల మీద ఉంది. ఈనాడు ఆరుద్ర ముద్ర అంటారే అది (ఫోర్జరీ అనకపోయినా) నిస్సందేహంగా పఠాభి ముద్రే. అది దాటి ఇప్పటికీ ఇంకా ఆరుద్ర బైటపడలేదు అని నగ్నముని ‘తూర్పుగాలి’కి రాసిన పీఠికలో శ్రీశ్రీ అన్నారు. 
      పఠాభి ‘ఫిడేల్‌ రాగాల డజన్‌’తోపాటు ‘నీలగిరి నీలిమలు, పఠాభి పన్‌చాంగం, కయిత నాదయిత’ గ్రంథాలు రాశారు. ‘కయిత నాదయిత’లో మాత్రా ఛందస్సుల విశ్వరూపం కనిపిస్తుంది. ‘ఫిడేలు రాగాల డజన్‌’ రాసిన పఠాభి ఈ గ్రంథం రాశారా అంటే అంత నమ్మశక్యం కాదు. ‘పన్‌చాంగం’ జ్యోతి పత్రికలో అచ్చయింది. రోజుకో పన్ను లెక్కన నెలరోజులకు సరిపడా పన్నులు ఏడాదిపాటు ఇచ్చారు పఠాభి. ‘‘పఠాభి పంచాంగంలోని పసిడి పలుకుల విటమిన్‌ బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనసుకు ఆరోగ్యము, ఉల్లాసము సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను’’ అని శ్రీశ్రీ ప్రశంసించారు. 
      పఠాభి గొప్ప చలనచిత్ర దర్శకుడు కూడా. ఆయన కన్నడచిత్రం ‘సంస్కార’కు దర్శకుడు. ఆయన అర్ధాంగి స్నేహలత ఆ సినిమాలో కథానాయిక. ఆ చిత్రానికి అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది.
      ‘అనితర సాధ్యం నా మార్గం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. అయితే ఆయన మార్గాన్ని ఎంతోమంది కవులు అనుసరించారు. అలా చెప్పుకోకపోయినా పఠాభి మార్గం మాత్రం నిస్సందేహంగా అనితరసాధ్యం.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం