బహుముఖ ప్రజ్ఞాశాలి

  • 199 Views
  • 0Likes
  • Like
  • Article Share

    - నాగరత్న

త్యాగరాయ గానసభ, రవీంద్రభారతి, నగర కేంద్ర గ్రంథాలయం, సుందరయ్య భవన్‌.. హైదరాబాదు నగరంలో ఎక్కడ ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా వినిపించే కె.బి.లక్ష్మి స్వరం ఒక్కసారిగా మూగబోయింది. ముప్పయ్యేళ్లు నిరాఘాటంగా పత్రికల్లో పనిచేసిన ఆ మస్తిష్కం ఆగిపోయింది. కథకురాలిగా, విమర్శకురాలిగా కితాబులందుకున్న ఆ కలం ఇంకిపోయింది. సాహితీవేత్తలకు ఆత్మబంధువయిన ఆ నేస్తం కానరాని లోకాలకు పయనమైపోయింది.
      లక్ష్మి విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి, వేటపాలెంలో పెరిగారు. హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి స్నాతకోత్తర విద్య (ఎంఏ) పూర్తిచేశారు. ఐవీఎస్‌ అచ్యుతవల్లి కథా సాహిత్యం మీద పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. ‘ఈనాడు’ సంస్థ పత్రికల్లో ఒకటైన ‘విపుల’లో ముప్పయ్యేళ్లపాటు సంపాదకత్వ విభాగంలో పనిచేసి వేలాది కథలను సరిదిద్దారు. ఆవిడ వృత్తి ప్రవృత్తి ఒకటే కావడంతో నిరంతరం సాహితీ కార్యక్రమాల్లో మునిగితేలేవారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించేవారు. ‘యువభారతి’ సాహితీ సంస్థ వనితా విభాగ అధ్యక్షురాలిగా సేవలందించారు. కె.బి.లక్ష్మి యువభారతి సాహితీ సంస్థలో పరిచయమైన కామేశ్వరరావును ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సాహిత్యంతో అనుబంధం ఉన్నవారే కనుక వారి సంసారం హాయిగా సాగిపోయింది. వారికి ఇద్దరు పిల్లలు. కొడుకు ప్రవీణ్, కూతురు సమీర.      
      కె.బి.లక్ష్మిగా ప్రఖ్యాతులైన ఆమె అసలు పేరు కొల్లూరు భాగ్యలక్ష్మి. కథలూ కవితలూ వ్యాసాలూ గల్పికలూ ఎన్నెన్నో రాశారు. అనువాదాలూ చేశారు. అనేకమంది రచయితల్లాగానే ఆమె రచనల్లోనూ మధ్యతరగతి జీవితాలు ప్రతిఫలిస్తాయి. ప్రేమలు పెళ్లిళ్లు, కుటుంబ వ్యవహారాలు, మానవ సంబంధాలు ప్రతిదీ ఆమెకి కథావస్తువే. వ్యవస్థ మార్పుకోసం సుతిమెత్తని వ్యంగ్యాస్త్రాలను చాకచక్యంగా ప్రయోగిస్తారు. ఆ కథల్లో సున్నిత హాస్యం తొణికిసలాడుతూ మన ప్రమేయం లేకుండానే ఆసక్తిగా చదివిస్తాయి. ‘జూకామల్లె’, ‘నా రేడియో జ్ఞాపకాలు’, ‘గమనం’, ‘వీక్షణం’ పుస్తకాలు వెలువరించారు. తన ప్రతిభకు నిదర్శనంగా అనేక సన్మానాలూ సత్కారాలూ అందుకున్నారు. ‘మనసున మనసై’ కథా సంకలనానికిగానూ 2003లో ‘ఉత్తమ రచయిత్రి’గా నంది పురస్కారం అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ తరఫున మునిమాణిక్యం నరసింహారావు మీద మోనోగ్రాఫ్‌ తెచ్చి రచయితలూ విమర్శకులతో భేషనిపించుకున్నారు.
      ముఖాన చిరునవ్వు, మాటల్లో చమక్కు, ఆలోచనల్లో చురుక్కు, స్వరంలో గాంభీర్యం, భాషలో స్పష్టత, పదాల్లో విరుపు, మదిలో విజ్ఞానవీచికలు వెరసి కె.బి.లక్ష్మి. ఆవిడ కథల్లో కవిత్వం తొణికిసలాడితే మాటల్లో చాతుర్యం ధ్వనించేది. ఉల్లాసం ఉత్సాహం ఆవిణ్నెప్పుడూ చుట్టుముట్టి ఉండేవి. చిట్టిచిట్టి వ్యంగ్యాలూ, చిన్నిచిన్ని అల్లర్లతో ఆహ్లాదానికి చిరునామాలా ఉండే వారు. పరిశీలన లక్ష్మి లక్షణం, పరిశోధన ఆవిడ లక్ష్యం. చాతుర్యం ఆమెకు భూషణం. లాలిత్యం ఆమె నేస్తం. ఆత్మీయ పలకరింపులు, దరహాసపు సంభాషణలు ఆమె ప్రత్యేకత. పత్రికాభాషే కాదు, మాండలికాల్లోనూ లక్ష్మి దిట్ట. ఆవిడ యూట్యూబ్‌లో చదివిన ‘జర చాయ్‌ తాగిపో’ కవిత వింటే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే!
      సాహిత్యాధ్యయనానికి పత్రికానుభవం జత కలిసిన లక్ష్మి రాతలూ మాటలూ అందర్నీ ఆకట్టుకునేవి. అరవయ్యారేళ్లపాటు సరదాగా, సంతృప్తిగా జీవనపయనం సాగించిన ఆవిడ జులై 29న గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆవిడ లేకున్నా ఆ జ్ఞాపకాలు పదిలంగానే ఉంటాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం