తెలుగు వ్యుత్పత్తి కోశ కీర్తి

  • 232 Views
  • 14Likes
  • Like
  • Article Share

    డాక్టర్‌ లక్కింశెట్టి కోటమల్లేశ్వరరావు

  • విశ్రాంత పరిశోధనాధికారి, ద్రావిడ నిఘంటు కేంద్రం, ద్రావిడ విశ్వవిద్యాలయం.
  • కుప్పం
  • 9441957904
డాక్టర్‌ లక్కింశెట్టి కోటమల్లేశ్వరరావు

తెలుగులో వ్యుత్పత్తి పదకోశం అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ఆచార్య లకంసాని చక్రధరరావు. రచయితగా, పరిశోధకులుగా, ఆచార్యులుగా పలు రంగాలకు విస్తరించిన ప్రతిభ ఆయన సొంతం. చక్రధరరావు సారథ్యంలో వెలువడిన ఎనిమిది సంపుటాల తెలుగు వ్యుత్పత్తి కోశం తెలుగు భాషా చరిత్రలో కలికితురాయి. చారిత్రక, వర్ణనాత్మక, తులనాత్మక లక్షణాలు కలిగిన ఏకైక నిఘంటువు ప్రపంచంలో ఇదొక్కటే.
      బాల్యం
నుంచి తెలుగు భాషాసాహిత్యాల పట్ల మెండైన అభిరుచి పెంచుకున్న లకంసాని చక్రధరరావు పశ్చిమగోదావరి జిల్లా చివటం గ్రామంలో 1939 జులై 3న జన్మించారు. తల్లిదండ్రులు సుబ్బాయమ్మ, సత్యనారాయణమూర్తి. వీరి స్వస్థలం తణుకు. అక్కడి బహుళార్థ సాధకోన్నత పాఠశాలలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. పదిహేనేళ్లకే ఛందస్సును క్షుణ్నంగా అభ్యసించి కందపద్యాలను రాయడం ప్రారంభించారు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతున్నపుడే కేశవస్వామిపై శార్దూల మత్తేభ వృత్తాల్లో కేశవ శతకాన్ని రచించారు. 
అపార భాషా సాహితీ సేవ
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (ఇప్పటి డీఎన్‌ఆర్‌) కళాశాలలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులయ్యాక 1958లో రాజమహేంద్రవరంలో తెలుగు బీఏలో చేరారు. విశ్వవిద్యాలయం మొత్తంలో ప్రథముడిగా నిలిచి జయంతి రామయ్య నుంచి పతకాన్ని పొందారు. 1960లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ప్రారంభించిన ఎంఏ తెలుగులో చేరారు. ఆ సమయంలో తాను రచించిన కేశవ శతకాన్ని గంటిజోగి సోమయాజికి బహూకరించారు. అప్పుడాయన తెలుగు ఎంఏ విద్యార్థులకు కావలసింది పరిశోధనా దృష్టి అని చెప్పి, కవిత్వాన్ని విరమించి పాండిత్యాన్ని సంపాదించుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు.
      ఎంఏ తర్వాత గంటిజోగి పర్యవేక్షణలో ‘తెలుగు శాసన సారస్వతాలలోని ఉర్దూ మరాఠీ పదాలు’ (క్రీ.శ.1800 వరకు) అంశంపై పరిశోధన ప్రారంభించారు. 1963లో సోమయాజి పదవీ విరమణ చేయడంతో ఆచార్య కాకర్ల వేంకట రామనరసింహం పర్యవేక్షణలో పరిశోధన కొనసాగించారు. 1967లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ‘సంస్కృతంలో ద్రావిడ పదాలు’పై పరిశోధనకు పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలోషిప్‌ లభించింది. ఆర్ట్స్‌ కళాశాల మొత్తంలో పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలోషిప్‌ అందుకున్న తొలి వ్యక్తి ఈయనే. అప్పటికే చక్రధరరావు వివిధ పత్రికలకు రాసిన 10 పరిశోధనా వ్యాసాలను 1968లో ‘భాషాశాస్త్ర వ్యాసములు’ పేరుతో పుస్తకంగా తెచ్చారు. 1969లో ఆంధ్ర విశ్వకళా పరిషత్తు తెలుగుశాఖలో ఉపన్యాసకులుగా నియమితులయ్యారు చక్రధరరావు. ఆయనలో హాస్యప్రియత్వం ఎక్కువ. తరగతిలో చమత్కారమైన సున్నిత హాస్యంతో పాఠాలు చెప్పేవారు. ఆయన ఎంత పండితులో అంత నిగర్వి కూడా.
      ఆంధ్ర విశ్వకళాపరిషత్తు స్వర్ణోత్సవాల సందర్భంగా చక్రధరరావు కూర్చిన ‘నన్నయ మొదలు వీరేశలింగం వరకు’ యాభై మంది తెలుగు కవుల పద్యమణులను ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ముద్రించింది. ఆయన రచించిన ‘దేశి కవిత’ అనే చిరుపొత్తాన్ని కూడా అదే సమయంలో పరిషత్తు ప్రచురించింది. ఇందులో దేశికవితను నిర్వచించి, భాష, ఛందస్సు, ఇతివృత్తాలు దేశీయంగా ఉండాలన్నది దేశికవితా లక్షణాలని ఆయన స్పష్టం చేశారు.
      తెలుగు అకాడమీ 1978లో రూపొందించిన ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు-తెలుగు నిఘంటు నిర్మాణంలో గురువులైన ఆచార్య గంటిజోగితో పాటు చకధ్రరరావు పాలుపంచుకున్నారు. ఎలకూచి బాలసరస్వతి రచించిన చంద్రికాపరిణయంలోని జూపల్లి పద్మనాయకుల చరిత్రను చక్రధరరావు పరిష్కరించారు. దాన్ని 1980లో నూజివీడుకు చెందిన అప్పరాయ గ్రంథమాల వారు ప్రచురించారు. అలాగే ఆంధ్ర విశ్వకళా పరిషదుపాధ్యక్షులు ఎం.ఆర్‌.అప్పారావు ప్రేరణతో పోతన భోగినీ దండకానికి చక్రధరరావు యథాస్థిత దండాన్వయాన్ని రచించారు. దీన్ని కూడా అప్పరాయ గ్రంథమాల వారే వెలువరించారు. దీని ముద్రణలో బొబ్బిలి కుమారరాజా రావు వేంకట గోపాలకృష్ణ సహకరించారు. 1987లో విశాఖపట్నం తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కళాపీఠం ప్రచురించిన ‘సాహితీ సమారాధన’కు చక్రధరరావే సంపాదకులు. ఆయన పర్యవేక్షణలో దాదాపు 30 మంది పీహెచ్‌డీలు పూర్తిచేశారు. దాదాపు 50 పరిశోధక వ్యాసాలను ఆయన ప్రచురించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 30 పరిశోధన పత్రాలు సమర్పించారు. ఆకాశవాణి విశాఖపట్టణం కేంద్రం ద్వారా సుమారు 60 ప్రసంగాలు చేశారు. 1985 నుంచి 1988 వరకు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు తెలుగు శాఖాధ్యక్షులుగా, 1989 నుంచి 1992 వరకు స్నాతకోత్తర పాఠ్య నిర్ణాయక మండలి అధ్యక్షులుగా ఉన్నారు. అంతేకాక తెలుగు విశ్వవిద్యాలయం అకడమిక్‌ సెనేట్‌ సభ్యులుగా విశిష్ట సేవలందించారు. 1997 నుంచి 2002 వరకు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ హ్యుమానిటీస్‌ బోర్డులోనూ సభ్యులుగా ఉన్నారు.
      లకంసాని సారథ్యంలో సహాయక బృందం కృషి వల్ల ఎనిమిది సంపుటాల తెలుగు వ్యుత్పత్తికోశం వెలువడింది. ఇందులో ద్రావిడ పదాలు, అన్యదేశ్యాలకు కూడా వ్యుత్పత్తులు అందించారు. ఇది ఆంధ్ర విశ్వకళా పరిషత్తు కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి. అయితే, ఇందులో అర్థ విపరిణామం పొందని సంస్కృత సమాలకు వ్యుత్పత్తులు ఇవ్వలేదు. అవి కూడా చేరిస్తే ఈ నిఘంటువు సమగ్రమవుతుందనే అభిప్రాయంతో సంస్కృతసమాల నిఘంటు నిర్మాణానికి పూనుకొని మొత్తం నాలుగు సంపుటాలుగా వేయాలని నిర్ణయించారు. నెలకు కేవలం ఒక్కరూపాయి జీతంతో రెండు సంపుటాలను పూర్తిచేశారు. కానీ, 2015 ఆగస్టు 25న ఆయన కన్నుమూయడం వల్ల మిగిలిన రెండుసంపుటాల పని ఆగిపోయింది. 
      చక్రధరరావు భాషా సాహితీ సేవను అనేక సంస్థలు కీర్తించి సత్కరించాయి. తెలుగు వ్యుత్పత్తి కోశ నిర్మాణంలో చేసిన సేవకు 1986లో విశాఖపట్నం తొలి మేయరు ఎన్‌.ఎస్‌.ఎన్‌.రెడ్డి ఆయనను సన్మానించారు. ఇలాంటి మరెన్నో సత్కారాలను ఆయన అందుకున్నారు. తుది శ్వాస వరకూ తెలుగు భాషా సాహిత్యాలకు జీవితాన్ని అంకితం చేసిన ఆచార్య లకంసాని చక్రధరరావుని తెలుగు నేల ఎన్నటికీ మరువదు.


వెనక్కి ...

మీ అభిప్రాయం