వరంగల్లు తెలుగు... వీనులవిందు

  • 742 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। టి.శ్రీరంగస్వామి

  • సాహితీ విమర్శకులు
  • వరంగల్లు
  • 9949857955
డా।। టి.శ్రీరంగస్వామి

తెలుగునేలను ఏకం చేసి వైభవంగా పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యానికి కేంద్ర బిందువు... తిక్కన, పాల్కురికి సోమన, శివదేవయ్య, పోతన లాంటి కవి పండితులు నడిచిన నేల... ఓరుగల్లు. కుతుబ్‌షాహీలు, నిజాంల పాలనలో మహమ్మదీయ ప్రాబల్యానికీ లోనైన ప్రాంతమిది. అలాంటి వరంగల్లు తెలుగు వైభవం కాకతీయుల తోరణమంత!
ఈ జిల్లా అనేక రాజ్యాలు, సంస్థానాలకు నెలవు. కురవి, జఫర్‌గఢ్, మేడారం, సర్వాయిపాపడి షాపురం, మల్లంపల్లి, ఆత్మకూరు లాంటి సంస్థానాలు చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తాయి. కురవి ఒకప్పటి ప్రాచీనాంధ్ర నగరం. కాకతీయ మహాసేనాని గోన గన్నారెడ్డి మానుకోట ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. మాను అంటే చెట్టు, చెట్లే కోటగా కలిగింది కనుక ఇది మానుకోట. నిజాం నవాబుల పాలనలో మహబూబాబాదుగా మారిపోయింది. అడవి బాపిరాజు ‘గోన గన్నారెడ్డి’ నవలలో మానుకోటకు సంబంధించిన కాకతీయ రాజ్య విశేషాలను చిత్రించారు. పోతన భాగవతం భక్తి పారవశ్యత, ఆ పక్కనే పాల్కురికి సోమనాథుడు అందించిన జానుతెనుగు కవిత్వం, ద్విపదలు, అష్టకాలు, రగడలు, సీసాలు ఓరుగల్లు గడ్డ మీద సాహితీ చైతన్యాన్ని రగిల్చాయి. మనుమసిద్ధి రాయబారిగా కవిబ్రహ్మ తిక్కన గణపతి దేవుని ఆస్థానాన్ని సందర్శించి, ఆయన ఆస్థానంలోనే భారతాన్ని వినిపించాడట!
కాలక్రమేణా వస్తున్న మార్పులను అనుసరించి ఇక్కడి జన భాష కూడా పరిణామం చెందుతూనే ఉంది. నిజాం పాలనలో అధికార భాష ఉర్దూ. పైగా వరంగల్లు ప్రత్యేక సుబాగా (ఇప్పటి రాష్ట్రం) ఉండింది. దాంతో ఇక్కడి పలుకులు ఉర్దూ మిశ్రమంగా సాగుతాయి. 
ఉర్దూ ప్రభావం
నైసర్గికంగా జనగామ, వరంగల్లు, మహబూబాబాదు, నర్సంపేట, ములుగు, పరకాలలు జిల్లాలో పురాతన తాలూకాలు. ములుగు, పరకాల, నర్సంపేటల్లో అటవీ ప్రాంతం గిరిజన సంస్కృతికి ఆటపట్టు. హైదరాబాదు నుంచి దిల్లీ, విజయవాడలకు వెళ్లే రైలుమార్గాలు ఈ జిల్లా నుంచి వెళ్లడం వల్ల ఇక్కడి నాగరికత ఎన్నో మార్పులకు లోనైంది. మహబూబాబాదు, జనగామ, వరంగల్లు ప్రాంతాల ప్రజల భాషలో గౌరవం స్థానంలో ఇజ్జత్, దుర్మార్గుడు అనేందుకు బద్మాష్, అయోమయానికి పరేషాన్, దృష్టికి నజర్, జిల్లా విద్యాధికారికి నాజర్, విడమరిచి చెప్పు అనేందుకు ఖుల్లాఖుల్లా అనడం, తీరికకు పుర్సత్, కృతజ్ఞుడుకు ఇమాన్‌దారి, బండికి గాడీ, ఆఫీస్‌కు మారుగా దఫ్తర్, చింతించకు అనేందుకు బదులుగా బేఫికర్, నీతి స్థానంలో నియత్‌... తదితర ఉర్దూ పదాలు కొల్లలుగా కనిపిస్తాయి. అయితే వరంగల్లు, జనగామ, నర్సంపేట, మహబూబాబాదు పట్టణ ప్రాంతాల్లో ఆధునిక ప్రామాణిక భాష వాడుక ఎక్కువ. జిల్లా మాండలిక సొగసులు గ్రామీణుల నాలుకల మీద తాండవమాడతాయి. వరంగల్లు మాండలికం ప్రస్తుతం పాఠ్యపుస్తకాలు, పత్రికల్లో వాడే ప్రామాణిక భాషలో కలిసిపోయి దర్శనమిస్తుంది.
      జిల్లా ప్రజలు మాట్లాడే భాష మచ్చుకు ఇలా ఉంటుంది... ‘‘ఏంది బిడ్డా నాయిన పరేషాన్‌ జేసిండంట. దవాఖానకు తీసుకుపోయిండ్రా!’’, ‘‘ఏం లేదన్నా! ఏందో గుబులు పెట్టుకున్నడు, చెప్పడు. గా డాక్టరేమో ఫర్వాలేదు, సోంచాయించొద్దని (ఆలోచించవద్దని) చెప్పిండు. దిగులు పడొద్దన్నడు’’ ఇలా తెలుగు, ఉర్దూల జమిలిగా కనిపిస్తుంది వరంగల్లు గ్రామీణుల సంభాషణ. వరంగల్లులోని అన్ని ప్రాంతాల్లో ప్రామాణిక భాషతోపాటు మాండలిక పదాలూ విరివిగా వాడుకలో ఉన్నాయి.
      దండాలు అనేందుకు శరణార్తులు, నమస్కారం అన్న అర్థంలో పబ్బతిపట్టడం, పెద్దకష్టం వచ్చింది అనేందుకు అరిగోస, వ్యవసాయాన్ని ఎవుసం, ఉపవాసం స్థానంలో ఒక్కపొద్దు, కూలికి మారుగా కైకిలు, మెట్లను తంతెలు, రకరకాలుగా అనేందుకు తీరొక్కలి, పొద్దూకి (రాత్రికి), పద్దాక (ప్రతిసారి/ మళ్లీ మళ్లీ), యాడికి (ఎక్కడికి), యాలబడంగ/ వేళబడంగ (చీకటి పడేవేళ), పైకం (డబ్బు), పెద్దయ్య (తండ్రి అన్న), ఇకమతు (ఉపాయం), ఇన్నొద్దులు (ఇన్నిరోజులు), అల్ల (వద్దు), మల్ల (తిరిగి), పొల్ల (అమ్మాయి), గల్ల (డబ్బులపెట్టె), కాక (బాబాయి), ఇమానంగా (ప్రమాణంగా), ఏగిలివారంగ (తెల్లవారుజామున, చుక్కపొడవంగ), బిర్ర (తొందరగా/ జల్ది), పెద్దవ్వ (పెద్దమ్మ), చిన్నవ్వ (పిన్ని) లాంటి పదాల్లో ఇక్కడి మాండలికం గుబాళిస్తుంది. కొన్ని పదాలు ఇతర జిల్లాల్లోనూ వ్యవహారంలో ఉన్నాయి.
సాగు సంబంధ భాష
కాకతీయులు వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేశారు. అందుకే రైతుకు సంబంధించిన కొన్ని పదాలు, సామెతలు ఇక్కడ ప్రత్యేకంగా వినిపిస్తాయి. ఇవి పక్క జిల్లాలైన కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, మెదక్‌లలోనూ వాడుకలో ఉన్నాయి. తొలకరి సమయాన్ని ఇక్కడ ‘పునాస’ అంటారు. ఇక మెట్ట, మాగాణి అనే తెలుగు పదాల స్థానంలో ఉర్దూ ప్రాబల్యం కనిపిస్తుంది. జిల్లాలో పంట పొలాలను ఖుష్కి (మెట్ట), తరి (మాగాణి) అని పిలుస్తారు. 
