విఫల ప్రయోగంలో బలిపశువులు

  • 1643 Views
  • 12Likes
  • Like
  • Article Share

    కత్తి నరసింహారెడ్డి

  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనమండలి సభ్యులు
  • 9440585031
కత్తి నరసింహారెడ్డి

ఆలోచించలేదు. అభిప్రాయాలు సేకరించలేదు. అధ్యయనం చేయలేదు. ఆర్భాటంగా పని మాత్రం మొదలెట్టేశారు. ఆ తర్వాత బొక్కబోర్లాపడ్డారు! తాము పడటమే కాదు... వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తునూ చీకటి లోయల్లోకి నెట్టేశారు!! సక్సెస్‌ పాఠశాలల పేరిట గత పాలకులాడిన మాయా జూదానికి గ్రామీణ ప్రాంత పిల్లల చదువులు గాల్లో దీపాలయ్యాయి. అమ్మభాషను వదలిపెట్టి ఆంగ్లానికి అరవంకీలు పెడదామనుకున్న వారి విపరీతబుద్ధివల్ల పేద విద్యార్థుల హక్కులన్నీ గంగపాలయ్యాయి. 2008లో ప్రారంభించిన ఆంగ్ల మాధ్యమ సక్సెస్‌ పాఠశాలలు... 2014 నాటికి ఓ విఫల ప్రయోగంగా తేలాయి. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ బడులను పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడానికి నిర్ణయించిన ఈ తరుణంలో నాటి సక్సెస్‌ పాఠశాలలు మిగిల్చిన చేదు అనుభవాలను తెలుసుకోవడం అవసరం.
ప్రస్తుతం
రాష్ట్రంలో విద్యావ్యవస్థలను పరిశీలిస్తే, 95 శాతం ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నాయి. అదే సమయంలో 98 శాతానికి పైగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో మాత్రమే బోధన జరుగుతోంది. స్థానికంగా ఆంగ్ల మాధ్యమ బడులు లేకపోవడంతో వేరే గత్యంతరం లేక గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పిల్లలు తెలుగు మాధ్యమంలో చదువుకుంటున్నారు... 
      తెలుగు మాధ్యమ చదువులను హేళన చేసే ఈ మాటలెవరివో తెలుసా? ఘనత వహించిన మహానేతలవి. జూన్‌ 10, 2008న సక్సెస్‌ పాఠశాలలకు నాంది పలుకుతూ అప్పటి అవిభాజ్య రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నం.76లో వారి రాతలివి. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ‘మెరుగైన విద్య’ను అందించడానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నామని ఆ ‘రాజ’పత్రంలో చెప్పారు ఆనాటి పాలకులు! మాతృభాషకు దూరమైన విద్య... మెరుగైంది ఎలా అవుతుందన్న స్పృహ వారికి లేదు. ఆ అజ్ఞానాంధకారంలోనే, అరకొర వనరులతో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న (బోధిస్తున్నామని అనుకుంటున్న) ప్రైవేటు పాఠశాలలను చూసి వాతలు పెట్టుకోవడానికి తయారయ్యారు!
      వాస్తవానికి, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లానికి పెద్దపీట వేయడానికి 2006 నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు అప్పటి పాలకపక్ష పెద్దలు. కొన్ని జిల్లాల్లోని బడుల్లో ప్రయోగాత్మకంగా ఆంగ్ల మాధ్యమంలో తరగతులూ నడిపించారు. ఫలితాలెలా వచ్చాయో తెలియదు కానీ, 2008 నుంచి సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమానికి తలుపులు తెరిచారు. అనుకున్నదే తడవుగా... ‘ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న విషయం గత కొంత కాలంగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది’ అన్న వాక్యంతో మొదలుపెట్టి జీవో ఇచ్చేశారు! ఈ నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు, విద్యాధికారులతో సదస్సులు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరిపామని చెప్పుకున్నారు. సదస్సుల్లో పాల్గొన్న వాళ్లందరూ ఆంగ్ల మాధ్యమానికి మద్దతు పలకడంతోనే ముందడుగు వేశామని నమ్మబలికారు. వాస్తవానికి ఆ సదస్సులు ఎక్కడ నిర్వహించారో తెలియదు! ఆంగ్ల మాధ్యమ చదువులపై లేనిపోని భ్రమలు వద్దు... అమ్మభాషలో చదువుకోవడమే ముద్దు అని విద్యావేత్తలందరూ మొత్తుకుంటుంటే, ఆంగ్ల మాధ్యమానికి వాళ్లు  ఓటేశారని సర్కారు అనడం హాస్యాస్పదం కాదా!
      ఏది ఏమైనా, ఆ జీవోతో ఉమ్మడి రాష్ట్రంలోని 6500 ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. వీటికి సక్సెస్‌ పాఠశాలలని నామకరణం చేశారు. 4094 ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఆరు, ఏడు తరగతులను ఈ బడుల్లో విలీనం చేశారు. అన్నప్రాశన రోజే ఆవకాయన్నం అన్నట్లు ఆంగ్ల మాధ్యమం ప్రారంభంలోనే సీబీఎస్‌ఈ సిలబస్‌ను తలకెత్తుకున్నారు. సరే, దాని బోధనకు ప్రత్యేకంగా నిపుణులైన ఉపాధ్యాయులను నియమించారా 
అంటే అదీ లేదు. ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న తెలుగు మాధ్యమ ఉపాధ్యాయుల నెత్తినే ఈ భారం మోపారు. తెలుగు మాధ్యమంలో చదువుకుని వచ్చి, సంవత్సరాల తరబడి తెలుగులో పాఠాలు చెప్పడానికి అలవాటు పడ్డ గురువులు ఒక్కరోజులో ఆంగ్లంలోనూ బోధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఉపాధ్యాయులకు ఆంగ్లంపై పట్టు పెంచడానికి ప్రతి నెలా శిక్షణా తరగతులు నిర్వహిస్తామని జీవోలో చెప్పారు. కానీ, ఎక్కడా పట్టుమని పదమూడు రోజులు కూడా శిక్షణనివ్వలేదు. మరి వాళ్లేం పాఠాలు చెబుతారు? విద్యార్థులేం నేర్చుకుంటారు? సక్సెస్‌ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల గతి అగమ్యగోచరమవడానికి ప్రధాన కారణమిదే. 
పోతున్నాయి!
సీబీఎస్‌ఈ సిలబస్‌పై విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో 2009-10 నుంచి రాష్ట్ర సిలబస్‌నే తీసుకున్నారు. కానీ, ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకంలో మాత్రం ప్రగతి లేదు. దీనికి తోడు పాఠ్యపుస్తకాల కొరత. ఆంగ్ల మాధ్యమ పిల్లలకు ఓ విద్యా సంవత్సరం మొత్తం పుస్తకాలివ్వని ఉదంతాలూ ఉన్నాయి. ఓ పక్క పాఠాలు చెప్పేవారికి ఆంగ్లం రాదు, సొంతంగా చదువుకుందామంటే పుస్తకాల్లేవు... దాంతో చిన్నగా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తరలిపోవడం ప్రారంభించారు. అంటే, గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల ద్వారా ఆంగ్ల మాధ్యమం వైపు నడిపించి... చివరికి వాళ్లను ప్రైవేటు బడులకు అప్పగించారన్న మాట! 
      విద్యార్థులు తగ్గిపోవడంతో ప్రారంభంలో ఉన్న 6500 సక్సెస్‌ పాఠశాలల్లో 5658 మాత్రమే ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలో తరగతులు నిర్వహిస్తున్నాయి. వాటిలోనూ ఆరో తరగతిలో చేరిన విద్యార్థులందరూ పదో తరగతి వరకూ రావట్లేదు. దాదాపు యాభై వేల మంది పిల్లలు మధ్యలో బడి మానేస్తున్నారు. 86వ రాజ్యాంగ సవరణ (21ఏ అధికరణం, 2002) ప్రకారం విద్య ప్రాథమిక హక్కయింది. కానీ, పాలకుల నిర్ణయాల్లో ముందుచూపు కొరవడటంతో పేద పిల్లలు ఆ హక్కును కోల్పోతున్నారు.    
      గ్రామీణ ప్రాంతాల్లో ఆంగ్ల మాధ్యమం అందుబాటులో లేకపోవడంవల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి పిల్లలు తెలుగులో చదువుకుంటున్నారని పాలకులు వ్యాఖ్యానించారు కదా! మరి సక్సెస్‌ పాఠశాలలు ప్రారంభించిన తర్వాత పల్లెల్లోని విద్యార్థులందరూ ఆంగ్ల మాధ్యమంలోకి మారిపోయారా? అదేం లేదు. సక్సెస్‌ పాఠశాలల్లో చేరికలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఒక సక్సెస్‌ పాఠశాలలో వంద మంది చేరారనుకుంటే వాళ్లలో ముప్ఫై మంది మాత్రమే ఆంగ్ల మాధ్యమం తీసుకుంటున్నారు. మిగిలిన వాళ్లందరూ చక్కగా తెలుగునే ఎంచుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆంగ్ల మాధ్యమంపై పాలకులకే ఎక్కువ మోజు ఉందన్నదీ అర్థమవుతోంది.
ఒప్పుకున్నారు కానీ...
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు (గణితం, విజ్ఞానశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఆంగ్లం) ఉపాధ్యాయుల కొరత ఉందని జీవో నం.76 చెబుతోంది. అంటే, ఉన్న ఉపాధ్యాయులపై బోధనా భారం ఉన్నట్లే కదా. ఆంగ్ల మాధ్యమంలో బోధన పేరిట వారి మరింత భారం మోపడం ఎంతవరకూ సహేతుకం? ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి నియామకాలు చేపట్టడమే కాదు, అదనపు పోస్టులను కూడా మంజూరు చేస్తామని చెప్పిన పాలకులు మాట మీద నిలబడలేదు. ఇక అన్ని పాఠశాలలకు అవసరమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, మైదానం, ప్రహరీగోడ, తాగునీరు తదితర వసతుల కల్పనలోనూ (ఇవన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పారు) లక్ష్యం నెరవేరలేదు. ప్రతి సక్సెస్‌ పాఠశాలకూ ఆరు తెలుగు - ఆంగ్లం, ఆరు ఆంగ్లం - తెలుగు నిఘంటువులు అందజేస్తామన్న హామీ పరిస్థితీ అంతే. 
      విచిత్రం ఏంటంటే... సక్సెస్‌ పాఠశాలల స్థితిగతులపై విద్యాశాఖ తరఫున సమీక్షలు జరగట్లేదు. ఆయా బడుల్లో బోధన ఎలా సాగుతోంది, విద్యార్థుల నైపుణ్యాలు ఏమేరకు ఉన్నాయన్న విషయాలను పట్టించుకునే వారే లేరు. ప్రమాణాల మెరుగుదలకు చర్యలు అసలే లేవు. దాంతో సక్సెస్‌ పాఠశాలలో ఆరో తరగతిలో చేరిన పిల్లల్లో ఎక్కువ మంది... పదో తరగతి పరీక్షలకు సరిగా సంసిద్ధులు కాలేకపోతున్నారు. విషయంపై పట్టు లేక, దాన్ని ఆంగ్లంలో వివరించే నైపుణ్యం కొరవడి అల్లాడుతున్నారు. చివరికి రెంటికీ చెడ్డ రేవళ్లవుతున్నారు. 
      ముక్కీమూలిగీ బొటాబొటి మార్కులతో పదో తరగతి పూర్తి చేసినా... ఇంటర్‌కు వచ్చేసరికి ఆంగ్ల మాధ్యమంలో నడిచే ప్రభుత్వ కళాశాలలు ఒకటి రెండు తప్ప లేవు. ప్రైవేటు కళాశాలలే దిక్కు. పేద కుటుంబాలకు చెందిన ఆ పిల్లలు వేలకు వేలు రుసుములు చెల్లించి ఆ కళాశాలల్లో చేరగలరా? వాస్తవానికి, సక్సెస్‌ పాఠశాలలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలో ఆరో తరగతిలో చేరిన విద్యార్థులు పదో తరగతిలోకి వచ్చేసరికి... ఇంటర్‌ చదవులకూ (ప్లస్‌టూ) ఆయా పాఠశాలల్లోనే ఏర్పాట్లు చేస్తామని జీవో 76లో చెప్పారు. కానీ, చేయలేదు. మోడల్‌ పాఠశాలల పేరిట కొన్నిచోట్ల ఈ సౌకర్యం కల్పించారు కానీ, నూటికి 95% బడుల్లో వీటి ఊసే లేదు. 
      మొత్తమ్మీద సక్సెస్‌ పాఠశాల విద్యార్థికి పదో తరగతి లోపు... నైపుణ్యాలు అబ్బట్లేదు. పదో తరగతి తర్వాత... చదువు కొనసాగించడానికి అవకాశాలూ కన్పించట్లేదు. విద్యా సంబంధిత విషయాల్లో పాలకులు గాలివాటుగా నిర్ణయాలు తీసుకుంటే, నవతరం ఎలా నిర్వీర్యం అవుతుందన్న విషయానికి, సక్సెస్‌ పాఠశాలల వైఫల్యమే పెద్ద ఉదాహరణ.


వెనక్కి ...

మీ అభిప్రాయం