తెలుగు తెలివికి పొద్దు ‘పొడుపు’

  • 3375 Views
  • 25Likes
  • Like
  • Article Share

    డా।। మాదిరాజు క‌న‌క‌దుర్గ‌

  • హైద‌రాబాదు
  • 9885688342
డా।। మాదిరాజు క‌న‌క‌దుర్గ‌

చుక్కలు పొడిచే వేళ, మక్కువ తీరే వేళ, ఆడపిల్లే పొడుపు కథ పొడవాలి.. అందగాడే తెలుసుకొని విప్పాలి’’ అన్నారు ఆరుద్ర. గడుసైన జానపదాల జాణతనంతో విసిరే పొడుపుకథలకు, దీటైన దేశవాళీ విడుపులను చెప్పటం ఓ అందమైన సవాలే! నేరుగా కాకుండా మారుగా ప్రశ్నను అడిగే ఒడుపు, వినోదాన్ని విజ్ఞానంతో మేళవించి చెప్పే విడుపులతో కూడిన పొడుపుకథ, తెలుగు భాషకు తలమానికం.
మానవ
మనోవికాసం బాల్యావస్థలో ఉన్నప్పుడే జానపదులు సృష్టించుకున్న కూటరచనలు పొడుపుకథలు. సామెతల మాదిరిగానే ఇవి చాలా వరకు ఏకవాక్య నిర్మితాలు. హాస్యస్ఫోరకాలు. ఊహాతీతంగా ఉండి గూఢమైన జవాబు తెలియగానే ఎదుటివారికి దిగ్భ్రమను కలిగించడం పొడుపుకథ స్వభావంగా చెప్పారు ఆర్వీయస్‌ సుందరం. అరిస్టాటిల్‌ దీన్ని రూపకాల సమాహారంగా అభివర్ణించారు. ఆంగ్ల రిడిల్, సంస్కృత ప్రహేళిక, ప్రాకృత పహేలీ, తమిళ పుడుర్, కన్నడ ఒగటు, మరాఠీ ఉఖాణం.. ఏ పేరుతో పిలిచినా అంతిమంగా పొడుపుకథ పరమార్థం మానసికాహ్లాదమే. 
      భారతదేశంలో వేదకాలం నుంచీ పొడుపుకథలు ప్రచారంలో ఉన్నాయి. రుగ్వేదంలో ‘‘ద్వా సుపర్ణా సయుజా సఖాయా....’’ అంటూ ఓ శ్లోకం ఉంటుంది. సమూల శ్రీమదాంధ్ర రుగ్వేద సంహిత ప్రకారం తెలుగులో చెప్పుకోవాలంటే, ‘‘అతులిత పర్ణముల్‌ గలిగి యంచితమైత్రి సమానయోగసు/ స్థితి భరియించి యేకమగు చెట్టున నున్నవి రెండు పక్షులు/ ద్ధతమగు రెంటిలో నొకటి తత్ఫలమున్‌ భుజియించు చుండ సం/ తతమును జూచుచుండుగద! తక్కిన పక్షి ఫలార్థి కాకయే’’! ఇలాంటిదే మరొక ప్రస్తావన శ్వేతాశ్వతరోపనిషత్తులోనూ కనబడుతుంది... ‘‘చెట్టు! చెట్టు మీద రెండు పిట్టలు, ఒక పిట్ట పండును తింటుంది, సుఖ దుఃఖానుభూతుల్ని పొందుతుంది. రెండోపిట్టకు ఏమీ అక్కర్లేదు. అది నిశ్చింతగా ఉంది, చెట్టేంటి? పిట్టల మర్మమేంటి?’’. ఈ పొడుపుకు ‘చెట్టు సంసారం, పండును తినే పిట్ట జీవుడు, తినని పిట్ట ఈశ్వరుడు’ అనేది విడుపు. 
వాని తలగొట్ట ఇందిరా వల్లభుడగు
‘‘ప్రవల్హికా ప్రశ్నదూతీ’’ అన్నది శబ్దరత్నావళి కర్త అభిప్రాయం. పొడుపు కథలో ప్రశ్న సందేశాన్ని ఛాయామాత్రంగా చేరవేసే దూతికగా ఉంటుంది. కొరవి గోపరాజు తన సింహాసన ద్వాత్రింశిక కావ్యంలో చాలా చోట్ల ఇటువంటి చమత్కారజ్ఞతను ప్రదర్శించాడు. ‘‘రాజ్యంబు వదలక రసికత్వమెడలక/ జయశీల ముడుగక, నయము చెడక/ దీనుల జంపక దేశంబు నొంపక/ నిజ ముజ్జగింపక నేర్పు కలిగి/ విప్రుల జుట్టాల వెన్నుసొచ్చినయట్టి/ వారిని గొల్చినవారి బ్రజల/ హర్షంబుతో గాచి యన్యాయ ముడుపుచు/ మున్ను జెప్పిన రీతి జెన్నుమీఱి/ చేత లొండులేక ప్రాతల విడువక/ యశము కలిమి దమకు వశము గాగ/ వసుధ యేలు రాజవర్గంబులోన న/ య్యాది విష్ణుమూర్తి వండ్రు నిన్ను’’..  ఈ సీసంలోని ఎనిమిది పాదాలు, గీతంలోని నాలుగు పాదాల మొదటి అక్షరాలను కలిపి చదివితే ‘‘రాజ దీని వివాహము చేయవయ్యా’’ అనే వాక్యం వస్తుంది. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని పరికిస్తే ఇలాంటి చమత్కారాలు వేనవేలుగా దర్శనమిస్తాయి.
      పొడుపు కథలంటే అల్లాటప్పా ఏమీ కాదు. పొడిచే వారికి సమాధానం తెలిసి ఉండాలి. సునిశిత బుద్ధి, ఏకాగ్రత అవసరం. ‘‘ఆలినొల్లక యున్న వానమ్మ-మగని/ నందు లోపలనున్న వానక్క మగని/ నమ్మినాతని జెరుచు దానమ్మ సవతి సిరులు మీకిచ్చు నెప్పట్ల కరుణతోడ’’ అన్నది ఓ పద్య పొడుపు. దీన్ని విప్పి చెప్పుకుంటే- ఆలినొల్లని వాడు భీష్ముడు; భీష్ముడి అమ్మ గంగ; గంగ భర్త సముద్రుడు; సముద్రంలో ఉన్నవాడు మైనాకుడు; మైనాకుడి అక్క పార్వతి; పార్వతి మగడు శివుడు; శివుణ్ని నమ్మిన వాడు రావణుడు; రావణుడి నాశనానికి కారణం సీతాదేవి; సీతాదేవి తల్లి భూదేవి; భూదేవికి సవతి లక్ష్మీదేవి; ఆ లక్ష్మీదేవి మీకు సంపదలిచ్చుగాక - ఇంత కథ ఉంది మరి! ఆచార్య హేమచంద్రుడు తన ‘కావ్యానుశాసనం’లో ప్రశ్నోత్తర ప్రహేళికాదులను చిత్రకవిత్వంగా నిర్వచించాడు. చిత్రకవిత్వంలోని లక్షణాంశాలు కొన్ని పొడుపుకథల్లో కనబడతాయి. ఈ లక్షణాంశాల్లోని అక్షర విలోపాన్ని ‘‘అక్షర త్రయంబు నలరారు పుష్పంబు/ నడిమి యక్షరంబు విడిచి పలుక/ ముదము నిచ్చు పులుగు మూర్తి నామంబొప్పు/ దీని భావమేమి తిరుమలేశ’’ అనే పద్యంలో చూడవచ్చు. ఈ పొడుపుకు విడుపు ‘కేతకి- కేకి’. కేతకి అంటే పచ్చపువ్వుల మొగిలి. కేకి అంటేనేమో నెమలి. అద్భుతంగా ఉంది కదా! ఇలాంటిదే ఇంకొక పొడుపు.. ‘‘అరయ నాల్గక్షరముల శివాఖ్య యొప్పు/ వాని తలగొట్ట ఇందిరా వల్లభుడగు/ వాని తలగొట్ట నర్థంబు భర్త యగును/ అట్టి పదమేదొ? పేర్కొనుడార్యులార’’! శివుడికి నాలుగు అక్షరాల మారుపేరు ‘ఉమాపతి’. ఇందులో మొదటి అక్షరం తీసేస్తే ‘మా(లక్ష్మీ)పతి’. దీంట్లో మొదటి అక్షరం లేకపోతే ‘పతి’. ఇదే విడుపు. ఇలాంటివే ‘మాటకాని మాట’ (టమాట), ‘కీలుగాని కీలు’ (వకీలు) లాంటివి. ఇలాంటి చిత్రవిచిత్రాల పొడుపుకథలు తెలుగులో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి.
తెలంగాణలో ‘తట్టు’
కర్తలు, వ్యవహర్తలు ప్రజలే అయిన జానపద సాహిత్యంలో పొడుపుకథలు గంపల కొద్దీ పుట్టి తెలుగు గాదెల్ని నింపాయి. ఈ ‘పొడుపుకథ’ తెలంగాణలో ‘తట్టు’గా మారుతుంది. పిల్లలు ‘మనం తట్లేసుకుందమబ్బ’ అనడం వింటూనే ఉంటాం. గూఢ ప్రశ్నను తాకటమే తట్టటం. ప్రశ్నకు జవాబు మనసుకు తడుతుంది. పొడుపు విడుపుల రెండర్థాలను తెలిపే పదం ఈ తట్టు. మొదట వేసిన తట్టుకు జవాబు చెప్పకుండా మరొకరు ఇంకో తట్టు వేస్తే అది ‘మారుతట్టు’. రాయలసీమ పరిభాషలో ‘మారుకత’. పొడుపుకథల్ని వరంగల్లు, కరీంనగర్, నిజామాబాదు ప్రాంతాల్లో శాస్త్రాలంటారు. అనంతపురం జిల్లాలో వీటిని ‘అడ్డుకతలు’గా వ్యవహరిస్తారు. ఇంకా వివిధ ప్రాంతాల్లో ‘చిటుకులు, సమస్యలు, సమిచ్చలు, యక్షప్రశ్నలు’గా పిలుస్తారు. 
      సంక్షిప్తతలో సంపూర్ణత్వాన్ని దర్శింపజేసేది పొడుపుకథ. ‘కంచెల కర్రెద్దు’ (పేను), ‘గుంతల గుండ్రాయి’ (కనుగుడ్డు), ‘రెండిళ్లకు ఒకటే దూలం’ (ముక్కు)... ఈ పొడుపుల్లో వ్యర్థాక్షరాలు ఏవీలేవు. ఉన్నవాటిల్లో ఏ ఒక్కటి లోపించినా అర్థం చెడిపోతుంది.  కొన్ని పొడుపుల్లో జవాబు నిగూఢంగా దాగి ఉంటుంది. ‘ఏదో మనవాడని ఊరుకున్నాను’ అన్నది అలాంటిదే. దీనికి విడుపు ‘దోమ’. అలాగే, అసలు అర్థానికి బదులు మరొకటి స్ఫురించే అపార్థద్యోతకత పొడుపుకథకు ప్రధాన లక్షణం. ‘గుడి చుట్టూ తిరిగి గుళ్లో...’ అన్న పొడుపు దీనికో ఉదాహరణ. ఈ ప్రశ్న వినలేక చెవులు మూసుకున్నా, విడుపు కొబ్బరికాయే. అది గుడికి వస్తుంది. చుట్టూ తిరుగుతుంది- ప్రదక్షిణం చేస్తుంది. దేవుడి పాదాల దగ్గర పగులుతుంది కదా మరి. ఇలాంటి ఉద్దేశ పూర్వక నిర్మితాలు పొడుపుల్లో కోకొల్లలు. అలాగే, ఇవి కథాత్మకాలు కూడా. మూడు పదాలతో ముగిసే కథ ‘కట్టె- కొట్టె- తెచ్చె’ దీనికో చక్కటి తార్కాణం. ఒక ప్రాణి, వస్తువు లేదా ప్రకృతిలోని ఏదో విశేషం గురించి ఉపమానం ద్వారా వాచ్యం చేస్తుంది పొడుపుకథ. ప్రశ్న ఆధారంగా ఉపమేయమైన విడుపును సూచించటమే అసలు చమత్కారం. ‘పొద్దున లేస్తే కర్రెపిట్ట బాయిల వడె’ (బొక్కెన లేదా చేద), ‘తెల్లటి భూమిల నల్లటి ఇత్తనం, సేతేస్తరు- నోటేర్తరు (కాగితం మీద రాత)’ తదితర పొడుపూ విడుపులు ఇలాంటివే. పొడుపు కథ నిర్మాణంలో ఒక వస్తువుకు ప్రతిగా మరొక వస్తువును సంకేతాత్మకంగా సూచించడమూ రివాజు. ‘బక్కకుక్కకు బండెడు పేగులు’ (మంచం, నవారు), ‘పుట్టెడు శనగల్లో ఒక్కటే రాయి’ (నక్షత్రాలు, చంద్రుడు) లాంటివి ఈ కోవలోకి వస్తాయి. 
నీ ఒళ్లంతా ముళ్లురా!
‘నూరుగురు అన్నదమ్ములకు ఒక్కటే మొలతాడు’ (చీపురు తాడు), ‘గవాసిల గడ్డపార’ (ముక్కుపుల్ల).. ఇలా పొడుపుకథలు గుచ్చినట్లుగానూ ఉంటాయి. ఇక కొన్నింటిలో చివర చెప్పాల్సిన వస్తువును ఒకే అక్షరం ద్వారా సూచిస్తారు. దాని ఆధారంగా మిగిలిన అక్షరాలను గ్రహించి చెప్పాల్సి ఉంటుంది. ‘‘వంకర టింకర శొ.. వాని తమ్ముడు అ.. నల్లగుడ్ల మి.. నాలుగు కాళ్ల మే...’’ దీనికి సమాధానాలేంటో తట్టాయా? శొంఠి, అల్లం, మిరియాలు, మేక! ఇక గేయాల రూపంలో ఉండే పొడుపుకథలు అనేకం. వీటి కూర్పులో లయాత్మకత చెవులకు ఇంపుగా వినబడుతుంది. ‘చెక్కని స్తంభం చేతికందదు, చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తియ్యగనుండు’; ‘రాచవారికి నచ్చే చిన్నది, రాజ్యాలెల్లా మెచ్చేనన్నది, బంగారు వారింటి కోడలు, పట్టుమంటే రాదు చేతులు, చేంతాడుతో తోడకుండా, చెంబుతో ముంచకుండా, నీటుగా కులుకుతూ నీళ్లు తెస్తానంది’.. ఈ రెండింటికీ విడుపు కొబ్బరికాయే. కొన్ని గేయాల్లో ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క జవాబు ఉంటుంది. ‘దిబదిబలాడేవి రెండు (కాళ్లు)/ దిబ్బెక్కి చూసేవి రెండు (కళ్లు)/ ఆలకించేవి రెండు (చెవులు)/ ఆదుకునేవి రెండు (చేతులు)’... ఇలాంటివి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతాయి.
      జీవితాన్ని కాచి వడబోసినవే లోకోక్తులు. ఇవి పొడుపు కథల్లో కోకొల్లలు. ‘అన్నేసి జూడు- నన్నేసి జూడు’ (ఉప్పు) అన్నది నిజమే కదా! వంటకాల్లో ఎన్ని పదార్థాలు వేసినా ఉప్పు లేనిదే రుచి ఉండదు. ‘చెట్టుమీది వాడు జుట్టుమీదికెక్కె’ (కల్లు), ‘వినేవాటికి, కనేవాటికి బెత్తెడు దూరం’ (చెవులు, కళ్లు) లాంటివి ఈ వరసలోనివే. ఇంకొన్ని పొడుపుకథల్లో చమత్కార చాతుర్యం తొణికిసలాడుతూ ఉంటుంది. ‘కొనేటప్పుడు నల్లగ, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగ’ (అల్లనేరేడు పండు), ‘ఓరోరి అన్నరో, నీ ఒళ్లంతా ముళ్లురా, కారాకు పచ్చరా, నీ కండంత చేదురా’ (కాకరకాయ), ‘కుండనిండా ఉండ్రాళ్లు- కుండకు తాళం’ (వెలగపండు), ‘గుడినిండా ముత్యాలు- గుడికి తాళం’ (దానిమ్మపండు), ‘ఊరూరవతల, ఉత్తరానకవతల, జమ్మిచెట్టవతల, జాలాదవతల పుంజులేని పెట్ట గుడ్లు పెట్టింది’ (పుట్టగొడుగు), ‘ఒకటి వచ్చింది, పదహారింటిని తాకింది, నూరై వెలసింది, రెండై పోయింది’ (పళ్లు తోముకునే పుల్ల).. లాంటివి భలే గమ్మత్తుగా ఉంటాయి.
