‘‘ప్రపంచంలో ఇన్ని భాషలున్నా... కొన్నిసార్లు, మన మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పలేమని... చెప్పటం సాధ్యం కాదనీ!’’
‘‘పోరాడే తత్వం అలవాటయ్యాక, జీవితంలో దేనిలోనైనా... ఎప్పటికైనా, గెలుపు తప్పదు’’
‘‘సమస్యలకు పరిష్కారాలు ఎక్కడి నుండో ఎగురుకుంటూ వచ్చి వాలవు. వాటిని పరిష్కరించడానికి కంకణం కట్టుకున్న వారి నమ్మకాల్లో నుంచి, వారి పట్టుదలల నుంచి వస్తాయి’’
‘‘ప్రేమంటే ఏంటి? ఒంటరితనం వల్ల వచ్చే భయాన్ని పోగొట్టి ప్రశాంతతనిచ్చే ఆసరా. భయమంటే ఏంటి? ఆ ఆసరాను కోల్పోతామేమోనన్న మానసిక భావన. మనిషి ఎప్పుడూ తోడును కోరుకునేది అందుకే - మొదట తల్లిదండ్రుల నుంచీ, తర్వాత కాలంలో స్నేహితుల నుంచీ, ఆపై జీవిత భాగస్వామి నుంచీ, చివర్న బిడ్డలూ మనువల నుంచీ’’
ఇలాంటి వాక్యాలు ఎక్కడ కనపడతాయి? మంచి కథలోనో... నవలలోనో... ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథంలోనో కదా! అది ఏదైనా కానీ, ఇలాంటి భావ వ్యక్తీకరణతో కూడిన రచన ఉత్తమమైన సాహిత్యమే కదా. ‘నవతరంగం.కాం’లో అలాంటి రచనలు చాలా ఉన్నాయి. అయితే... అవన్నీ ఒకే అంశం చుట్టూ అల్లుకున్నవి. అయినా వేటికవే విభిన్నంగా ఉంటాయి. ఇంతకూ ఆ అంశం ఏంటంటే... ‘చలనచిత్రం’. అవును అదే. సినిమా అంటే దృశ్యరూపంలోని సాహిత్యమని నమ్ముతూ... ప్రపంచ భాషల్లోని ఆణిముత్యాల్లాంటి చలనచిత్రాల విశేషాలను తెలుగులో అందించేందుకు ఏర్పాటైన వెబ్సైట్ ‘నవతరంగం.కాం’. పేరుకు ఇది సినిమా వెబ్సైట్ అయినా ఇందులో బజారుస్థాయి పుకార్లు కనిపించవు. మసాలా వార్తలు, అసభ్య చిత్రాలు, ద్వంద్వార్థ శీర్షికలు, అర్థం పర్థం లేని సమీక్షలు ఉండవు. చలన చిత్రాన్ని దృశ్య కావ్యంగా భావిస్తూ, సాహితీ సమీక్ష చేసే పద్ధతిలోనే వ్యాసాలను అందిస్తుందీ వెబ్సైట్. అందుకే అందులోని రచనల్లో పైన చెప్పుకున్న వాక్యాల్లాంటివి కోకొల్లలుగా కనిపిస్తాయి.
మొదలెలా?
అది 2007. నెల్లూరుకు చెందిన వెంకట్ శిద్ధారెడ్డి లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. చలనచిత్రాల మీద తనకున్న ఇష్టంతో ఈ వెబ్సైట్ ప్రారంభించారు. ఇందులో అన్ని భాషల్లోని ఉత్తమమైన చిత్రాల పరిచయాలు, వాటి కథల విశ్లేషణలు, చలనచిత్ర నిర్మాణంలోని సాంకేతిక అంశాల మీద వ్యాసాలు, సమీక్షలు రాస్తుండేవారు. వాటిని చూసిన ఔత్సాహికులు కొందరు తమ వంతుగా వ్యాసాలు రాసి పంపారు. అలా ఈ వెబ్‌సైట్‌కు మంచి ఆదరణ లభించింది. శిద్ధారెడ్డి ఆసక్తికి ఆయన భార్య రంజని సాంకేతిక పరిజ్ఞానం, శ్రమా తోడయ్యాయి.
ఏమేముంటాయి?
‘చూడదగ్గ చిత్రాలు, ప్రపంచ సినిమా, చిత్ర చరిత్ర...’ తదితర ముప్ఫైకి పైగా విభాగాల్లో ఇందులో వ్యాసాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్తవి తోడవుతుంటాయి. అంతర్జాతీయ చలనచిత్ర విశేషాలను అందివ్వడంతో పాటు సినీ నిర్మాణంలోని వివిధ అంశాలను చక్కగా విశ్లేషించే రచనలు ఇందులో చాలా ఉన్నాయి. అలాగే, చలనచిత్ర రంగంలో కృషి చేసిన ప్రముఖుల జీవిత విశేషాలు, ముఖాముఖిలు ‘నవతరంగం’ ప్రత్యేకం. ఇక భాషలకు అతీతంగా మంచి చిత్రాల పరిచయం, కొత్త చిత్రాల సమీక్షలనూ ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం మామిడి హరికృష్ణ, జంపాల చౌదరి తదితర ఇరవై మందికి పైగా రచయితలు ఈ వెబ్సైట్లో సభ్యులుగా ఉన్నారు. ‘అతిథి’ పేరిట అడపాదడపా రచనలు చేసే వాళ్లూ ఎందరో ఉన్నారు. అన్నట్టు, ఇందులో ప్రకటనలేమీ ఉండవు. లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న ఈ వెబ్‌సైట్‌లోని అన్ని వ్యాసాలనూ ఉచితంగా చదువుకోవచ్చు.
‘‘అంతర్జాలంలో తెలుగులో రాయడం సాధ్యమవడంతో ఎంతోమంది ఎన్నో వినూత్న ప్రయత్నాల ద్వారా ఎన్నో విశేషాలను నలుగురితో స్వచ్ఛమైన తెలుగు భాషలో పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే సినిమా అనే ప్రక్రియకు వినోదమొక్కటే ప్రధానంగా కాకుండా మరో దృష్టికోణం కలగజేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన సైట్ ఇది’’ అనే వెంకట్, రంజనిల ఆలోచనలకు అచ్చమైన ప్రతిబింబం ఈ వెబ్సైట్.
నాకు సినిమాలంటే ఆసక్తి. నా భార్య రంజనీ శివకుమార్‌తో కలిసి ఈ వెబ్సైట్ ప్రారంభించా. పగలు ఉద్యోగం, రాత్రివేళల్లో వెబ్సైట్ పని చూసుకుంటూ మూడేళ్లు కష్టపడ్డా. సాంకేతికంగా వెబ్‌సైట్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో రంజని చాలా సాయం చేసింది. తను కూడా సాఫ్ట్వేర్ ఇంజినీరే. వెబ్‌సైట్‌కు ప్రశంసలు రావడంతో చాలామంది వ్యాసాలు రాయడానికి ముందుకొచ్చారు. వారిని నవతరంగం సభ్యులుగా చేర్చుకుని సినిమాల గురించి అన్ని వివరాలనూ అందిస్తున్నాం. లండన్‌లో ఇద్దరం కొన్నేళ్లు ఉద్యోగాలు చేశాక, మాకు ఇష్టమైన రంగాల్లోకి వెళ్లాలనుకున్నాం. అందుకే ఉద్యోగాలను వదులుకున్నాం. భారత్‌కు తిరిగి వచ్చేశాం. నేను సినీరంగం వైపు వచ్చా. ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్‌లో రచయితగా ఉన్నా. రంజని కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయనిగా పేరు తెచ్చుకుంది.
- వెంకట్ శిద్ధారెడ్డి