      వ్యవసాయం చేసేవాళ్లు ఆరుగాలం కష్టపడాలి. నిత్యం పొలం చూసుకోవాలి. లేకపోతే పంట సరిగా చేతికి అందదు. దీనిని సూచించేదే ‘పొలంకాడికి పోనోని ఎవుసం- పొయిల వెట్టినట్టే ఉంటదట’ అనే సామెత. ఒక పనిచేస్తూ మధ్యలో మరో పనిలో తలదూర్చే వాళ్లను ఉద్దేశించి ‘కోడెగిత్తలతో ఎవుసం జేత్తే ఆవులు గనవడంగనే అవుతలపడ్డయట’ అనే సామెత ఉపయోగిస్తారు. మామూలు పనే చేయలేని వ్యక్తి పెద్దపెద్ద పనులు చేస్తానని డంబాలు పలికితే వాడే సామెత ‘ఖుష్కిల దున్ననోడు తరిలనైతే తప్పక దున్నతనన్నడట’. పెద్దగా కష్టపడకుండా ఎక్కువ సంపాదించుకుంటే ‘కూలికి పోయినమ్మకంటే పరిగెకు పోయినమ్మకే లాభమట’ లాంటి సామెతలు ఇక్కడి గ్రామీణుల్లో ప్రత్యేకం. 
      వీటికి తోడుగా కడ్పులున్న సుఖం కాశికి పోయినా దక్కదట, ఇంటింటికి మంటిపొయ్యి, ఆశకు ఊశిగాడు సచ్చిండంట, ఉట్టికి గాకుండ, సొర్గానికి గాకుండ అయితది, చెప్పుకుంటె సిగ్గువాయె, చెప్పకుంటె మానం బాయె, పని పాతరబెట్టి, ఊరు జాతర బోయినట్టు, ఇచ్చుకున్నోడు ఈగ, పుచ్చుకున్నోడు పులి, అచ్చికాలు బుచ్చికాలు ఆర్నెల్లు... ఇచ్చుక దంతం మూణ్నెల్లు, అయినోడు అయిదం చెట్టు- కానోడు కానుగచెట్టు, బొక్క తినంగ భోగం... లెక్క చెప్పంగ దుఃఖం, సోకులు సోలెడు... మాటలు మానెడు లాంటి సాధారణ సామెతలు కూడా ఇక్కడి ప్రజల నోళ్లలో నానుతుంటాయి. శిష్ట శిష్టేతర భాషలో తెలుగు నేలంతటా ఉండే తేడాలే ఇక్కడా కనిపిస్తాయి. జిల్లాలో వాడుక భాషలో వివిధ తాలూకాల్లో తేడాలు అంతగా కనిపించవు, కానీ, ఖమ్మం జిల్లా గార్లకు సమీపంలో ఉన్న మరిపెడలో మాత్రం కొంచెం ఖమ్మం యాస కలుస్తుంది. ములుగు ప్రాంతంలో వచ్చిండు స్థానంలో అచ్చిండు అనే వాడుక కనిపిస్తుంది.
సాహితీ వారసత్వం
ఒద్దిరాజు సీతారామచంద్రరావు, ఒద్దిరాజు రాఘవరంగారావు, సముద్రాల లక్ష్మీనరసయ్యలు వరంగల్లు తొలి కథకులలో చెప్పుకోదగినవారు. మాడపాటి హనుమంతరావు ఏ సౌకర్యాలూ లేని కాలంలోనే ‘తెనుగు’ (1922) పత్రికను స్థాపించారు ఒద్దిరాజు సోదరులు. దాశరథి, కాళోజీ, వానమామలై సోదరులు, జానపద పరిశోధకుడు బిరుదురాజు రామరాజు, జనధర్మ, వరంగల్‌వాణి పత్రికల సంపాదకుడు ఎం.ఎస్‌.ఆచార్య, ప్రజామిత్ర సంపాదకుడు దివ్వెల హనుమంతరావులు, తెలుగు సంస్కృత సాహిత్యాల అభివృద్ధికి తోడ్పడిన ఆకారపు నరసింహం, ‘శోభ’ సాహిత్య మాసపత్రిక సంపాదకులు దేవులపల్లి రామానుజరావు లాంటి వారి సారస్వత వారసత్వాన్ని ఎందరో కొనసాగిస్తున్నారు.
      ఇప్పడు రోజువారీ వాడుకలో మాండలికంతో కలిసిపోయి ఆధునిక ప్రామాణిక భాష వ్యవహారంలో ఉన్నా,  మారుమూల ప్రాంతాల్లో మాండలికానిదే పైచేయి. ‘‘ఉన్న ఒక్కెకరం, నీ పెండ్లికి కర్సుపెడితే, తర్వాత వాడేం చేసుక బతుకుతడు’’ లాంటివాటిలో గ్రామీణుల నిసర్గ ఉచ్చారణ ఆత్మీయతా స్వరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. పోతనామాత్యుడు చెప్పిన ‘సంగడి’తనం ఈ నేలమీద తన సువాసనలు వెదజల్లుతూనే ఉంటుంది.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం