జానపద గేయాల సెలయేరు

  • 1722 Views
  • 16Likes
  • Like
  • Article Share

    డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

  • స‌హాయ ఆచార్యులు, తెలంగాణ విశ్వవిద్యాల‌యం
  • డిచ్‌ప‌ల్లి, నిజామాబాదు
  • 9866917227
డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

అక్షర ప్రపంచం విస్తరించని కాలంలోనే, అజ్ఞాత స్వరాల నుంచి అందివచ్చిన సాహిత్య వారసత్వం జానపదుల పాటలు. అలాంటి పాటల సెలయేరు తెలంగాణ. ఇక్కడి జానపదుల పాటల్లో సెలయేటి నీటిలోని తేటతనం కనిపిస్తుంది. తీయదనమూ ఉంది.
తెలంగాణలో పాటకు
ప్రాణం పెట్టే గుణం ఉంది. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకమైన జానపద గీతాలున్నాయి. వివిధ సందర్భాలలో వాటిని వేడుకతో పాడుకునే ప్రజానీకం ఇప్పటికీ కనిపిస్తారు. తెలంగాణలో ఈ పాటల ప్రవాహానికి కారణమూ ఉంది. ఇక్కడ శాశ్వత జలాధారాలు తక్కువ. వర్షాధార వ్యవసాయం ఇక్కడి సంప్రదాయం. ఇందులో కావాల్సినంత శ్రమ ఉంటుంది. ఈ శ్రమను మరచిపోయే క్రమంలో జానపదులు పాటను ఆశ్రయిస్తారు. ఆనాటి పాల్కురికి సోమనాథుడి నుంచే జానపద గీతికల ప్రస్తావనలు కనిపిస్తాయి. ఆ పరంపర ఈనాటికీ ప్రస్ఫుటమవుతోంది. అప్పటి నిజాం వ్యతిరేక పోరాటానికి జానపద బాణీల్లోని పాటలు గొప్ప స్ఫూర్తినిచ్చాయి. ఇది చారిత్రక సత్యం. ఇటీవలి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ జానపద మార్గంలోని పాటలు విప్పార వినిపించాయి. ఆబాల గోపాలం నాలుకల మీద నాట్యం చేశాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ పాటల్లోని తీయదనానికి ఆకర్షితులయ్యారు.
      తరచి చూస్తే జానపదుల పాటల మీద జరిగిన పరిశోధనలు కూడ తెలంగాణ నుంచే ఎక్కువ. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం దీనికి నాందీ గీతాన్ని పాడింది. సుప్రసిద్ధ పరిశోధకులు ఆచార్య బిరుదురాజు రామరాజు జానపద పరిశోధనలకు విశ్వవిద్యాలయ స్థాయిలో పునాదులు వేశారు. ఆయన తరువాత ఆచార్య నాయని కృష్ణకుమారి, వెల్దండ రఘుమారెడ్డి, రావి ప్రేమలత, కసిరెడ్డి వెంకటరెడ్డి, రుక్నుద్దీన్, గోపు లింగారెడ్డి - ఇంకా ఎంతోమంది తెలుగు జానపద వాఙ్మయంపై విలక్షణ పరిశోధనలు చేశారు. ఇప్పటికీ అలాంటి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. జానపదుల పాటల బాణీల్లో రాసిన సినీగీతాలు తెలుగునాట అపూర్వ స్పందనల్ని అందుకున్నాయి. ఆచార్య సి.నారాయణరెడ్డి వంటి సినీ గేయకర్తల రచనల్లో తెలంగాణ జానపద గేయ సౌరభాలు గాఢంగా అల్లుకుని పోయాయి.
ఆ మాటల్లో ఎంత మాధుర్యమో!
జానపద గేయాలు మౌలికంగా - మౌఖిక వాఙ్మయ రీతికి చెందినవనే సంగతి తెలిసిందే. మౌఖిక వాఙ్మయంలో స్నిగ్ధత ఎక్కువ. ఆశువుగా జాలువారే మాటలే ఇక్కడ పాటలవుతాయి. అందులో భాష, ఛందస్సు, వ్యాకరణాల పట్టింపులు ఉండవు. ఒక్క మాటలో చెబితే జానపదుల పాటలు ఊయల్లో ఊగే పసిపిల్లాడి బోసి నవ్వుల వంటివి. అన్నట్టు - పసిపిల్లల్ని నిద్రపుచ్చే ప్రయత్నంలో భాగంగా పాడే ఈ పాట బాగా ప్రచారంలో ఉండేది.
పిట్ట రావే పిట్టా, పిల్లల తల్లీ,
పిల్లలకు పాలిచ్చీ, పల్లెలకు పోవే,
పల్లెలకు పోయొచ్చీ బుట్టలల్లుకోవే...

      ఈ పాటలో చక్కటి కవిత్వాభివ్యక్తి ఉంది. పాటను ఆర్ద్రమైన పద్ధతిలో పాడుతూంటే పసిపిల్లలు హాయిగా నిద్రపోతారు. 
      పసిపిల్లవాడి ఏడుపును చూడలేని మాతృమూర్తి హృదయానికి ప్రతిబింబం వంటి మరో పాట కూడా బాగా ప్రఖ్యాతం. ఇదీ ఆ పాట...
ఏడవకు ఏడవకు వెర్రి నాయిన్నా
ఏడిస్తే నీ కండ్ల నీలాలు గారూ
నీలాలు గారితే నే చూడలేను
పాలైన గారవే బంగారు తండ్రీ..

బంగారు బతుకమ్మ ఉయ్యాలో
జానపద గేయాలకు నెలవు బతుకమ్మ పండగ. బతుకమ్మను ఆడే ప్రతి సాయంత్రం మహిళలు ఎన్నో పాటలు పాడుకుంటారు. ఇవి విశిష్టమైన బృంద గేయాలు. ‘‘ఉయ్యాలో’’ అన్న మాట పలు పాటల్లో పునరావృతమవుతుంది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో ప్రచారంలో ఉన్న ఈ పాటలోని కొన్ని వాక్యాలు...
ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో, ఒక్కూరికిచ్చి                     ఉయ్యాలో
ఒక్కడే మా యన్న ఉయ్యాలో, వచ్చన్నపోడు                     ఉయ్యాలో
ఎట్లెట్ల చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డమాయె                     ఉయ్యాలో...

      ఇలా సాగే పాటలో ఎంతో పరమార్థం ఉంది. చెల్లెళ్లకు తమ అన్న పట్ల ఉన్న అనురాగం, స్థూలంగా పుట్టింటి మీద మమకారం ప్రతిధ్వనిస్తున్న మాటలవి. అన్నయ్య కూడా చెల్లెళ్ల దగ్గరికి రావాలనే అనుకుంటాడు. కానీ, కుదరదు. రాలేకపోవడానికి అతనికీ ఓ కారణం ఉంటుంది. ఇలా అన్నాచెల్లెళ్ల అనిర్వచనీయ బంధాన్ని ఈ పాట ఆవిష్కరిస్తోంది. తరతరాల నాడు ఈ పాట కట్టిన అజ్ఞాత కవి ఎవరో ‘అల్పాక్షరాలలో అనల్పార్థ రచన’ తెలిసిన ప్రతిభావంతుడు.
      బతుకమ్మ పాటలు నూటికి తొంభై శాతం దేశి ముద్రతోనే ఉంటాయి. అయితే అక్కడక్కడా ఒకటి రెండు మార్గ పద్ధతికి దగ్గరగా ఉన్నట్టూ కనబడతాయి. ఇవి కూడా తెలంగాణలో బాగానే ప్రచారంలో ఉన్నాయి. అందుకొక ఉదాహరణ... 
శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై  తోచునమ్మా
భారతీ సతివయ్యు బ్రహ్మకిల్లాలివై
పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీ లక్ష్మీ వయ్యూ గౌరమ్మ భార్యవైతవి హరికినీ...
ఎన్నెన్నో రూపముల ఏడేడు లోకముల
ఉన్న జనులకు కోర్కె లన్ని సమకూర్చును
కన్నతల్లి వైతివీ గౌరమ్మ కామధేనువ వైతివీ..

హోలీ హోలీల రంగ హోలీ
తెలంగాణలో హోలీ పండగను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. హోలీకి ముందు కామ దహనం జరుగుతుంది. అంతకు ముందు రోజుల్లో కాముని పున్నమి పాటలు ఊరూరా, వాడవాడలా ప్రతిధ్వనించేవి. ఇప్పుడు మారిన సాంకేతిక ప్రపంచంలో ఈ పాటల సవ్వడి కొంచెం బలహీనపడినా, వాటి ఉనికి మాత్రం పదిలంగానే ఉంది. ‘‘హోలీ హోలీల రంగ హోలీ చెమ్మ కేళీల హోలీ’’ అని ఉత్సాహంగా బాలురు, యువకులు రాత్రివేళల్లో పాడుకుంటారు. అందులో ఒక పాట...
రుంగు రుంగు బిల్ల రూపుల దండ
దండ గాదుర దామర మొగ్గ - మొగ్గ గాదు మోదుగు నీడ
నీడ గాదుర నిమ్మలబాయి - బాయి గాదుర బసంత కూర    
కూర గాదుర గుమ్మడిపండు - పండు గాదుర పాపర మీసం
మీసం గాదుర మిరియాల పొడి - పొడి గాదుర పొలిమేర గట్ట..
      ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. జానపద గేయ లక్షణమైన ‘పాఠ భేదం’ ఈ పాటలోనూ కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో వేర్వేరు పదాలతో ఇది ప్రచారంలో ఉంది.
అత్తాకోడళ్ల సంవాదం
అత్తాకోడళ్ల మధ్య ఏర్పడే స్పర్థల్ని గురించిన జానపద గేయాలు తెలుగు సీమ అంతటా వ్యాప్తిలో ఉన్నాయి. ‘అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మో, కోడల్లేని అత్త గుణవంతురాలూ’ అన్న గేయం చాలామంది విన్నదే. అత్త - కోడలు సంవాదం ఇక్కడ ఎట్లా చిత్రితమైందో చూడండి... 
కోడలా కోడలా కొలికి ముత్యమా
పచ్చిపాల మీది మీగడేమాయే, వేడి పాలమీద వెన్నలేమాయే
తేనె కుండలమీద తెప్పలేమాయే, నూనెకుండలమీద నురుసులేమాయే?
అత్తా నువు బెట్టిన ఆరల్లకల్ల, అట్లబాయి అడవిలో మానుగానైతి
మానన్న గానైతి మంచె వేతూరు ఆకన్న గానైతి మేకలారగించు
కాయన్న గానైతి కాకులారగించు పండన్న గానైతి పక్షులారగించు...

      తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో బాగా ప్రచారం పొందిన చాలా జానపద గేయాలు తెలంగాణలోనూ చిరపరిచితమైనవే. ‘‘చెమ్మచెక్క చేరడేసి మొగ్గ, అట్లు పోయంగ, ఆరగించంగ/ రత్నాల చెమ్మచెక్క రంగులేయంగ ముత్యాల చెమ్మచెక్క ముగ్గులేయంగా/ పగడాల చెమ్మచెక్క పందిరేయంగ’’, ‘‘గుడు గుడు గుంజం గుండేరాగం పాంపట్టె పడిగే రాగం’’, ‘‘ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా సన్నా బియ్యం, చారూ పప్పు...’’ - తెలుగువారి వారసత్వ సంపదలైన ఇలాంటి గీతాలెన్నో ఇక్కడ వినిపిస్తాయి. 
మంగళహారతుల ముచ్చట
తెలంగాణలో మంగళ హారతుల ప్రాధాన్యత ఎక్కువ. బహుశా ఇది మహారాష్ట్ర ప్రభావం వల్ల ఏర్పడిన సంప్రదాయం కావచ్చు. ఇక్కడి మంగళ హారతుల రచనలోనూ జానపద ముద్ర ఉంటుంది. అలాంటి మంగళ హారతులే బాగా ప్రచారాన్ని పొందుతాయి. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్లు జిల్లాల్లో ప్రఖ్యాతమైన మంగళహారతి ఇది...‘‘కర్పూర మంగళారతి శ్రీకంఠమొసగితీ/ సర్పాధినాథ హరవరద సార్వ శంకరా...’’!
      తెలంగాణ జానపద గేయాలు నిసర్గమైన భాషకు వన్నె తరగని చిరునామాలు. వీటిలో మాండలికపు గుబాళింపులున్నాయి. అప్రయత్నంగా జాలువారే కవిత్వం కావడంతో నిత్య జీవితపు వాడుక మాటలే వీటిలో ఎక్కువగా కనిపిస్తాయి. జానపద గేయాలలోని పద ప్రయోగాల ద్వారా తెలంగాణ జనపదాల జీవద్భాషను అంచనా వేయవచ్చు. పెరట్ల (పెరడులో), నీ గూట్ల (గోడలో పెట్టుకునే గూడులో), నంద దీపం (మట ముంత దీపం), అర్ర (గది), మెత్త (దిండు), పున్నమ (పున్నమి), కొంటబోయి (తీసుకొని పోయి), ఆరుగుల్ల (వీధి వాకిలిలో), మూగల్లు (మువ్వలు), ల్యాగ (లేగ), యౌసం (వ్యవసాయం) దూప (దప్పి), ఏంచిన (వేయించిన), కీక (కేక), వనగాయ (లేత చింతకాయ), సితపల్క (సీతాఫలం), మ్యానత్త (మేనత్త)- ఇలాంటి వందలాది మాటలు నిఘంటువులకు చేరనివి, ప్రజల నాలుకలను వీడనివీ ఎన్నో ఉన్నాయి. 
      జానపద గేయ నిలయమైన తెలంగాణ మూలమూలల్లో మరెన్నో పాటలు దొరుకుతాయి. నవతరం జిజ్ఞాసువులు ఈ అమృతప్రాయమైన రచనల్ని సేకరించాలి. వాటిపై వెలుగులు పడేలా చూడాలి.


బండెనక బండి... 
బండెనక బండి గట్టి/ పదహారు బండ్లు గట్టి/ ఏ బండ్లో వస్తవు కొడకో/ నైజాము సర్కరోడా... నిజాము వ్యతిరేక ఉద్యమంలో మారుమోగిన గీతమిది. జానపద బాణీలో సాగే ఈ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. దాదాపు ఇదే బాణీలో మరో జానపద గీతం ఉంది. అది కూడా ‘‘బండెనక బండి..’’ అంటూనే ప్రారంభమవుతుంది. కానీ దాని ఇతివృత్తం వేరు. ఆ గీతం ఏంటంటే...
బండెనుక బండి కొడుకా
పదహారు బండ్లు కొడుకా
ఏ బండ్లె వస్తవు కొడుకో
బండోల్ల గురువన్నా!
బండోల్ల గురువన్న - బలవంతుడ వనుకొన్న
నిన్ను కొట్టి పెడుతరు కొడుకో 
బండోల్ల గురువన్నా!
గొడ్డండ్లు దీసుకోని - గొంగట్ల బెట్టుకోని
నిన్ను నరికి పెడుతరు కొడుకో
బండోల్ల గురువన్నా!

రైతు కష్టం
అందరికీ అన్నం పెట్టే రైతుకు మాత్రం ఎప్పుడూ కష్టాలే. విత్తు నాటినప్పటి నుంచి పంటను అమ్ముకునే దాకా అడుగడుగునా అగచాట్లే. అన్నదాతలు పడే ఈ ఇక్కట్లను చెప్పే జానపద పాట ఒకటి కరీంనగర్‌లో ప్రచారంలో ఉంది. అది...
నేనేమి సేతూ - సేనెట్లు గాతూ
మొగులు మెత్తనాయె
భూమి బురబురపొంగె
నల్లనీ రాగట్ల తెల్లజొన్నాలేస్తె
మొలసి మొలవకముందె కోతింత పీకె ।।నేనేమి।।

కోతి పీకిందాని కోపాన నేనుంటె
ఉరికురికి వచ్చేటి ఉడుతింత పీకే   ।।నేనేమి।।
ఉడుత పీకిందాని ఉరిమురిమి నేనుంటే
పసపస వచ్చేటి పందింత పీకే       ।।నేనేమి।।
పంది పీకిందాని రందితో నేనుంటే
ఆవు లేగా వచ్చి ఆయింత మేసే    ।।నేనేమి।।
ఎన్నీల కాలమందు ఏదుల మందవచ్చి
పడమటి భూమిలో పంటంత మేసే ।।నేనేమి।।
బాకిసాకిసేసి బక్కలను నేగొంటె
బాకి దీరకముందె బక్కలే తరలే ।।నేనేమి।।
కరణాలు కాపులు పన్నులడుగావస్తె
పన్ను గట్టకపోతే పట్టితన్నేరూ
వాసీగ భద్రాద్రి ఈశుణ్ని నమ్మితే
అరువై యారుపుట్ల జొన్న లెల్లునురా ।।నేనేమి।।

(మొగులు - ఆకాశం, మేఘం; రాగట్ల - రేగడిలో; బక్కలు - పశువులు)

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం