మహాత్ముడు నడిచిన దారిలో....

  • 356 Views
  • 1Likes
  • Like
  • Article Share

    సాహితీ స్రవంతి

సత్యసంధతనీ, త్యాగనిరతినీ ఊతంగా చేసుకుని దేశసేవలో సమున్నతశక్తిగా ఎదిగిన మహాత్ముని జీవనక్రమాన్ని తెలిపే పుస్తకమిది. దేశం వలసపాలనలో మగ్గుతున్న రోజుల్లో స్వాతంత్య్ర కాంక్ష, స్వపరిపాలన ఊహకే అందని సంక్షుభిత పరిస్థితుల్లో సత్యాగ్రహ ప్రయోగంతో మనిషి సాధించలేనిదంటూ ఉండదని నిరూపించిన జీవన ఇతిహాసమిది. పొరపాట్లు, తడబాట్లలోంచి తనను తాను తీర్చిదిద్దుకుని ఉన్నతత్వాన్ని నిలుపుకున్న పూజ్యబాపూ ప్రస్థానమిది. సత్యాన్ని కనుక్కోవడమే కాదు, దాన్ని ఆచరణలో భాగంగా చేసుకోవడానికి తానే ఒక సమిధగా మారాల్సిన పరిస్థితులకు అక్షరరూపమే ఈ ‘సత్యశోధన’.. గాంధీ మహాత్ముడి ఆత్మకథ!
‘సత్యశోధన’
అనేది గాంధీ భౌతిక క్రమవికాసాన్ని తెలిపే రచన మాత్రమే కాదు, మూర్తీభవించిన మహాత్ముని సూత్రీకరణలకి ఆచరణరూపం. 1869 నుంచి 1921 దాకా తన యాభైయేళ్ల జీవితకాలంలో సత్యానుష్ఠానంతో తాను చేసిన ప్రయోగాలనూ, హింస తాలూకూ ప్రభావాలనూ ఒక గమనింపుగా గాంధీ చేసిన ప్రయాణమిది. ఇందులో బాపూజీ జీవనక్రమం అయిదు అధ్యాయాలుగా విభజితమైనప్పటికీ సత్యమార్గమనే ఏకసూత్రత అంతర్లీనంగా కనిపిస్తుంది.
      సాంప్రదాయిక వైష్ణవ పద్ధతులూ, మతాచారాలు ఒకానొక పరిస్థితుల్లో తీవ్రక్షోభకు గురిచేసినా తన ఆత్మశక్తికి అవేమీ అడ్డంకి కాలేదంటారు గాంధీ. అమానవీయతను ఖండించడంలోగానీ.. అస్పృశ్యతను దునుమాడటంలోగానీ మహాత్ముడు అలసత్వాన్ని చూపలేదనే విషయాన్ని ఈ పుస్తకంలో చాలా చోట్ల గమనించవచ్చు. చిన్నప్పటి నుంచీ సిగ్గరిగా మసలిన గాంధీ తన ఎదుగుదలకి ఈ ఆత్మన్యూనతాభావమే పెద్ద లోపమని గుర్తించి దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ముంబయి కోర్టులో న్యాయవాదిగా విఫలమైనప్పుడు.. తనలో మెరుగుపరచుకోవాల్సిందేంటో తెలుసుకుంటారు. తర్వాత ఆ లోపాల్ని అధిగమించడం గాంధీ కార్యదక్షతకు మచ్చుతునక. ఆనువంశిక కట్టుబాట్లు, శారీరక దుర్బలత కారణంగా ఏమీ సాధించలేనేమో అనే సంశయం వల్ల కొంతా.. అపరిపక్వ ఆలోచనల వల్ల కొంతా దుష్టసాంగత్యాలకి చేరువైన గాంధీ క్రమక్రమంగా తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది మాత్రం ఉంగరం దొంగతనం విషయంలో తండ్రికి రాసిన లేఖతోనే. ఆ ఉత్తరం తండ్రికి మనస్తాపం కలిగించడమే కాదు అది తనలో మార్పునకి మూలహేతువయ్యింది. ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు తల్లికిచ్చిన మాటతోపాటూ పితృవియోగ వేదనలోని ఆంతర్యాన్ని అవగతం చేసుకున్నారు. ఈ కారణం వల్లనే గాంధీ భావోద్రేకాల విషయంలో చివరిదాకా దృఢంగా నిలబడగలిగారు.
