నిఘంటు నిర్మాణంలో ఆచార్యులు

  • 113 Views
  • 4Likes
  • Like
  • Article Share

మాండలిక పదాలను నిఘంటువులకు ఎక్కించిన అగ్రగణ్య భాషా శాస్త్రవేత్త ఆచార్య రవ్వా శ్రీహరి. సృజన, పరిశోధన, అనువాద రంగాల్లో కృషిచేస్తూనే.. నిఘంటు వ్యాకరణవేత్తగా, సంపాదకుడిగా, అధ్యాపకుడిగానూ తెలుగుకు విశేష సేవలందించిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ ఏడాదికి రాష్ట్రపతి గౌరవ ప్రశంసాపత్రానికి ఎంపికయ్యారు. 
నల్లగొండ
జిల్లా వెల్వర్తి గ్రామానికి చెందిన ఓ సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చారు శ్రీహరి. సెప్టెంబరు 7, 1943న జన్మించారు. పదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారు. అప్పటికి వీరి కుటుంబంలో కులవిద్యలపైనే కానీ చదువుల మీద అంత దృష్టి ఉండేది కాదు. కానీ శ్రీహరి మాతృమూర్తికి పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకోవాలని కోరిక ఉండేది. దాని ఫలితంగా సురవరం ప్రతాపరెడ్డి, ఎమ్‌.నరసింగరావుల సాయంతో యాదగిరి లక్ష్మీనృసింహ విద్యాపీఠంలో చేరారు. గురువు కప్పగంతు లక్ష్మణశాస్త్రి ప్రోత్సాహంతో హైదరాబాదు సంస్కృత కళాశాలలో వ్యాకరణం చదివారు. తర్వాత వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితులుగా చేస్తూనే ఎమ్మే పూర్తి చేసి, ఆంధ్రసారస్వత పరిషత్తులో ఉపన్యాసకులుగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ‘భాస్కర రామాయణం’ పరిశోధన చేశారు. ఆ తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగానూ, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి సంపాదకులుగానూ వ్యవహరించారు.
      ‘శ్రీహరి నిఘంటువు’.. తెలుగు ప్రామాణిక నిఘంటువుల్లో ఒకటి. ఈ నిఘంటువును ‘సూర్యరాయాంధ్ర నిఘంటుశేషం’ అనీ అంటారు. సూర్యరాయంధ్ర నిఘంటువులో లేని సుమారు ముప్పయి అయిదు వేల కొత్త ఆరోపాలు ఇందులో చోటుచేసుకున్నాయి. తాళ్లపాక కవుల సాహిత్యం, తెలుగులో వచ్చిన పదసాహిత్యమూ, కాటమరాజు కథలు, బొబ్బిలి యుద్ధం లాంటి జానపద సాహిత్య గ్రంథాలు, రాయవాచకం, సిద్ధేశ్వర చరిత్ర, కట్టా వరదరాజు రచించిన శ్రీ రామాయణం, పల్నాటి వీరచరిత్ర, ద్విపద గ్రంథాలు, యక్షగాన సాహిత్యం, కాశీయాత్ర చరిత్ర, సాక్షి వచన గ్రంథాలు తదితర రచనల్లోని పదాలను సేకరించి ఇందులో పొందుపరిచారు. అప్పటి దాకా నిఘంటువుల్లోకి ఎక్కని మాండలిక పదాలెన్నింటినో ఇందులోకి చేర్చారు. ఆంధ్రమహాభారత, భాగవతాల్లోని అంశాలనూ, హంసవింశతి, శుకసప్తతి లాంటి కథాకావ్యాలలోని విశేషాంశాల గురించీ చెప్పారు. వీటితో పాటు ఆధునిక సాహిత్య ప్రక్రియలైన నవల, కథ, కవితా రచనల్లోని పదాలకూ ఇందులో చోటు కల్పించారు. కేవలం పదాలే కాకుండా భాషా వ్యవహారంలోని ప్రత్యేకతను తెలిపే పదబంధాలనూ చేర్చారు. వావిళ్ల నిఘంటువు, వాచస్పత్యం, బ్రౌణ్యం, తెలుగు వ్యుత్పత్తి పదకోశం తదితరాల్లోని పదాలనూ ప్రస్తావించారు. గడిచిన యాభై అరవై ఏళ్లలో తెలుగులోకి కొత్త పదజాలం వచ్చిచేరింది. ఆ క్రమంలో అర్థ, శబ్దపరిణామాల వల్ల మార్పుచెందిన పదాలను కూడా ఈ నిఘంటువులో చేర్చారు. దీనికంటే ముందు శ్రీహరి.. ‘సంకేత పదకోశాన్ని’ తీసుకొచ్చారు. వ్యాకరణం, తర్కం, మీమాంస, జ్యోతిషం, అలంకారం, ఆయుర్వేద శాస్త్రాలకు చెందిన 2200 సాంకేతిక పదాలకు ఇందులో వివరణ ఇచ్చారు. సంఖ్యార్థనామ ప్రకాశిక, విద్యార్థి కల్పతరువు, వాచస్పత్యం, శబ్దరత్నాకరం, సంకేతకోశం (మరాఠీ), శ్రీవత్స నిఘంటువు (కన్నడం) తదితరాల ఆధారంగా ఈ నిఘంటువు నిర్మాణం జరిగింది. ‘‘శ్రీహరిగారు ఈ సంకేత పదకోశాన్ని శాస్త్రీయంగా నిర్మించారు. ఈ కృషి జిజ్ఞాసువులందరికీ మహోపకారమని నా సంపూర్ణ విశ్వాసం’’ అని తిరుమల రామచంద్ర ప్రశంసించారు. అన్నమయ్య పదకోశం, వ్యాకరణ పదకోశం, నల్లగొండ జిల్లా మాండలిక పదకోశాలనూ శ్రీహరి రూపొందించారు. నిఘంటువు నిర్మాణంలో శ్రీహరి చేసిన అవిరళ కృషికి గౌరవంగా తిరుపతిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ‘మహామహోపాధ్యాయ’ బిరుదుతో సత్కరించింది. 2013లో  ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం విశిష్ట పురస్కారంతో పాటు అనేక గౌరవాలు శ్రీహరిని వరించాయి.
      ఆచార్య రవ్వా శ్రీహరి నిఘంటువు నిర్మాణంలోనే కాకుండా సృజనాత్మక సాహిత్య రచనలోకూడా కృషిచేశారు. తెలుగులో 50 గ్రంథాలతోపాటూ సంస్కృతంలో పాతికపైనే రచనలు వెలువరించారు. వ్యాకరణ, విమర్శా రచనలు చేశారు. శ్రీహరి నిత్య అధ్యయనశీలి. భాషకు సంబంధించిన వినూత్న కోణాలను వెలికితీస్తూ పరిశోధనే పరమావధిగా భావించిన వారు. విద్యార్థులను జ్ఞానోన్ముఖులుగా మలచడానికీ, వారిలో సత్యనిష్టను కలిగించడానికీ శ్రీహరి లాంటి ఆచార్యులు ఏ కాలానికైనా అవసరమే.


వెనక్కి ...

మీ అభిప్రాయం