జారిపోతున్న సిరులు
అత్యంత ప్రాచీనమైన వ్యవసాయ వృత్తికి సంబంధించి వందల కొద్దీ పొడుపు కథలను సృష్టించారు జానపదులు. సాగు విజ్ఞానాన్ని అందించే నిధులుగా ఇవి తోడ్పడతాయి. ‘చిత్త చిత్తగించి, స్వాతి చల్లజేసి, విశాఖ విసరకుంటె, అనూరాధలో అడిగినంత పండుతాను’ (జొన్నచేను), ‘స్వాతి కురిస్తే, చల్లపిడతలోకి రావు’ (జొన్నలు)- ఇలాంటి పొడుపులకు పల్లెటూళ్లలో కొదవే లేదు. అలాగే, ‘ఏటిలో ఎద్దు, ఎన్ని పగ్గాలు వేసినా రాదు’ (ఏటిలో నీళ్లు), ‘మా తాతకి రెండెడ్లు. ఒకటి ముందుకు నడుస్తుంది, ఒకటి వెనక్కి నడుస్తుంది’ (చెప్పులు), ‘మాతాత మూడెద్దుల్ని తోలి తెచ్చాడు. ఒకటి మునుగుతుంది, ఒకటి తేలుతుంది, ఒకటి కరుగుతుంది’ (వక్క, ఆకు, సున్నం), ‘ఎద్దు పండంగ, మోకు సాగంగ’ (గుమ్మడికాయ- తీగె) లాంటివీ పల్లెల్లో ఎక్కువగానే వినపడతాయి. 
      ఇలా చెప్పుకుంటూ పోతే, మౌఖిక సాహిత్య సాగరంలోని ముత్యాల లెక్కకు తరుగే లేదు. నందిరాజు చలపతిరావు, డా।। వెలగా వెంకటప్పయ్య, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి తదితర పండితులు ఈ పొడుపుకథలను పరిశోధించి, సంకలనాలను రూపొందించారు. వాటిని భవిష్యత్తరాలకు అందించే ప్రయత్నం చేశారు. పిల్లల్లో సునిశిత ఆలోచనలను వికసింపజేసి వారిలో తెలివితేటలను పెంచడం ప్రాచీన కాలం నుంచీ, పొడుపుకథల ప్రధాన లక్ష్యం. అయితే ఇప్పటి తరానికి వీటిలో చాలా వరకు తెలియవు. చల్లకవ్వం, తిరగలి, రోలురోకళ్లు, నాగలికర్రు, బోద (కొట్టాలపైకప్పు), వెల్ల, మొగసాల, దుత్త, కొలిమితిత్తి, కొడవలి, దూలం, సారె లాంటి ఒకప్పటి వ్యవహార పదాలను ఎన్నింటినో పిల్లలకు పరిచయం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పదాలకు అర్థం తెలియని వాళ్లు ఇంక పొడుపుకథను అర్థం చేసుకొనే అవకాశం లేదు. అలా క్రమంగా ఇవి మన వ్యవహారం నుంచి దూరంగా జరిగిపోతున్నాయి. నేటితరానికి తెలుగు భాష సొగసులు పూర్తిగా ఆకళింపునకు రావాలంటే మనదైన సంస్కృతిని అమ్మ చేతిముద్దగా అందించాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం