తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారాలు - 2019 

  • 401 Views
  • 0Likes
  • Like
  • Article Share

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్ర‌క్రియ‌ల్లో 2017  సంవ‌త్స‌రానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం సాహితీ పుర‌స్కారాలు పొందిన రచయితలు, వారి గ్రంథాల పరిచయాలు...
కథానిక
నెమలినార -  బి.మురళీధర్‌ (94402 29728)
విశ్రాంత వ్యవసాయా ధికారి. స్వస్థలం ఆదిలాబాదు జిల్లా బోధ్‌ మండలంలోని సొనాలా గ్రామం. మూడు దశాబ్దాలుగా సాహితీ సృజన చేస్తున్నారు. 21 కథలు, ‘నిరుడు కురిసిన కల’ నవల రాశారు. 1995 ఆంధ్రప్రభ నవలల పోటీలో ఈయన నవల మొదటి బహుమతి అందుకుంది. 14 కథలు వివిధ పత్రికల పోటీల్లో బహుమతులు గెల్చుకున్నాయి. రైతులని చైతన్య పర్చేలా వివిధ అంశాలపై రాసిన 150 లఘు నాటికలు, రూపకాలు, కథలు, ప్రసంగాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. వయోజనుల కోసం వివిధ అంశాలపై 21 చిన్న పుస్తకాలు రాశారు. 
      నెమలినార కథా సంపుటి 2016లో వెలువడింది. ఇందులో 18 కథలున్నాయి. ఆదిలాబాదు జిల్లా గ్రామీణ జీవనానికి, అక్కడి ప్రజల కష్టాలు, కన్నీళ్లు, వ్యథలు, వారి జీవన నైపుణ్యాలు, సౌందర్యదృష్టికి ఇవి నిలువుటద్దాలు. 


నవల
మొగలి - భూతం ముత్యాలు (94904 37978)
స్వస్థలం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి. అదే జిల్లా మునుగోడు మండలం గంగూరిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు. ‘సూర, పురుడు, ఇగురం’ నవలలు, ‘బేగరి కథలు, బుగాడ కథలు, దగ్దం కథ’ల సంపుటాలు, దుగలి కవితా సంపుటి, నియతి ఆత్మకథ, మాండలికం (కులవృత్తి పదకోశం), మాలవారి చరిత్ర గ్రంథాలు వెలువరించారు. 
దళితుడైన మొగలి దొర బిడ్డను ప్రేమించడం, దొర అతని మీద పగబట్టడం, దొర అన్యాయాలపై అతని పోరాటం, చివరికి ప్రేమికులు ఒక్కటవ్వడం, కూలీలుగా మొగలి తల్లిదండ్రులు పడిన కష్టాలు ఈ నవల ఇతివృత్తం. తెలంగాణ పలుకుబళ్లు, జాతీయాలు, సామెతలు ఈ నవలలో అడుగడుగునా కనిపిస్తాయి. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలే మార్గమన్న అంబేడ్కర్‌ తాత్వికత ప్రధాన భూమికగా సాగే ఈ నవల 2016లో ప్రచురితమైంది. 


రచయిత్రి ఉత్తమ గ్రంథం
రాయక్క మాన్యమ్‌ - జూపాక సుభద్ర (94410 91305)
ప్రముఖ కవయిత్రి, కథకులు, వ్యాసకర్త, వక్త. అట్టడుగు వర్గాల మహిళలు, దళితుల జీవితాలను అక్షరబద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలో అదనపు కార్యదర్శి. ‘నల్లరేగటిసాల్లు, కైతునకల దండెం, అయ్యయ్యో దమ్మక్క’ తదితర పుస్తకాలు వెలువరించారు. ‘చంద్రశ్రీ యాదిలో’ గ్రంథానికి సంపాదకత్వం వహించారు. పత్రికల్లో పలు వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 
‘రాయక్క మాన్యమ్‌’ కథా సంపుటి అట్టడుగు వర్గాల మహిళల బతుకువెతలకు అద్దంపడుతుంది. ఇందులో మొత్తం పదిహేడు కథలున్నాయి. డక్కలి కులంలో జన్మించిన రాయక్క తనకు రావాల్సిన మాన్యాన్ని ధైర్యంగా, తెలివిగా ఎలా దక్కించుకుందో ‘రాయక్క మాన్యమ్‌’ కథ వివరిస్తుంది. ఈ కథలన్నీ ఆయా పాత్రల సహజ సంభాషణల్లో సాగుతాయి. ఈ పొత్తం 2014లో ముద్రణ పొందింది. 


గేయ కవిత
ఎలకోయిల పాట - తుమ్మూరి రాంమోహన్‌రావు (97015 22234)
విశ్రాంత ప్రధానోపా ధ్యాయులు. కరీంనగర్‌ జిల్లా ఎలగందుల వాసి. ‘గొంతెత్తిన కోయిల’ గేయ కవితా సంపుటి, ‘మువ్వలు’ హైకూలు/ త్రిపదులు, ‘పెన్‌గంగ- ప్రాణహిత, నేనెక్కడ్నో తప్పిపోయిన, కొన్ని నవ్వులు ఏరుకుందామని’ వచన కవితా సంపుటాలు, ‘మహెఫిల్లో కోయిల’ గజల్‌ సంపుటి వెలువరించారు. 
‘ఎలకోయిల పాట’ మూడు భాగాల గేయ కవితా సంపుటి. మొదటి భాగం ‘సుస్వర నీలి రాగ తరంగిణి’లో గాయని సునీతకు అంకితంగా పలు గేయాలు రాశారు. రెండోభాగం ‘ప్రతిభకు పాటల పందిరి’లో సినారె, అక్కినేని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి ప్రముఖుల మీద గీతాలు కూర్చారు. మూడో భాగం ‘తరుణగీతాల తోరణం’లో ఉగాది, సంక్రాంతి, గోదావరి పుష్కరాలు లాంటి సందర్భాల్లో రాసిన గీతాలు ముద్రించారు. దాదాపు 70 గేయాలున్న ఈ పొత్తం 2016లో ముద్రణ పొందింది. 


అనువాదం
గుప్పిట జారే ఇసుక - మెహక్‌ హైదరాబాదీ (70361 75175)
32 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం ‘ఆంధ్రజ్యోతి’లో డిప్యూటీ న్యూస్‌ఎడిటర్‌. అసలు పేరు పి.వెంకట సూర్యనారాయణ మూర్తి. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం. విశ్రాంత డీఎస్పీ ఎంఏ మాల్వే దగ్గర ఉర్దూ నేర్చుకున్నారు. ‘సాక్షి’లో ఆ భాషా పదాలను పరిచయం చేస్తూ ‘హైదరాబాత్‌’ శీర్షిక నిర్వహించారు. ఉర్దూలో 25 గజల్స్‌ రాశారు. 
ప్రముఖ ఉర్దూ రచయిత్రి జిలానీ బానో 21 ఉర్దూ కథల అనువాదమే ‘గుప్పిట జారే ఇసుక’. సాంఘిక అసమానతలు, మత మౌఢ్యం లాంటి వాటికి ఇవి అద్దంపడతాయి. ఇది 2016లో ముద్రితమైంది 2018లో జిలానీ బానోవి మరో 21 కథలతో ‘అంతా నిజమే చెప్తా’ పొత్తం తెచ్చారు. ఉర్దూ నుంచి పలు వ్యాసాలు తెలుగులోకి అనువదించారు. ‘ప్రజాప్రస్థానం’ గ్రంథం వెలువరించారు. 


వచన కవిత
వానొస్తద? - నారాయణస్వామి 
స్వస్థలం సిద్దిపేట. అమెరికాలో స్థిరపడ్డారు. పాఠశాల రోజుల్లోనే కవితల పట్ల ఆకర్షితులయ్యారు. ‘కల్లోల కలల మేఘం, సందుక’ కవితా సంపుటాలు వెలువరించారు. 
‘వానొస్తద?’ కవితా సంపుటిలో మొత్తం 42 కవితలున్నాయి. తెలంగాణ నేల మీద తన అస్తిత్వాన్ని, జ్ఞాపకాలను వెతుక్కుంటూ, మూడు దశాబ్దాల విప్లవ, దళిత ఉద్యమాలను స్మరించుకుంటూ తెచ్చిన కవితా సంపుటి ఇది. ఇందులోని కవితలకు ప్రముఖ చిత్రకారులు ఏలె లక్ష్మణ్‌ బొమ్మలు అందించారు. ‘‘బాపూ నీ యాది/ తల్లిరొమ్ము తెలియని/ నా పెదవుల మీద/ తడియారని చనుబాల చారిక/ పుండై సలిపిన పసితనాన్ని/ ప్రేమగా పుణికిన ఫకీరు నెమలి ఈక/ పుల్ల అసొంటి పెయ్యికి దిష్టితీసి/ పదిలంగా సాదిన సాంబ్రాణి పొగ....’’ లాంటి గాఢ అనుభూతినిచ్చే కవితలను ఇందులో కూర్చారు రచయిత


పద్య కవిత
మన్యభారతం - మాల్యశ్రీ (చింతూరి మల్లయ్య) (92900 70043)
స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగల్లపల్లి. పంచాయతీరాజ్‌ విశ్రాంత అధికారి. జనరంజని పద్య సంపుటి, రామదాసు పద్యకావ్యం, వెన్నెల మలుపులు చీకటి వెలుగులు కథా సంపుటి వెలువరించారు. ‘జనరంజని’ మీద తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్‌ పరిశోధన జరిగింది. 
‘మన్యభారతం’.. వెయ్యి పద్యాల కావ్యం. చర్ల సంస్థానాధీశుడు మేదినీరాయుడు 200 ఏళ్ల కిందట బ్రిటిష్‌ వారి మీద పోరాడి వీరమరణం పొందారు. ఆయన గాథే ఈ కావ్య ఇతివృత్తం. మేదినీ రాయుడు శ్రీకాకుళం ప్రాంతం నుంచి చర్లకు తరలివచ్చి సంస్థానం ఏర్పాటు చేసుకున్నారు. కొంతకాలం బ్రిటిష్‌ వారికి సామంతుడిగా ఉన్నారు. ఆంక్షలు ఎక్కువవ్వడంతో వారి మీద పోరు సాగించి అమరులయ్యారు. జనశృతిలో ఉన్న ఈ కథను సేకరించి స్వతంత్ర పద్య కావ్యంగా రాశారు మాల్యశ్రీ. ఈ పుస్తకం 2016లో ప్రచురితమైంది. 


వచన రచన
దేవ రహస్యం - కోవెల సంతోష్‌కుమార్‌ 90521 16463

‘నమస్తే తెలంగాణ’లో న్యూస్‌ఎడిటర్‌. స్వస్థలం వరంగల్లు. దశ మహావిద్యలు, సృష్టి పరిణామం లాంటి వాటి గురించి తెలియజేస్తూ ‘మహావిద్య’ పుస్తకం రాశారు. శివతత్వం మీద ‘విలయ విన్యాసం’ గ్రంథం తేనున్నారు. 
భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్ని ఆధునిక విజ్ఞానశాస్త్రంతో అనుసంధానిస్తూ రాసిన గ్రంథమే ‘దేవ రహస్యం’. ఇది మొత్తం 40 వ్యాసాల సమాహారం. పాఠకుడితో నేరుగా మాట్లాడుతున్నట్టుగా ఇవి సాగుతాయి. దేవుడు అంటే ఏంటి? వినాయకుడికి విచిత్రమైన రూపం ఎందుకుంది? సరస్వతి వీణ ఎందుకు పట్టుకుంటుంది? గణేశుడు ఎలుక మీద ఎలా ప్రయాణిస్తాడు? లాంటి అంశాలను విజ్ఞానశాస్త్రం కోణంలో చర్చిస్తుందీ పుస్తకం. అలాగే గ్రహాంతర జీవులు, ఇప్పటివరకూ మానవాళికి అంతుబట్టని విషయాలను కూడా స్పృశిస్తుంది. ఈ పొత్తం 2014లో ముద్రితమైంది. 


బాలసాహిత్యం
అనగా అనగా పిల్లల కథలు - కొల్లూరు స్వరాజ్యం వెంకట రమణమ్మ (93472 11537)
విశ్రాంత ఉపాధ్యాయిని. విశాఖపట్నం వాసి. బాలల కోసం కథలు, బుర్రకథలు, కవితలు, పాటలు, ఏకపాత్రాభినయాలు, నాటికలు రాస్తున్నారు. కప్పన్న విందు (కథలు), భళాభళిరా తమ్ముడా (బుర్రకథ), వెన్నముద్దలు, హరివిల్లు, చందమామ దాయిదాయి (బాలలగేయాలు) పుస్తకాలు, పెద్దల కోసం స్వరాజ్య సీమ, స్వరస్వరాజ్యం కవితా సంపుటాలు వెలువరించారు. శరణం హరి శరణం, శ్రీహరి లహరి, యాత్రా గీతాంజలి పేరుతో భక్తి గీతాల పొత్తాలు తెచ్చారు. ‘బాలబాట’ మాసపత్రిక నడుపుతు న్నారు. శివానంద బాలవిహార్‌ సంస్థ ద్వారా పిల్లలను సాహితీ రచన, గానం లాంటి వాటిలో తీర్చిదిద్దుతున్నారు.
‘అనగా అనగా పిల్లల కథలు’ పుస్తకం 23 నీతి కథల సంపుటి. 2015లో ముద్రితమైంది. ‘చదువు విలువ, కుండ నవ్వింది, అమ్మ క్షేమం, చీమ నవ్వింది’ లాంటి కథలు ఇందులో ఉన్నాయి. 


నాటకం/నాటిక
సప్త సౌరభాలు - భారతుల రామకృష్ణ (99499 92437)
నటులు, రచయిత, దర్శకులు. స్వస్థలం ప్రకాశం జిల్లా చెరుకూరు. విజయవాడలో స్థిరపడ్డారు. వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ఇప్పటి వరకూ ముప్పయి అయిదు నాటికలు రాశారు. ముప్పయి నాటికల్లో దాదాపు 400 సార్లు నటించారు. పలు నాటకాలకు దర్శకత్వం వహించారు. దూరదర్శన్‌లో మూడు నాటికలు, రేడియోలో ఎనిమిది నాటికలు ప్రసారమయ్యాయి. పూర్తిగా స్త్రీ పాత్రలతో నారీభేరి నాటిక రాశారు. 
సప్త సౌరభాలు నాటికల సంపుటి 2014లో ముద్రణ పొందింది. ఇందులో ‘ఆల్బం, మేనరికం, అటెన్షన్, పాకసమాజం, తాళంచెవి, వికసిత కుసుమం, ఆన్సర్‌’ అనే ఏడు నాటికలున్నాయి. ఇవన్నీ రంగస్థలం మీద ప్రజాదరణ పొందినవి. ఆల్బం నాటిక మూడు నందులు, ఆన్సర్‌ నాటిక రెండు నంది బహుమతులు పొందాయి. 


సాహిత్య విమర్శ
శైలీ శిల్పం వెయ్యేళ్ల తెలుగు కవిత్వం - డా।। అట్లా వెంకట రామిరెడ్డి (97014 30356)
స్వస్థలం కడప జిల్లా రంగశాయి పురం. విశ్రాంత అధ్యాపకులు. హైదరాబాదు వాసి. ‘ప్రేమ- ప్రకృతి, ప్రళయం - ప్రగతి’ కవితా సంపుటాలు, మానవ జీవనం మహాప్రస్థానం (ఒక సమగ్ర నీతి కావ్యం) పొత్తాలు వెలువరించారు. ‘ఆంధ్ర ప్రబంధ యుగం- అలంకార ప్రస్థాన ప్రయోగం’ మీద పరిశోధన చేశారు.
‘శైలీ శిల్పం - వెయ్యేళ్ల తెలుగు కవిత్వం’ పొత్తంలో నన్నయ నుంచి 2000 సంవత్సరం వరకు ప్రాచీన, ఆధునిక కవుల శైలీ శిల్పాలను రచయిత విశ్లేషించారు. ఈ గ్రంథంలో ‘సాహిత్యం-కవిత్వం-శైలీ శిల్పం- వస్తురూపాలు; కవితా శైలి-గుణాలు దోషాలు; శైలీ బేధాలు - నిర్మాణ శిల్పం; వెయ్యేళ్ల తెలుగు కవిత్వం శైలీ శిల్పం’ అనే నాలుగు విభాగాలున్నాయి. వీటిలో ఆయా కవుల విశిష్ట శైలీ శిల్పాలను, కవిత్వాన్ని వివేచించడంతో పాటు శైలీ శిల్పాల చారిత్రక పరిణామాన్ని కవుల పరంగా అన్వయించారు. 2014లో ఈ పొత్తం ముద్రితమైంది.


తానా బహుమతి నవల
కొండపొలం - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి (94412 87865) 
కడప జిల్లా బాలరాజు పల్లెలో 1963లో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ నిరంతర సాహితీ సేద్యం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎనిమిది నవలలు, మూడు కథా, ఒక కవితా సంపుటాలు వెలువరించారు. ఈయన కథలు ఇతర భాషల్లోకి అనువాదమ య్యాయి. పలు కథా సంకలనాల్లో చోటు సంపాదించాయి. 
2019కి తానా నవలల పోటీలో వెంకటరామిరెడ్డి ‘కొండపొలం’ నవల రూ.రెండు లక్షల బహుమతి గెలుచుకుంది. తెలుగు నవలకు ఇప్పటి వరకూ ఇదే అతిపెద్ద బహుమతి. రాయలసీమ గొల్ల కాపరుల జీవితాన్ని చిత్రించే నవల ఇది. ఎండాకాలంలో వాళ్లు గొర్రెలను మేపడానికి కొండ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఎదుర్కొనే కష్టాలను ఇందులో కళ్లకుకట్టారు. తానా దీన్ని త్వరలో ప్రచురించనుంది. 2017లో కూడా తానా నవలల పోటీలో వెంకట రామిరెడ్డి ‘ఒంటరి’ నవల మరో రెండింటితో సంయుక్తంగా బహుమతి అందుకుంది. ‘చినుకుల సవ్వడి’ నవల ‘చతుర’ బహుమతి గెలుచుకుంది. 1997లో తొలిసారి రాసిన ‘కాడి’, 2007లో వెలువరించిన ‘తోలుబొమ్మలాట’ నవలలు ఆటా పురస్కారం పొందాయి. 1997లో తానా తొలిసారి నిర్వహించిన నవలల పోటీలో చంద్రలత ‘రేగడివిత్తులు’ 1.30 లక్షల పూర్తి బహుమతి సాధించింది.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం