ఒక్కో అక్షరం ఒక్కో అర్థం

  • 954 Views
  • 6Likes
  • Like
  • Article Share

ఎవరైనా చెప్పిన మాటే పదేపదే చెపితే ‘చెప్పిందే ఎన్ని సార్లు చెబుతారూ’ అని అంటాం. మాట గురించే అలా అనుకుంటే మరి శాశ్వతంగా ఉండే సాహిత్యం కోసం ఏమనుకోవాలి! అదీ కవిసార్వభౌముడు శ్రీనాథుడి పద్యమైతే!!!... అవును నిజంగా ఆయన చెప్పిందే. సీస పద్యంలో ఒక పాదాన్నే నాలుగు సార్లు చెప్పాడు. ఆ పద్యానికి చివరలో జతగా చెప్పాల్సిన పద్యంలోనూ ఒకే పాదాన్ని నాలుగు సార్లు చెప్పాడు. కానీ ఆ పద్యం విసిగించదు, కవిత్వంపట్ల ఆసక్తిని కలిగిస్తుంది. 
రాజ నందన రాజ రాజాత్మజులు సాటి
    తలప నల్లయవేమ ధరణి పతికి
రాజ నందన రాజ రాజాత్మజులు సాటి
    తలప నల్లయవేమ ధరణి పతికి
రాజ నందన రాజ రాజాత్మజులు సాటి
    తలప నల్లయవేమ ధరణి పతికి
రాజ నందన రాజ రాజాత్మజులు సాటి
    తలప నల్లయవేమ ధరణి పతికి
భావ భవభోగ సత్కళా భావములను
భావ భవభోగ సత్కళా భావములను
భావ భవభోగ సత్కళా భావములను
భావ భవభోగ సత్కళా భావములను

      దీన్ని శ్రీనాథుడు అల్లయ వేమారెడ్డి గురించి చెప్పాడు. వేమారెడ్డికి ధర్మ వేమన అనే బిరుదు ఉంది. శివభక్తుడు.
ఈ పద్య అర్థాన్ని తెలుసుకోవాలంటే సీసపద్యంలో మొదటిపాదం, తరువాత పద్యంలో మొదటిపాదం ఒకటిగా అన్వయించుకొని భావాన్ని చెప్పుకోవాలి. అదేవిధంగా మిగతా నాలుగు పద్య పాదాల్నీ అనుసరించాలి. చదివిన పద్య పాదమే చదువుతాం కానీ నాలుగు పాదాలకీ అర్థాలు వేరు. ఈ పద్యం ప్రతి పాదంలో అర్థాల గమ్మత్తుని తెలిపారు దీపాల పిచ్చయ్య శాస్త్రి. 
మొదటి పాదం అర్థాలు: రాజనందన= చంద్రుని కుమారుడు బుధుడు, ర = సమర్థుడు, అజ= ఈశ్వరుడు, రాజ= దేవేంద్రుడు, ఆత్మజులు= బ్రహ్మదేవుడు, తలపన్‌ = ఆలోచించగా, అల్లయ వేమ ధరణి పతికి= అల్లయ వేమారెడ్డి అనే రాజుకి, సాటి = సమానము, 
భావ= బుద్ధియందు, భవ = ఐశ్వర్యమునందును, భోగ = అనుభవంలోనూ, సత్కళా= శ్రేష్ఠమైన విద్యల యొక్క, భావములను= అతిశయమందునూ
      అల్లయ వేమారెడ్డి బుద్ధికి బుధుడు. ఐశ్వర్యంలో ఈశ్వరుడు. వైభవంలో ఇంద్రుడు. ఉత్తమమైన విద్యలో బ్రహ్మ.
రెండో పాదం: ర+అజ+నందన= మనోహరుడైన శివుని కుమారుడైన కుమారస్వామి, ర+అజ= శ్రేష్ఠుడైన బ్రహ్మకు పుట్టిన వశిష్ఠుడు, రాజ= క్షత్రియుడైన, ఆత్మ+జ= రఘుమహారాజు కుమారుడైన అజుడు, తలప నల్లయవేమ ధరణి పతికి= వీరంతా అల్లయ వేమారెడ్డికి సమానులు.
      భావ= క్రియ యందు, భవ= ధనమునందు, భోగ= పరిపాలనలో, సత్కళా= శ్రేష్ఠమైన కాంతి యొక్క, భావములను= సమూహమునందును
      క్రియకు మనోహరుడైన శివుని కొడుకు కుమారస్వామి. ధనానికి కుబేరుడు. పరిపాలనలో రఘుమహారాజు కుమారుడైన అజుడు. శ్రేష్ఠమైన కాంతి సమూహాల్లో చంద్రుడు వంటివాడు అల్లయ వేమారెడ్డి.
మూడో పాదం: ర+అజ+నందన= బంగారం వంటి కాంతిగల బ్రహ్మకు పుట్టిన సనత్కుమారులు, ర+అజ= శ్రేష్ఠుడైన బ్రహ్మకు పుట్టిన వశిష్ఠుడు, రాజ= క్షత్రియుడైన, ఆత్మ+జ=బృహస్పతియందు పుట్టిన కచుడు, తలప నల్లయవేమ ధరణి పతికి= ఆలోచిస్తే వీరంతా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.
      భావ= ఆత్మజ్ఞానములోను, భవ= పుట్టుకలోను, భోగ= అనుభవములోను, సత్కళా= అభివృద్ధియొక్క, భావములను = పద్ధతిలోను
వేమారెడ్డి ఆత్మజ్ఞానంలో బ్రహ్మమానస పుత్రులు సనత్కుమారులు. పుట్టుకకు వశిష్ఠుడు. అనుభవం, అభివృద్ధి పద్ధతులో బృహస్పతి కొడుకు కచుడు వంటివాడు.  
నాలుగో పాదం: ర+అజ+నందన= శ్రేష్ఠుడైన మన్మథుని కుమారుడైన అనిరుద్ధుడు, ర+అజ= సర్వవ్యాపకుడైన విష్ణువు, రాజ= యక్షుడు (నలకూబరుడు), ఆత్మజ= మన్మథుడును, తలప నల్లయవేమ ధరణి పతికి= ఆలోచిస్తే వీరంతా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.
      భావ=ఆకారమునందును, భవ= సంసారమందును, భోగ= సుఖానుభవము నందును, సత్కళా= సౌందర్యం యొక్క, భావములను = రీతియందును
      ఆకారంలో శ్రేష్ఠుడైన మన్మథుని కుమారుడు అనిరుద్ధునికి, సంసారంలో సర్వవ్యాపకుడైన విష్ణువుకి, సుఖాను భవంలో యక్షునికి, సౌందర్యం రీతుల్లో మన్మథునికి సమానుడు అల్లయ వేమారెడ్డి.
      తెలుగు కవుల సృజనాత్మకతకు నిదర్శనాలు ఇలాంటి పద్యాలు. తెలుగు సాహిత్యాన్ని తరచి చూస్తే కలం విన్యాసాలు అనేకం అబ్బుర పరుస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం