అమ్మలగన్నయమ్మ

  • 883 Views
  • 1Likes
  • Like
  • Article Share

    ఉమాశ్రీ

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ! మా 
యమ్మ! కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్‌ 

అంటూ అమ్మవారి తత్వసారాన్ని నాలుగు వేదాల్లాగా నాలుగు పాదాల్లో అందించారు తెలుగువారి పుణ్యాలపేటి పోతన్న. అలాంటి అమ్మలగన్న అమ్మను వర్ణిస్తూ వ్యాసమహర్షి ‘‘కరాంగులినఖోత్పన్న నారాయణదశాకృతిః’’ అంటారు. అమ్మవారు లీలగా తన చేతివేలిగోటితో మీటితే నారాయణుడు పది అవతారాలు ఎత్తాడట! అమ్మవారి సర్వశక్తిమత్వానికి మచ్చుతునక ఈ మాట.
      భాద్రపదంలో బరువెక్కిన మేఘాలు శరదృతువులో తేలికైనట్లు, సమస్యా మేఘావృతమైన మనసు విఘ్ననాయకుని ఆరాధనతో ఆపదల్ని తొలగించుకుని శరత్కాల మేఘంలాగా స్వచ్ఛమైన, తేలికైన మనసుతో అందరమ్మ ఆరాధనకు సన్నద్ధమవుతున్న వేళ ఇది. ఈ శుభతరుణంలో అమ్మవారి వైభవాన్ని కీర్తించుకోడానికి నవరాత్రులు జరుపుకుంటారు. ఇక్కడ నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అనేకాక తొమ్మిది పగళ్లు అని కూడా అర్థం. ఈ తొమ్మిది రాత్రుల తర్వాత వచ్చే పగలే విజయదశమి. దశహరా పండుగ. ఈ దశహరానే వ్యవహారంలో దసరాగా స్థిరపడింది. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ దసరా. రామాయణ, మహాభారతాది ఇతిహాసాల్లో కూడా ఈ పండగకు సంబంధం కనిపిస్తుంది. రామాయణపరంగా రామచంద్రమూర్తి రాక్షస సంహారం చేసి రావణుడి మీద విజయం సాధించిన దినంగా, మహాభారతపరంగా పాండవులు ధర్మానికి కట్టుబడి అరణ్య, అజ్ఞాత వాసాలు పూర్తిచేసుకుని కౌరవసంహారానికి ఉద్యుక్తులవుతూ విజయసాధన కోసం జమ్మి చెట్టు మీద దాచిన తమ ఆయుధాల్ని కిందికి దించిన దినంగా విజయదశమిని భావిస్తారు.
      ఈ విజయదశమికి సంబంధించి దేశవ్యాప్తంగా భిన్న పూజావిధానాలు ఉన్నాయి. దుర్గాదేవిని నవదుర్గలుగా భావించడం, లక్ష్మీ సరస్వతీ పార్వతులను ఒక్కరిని మూడు రోజులుగా పూజించడం లేదా ఒక్కొక్కరోజు ఒక్కొక్క అలంకారంగా అమ్మవారిని పూజిస్తూ పదోరోజు రాజరాజేశ్వరీదేవిగా పూజించడం కనిపిస్తుంది. నవ దుర్గారాధన దేశంలోని పలు ప్రాంతాల్లో విశేష ప్రచారంలో ఉంది. నవ దుర్గల పేర్లు కలసి వచ్చే ఈ శ్లోకాన్ని చాలా మంది భక్తులు నిత్యం పఠిస్తూ ఉంటారు. ‘‘ప్రథమం శైలపుత్రీచ/ ద్వితీయం బ్రహ్మచారిణీ/ తృతీయం చంద్రఘంటేతి/ కూష్మాండేతి చతుర్థకమ్‌/ పంచమం స్కంధమాతేతి/ షష్ఠం కాత్యాయనీతి చ/ సప్తమం కాళరాత్రీతి/ మహాగౌరీతి చాష్టమమ్‌/ నవమం సిద్ధిధాత్రీ చ/ నవదుర్గాః ప్రకీర్తితాః/ ఉక్తాన్యేతాని నామాని/ బ్రహ్మణైవ మహాత్మనా’’. ఇక శ్రీశైల క్షేత్రంలో శాక్తేయసంప్రదాయాన్ని అనుసరించి పదిరోజులు వరుసగా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ దుర్గ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాయిని, చివరిరోజు భ్రమరాంబికా రూపాలుగా ఆరాధన జరుగుతుంది. బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఇందుకు కొంత భిన్నంగా అలంకరణ ఉంటుంది. ఆయా ప్రాంతాల ఆలయాల్లో స్థానిక సంప్రదాయాన్ని అనుసరించి చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అనుసరించే సంప్రదాయాన్ని ప్రామాణికంగా భావిస్తారు. ఇక్కడ పదిరోజులు వరుసగా స్వర్ణ కవచాలంకృత దుర్గ, బాలాత్రిపురసుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలిత, మహాలక్ష్మి, సరస్వతి, మహాదుర్గ, మహిషాసురమర్దిని, చివరి రోజు రాజరాజేశ్వరీదేవిగా ఆరాధిస్తారు. మొదటి రోజు కనిపించే స్వర్ణ కవచాలంకృత దుర్గమ్మ అలంకారం విజయవాడకి ప్రత్యేకం. ఏది ఏమైనా మూలానక్షత్రం నాడు సరస్వతీ మాత, అష్టమినాడు దుర్గమ్మ, నవమినాడు మహిషాసుర మర్దిని అనే అలంకారాల్లో మార్పు ఉండదు. ఒక్కొక్క ప్రాంతంలో మహాలక్ష్మి స్థానంలో మహంకాళి, అన్నపూర్ణాదేవి స్థానంలో శాకంబరీ అలంకారాలు కనిపిస్తున్నాయి. 
      మొదటిరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గగా అలంకరిస్తారు. రెండోరోజు అలంకారం బాలా త్రిపురసుందరి. పురం అంటే శరీరం. త్రిపుర అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు అని అర్థం. ఆయా శరీరాల్లో చైతన్యరూపంగా ప్రకాశించేది త్రిపుర సుందరి. ‘‘అష్టవర్షా భవేత్‌ కన్యా’’ అన్న మాటననుసరించి ఎనిమిది సంవత్సరాల కన్యారూపం బాల. భండాసురుడు అతడి పుత్రులైన ముప్పయి మంది రాక్షసుల్ని సంహరించడానికి ఉద్భవించిన పరాశక్తి మానసపుత్రి ఈ బాల. ఆ భండాసుర సంహారానికి ఉద్యుక్తమవుతున్న బాల పరాక్రమాన్ని చూసి ఆనందిస్తున్న పరాశక్తి రూపాన్ని ‘‘భండాసుర వధోద్యుక్తా బాలా విక్రమ నందితా’’ అంటూ కీర్తించారు వ్యాసమహర్షి.
      ఆ తర్వాత అలంకారం గాయత్రీ. వేదమాత అని కూడా గాయత్రీమాతకు పేరు. అన్ని మంత్రాల్లోకి అత్యంత శక్తివంతమైంది గాయత్రీమంత్రం. కొంతమంది అంటున్నట్లుగా ఇది గాయిత్రీ కాదు, గాయత్రీ అనేదే సరైన పదం. గాయంతాం త్రాయతే ఇతి గాయత్రి. అంటే పాడేవారిని, కీర్తించేవారిని త్రాయతే అంటే రక్షించేది గాయత్రి. ఇక్కడ పాడటం అంటే మననం చేయడం. ఈ గాయత్రి పంచముఖ సమన్విత. ఆ పంచముఖాలు పంచభూతాలకు ప్రతీకలు. గాయత్రీ మాతను పూజించడం అంటే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించడమే. అంటే ప్రకృతిని సంరక్షించుకోవడమే. 
      ‘‘అన్నాద్భవంతి భూతాని’’ అంటుంది భగవద్గీత. మానవుడి స్థూలశరీర పోషణకు ప్రధానమైంది ఆహారం. సాక్షాత్తు ఆదిభిక్షువు నుంచి అడ్డాల్లో ఉండే బిడ్డవరకు ఆహారాన్ని అందించి మానవ మనుగడకు మూలభూతమైంది అన్నపూర్ణ. ‘‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’’ అని కదా మహాకవుల మాట! అఖిల ధర్మసాధనకు సాధనమైన శరీరాన్ని పోషించే బాధ్యతను స్వీకరించిన తల్లి అన్నపూర్ణ. తల్లిదండ్రుల బాధ్యత కొనసాగించడం బిడ్డ కనీస ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించి అమ్మ అనుగ్రహం ద్వారా పొందిన ఐశ్వర్యాన్ని దరిద్ర నారాయణసేవకు కొంత వెచ్చించాలి. అదే అన్నపూర్ణ అలంకార తత్వం. 
      ‘‘పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ’’ అని అమ్మవారి నామాన్ని తెలియజేస్తుంది లలితాసహస్రం. అలాంటి పంచమి నాటి అలంకారం లలితా పరాభట్టారికా. ‘‘స్వాత్మైవ లలిత ప్రోక్తా దేవి విశ్వవిగ్రహ’’ అని చెప్తుంది భావనోపనిషత్‌. విశ్వమంతా ఒక విగ్రహరూపం ధరిస్తే ఆమె లలిత. ఆమె సాధకుడిలో ఆత్మ రూపంలో ఉంటుంది. సాధన ద్వారా సాధకుడు తన లోపల ఉన్న ఆత్మే విశ్వమనే రూపంలో కూడా ఉందని గ్రహిస్తాడు. దీన్నే భగవద్గీత ‘‘ఆత్మవత్‌ సర్వభూతాని’’ అని చెబుతుంది. ఈ భావనను మనసులో కుదుర్చుకున్నవాడు ఎప్పుడూ లోకహితుడే కానీ లోక కంటకుడు కాడు, కాలేడు. అదే లాలిత్యంతో కూడిన లలితా అలంకార తత్వం.
      ‘‘ధనం మూలం ఇదం జగత్‌’’ అని ఆర్యోక్తి. ఈ ధనానికి, ఐశ్వర్యానికి మూల దేవత మహాలక్ష్మి. షష్టి తిథిÅ నాడు అమ్మవారు ఈ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తుంది. అమ్మ అనుగ్రహించిన ఆ సంపదకు మూడే దారులు.. భోగం, దానం, నాశం. అమ్మవారు అనుగ్రహించినదాన్ని అనుభవించు! దానితో పాటు ఇతరులకు కొంత పంచు! ఈ రెండూ చెయ్యకపోతే మిగిలేది మూడో స్థితే. అంటే నాశనమే. తను సంపదను అనుగ్రహిస్తూ మనల్ని కూడా అలా చేయమని తన చేతల ద్వారా మార్గదర్శనం చేస్తుంది అమ్మ. ఇదే విషయాన్ని ‘‘నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదర్శంగా పెట్టుకో’’ అని ప్రవచించింది జిల్లెళ్లమూడి అమ్మ. ‘ఆదరంగా పెట్టు’ అని కాకుండా ‘పెట్టుకో’ అనడంలో ఆ పెట్టడం ద్వారా వచ్చే ఫలితం నీకే అని చెప్పడం కోసమే.
      సప్తమి నాడు సరస్వతి దేవిగా దర్శనమిస్తుంది అమ్మవారు. సరస్వతి అంటే జ్ఞానస్వరూపం. ఆమె సరస్‌ వతి. అంటే ప్రవాహ తత్వం కలిగింది అని అర్థం. గమనశీలమైంది. ఎందుకంటే జ్ఞాన స్వరూపం కాబట్టి. జ్ఞానం ఎప్పుడూ ఒకరి దగ్గర స్థిరంగా ఉండదు. అది ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ ఉంటుంది. చైతన్య రూపంలో ఉంటుంది. ఆ రూపానికి సరస్వతి అని పేరు. జ్ఞానం ఎల్లప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. అందుకనే సరస్వతీమాత రూపం కూడా సదా ధవళ వర్ణమే. 
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామరవాహినీ శుభా
కారతనొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ 

      అంటూ లోకంలోని ధవళ వర్ణ శోభిత పదార్థాలన్నింటనీ కుప్పపోసి వర్ణించారు పోతన. అయితే లలిత అమ్మవారిని నిష్కామ భావంతో ఆరాధించిన వారికి పైన చెప్పుకున్న లక్ష్మీ సరస్వతుల అనుగ్రహం కరతలామలకమే. లలితా రూపమైన అమ్మ అనుగ్రహాన్ని పొందగలిగితే లక్ష్మీ సరస్వతుల అనుగ్రహం ఆవు వెంట దూడలా అదే వస్తుంది. ‘‘సచామర రమావాణీ సవ్యదక్షణ సేవితా’’ అని లలితా సహస్రం చెబుతుంది. లక్ష్మీ సరస్వతులిద్దరూ వరుసగా లలిత అమ్మవారికి ఎడమ కుడి వైపుల ఉండి సేవ చేస్తుంటారు. మన సంప్రదాయంలో కుడి ఎడమల్లో కుడిని కొంచెం కుడిగానే చూస్తాం. అంటే లక్ష్మీ సరస్వతుల్లో కుడివైపునున్న సరస్వతికే ప్రాధాన్యం కనిపిస్తుంది. అంటే విద్య ద్వారా ధనాన్ని సంపాదించాలి కానీ ధనం ద్వారా విద్యను కాదు అని తెలియజేస్తుంది ఈ అలంకారం.
      అష్టమినాటి అలంకారం మహాదుర్గ, కనకదుర్గ. దుర్గ అంటే దుర్గతిని తొలగించేది. ఇక్కడ దుర్గతి అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానం నుంచి పుట్టిన అరిషడ్వర్గాలకు లోబడి ప్రవర్తించే గుణాన్ని నశింపజేసేది దుర్గ. చేరుకోవడానికి శక్యంకాని లక్ష్యాల్ని చేరువ చేసేది దుర్గ. మనిషి మనసులో ఉండే దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి లక్ష్యాన్ని సుగమం చేసేది దుర్గ. నవమినాటి అలంకారం మహిషాసుర మర్దిని. మహిషమంటే దున్నపోతు. ఆ లక్షణాలు కలిగి ఉండటం మహిషాసురత్వం. ఇది అచ్చమైన తమోగుణం. అలసత్వం, నిద్ర, బద్దకం, హింస, క్రౌర్యం మొదలైన తమోగుణ లక్షణాల్ని మర్దింపచేసేది మహిషాసుర మర్దిని. ప్రస్తుత సమాజంలో కంఠదఘ్నంగా ఉన్న ఈ లక్షణాలను ఈ రూపంలోని అమ్మను ఆరాధించడం ద్వారా అంటే అమ్మతత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా తొలగించుకోవచ్చు. ఎప్పుడైతే మానవ స్వభావంలో ఉన్న మహిషాసురుని సంహారం జరుగుతుందో ఆ వెంటనే వచ్చేది విజయమే. 
      ఈ నవ అలంకారాల తత్వాన్ని అర్థం చేసుకుని జీవితానికి అన్వయించుకున్న రోజు మనం చేరుకునే దశ విజయమే. అదే విజయదశమి. ఆ దశకు చేరుకున్న దశమినాడు అమ్మవారిని రాజరాజేశ్వరీ అవతారంగా పూజిస్తారు. ఇంతకూ రాజరాజేశ్వరీ అంటే? మన పైన ఉండేవారు అధికారులు, నాయకులు, రాజులు, మహారాజులు. వారిపైన ఉండేవాడు రాజరాజు. అంటే చక్రవర్తి. అలాంటి రాజరాజులకు ఈశ్వరి కాబట్టి అమ్మ రాజరాజేశ్వరి. రాజరాజుల్ని నియమించగలిగినది. అందుకనే లలితా సహస్రనామాల్లో అమ్మవారిని ‘‘రాజపీఠ నివేశిత నిజాశ్రిత’’ అని కీర్తిస్తారు. అంటే పైన చెప్పుకున్న దుర్గుణాలన్నీ వదిలించుకుని అమ్మను ఆశ్రయిస్తే, తనను ఆశ్రయించిన వారిని రాజపీఠాల్లో నివేశింపగలిగింది అని అర్థం. 
      లోకంలో ఉన్నది ఒకే శక్తి. దాన్ని విజ్ఞానశాస్త్రం అణుశక్తి అంటుంది. సంప్రదాయం దైవశక్తి అంటుంది. ఈ శక్తి సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి భిన్న రూపాల్ని ధరిస్తుంది. బల్బులో వెలుగులా, హీటర్లో వేడిగా, ఫ్రిజ్‌లో చల్లగా, ఇలా పరస్పర విరుద్ధంగా కనిపించే శక్తులన్నిటికీ మూలం ఒకే విద్యుచ్ఛక్తి అయినట్లు, భిన్నరూపాల్లో కనిపిస్తున్న అలంకారాలకు, అవతారాలకు మూలశక్తి ఒక్కటే. ‘‘భోగే భవానీ, పురుషేషు విష్ణు, క్రోధేచ కాళీ, సమరేచ దుర్గా’’ అని దేవీభాగవతం, ‘‘ఏకో విష్ణుర్మహర్భూతం పృథగ్భూతాన్యనేన చ’’ అని విష్ణుసహస్రనామం చెబుతుంది. దీనికి స్త్రీ పురుష భేదం కానీ మనవ తిర్యక్‌ భేదం కానీ లేదు. ఒకే శక్తి స్త్రీరూపంలో ఉన్నప్పుడు లలిత అయితే, పురుష రూపంలో ఉన్నప్పుడు విష్ణువు. ఆ స్త్రీ లాలిత్యంతో ఉన్నప్పుడు లలిత, క్రోధంతో ఉన్నప్పుడు కాళీ, సమరాంగణంలో ఉన్నప్పుడు దుర్గ, ‘‘శ్రీకృష్ణో శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబికా’’ అన్న పద్మపురాణ వాక్యం ఇదే విషయాన్ని ధృవీకరిస్తుంది. ఈ రకంగా అమ్మవారి వివిధాలంకారాలు మనిషిని దైవత్వం వైపుగా అడుగులు వేయించడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
      చైతన్యాన్ని అంటే సూక్ష్మరూపంగా జీవునిలో ఉన్న ప్రాణశక్తి స్వరూపాన్ని తెలియజేయడానికి బాలా త్రిపురసుందరి, అంటే మనిషిలో నిద్రాణమై ఉన్న సామర్థ్యాన్ని వెలికితీసి ఆత్మవిశ్వాసాన్ని కలిగించేది. బుద్ధిశక్తిని ప్రచోదనం చేయడానికి గాయత్రి, స్థూల శరీర ప్రాధాన్యాన్ని విస్మరించకుండా సరైన ఆహారాన్ని అందించడానికి అన్నపూర్ణ, సమస్త సృష్టిలోని ఏకత్వాన్ని తెలియజేసి సమాజం పట్ల లాలిత్యాన్ని పెంపొందించ డానికి లలిత, సంపదను పొందడం, పొందిన సంపదను లోకహితం కోసం వెచ్చించడానికి మహాలక్ష్మి, శ్లోకజ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని కలిగించడానికి సరస్వతి, దుర్గతిని రూపుమాపుకుని సుగతిని పొందడానికి దుర్గ అలంకారం, దుష్టత్వ నిర్మూలన కోసం మహిషాసుర మర్దిని, యోగ్యతకు అనువైన స్థితిని కలిగించడానికి రాజరాజేశ్వరి అలంకారాన్ని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాణులకు కావాల్సిన అన్నింటినీ కూడా దైవ స్వరూపాలుగా చెప్పారు పూర్వీకులు . ఇది విశ్వాసానికి సంబంధించిన మాట. తత్వతః పరిశీలిస్తే ఇదే యదార్థం కూడా.


వెనక్కి ...

మీ అభిప్రాయం