మనిషిని నమ్మిన మనీషి

  • 194 Views
  • 11Likes
  • Like
  • Article Share

    ఆర్వీ రామారావ్‌

  • అనుభవజ్ఞులైన పాత్రికేయులు
  • హైదరాబాదు
  • 9676282858
ఆర్వీ రామారావ్‌

ఒక మనిషిలో ఓ వైపు కమ్యూనిజం, మరోవైపు దైవభక్తి ఉండటం ద్వైదీభావంగానో, వైరుధ్యంగానో భావించడం సహజమే. కానీ దాశరథి రంగాచార్యలో ద్వైదీభావం బొత్తిగా లేదు. ఈ రెండు పార్శ్వాలూ ఆయన జీవితంలో సమాంతరంగానే ఉండేవి. ఆ రెండింటికీ పొసగదని ఆయన ఏనాడూ భావించలేదు. కమ్యూనిస్టు భావాలు ఎంత బలంగా ఉండేవో దైవభక్తి కూడా కొట్టొచ్చినట్టు కనిపించేది.
తెలుగు
సాహిత్య చరిత్రలో నిత్య జ్వాజ్వల్యమానమైన దాశరథి రంగాచార్య (1928 ఆగస్టు 24 - 2015 జూన్‌ 8) సాహితీ ప్రస్థానంలో రెండు ప్రధానమైన పాయలు కనిపిస్తాయి. ఒక పాయ అభ్యుదయ సాహిత్యానికి ప్రతీక అయితే మరో పాయ సంప్రదాయ సాహిత్యానికి కొనసాగింపు. ఆయన జీవితంలోనూ, జీవన దృక్పథంలోనూ ఈ రెండు ఛాయలూ ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. ఆయనకు కమ్యూనిజం మీద ఎంత నమ్మకం ఉందో, అదే స్థాయిలో దైవం మీద విశ్వాసం ఉంది. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత పూర్తి సంప్రదాయ ఆహార్యంలో కనిపించేవారు. ధోవతి, పైపంచె, పట్టెవర్ధనాలతో అచ్చం శ్రీవైష్ణవుడిగా వేషధారణ మార్చేశారు. అప్పుడే ఆయన అనితర సాధ్యంగా నాలుగు వేదాలను తెలుగులో రాశారు. చాలామంది వయసు మీద పడిపోయిన తర్వాత ఆయన భక్తిమార్గం పట్టారనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆయన దృక్పథంలో ఈ రెండు అంశాలూ మొదటి నుంచి జమిలిగానే సాగాయి. వేషం మార్చకముందూ ఆయనకు దైవభక్తి ఉంది. శ్రీచూర్ణంతో నామం పెట్టుకునే వారు. కానీ అది రేఖా మాత్రంగానో, చెరిగిపోయినట్టో కనిపించేది. ఉద్యోగం చేస్తున్నప్పుడు అందరిలాగే ప్యాంటు, షర్టు ధరించేవారు. అంతే.
      జన సామాన్య సకల సమస్యలకు కమ్యూనిజమే పరిష్కారం అనుకునే వారికి దైవంతోనూ, మతంతోనూ సంబంధం ఉండదన్నది ఓ భావన. అదేగనక నిజమైతే దైవభక్తులందరూ కమ్యూనిస్టు వ్యతిరేకులుగా మిగిలి పోవాల్సి వస్తుంది. దైవభక్తి ఉన్న వారు లోకకల్యాణం కోరుకోగూడదన్న నియమం ఏమీ లేదు. ఏ వ్యక్తి భావ సముచ్ఛయమైనా పుట్టి పెరిగిన వాతావరణం మీదే ఆధారపడి ఉంటుంది. రంగాచార్య ఫక్తు సంప్రదాయవాదాన్ని అనుసరించే శ్రీవైష్ణవ కుటుంబంలో జన్మించారు. సంప్రదాయాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు. జీవితంలో సంపాదించిన జ్ఞానం, చదివిన చదువు, పరిశీలించిన సమాజం పోకడ ప్రభావం భావజాలాన్ని మలుస్తుంది. రంగాచార్య విషయంలోనూ అదే జరిగింది. 
      బడి చదువులు చదువుతున్న సమయంలోనే నిజాం నిరంకుశ పాలనలోని దౌష్ట్యాన్ని చవి చూశారు. ఆ రోజుల్లో అందరూ మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా రూమీ టోపీలు పెట్టుకోవాల్సిందే. రంగాచార్య పుట్టి పెరిగిన కుటుంబం, ఆయనలో అంకురిస్తున్న తిరుగుబాటు భావాలు ఈ నిర్బంధాన్ని సహించనివ్వకుండా చేశాయి. అందుకే ఆయన పాఠశాల విద్యార్థులతో సమ్మె చేయించి ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. ఆయనను పాఠశాలలో చదువుకోకుండా నిషేధం విధించారు. అక్కడితో ఆగకుండా అసలు నిజాం సంస్థానంలో ఎక్కడా చదువుకోకూడదని ఆంక్ష విధిస్తే ఆయన విజయవాడ వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది. అన్యాయాన్ని ఎదిరించే తత్త్వం రంగాచార్యకు చిన్ననాటే అబ్బింది. అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలియజేయని వారిని ఆయన ఈసడించేవారు. ఫ్యూడల్, భూస్వామ్య సంస్కృతి దాష్టీకం ఆయనకు ఏనాడూ మింగుడు పడలేదు. కళ్లెదుట కనిపిస్తున్న వాస్తవాన్ని గ్రహించగలిగిన సహృదయత ఉన్నందువల్లే ఆయన నిరసన తెలియజేసితీరాలనేవారు. ఇది సామాజిక చైతన్యానికి నిదర్శనం.
తెలంగాణ జన జీవిత చిత్రాలు
రంగాచార్య రచయిత కావాలన్న లక్ష్యంతో రచనలు ప్రారంభించలేదు. వట్టికోట ఆళ్వార్‌స్వామి నిజాం హయాంలో జరుగుతున్న అకృత్యాలను, భూస్వామ్య సంస్కృతి వికృత రూపాన్ని ఎండగడుతూ ‘ప్రజలమనిషి’, ‘గంగు’ నవలలు, ‘జైలు లోపల’ కథలు రాశారు. తెలంగాణ జన జీవిత చిత్రణ కోసం ఆళ్వార్‌స్వామి నిర్దిష్టమైన పథకం వేసుకున్నారు. అయితే అకాల మరణంతో ఆ పని అక్కడితో ఆగిపోయింది. ఆయన రూపొందించుకున్న ప్రణాళికను కొనసాగించడం అవసరం అన్న ఉద్దేశంతోనే రంగాచార్య కలం పట్టారు. ఆళ్వార్‌స్వామి వదిలేసిన దగ్గరనుంచి మొదలెట్టి ‘చిల్లర దేవుళ్లు’, ‘మోదుగుపూలు’, ‘జనపదం’ నవలలు వరసగా రాశారు. ఇంకా అనేక నవలలు రాసినప్పటికీ ఓ ప్రణాళిక ప్రకారం తెలంగాణ జన జీవితాన్ని చిత్రించే ఉద్దేశంతో రాసిన నవలలు మాత్రం ఇవే. ఇవి రాయడానికి ఆయనకు నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నెరవేర్చారు.
      రామాయణం, మహాభారతం లాంటివి సామాన్య జనానికి అందుబాటులో ఉండాలన్న సంకల్పం వల్లే ఆ రెండు గ్రంథాలను సులభవచనంలో రాశారు. సర్వకాలీనమైన, విశ్వజనీనమైన సాహిత్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతోనే అనేక మందిలాగే రంగాచార్య అదే బాట పట్టారు.
      అన్నీ వేదాల్లోనే ఉన్నాయష అనుకునే వారి సంఖ్యే ఎక్కువ. కానీ వేదాల్లో ఏముందో తరచి చూసే ఓపిక, సామర్థ్యం కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. వాటిని పరమ పవిత్ర గ్రంథాలుగా ముద్రవేసి జన సామాన్యానికి అందకుండా జాగ్రత్త పడ్డారు. అది రంగాచార్యకు నచ్చలేదు. అందుకే సులభ వచనంలో నాలుగు వేదాలను అందించారు. ప్రాచీన సాహిత్యం పరిత్యజించదగింది కాదు. వాటిని పరిశీలించకుండానే నిరాకరించడం అభ్యుదయానికి చిహ్నమూ కాదు. ఈ స్పష్టత రంగాచార్యకు సంపూర్ణంగా ఉన్నందువల్లే వేదాలు తెలుగులో రాశారు. మానవ జాతి చిరసంచిత వాస్తవికతా నిధి నిక్షేపాలను మామూలు జనానికి అందుబాటులోకి తేవడం ఏ జాతికైనా అవసరమే.
తన వేదం ఆ మానిఫెస్టోనే 
రామాయణ మహాభారతాలను, వేదాలను తెలుగులో చెప్పాలన్న రంగాచార్యకు ఆయన నమ్మి, ఆచరించిన మార్క్సిజం అడ్డంకిగా కనిపించలేదు. పైగా తాను కమ్యూనిస్టును కాకపోతే వేదాలను తెలుగులో రాయగలిగే వాడినే కాదనేవారు. తన వేదం మాత్రం కమ్యూనిస్టు మానిఫెస్టోనే అని నిర్మొహమాటంగా చెప్పేవారు. తన దైవభక్తి చాటుకోవడానికి రంగాచార్య ఏనాడూ ప్రయత్నించలేదు. మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవిగానే భావించేవారు. అలాగే జన కల్యాణానికి ఉపకరించేది మార్క్సిజమేనన్న తన దృఢవిశ్వాసం వ్యక్తం చేయడానికీ¨, ప్రచారం చేయడానికీ వెనుకాడలేదు. విశ్వాసం మనిషిని నడిపిస్తే సిద్ధాంత బలం మనిషిని దృఢంగా కాళ్ల మీద నిలబెడుతుంది. తన విశ్వాసాలను కొనసాగిస్తూనే నమ్మిన సిద్ధాంత ప్రాతిపదికకు అనుగుణంగా రచనలు చేసిన రంగాచార్యలో చూడాల్సింది వైరుద్ధ్యాన్ని, ద్వైదీభావాన్ని కాదు.
      రంగాచార్య వేదాలు తెలుగులో అందుబాటులోకి తెచ్చినా అవే సర్వస్వం అన్న మూఢవిశ్వాసం ఆయనలో ఎన్నడూ కనిపించలేదు. మార్క్సిజం మాత్రమే జనం సమస్యల పరిష్కారానికి మార్గదర్శి అన్న మాట మాత్రం ఆయన చివరిదాకా చెప్తూనే వచ్చారు. ఆ మాటనే నమ్మారు. తన పరిధిలో తాను ఆచరించడానికి ప్రయత్నించారు. లేకపోతే ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో దూకేవారే కాదు. ఆ తర్వాతి దశలో ప్రజా పోరాటాలతో మమేకం అయ్యేవారే కాదు. జైలుశిక్ష అనుభవించాల్సిన అగత్యం పట్టేదే కాదు. నిజాం నిరంకుశ పాలనలోని కర్కశత్వాన్ని ఎండగట్టాలన్న పట్టుదలే లేకపోతే తెలంగాణ సాహిత్యాన్నే కాదు, తెలుగు సాహిత్యాన్నే సుసంపన్నం చేసిన మౌలిక రచనలు చేయగలిగేవారే కాదు.
అభ్యుదయమే ఆశయం
సాహిత్య జీవితంలో రంగాచార్య ఎప్పుడూ అభ్యుదయపథంలోనే పయనించారు. 1970ల తొలి దశలో అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణంలో ఆయన పాత్ర విస్మరించలేనిది. రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘానికి చాలా కాలం ప్రధాన కార్యదర్శిగా ఉండి యువతరానికి స్ఫూర్తినిచ్చారు. ఆయనలో ఈ స్ఫూర్తి కడదాకా కొనసాగింది. శారీరకంగా అశక్తుడైన దశలోనూ ఆయనలో పోరాటపటిమ చెక్కు చెదరలేదు. శరీరం సహకరించి ఉంటే ఎప్పటిలాగే జన వాహినులతో భుజం భుజం కలిపి పోరాడేవారే.
      రంగాచార్య తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసినట్టే రచయితగా ఆయన జీవితమూ సుసంపన్నమైంది. ఆయన జీవిత కాలంలోనే ఆయన రచనలన్నీ సంకలితమై సంపుటాలుగా వెలువడ్డాయి. ఆయన రచనలపై పరిశోధనలు జరిగాయి. అయినా ఆయనలో తపన ఆగలేదు. ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వ్యక్తం కావాల్సిన స్థాయిలో నిరసన వ్యక్తం కావడం లేదని బాధపడేవారు. ప్రపంచీకరణ ఉద్ధృతిని నిరోధించడంలో మన కర్తవ్యాన్ని నెరవేర్చకపోతే భావి తరాలు బానిసత్వంలో మగ్గక తప్పదనీ, భవిష్యతరాలు మనల్ని క్షమించవనీ అనేవారు. ఆయన శరీరాకృతి కన్నా ఆయన ఆలోచనా ధార ఉన్నతమైంది. ఆయన అనుసరించిన సంప్రదాయంకన్నా ఆయన సిద్ధాంత బలిమి అచంచలమైంది. మనిషి మీద ఆయన నమ్మకం ప్రబలమైంది. ఆయనది అన్ని రకాలుగానూ నిండు జీవితమే.


వెనక్కి ...

మీ అభిప్రాయం