‘ఉపాధ్యాయులు ఉత్తేజితుల్ని చేస్తారు. గ్రంథపాలకులు ఆ ఉత్తేజాలకు సంపూర్ణత్వం సిద్ధింపజేస్తారు’ అంటారు అమెరికన్ నవలా రచయిత రే బ్రాడ్బ్యురీ. నిజమే... పొత్తపుగుడి ఏలికలంటే చదువరుల, ఎరుకపీటల వంతెనలే. వాళ్లు పొత్తపుగుళ్ల పూజారులు. అలాంటి వ్యవస్థకు భారతదేశంలో పునాదులు వేసి, గ్రంథాలయశాస్త్రాన్ని మన విద్యావ్యవస్థలో ఒక అంశంగా చేసి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన మహనీయుడు శియాలి రామామృత రంగనాథన్. భారత గ్రంథాలయశాస్త్ర పితామహుడైన ఆయన జన్మదినం ఆగస్టు 12. అదే భారత గ్రంథపాలకుల దినోత్సవమైంది.
వెనకటికాలంలో తాళపత్ర గ్రంథాలను భాండాల్లో (కుండల్లో) దాచే పని చేయడం వల్ల ‘గ్రంథ భాండాగారు’లనే పేరు వాడుకలోకి వచ్చింది. ఆంగ్లంలో మూడు బీ లుంటే గ్రంథాలయం అన్నారు. అవి ‘బుక్స్, బిల్డింగ్, బ్రెయిన్’. ఒక మైదానంలో వేల పుస్తకాలు ఉంటే అది గ్రంథాలయమైపోదు. పొత్తాలతో కూడిన భవనం మాత్రమే ఉన్నా గ్రంథాలయం కాదు. వివిధ జ్ఞానశాఖల పుస్తకాలను చదువరులకు అందించే మూడో బీ అయిన గ్రంథపాలకుడు (లైబ్రేరియన్) ఉన్నప్పుడే అది గ్రంథాలయం అవుతుంది. ఆర్థిక, పాలనా వ్యవహారాలలో గ్రంథాలయాలకు పాలకులంటూ వేరుగా ఉన్నప్పటికీ, గ్రంథ భాండాగారులను గ్రంథాలయ పాలకులనీ గ్రంథపాలకులనీ అనడం వారికిచ్చే ప్రాధాన్యానికి తార్కాణం.
నిర్ణీతమైన పనివేళలుండి, కులమత వర్గ విచక్షణ లేకుండా పౌరులందరికీ ఉపయోగపడేది పౌర గ్రంథాలయం. ప్రభుత్వ, ప్రైవేటు, విశ్వవిద్యాలయ, కళాశాల, పురపాలకసంఘ, కొన్నిచోట్ల పంచాయతీ ఇలా ఎన్నిరకాల గ్రంథాలయాలున్నా అన్నింట్లో జరిగేది జ్ఞానశాఖల ప్రగతి పంపిణీయే. వాటిని నిర్వహించేది గ్రంథపాలకులే. గ్రంథాలయ రంగ మహనీయుల సేవాస్ఫూర్తిని ఇబ్బడిముబ్బడిగా పొందడానికి ఉద్దేశించిందే గ్రంథపాలక దినోత్సవం.
గ్రంథాలయశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గౌరీశంకర శిఖర సదృశంగా తలెత్తుకుని నిలిచేలా చేసిన ఘనత ఎస్ ఆర్ రంగనాథన్ది. ఆయన 1892 ఆగస్టు 9న తమిళనాడులో తంజావూరు జిల్లా శియాలిలో సీతాలక్ష్మి, రామామృత అయ్యర్ దంపతులకు జన్మించారు. ప్రభుత్వ దస్త్రాల్లో ఆగస్టు 12 అని నమోదైంది. దాంతో ప్రభుత్వం ఆ రోజునే గ్రంథపాలక దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే రంగనాథన్‌కు ముందే తెలుగువారైన అయ్యంకి వేంకటరమణయ్య భారతదేశంలో పౌర గ్రంథాలయోద్యమానికి ఊపిరులూదారు. రంగనాథనే అయ్యంకిని గ్రంథాలయ రంగంలో తనకు గురువుగా భావించేవారట. అయ్యంకి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పడింది. తెలుగునాట పెద్ద సంఖ్యలో గ్రంథాలయాల స్థాపన వికాసవంతంగా జరిగింది. దాన్నే ప్రజా గ్రంథాలయోద్యమంగా చరిత్రకారులు పేర్కొన్నారు.
ఆంధ్ర తెలంగాణలు - గ్రంథపాలకులు
రెండు ప్రాంతాల్లోనూ గ్రంథాలయోద్యమం అంటే పొత్తపుగుళ్ల స్థాపన, గ్రంథాల సేకరణ, నిర్వహణ వంటి వాటికే ఎక్కువగా చెందినా, ఆ ఉద్యమకర్తలు రాన్రానూ శాస్త్రీయ దృష్టిని పెంచుకున్నారు. అందుకే ‘గ్రంథాలయ సేవకులు, గ్రంథాలయ సేవావ్రతులు, సేవానిరతులు, గ్రంథాలయ పాలకులు, గ్రంథాలయాధికారులు అన్నీ పర్యాయపదాలే’ అంటారు వెలగా వెంకటప్పయ్య. వీరంతా గ్రంథాలయోద్యమాన్ని వివిధ ఉద్యమాల మూలోద్యమంగా దర్శించి పాల్గొన్నారు. అయ్యంకి, సురవరం, పాతూరి, కోదాటి, వావిలాల, వెలగా ప్రభృతులు ఉద్యమాభివృద్ధిలో భాగంగా గ్రంథాలయాలు శాస్త్రీయంగా ఎదగాలని ఆశించారు. ఇందులో కొందరు తెలుగులో గ్రంథాలయశాస్త్ర గ్రంథాలూ రాశారు.
చాలీ చాలని జీతాలతో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నా... ఎందరో గ్రంథపాలకులు అంకితభావంతో సేవలు చేయడం వల్లనే ప్రైవేటు గ్రంథాలయాలు జ్ఞానరక్షణ చేయగలిగాయి. విశ్వవిద్యాలయ, కళాశాలల గ్రంథాలయాలు, కొన్ని ప్రభుత్వ గ్రంథాలయాలు శాస్త్రీయ వైజ్ఞానిక దృష్టితో అభివృద్ధిలో ఉన్నా, ఇలా లేనివీ ఎన్నో ఉన్నాయి.
శ్రీశ్రీ వంటివారిని సైతం ప్రభావితం చేసిన అబ్బూరి రామకృష్ణారావు గ్రంథపాలకులకే శిరోభూషణం వంటివారు. రాయలసీమ రత్నం అమళ్లదిన్నె గోపీనాథ్, అయోధ్యాపురం కృష్ణారెడ్డి, ఆళ్ల రాఘవయ్య, తెలుగు విశ్వవిద్యాలయ గ్రంథపాలకుడు ఎమ్.శంకరరెడ్డి, వర్గీకరణ ప్రముఖుడు పి.ఎన్.దేవదాసు, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయ జీవితాంకితుడు ఎమ్.ఎల్.నరసింహారావు, కాళోజీ నారాయణరావు, కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయం వ్యవస్థాపకులు జానమద్ది హనుమచ్ఛాస్త్రి, అనకాపల్లి శారదా గ్రంథాలయ విశిష్ట సేవకులు కొడమంచిలి ఎర్రయ్య పంతులు, నిడదవోలు మాలతి, పాతూరి విజయకుమార్, ఏలూరుకు చెందిన బి.వి.దాశరథి, వేటపాలెంకు చెందిన లంక శివరామకృష్ణ, గౌతమీ గ్రంథాలయంకి చెందిన మహీధర జగన్మోహనరావు, రేటూరి గిరిధరరావు, కథానిలయ నిర్మాత కాళీపట్నం రామారావు... ఇలా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కోణాల్లో సేవలందించిన ఆదర్శ గ్రంథపాలకులు ఎందరో ఉన్నారు. మనదేశంలో గ్రంథాలయాల నిర్వహణను పవిత్రకార్యంగా భావించే ఎంతోమంది గ్రంథపాలకులకు స్ఫూర్తి మాత్రం రంగనాథనే.
విద్యా రంగనాథన్
౧౮౯౭లో విజయదశమినాడు అక్షరాభ్యాసం చేసుకున్న రంగనాథన్, ప్రాథమిక దశలో తిరువేంకటాచారి వంటి సంస్కృత ఉపాధ్యాయుల ప్రభావంతో శైవ వైష్ణవ భక్తుల గురించి, సంస్కృతి గురించి తెలుసుకున్నారు. ౧౯౦8 ౧౯౦౯ మధ్య ఒకవైపు అనారోగ్యం బాధిస్తున్నా ప్రథమశ్రేణిలో మెట్రిక్యులేషన్లో నెగ్గిన పట్టుదల ఆయనది. ౧౯౧౬లో ఎమ్మే ఉత్తీర్ణతతో ‘లెక్కల్లో’ మనిషి అయ్యారు. యాంత్రికంగా విద్య నేర్చుకోవడానికి ఆయన వ్యతిరేకం. అధ్యాపకులతో సత్సంబంధాలు నెరపుతూ... చర్చోపచర్చల్లో జ్ఞానార్జన చేయడానికి ఆయన ప్రాధాన్యమిచ్చేవారు. రంగనాథన్ మొదటి భార్య రుక్మిణి అకాల మరణం చెందారు. దాంతో శారదను పెళ్లాడారు. భర్త కార్యకలాపాలకు నిండుమనసుతో సహకరించిన ధర్మచారిణి ఆమె.
మంగళూరు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకత్వం రంగనాథన్ తొలి ఉద్యోగం. తర్వాత 1921లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో గణిత, భౌతికశాస్త్రాల అధ్యాపకులుగా పనిచేశారు. ‘పుట్టుకవి’ అన్నట్లు ఆయనను ‘జన్మతః ఉపన్యాసకులు’ అనేవారు. విద్యార్థుల్ని ఆకట్టుకుంటూ విజ్ఞానాన్ని ప్రసారం చేయడం, సదస్సులు నిర్వహించడం ఆయన దైనందిన కృత్యాలు.
గ్రంథాలయశాస్త్ర పంచసూత్రాలు
1. పుస్తకాలున్నది ప్రజల ఉపయోగానికే
2. ప్రతి చదువరికీ తనదైన పుస్తకం ఉంటుంది.
3. ప్రతి పుస్తకానికీ తనదైన పాఠకుడు ఉంటాడు.
4. పాఠకుల సమయాన్ని మిగిల్చాలి.
5. గ్రంథాలయాలు అభివృద్ధి చెందే సంస్థలు.
- ఎస్.ఆర్.రంగనాథన్
గణితం నుంచి గ్రంథాలయశాస్త్రానికి
మూడేళ్లపాటు బోధకుడిగా సేవలందించిన రంగనాథన్, 1924లో మద్రాసు విశ్వవిద్యాలయ గ్రంథపాలకుడిగా వెళ్లారు. ఆ విశ్వవిద్యాలయానికి ఆయనే మొట్టమొదటి గ్రంథపాలకుడు. ఆ పొత్తపుగుడి రంగనాథన్‌కు ప్రయోగశాలగా ఉపయోగపడింది. ఫలితాలను గ్రంథాలయశాస్త్ర విజ్ఞాన గ్రంథఫలాలుగా, భారతీయ గ్రంథాలయశాస్త్ర ఆలోచనా ఫలాలుగా ప్రపంచం రుచి చూసింది. ‘నేను గ్రంథపాలకుణ్ని కావాలని కోరుకోలేదు. సమయ సందర్భాల వల్ల అలా రూపుదాల్చాను. కానీ అలా అయినందుకు తర్వాత ఎప్పుడూ విచారించాల్సిన అవసరం రాలేదు’ అని చెప్పారాయన.
గ్రంథాలయశాస్త్రంలో శిక్షణ కోసం రంగనాథన్ 1925లో ఇంగ్లాండు వెళ్లారు. ఆరు నెలల శిక్షణలో భాగంగా ఆయన ఎన్నో గ్రంథాలయాలను అధ్యయన దృష్టితో దర్శించారు. అవి ప్రజలకు ఏవిధంగా శాస్త్రీయంగా ఉపయోగపడుతున్నాయో లోతుచూపుతో గ్రహించారు. అప్పుడే మనదేశ గ్రంథాలయ వైజ్ఞానిక అవసరాలను గమనించారు. ఉత్సాహం, ప్రణాళికా రచనా పటిష్ఠత, కాలసద్వినియోగ దృష్టి, సామాజిక ప్రేమ... ఇన్ని అంశాలు సమైక్యమవడంతోనే ఆయన గ్రంథాలయశాస్త్ర పరిశోధనా రంగనాథుడయ్యారు. గ్రంథాలయశాస్త్రానికి సాంఖ్యకశాస్త్రాన్ని అనువర్తిస్తూ లైబ్రమెట్రీ భావనను అభివృద్ధి చేసిన ఘనుడు రంగనాథన్.
గ్రంథాలు ఇస్తేగా!
ఒక గ్రంథపాలకునికి సన్మానం జరుగుతోంది. దండలు, శాలువాలు సన్మాన తతంగాలూ జరుగుతున్నాయి. సన్మానితుడైన గ్రంథపాలకుని గురించి చెబుతూ ఓ పెద్దాయన ‘‘గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రంథపాలకుని అధీనంలో ఏ పుస్తకాలూ పాడవలేదు, నలగలేదు, పుస్తకాలు పోలేదు కూడా. అందుకే ఈయనకు సన్మానం’’ అన్నారట. వెంటనే సభికుల్లో ఒకరు లేచి ‘‘అసలాయన ఎవరికైనా పుస్తకాలిస్తేగా’’ అన్నారట!!
ఆయన కృషి వల్లే 1931లో మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రంథాలయశాస్త్ర విభాగం ప్రారంభమైంది. అనంతర కాలంలో కాశీ హిందూ, దిల్లీ విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయశాస్త్ర ఆచార్యులుగా బాధ్యతలు చేపట్టారు. ఆయన చొరవ వల్లే దేశంలో తొలిసారిగా మద్రాసు ప్రభుత్వం 1957లో పౌర గ్రంథాలయ చట్టం తెచ్చింది. యునెస్కోను ఒప్పించి దిల్లీలో డాక్యుమెంటేషన్ సెంటర్ ఏర్పాటయ్యేలా చేసిందీ ఆయనే. 1972 సెప్టెంబరు 27న స్వర్గస్థులయ్యేలోగా ఆయన అనుభవం, పరిశోధనాలోచనలు, భవిష్య వర్తమానావసరాల అధ్యయనాలు అన్నీ గ్రంథావతారాలు దాల్చాయి. గ్రంథాలయాల రంగంలో ఆయన కృషికి గుర్తింపుగా దిల్లీ, పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్‌ను, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం రావ్ సాహెబ్, భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రదానం చేశాయి. గ్రంథాలయశాస్త్ర వికాసం కోసం ఆయన 1963లో శారదా రంగనాథన్ ఎండోమెంట్ స్థాపించారు. 1965లో గ్రంథాలయశాస్త్ర జాతీయ పరిశోధన ఆచార్యులుగా నామినేట్ అయ్యారు. మెల్విల్ డ్యూయీ దశాంశ వర్గీకరణ అప్పటికే ప్రసిద్ధమైనా, కోలన్ వర్గీకరణకు రూపమివ్వడం ఆయన జ్ఞానదృష్టికి నిదర్శనం.
రంగనాథన్ గ్రంథరాజాలు
గ్రంథాలయాల నిర్వహణ గురించి ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు. అందులో... ఫైవ్లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్సు, కోలన్ క్లాసిఫికేషన్, రామానుజన్ ద మేన్ అండ్ ద మేథమెటిక్స్, క్లాసిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్, న్యూ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ లైబ్రరీస్, రిఫరెన్సు సర్వీసు, కేటలాగింగ్ ప్రాక్టీసు, ఫిజికల్ బిబ్లియోగ్రఫీ ఫర్ లైబ్రేరియన్స్, ఫిలాసఫీ ఆఫ్ లైబ్రరీ క్లాసిఫికేషన్, ఏ లైబ్రేరియన్ లుక్బ్యాక్, సజ్జెషన్స్ ఫర్ ఆర్గనైజేషన్ లైబ్రరీ ఇండెక్స్ లాంటివి ఏ భాషలోని, ఏ ప్రాంతంలోని, ఏ స్థాయిలోని గ్రంథాలయ పాలకులకైనా మార్గదర్శక సూత్రాలను అందిస్తాయి. ఇంకా లైబ్రమెట్రీ, బిబిలొమెట్రీ వంటి కొత్త గ్రంథాలయశాస్త్ర పదాలను సైతం రంగనాథన్ సృష్టించారు. వర్తమాన భవిష్య భారత గ్రంథాలయ వైభవ ప్రగతికి రంగనాథన్ సూచనలు శిరోధార్యం. ఆయన ఆలోచన శ్లోకం వంటిదని, దానికి వివిధ అర్థాలూ తాత్పర్యాలూ, చర్చించుకొనేవి ఉంటాయన్నది విజ్ఞుల మాట.
ఇప్పుడు తెలుగు నేలకు వస్తే మన గ్రంథాలయాలను ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. ‘గ్రంథాలయంలో నాకు దైవదర్శనం అవుతుంద’న్న రంగనాథన్ భావనను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు రాష్ట్రాల పాలకులు పొత్తపుగుళ్ల అభివృద్ధి, వాటి పునరుజ్జీవనం మీద దృష్టిపెట్టాలి. ఇక గ్రంథపాలకులు కూడా పాఠకులకూ జ్ఞానపీఠాలైన గ్రంథాలయాలకు మధ్య వారధులుగా, సారథులుగా ఉండాలి. ఒక మహోన్నత నాగరిక ఆధునిక ప్రగతిశీలక మానవుని రూపకల్పనలో మనం భాగస్వాములవుతున్నామనే ఆనందం, సంతృప్తీ ప్రతి గ్రంథపాలకుడికీ ఉండాలి.
* * *