ఆ పుస్తకమే మార్చింది
దక్షిణాఫ్రికాలో జాత్యహంకారం చేసిన గాయం గాంధీ మనోనిబ్బరానికి సవాలు విసిరింది. అక్కడే ఉండి ప్రతిఘటించడమా! ఇంటికి తిరుగుముఖం పట్టడమా! అలా ఆ రాత్రంతా రైల్వేస్టేషన్లో ఒంటరిగా గడిపిన ఇరవై ఏళ్ల గాంధీకి ఆత్మశక్తి ఉదయించింది. అదే సత్యాగ్రహోద్యమానికి నాంది పలికింది. అది గిర్మిటియాలను (దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న వలస భారతీయులు) ఏకం చేయడం కోసమో... జాత్యహంకారులను శిక్షించడం కోసమో రూపుదిద్దుకున్నది కాదు. సత్యాగ్రహ వ్రతాచరణ ద్వారా మనిషిని కార్యోన్ముఖుడిగా మలచాలనే ఆశయం కోసమే. తర్వాత ఇది చాలా సందర్భాల్లో ముఖ్యంగా భారత జాతీయోద్యమంలో శక్తిమంతమైన ఆయుధమయ్యింది మహాత్మునికి. జాత్యహంకారం విషం కక్కుతున్న దేశంలో వలస భారతీయులు ఎదుర్కొంటున్న అవమానాలనూ, స్థానికుల అగచాట్లను కళ్లారా చూశారాయన. మూడోతరగతి ప్రయాణికుడిగా హోటళ్లలోనూ, సమావేశ మందిరాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అవమానాలను చవిచూశారు. వాటి ద్వారా విముక్తి మార్గాన్వేషణలో తన కలాన్నీ, కాలాన్నీ శక్తివంచనలేకుండా వినియోగించారు. 
      దక్షిణాఫ్రికాలో ఎన్నో సంస్కరణలకి మూలమైన గాంధీ స్వదేశానికి తిరిగొచ్చాక లోకమాన్యుని సామీప్యంలో దేశ పరిస్థితులనూ, సామాజిక రాజకీయ సంక్షోభాలనూ అవగాహన చేసుకున్నారు. తనకు రాజకీయ పరిజ్ఞానం తిలక్‌ వల్లనే అలవడిందని చెప్పుకున్న గాంధీకి జాతీయ కాంగ్రెస్‌ ప్రవేశం అంత త్వరగా సాధ్యపడలేదు. 
      గాంధీ తనకు తానుగా విధించుకున్న నియమాలు, వ్రతాచరణ పద్ధతులు అప్పటి సనాతన హిందూ నియమాలకు భిన్నంగా ఉండేవి. గౌతమబుద్ధుడు, క్రీస్తు, మహమ్మద్‌ ప్రవక్త లాంటి ప్రబోధకుల జీవకారుణ్య భావాలకి ఆయన ప్రభావితులయ్యారు. సగటు విద్యార్థి అయిన గాంధీకి ముందు నుంచీ భౌగోళిక ప్రాంతాల మీద అవగాహన మాత్రమే కాదు, ధార్మిక విషయాల పరిజ్ఞానమూ అంతంత మాత్రమే. బారిస్టరుగా ఇంగ్లాడులో కొంత, దక్షిణాఫ్రికాలో కొంత పుస్తక పఠనం అలవర్చుకోవడం ద్వారా విశ్వవిజ్ఞానం మీద అవగాహన పెంచుకున్నారు. న్యాయవాదిగా శిక్షణ పూర్తిచేసుకుని స్వదేశానికి తిరిగొస్తున్నప్పుడు గాంధీకి ఆచార్య విలియం ‘‘నీకు ఇతర గ్రంథాల వల్ల కలిగిన జ్ఞానం కొద్దిగానే ఉంది. నువ్వు కనీసం హిందూ దేశ చరిత్ర అయినా చదివుండాలి. మనిషి స్వభావం తెలుసుకోవడానికి కొన్ని పుస్తకాలు చదవాలి’’ అని సలహా ఇచ్చారు. అప్పుడే  గాంధీ పుస్తకాల శక్తినీ, వాటి ప్రభావాన్ని అంచనా వేసుకోగలిగారు. తర్వాత ఆయన పుస్తక పఠనం మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. తనకు ఇష్టమైన రచయితల గురించి చెబుతూ.. ‘‘నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ముగ్గురు... రాయ్‌చంద్‌ భాయ్, టాల్‌స్టాయ్, రస్కిన్‌’’ అని అంటారు. వీరిలో రస్కిన్‌ సర్వోదయ భావాలు తర్వాతకాలంలో గాంధీ రచనల మీద ప్రభావం చూపాయి. విభిన్న భాషల మాధుర్యాన్ని చవి చూడటమే కాదు, వాటిని నేర్చుకునేందుకూ ప్రయత్నించారు. ‘‘తమిళం దక్షిణాఫ్రికా జైల్లో నేర్చుకున్నాను. ఉర్దూ ఎరవాడ జైల్లో నేర్చుకున్నాను. సాధనలేమి వల్ల తమిళం మరుగున పడిపోయింది’’ అని ఒకచోట ప్రస్తావిస్తారాయన. దక్షిణాఫ్రికాలో గిర్మిటియాలలో హక్కుల సాధన కోసం మొదలైన గాంధీ పోరాటం, స్వదేశంలో చంపారన్‌ రైతుల ఆందోళనలోనూ.. ఆ తర్వాత బోయర్స్‌ యుద్ధ సమయంలో సేవానిరతిలోనూ క్రమవికాసాన్ని పొందుతూ వచ్చింది. తనలోని కార్యదక్షత కేవలం భౌతికశక్తికి చెందినది కాదంటారు మహాత్ముడు. అది తాను చివరిదాకా విశ్వసిస్తూ వచ్చిన ఉపవాసం, బ్రహ్మచర్యం, సత్య వ్రతాచరణ లాంటి సలక్షణ ఆచారాలతో ఒనగూడిన మానసిక దృఢత్వమేనని ఆత్మకథలో చాలా చోట్ల చెబుతారు. 
అది ఆత్మవిశ్వాసం!
తనకు ప్రతికూలమైన విషయాలను తృణీకరించకుండా ఆ అంశాలు సత్యాన్వేషణకు ఎంతవరకు ఉపకరిస్తాయో.. వైయక్తిక ఎదుగుదలకు ఎలా ఉపయుక్తమవగలవో తర్కించి వాటిలో మంచిని గ్రహించడం గాంధీ పద్ధతి. విభిన్న మతాచారాలనూ.. విదేశీయుల సదాచారాలనూ సాధ్యమైనంతవరకూ తన ఆచరణలో భాగంగా చేసుకున్నారు. కానీ, మాంసాహారం విషయంలో మాత్రం తన నిష్ఠను చివరిదాకా కొనసాగిస్తూ వచ్చారు. కుమారుడు మణిలాల్‌ ఆరోగ్యం విషమించినప్పుడు... భార్య కస్తూరిబాయి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడూ, నీళ్ల విరేచనాలతో తాను నీరసించిపోయినప్పుడు.. ఎప్పుడూ తన నియమాలను ఉల్లంఘించలేదు. వైద్యులు మాంసాహారాన్ని వైద్యంగా సూచించినప్పటికీ.. తను నమ్మిన నీటివైద్యంతోనే ఉపశమనం పొందడం ఆయన మొండితనం అనుకుంటాం గానీ అందులోనూ ఆత్మవిశ్వాస ప్రకటన ఉంది. 
      స్వదేశానికి తిరిగొస్తున్నప్పుడు ‘‘ఈ పుస్తకం చదవదగింది...చదవండి! అని మీకు నచ్చుతుంది’’ అని మిత్రుడు పోలక్‌ చెప్పి వెళ్లిన తర్వాత ‘అందులో ఏముందీ! ఏంటీ పుస్తకం!’ అని చూశారు గాంధీ! ‘‘అది ‘అన్‌ టు ది లాస్ట్‌’. రస్కిన్‌ బాండ్‌ రచన. చివరి పేజీ వరకూ వదలకుండా చదివాను దాన్ని. నన్ను ఆ పుస్తకం విపరీతంగా ఆకట్టుకుంది. జోహన్స్‌బర్గ్‌ నుంచి నెటాల్‌కు ఇరవైనాలుగు గంటల ప్రయాణం. సాయంత్రం రైలు డర్బన్‌ చేరుకుంది. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. పుస్తకంలో చదివిన వాటిని ఆచరణలో పెడదామనే నిర్ణయానికొచ్చాను. నా జీవితంలో నాలో మహత్తరమైన నిర్మాణాత్మకమైన మార్పు తెచ్చిన పుస్తకం ఇదేనని కచ్చితంగా చెప్పగలను’’ అంటూ ఆ గ్రంథ ప్రభావాన్ని వివరిస్తారు గాంధీ. ఈ పుస్తకాన్నే ‘సర్వోదయం’ పేరుతో ఆయనే అనువదించి ప్రచురించారు కూడా.
తొలి అనువాదకులు వేలూరి
అసలు తను ఆత్మకథ రాయడానికి కారణాలేంటో చెబుతూ.. ‘‘సత్యశోధన అనే ఈ గ్రంథ రచనకు గల కారణాలను, సందర్భాలను పాఠకులకు తెలియజేయడం అవసరమని నేను భావిస్తున్నాను. ఈ కథ రాసే సమయంలో నా దగ్గర ప్రణాళిక అంటూ ఏమీలేదు. ఎదురుగా పుస్తకాలు గానీ, డైరీలుగానీ, ఇతర పత్రాలు పెట్టుకుని నేను ఈ ప్రకరణాలు రాయలేదు. అంతరంగం చూపిన మార్గంలో రాస్తున్నానని చెప్పగలను’’ అంటారు మహాత్ములు. ‘‘1920 తర్వాత నా జీవితం పూర్తిగా ప్రజామయం అయిపోయింది. జాతీయ కాంగ్రెసు నాయకులందరితో అమితంగా మమేకం అయిపోయాను. ఇక నా గురించి అన్నీ మీకు తెలిసినవే! కాబట్టి ఇక చెప్పాల్సినవి ఏవీలేవని తన ఆత్మకథా రచనను ముగిస్తారు గాంధీ.
      మహాత్ముడి ఆత్మకథ భారతీయులనే కాదు, చాలా దేశాల వారిని గాంధీ మార్గం వైపు తీసుకొచ్చింది. ఈ ఆత్మకథ భారతీయ భాషలన్నింటిలోకీ అనువాదమయ్యింది. తెలుగులో తొలిసారి ఆంధ్రగ్రంథమాల 1929లో ‘గాంధీజీ ఆత్మకథ’ పేరుతో ప్రచురించింది. మహాత్ముడి మూలరచన గుజరాతీలోనే ఉండటంతో ఆ భాషను నేర్చుకుని మరీ ఆ పొత్తాన్ని అనువదించారు వేలూరి శివరామశాస్త్రి. ‘దేశోద్ధారక’ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దీనికి ప్రకాశకులు. ‘‘గుజరాత్‌ నవజీవన్‌ పత్రికయందు వ్యాసరూపమున ప్రచురింపబడుతున్న ఆత్మకథ పుస్తకరూపము దాల్చినది. ఆత్మకథాప్రకరణముల కనువాదములెప్పటికప్పుడే ఆంగ్ల పత్రికలయందును, దేశభాషాపత్రికలయందును ప్రచురింపబడుచున్నవి. తెలుగునందును ఆత్మకథను ప్రచురించుటకు మహాత్ములవారి నాంధ్రప్రముఖులు కోరియుండిరి. మహాత్ముని అనుమతితో దీనిని ప్రచురించుటకు బూనితిని. స్వయంగా తెలిగింపనెంచితిని. కాని సాధ్యము కాలేదు. సుప్రసిద్ధాంధ్రపండితులు, శతావధానులు శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారాంధ్రీకరణ భారం వహించి అచిర కాలమున పూర్తిచేసిరి’’ అంటూ కాశీనాథుని తన ముందుమాటలో చెప్పారు. తర్వాతి కాలంలో గాంధీ ఆత్మకథకు తెలుగులో చాలా అనువాదాలు వచ్చాయి. తుమ్మల సీతారామమూర్తి దాన్ని ‘మహాత్మ కథ’గా పద్యరూపంలో వెలువరించారు. వేమూరి రాధాకృష్ణమూర్తి ‘సత్యశోధన’ పేరిట 1993లో చేసిన అనువాదం తెలుగువాళ్లకి గాంధీ జీవితాన్ని ఇంకా బాగా పరిచయం చేసేందుకు సాయపడింది. ఈ రచనకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ అనువాద పురస్కారమిచ్చి గౌరవించింది. ఈ పుస్తకానికి సంబంధించి 1998 నాటికే తెలుగునాట 40 వేల ప్రతులు అమ్ముడయ్యాయి. తర్వాత నవజీవన్‌ సంస్థ మహాత్ముడి రచనలకు సంబంధించిన కొన్ని సంపుటాలనూ వెలువరించింది. జాతిపిత జీవిత విశేషాలతోపాటు ఆయన ఆలోచనలనూ నేటితరానికి అందించి, వారిలో స్ఫూర్తి కలిగించే దిశగా చైతన్యస్ఫోరకమైన సాహిత్యం ఇప్పటికీ వస్తూనే ఉంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం