ఆయన వీరకాడు ఈయన జగిలోడు

  • 297 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। దామెర వేంకట సూర్యారావు

  • విశాఖపట్నం
  • 9885188431
డా।। దామెర వేంకట సూర్యారావు

చిలుకూరి నారాయణరావు ‘త్రికళింగాల’ గురించి చెప్పారు. మధుకళింగం, ఉత్కళింగం, కళింగం అనే వాటి పేర్లు శ్రీముఖలింగేశ్వర శాసనంలోనూ కనిపిస్తాయి. వీటిలోని కళింగమే నేటి ఉత్తరాంధ్ర. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఈ ప్రాంత తెలుగు విలక్షణమైంది.
భాష
సజీవ వ్యవస్థకు చెందింది. నిత్యం పరిణామం చెందుతూనే ఉంటుంది. ఈ మార్పు కావ్యభాషలో చాలా ఆలస్యంగానూ, వ్యవహార భాషలో చాలా తొందరగానూ వస్తుంది. ప్రాంతీయ, సామాజిక, చారిత్రక, వృత్తికాల భేదాల్ని బట్టి ఒకే భాష విభిన్న రకాలుగా వ్యవహారంలో ఉంటే, ఆ భాషలో మాండలికాలు ఏర్పడతాయి (నిర్ణీత జన సముదాయానికి లేదా పరిమిత వ్యవహార ప్రాంతానికి మండలమని పేరు). ఒకే భాషకు ప్రజల వ్యవహారంలోనూ, పదాల్లోనూ, వాటి ఉచ్చారణలోనూ, ప్రత్యయాల్లోనూ, పదాల అర్థాల్లోనూ, వాక్య రచనలోనూ భేదాలు ఉంటాయి. ఈ భేదాలే ‘మాండలికాలు’. ప్రముఖ భాషా శాస్త్రజ్ఞులు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ‘తెలుగునాడు’ను నాలుగు భాషా వ్యావహారిక మండలాలుగా విభజించారు. పూర్వ (కళింగ ప్రాంతం), మధ్య (గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశంలో కొంత భాగం), దక్షిణ (ప్రకాశం జిల్లాలో కొంతభాగం, నెల్లూరు, రాయలసీమ) ఉత్తర (తెలంగాణ) మండలాల తెలుగులో చారిత్రకంగా ప్రాచీనమైన పద రూపాలెన్నో నేటికీ వ్యవహారంలో ఉన్నాయి. వీటిలో పూర్వమండల భాషను పరిశీలిస్తే కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. 
      కారంపొడిని ఉత్తరాంధ్రలో ‘బివు’ అంటారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా గ్రామాల్లో ‘బివుగా ఉంది’ అంటే కారం ఎక్కువైందని అర్థం. తెనాలి రామకృష్ణుడి ‘పాండురంగ మాహాత్మ్యం’లో ‘ఒక కొన్ని ద్రబ్బెడలొక గొన్ని తాలిపులొక కొన్ని విధముల మొఱ్ఱచేరులు’ అనే ప్రయోగం ఇదే అర్థంలో ఉంటుంది. ‘దగ’ అంటే దప్పిక. దగ పట్టడమంటే నోరు ఎండిపోవడం. ‘పెనుదవ్వు దగదొట్టజని రెట్టవడ...’ అంటాడు పెద్దన తన ‘మనుచరిత్ర’లో. ‘మిత్తు’ అనే మాటను స్నేహితుడు అనే అర్థంలో ఈ ప్రాంతంలో వాడతారు. అచ్చతెనుగు రామాయణంలో ఇదే అర్థంలో ‘‘మిత్తన డాకొని...’’ అనే ప్రయోగం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గో సంపదను ‘సొమ్ములు’ అంటారు. అచ్చతెనుగు రామాయణంలో ఈ పదాన్ని ఇదే అర్థంలో వాడారు. రావిశాస్త్రి ‘సొమ్ములు పోనాయండి’ అనే నవల రాశారు. ఉత్తరాంధ్ర వాసుల వాడుకలోని ఇలాంటి ఎన్నో పదాలు, పదబంధాలు సాహిత్యంలో కనిపిస్తాయి. 
గాబ... బేపి
ఉత్తరాంధ్ర ప్రజల పలుకుబళ్ల మీద ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా భాషపై పొరుగున ఉన్న ఒడియా ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. బంధుత్వాల పరంగా అక్కను ‘అప్ప’, కుమార్తెను ‘అమ్మి’, వియ్యంకుణ్ని ‘ఈరకాడ’ని, వియ్యపురాలిని ‘ఈరగత్తె’ (వీరకాడు, వీరగత్తె) అనీ అనడం ఇక్కడ సాధారణం. తోడల్లుణ్ని ‘జగిలోడు’ అని వ్యవహరిం చడం చాలా ప్రత్యేకమైన ప్రయోగం.
      వ్యవసాయ రంగానికి సంబంధించిన పదజాలం పరిశీలిస్తే, ‘కాడి’ని ‘పూజ’ అంటారు. ‘కలుపు’ను ‘గాబ’గా పిలుస్తారు. చేనుకు చుట్టూ వేసే ‘కంచె’ను ‘ఎలుగు’గా వ్యవహరిస్తే, ‘కర్రు’ను ‘నక్కు’గా పిలుచుకుంటారు. అలంకారాలు, ఆభరణ విశేషాలకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో వాడుకలో లేని నాగరణ పాపిడి సేరు, బేసర్లు, బాజాబందు, జువకాలు లాంటి పదాలు ఇక్కడ వినిపిస్తాయి. కళింగాంధ్రలో వ్యవహారంలో ఉన్న బేపి (కుక్క), కంచారి (పాలేరు), పైన (దువ్వెన), రేక (చేద), బుగత (యజమాని), ఉభాలు (ఊడ్పులు) లాంటి వాటికి ఒడియా మూలం. ఇక్కడి క్రియాపదాలు కూడా ఇతర ప్రాంతాల కన్నా భిన్నంగా ఉంటాయి. వెళ్లొచ్చీసేడు, తెచ్చీసేడు, చేసీసేడు లాంటి వ్యవహారం వినిపిస్తుంది. 
‘చీడ’ మంచిదే!
పలుకుబళ్ల విషయంలోనూ ఉత్తరాంధ్రలో ప్రత్యేక ప్రయోగాలు వినిపిస్తాయి. ‘ఒంటరిగా’ అనే అర్థంలో ‘ఆలీగ’ అనే పదం ఉంది. మంచీ-చెడు అనే అర్థంలో ‘ఇదం పదం’ అనే మాట వాడతారు. పొగడటాన్ని ‘ఉబ్బేయడం’ అనీ, హాస్యమాడటాన్ని ‘ఆసికాలాడట’మనీ అంటారు. పిల్లల్ని ‘గుంట’ అనడం ఇక్కడ మామూలే. ఎవరైనా ఏ పనిలోనైనా ఆలస్యం చేస్తే ‘ఇద్దులాడ్డం’ అంటారు. నిర్లక్ష్యం చేస్తే ‘నిసాకారు’ చేస్తున్నడని చెబుతారు. పరుగెత్తుకు రావడాన్ని ‘పార్రావడ’మని, గోక్కోవడాన్ని ‘బక్కురుకోవడ’మని అంటారు.
      అనాగరికుణ్ని ‘బెంటు’, పనికిమాలిన వాడనే భావంలో ‘బోకు’ అనడం సాధారణం. ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటే ‘పల్లకున్నారు’ అంటారు. పళ్లు తోముకునే పుల్లను ‘పందుంపుల్ల’, ‘పలకర్ర’గా పిలుస్తారు. నిచ్చెనను ‘దాపకర్ర’ అని, మొలలో దోపుకునే డబ్బుసంచిని ‘బిక్యరా’ అని, ఇంటి ముందు మెట్ల మీది అరుగును ‘చీడ’గా పిలుచుకోవడం ఉత్తరాంధ్ర తెలుగు ప్రత్యేకత. కాలక్షేపం కబుర్లు లేక పనికిమాలిన కబుర్లను ‘కుచ్చిటప్పాలు’గా వ్యవహరిస్తారు. ఈ జన జీవిత భాషా వ్యవహారం మీద ఇప్పటికే కొంత పరిశోధన జరిగింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల తెలుగు మీద బూదరాజు రాధాకృష్ణ సంపాదకత్వంలో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రచురించింది. రచయితల ప్రయోగాల ఆధారంగా కళింగాంధ్ర మాండలికం మీద జి.ఎస్‌.చలం ఓ పుస్తకం వెలువరించారు.
      ‘‘రచయిత తన భాషను తాను సృష్టించుకోలేడు. సమాజం సృష్టించిన దాన్నే అతడు స్వీకరించాలి. తరతరాల ప్రజా కళాకారులు సృష్టించిన సజీవ భాషను అతను ఆశ్రయిస్తాడు. అక్కడే అతనికి శక్తివంత జీవద్భాష లభిస్తుంది’’ అని అంటారు ఎల్‌.పి.స్మిత్‌ అనే భాషా శాస్త్ర నిపుణుడు. మహాకవి గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకం ద్వారా కళింగాంధ్ర మాండలికానికి సాహిత్య గౌరవం కల్పించారు. ఆ తర్వాత రావిశాస్త్రి నవలల్లో, కథల్లో పుష్కలంగా ఈ పలుకుబళ్లు దర్శనమిస్తాయి. ఇంకా చాసో, కాళీపట్నం కథల్లోనూ, బలివాడ కాంతారావు నవలల్లోనూ, వంగపండు ప్రసాదరావు పాటల్లో, గణేశ్‌పాత్రో నాటకాల్లో కళింగాంధ్ర జీవద్భాష మురిపిస్తుంది. కేఎన్‌వైౖ పతంజలి, అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు, అర్నాద్‌ తదితరులు కూడా కళింగాంధ్ర నుడికారానికి ప్రాణంపోశారు. మాండలిక పదాలను రచనలో వాడినప్పుడు ఆయా మాటల అర్థాలూ, అర్థ విశేషాలూ ప్రకరణాన్ని బట్టి, వాక్యంలో వాటికున్న స్థానాన్ని బట్టి స్పష్టమవుతాయి. సందర్భం నుంచి తొలగించినప్పుడు భిన్న ప్రాంతాల వారికి అవి స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. కానీ, స్థానికులకు ఆ ప్రయోగం ఆత్మీయతా భావాన్ని కలిగిస్తుంది. రససిద్ధికి తోడ్పడుతుంది. ఒకప్పుడు ఆయా రచనల్లో అక్కడక్కడా మాండలిక ప్రయోగాలు కనిపించేవి. ఇప్పుడు పూర్తిగా మాండలికంలోనే చాలా రచనలు వస్తున్నాయి. వివిధ ప్రాంతాల జీవద్భాషను ఆస్వాదించడానికి మాండలికాల అధ్యయనం అనివార్యం.


వెనక్కి ...

మీ అభిప్రాయం