పసిడి చీర వాడికి పాలకూడు

  • 1150 Views
  • 9Likes
  • Like
  • Article Share

    ఆచార్య శివుని రాజేశ్వరి

  • శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం
  • తిరుపతి.
  • 9652248978
ఆచార్య శివుని రాజేశ్వరి

కవిత్వానికి మాట్లాడే భాష నిషిద్ధం కాదు. భాషలో దొరికే అన్ని వనరులనూ కవిత్వ భాష వాడుకుంటుంది... ఇది చేరా మాట.   శతాబ్దాల కిందటే అన్నమయ్య దీన్ని ఆచరించాడు. వైరి సమాసాలు, వ్యాకరణ విరుద్ధాలంటూ పండితులేసే చిక్కుముళ్లను గంపకెత్తి పక్కకేసి... ‘పదిమందికి అర్థమైతే చాలు’ అనుకుంటూ పల్లీయుల పలుకులకు కావ్యగౌరవం కల్పించాడు. ఆ క్రమంలో ఆయన ప్రయోగించిన పదజాలం, విశిష్ట సమాసాలు, జాతీయాల తియ్యదనం ముందు ‘పాలకూడూ’ దిగదుడుపే. అంతటి రుచిని ఆస్వాదించాలంటే తితిదే రూపొందించిన ‘అన్నమయ్య పద ప్రయోగకోశా’న్ని తిరగేయాలి.  
పదప్రయోగకోశమంటే నిఘంటువు కాదు. నిఘంటు రూపకల్పనకు అందివచ్చే ఆధార సామగ్రి మాత్రమే. ఓ కావ్యంలోని పదాలను సందర్భవాక్యాలతో సహా అకారాది క్రమంలో కూర్చడమే పదప్రయోగ కోశ నిర్మాణం. ఆయా పదాలు ఉన్న పద్యాలు, ఆశ్వాసాల సంఖ్యను ఇందులో చేర్చుతారు. మొత్తమ్మీద ఈ కోశాల వల్ల సంబంధిత కవి ఎన్ని పదాల్ని... ఏయే అర్థాల్లో ఉపయోగించాడో తెలుస్తుంది. అలా కవి వాడిన పదాలెన్నో ముందు లెక్కతేలితే తప్ప ఆయా పదాల అర్థాలు, భావాలను వివరిస్తూ నిఘంటువును తయారు చేయలేం!  
      ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ (ఉమ్మడి రాష్ట్రంలో) నన్నయ, నన్నెచోడుడు, తిక్కనల పదప్రయోగ కోశాలు రూపొందించింది. తర్వాత శ్రీనాథుడు, కృష్ణదేవరాయల(ఆముక్తమాల్యద)వీ వెలువడ్డాయి. అన్నమయ్య పదప్రయోగ కోశం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో కొంతభాగం పూర్తయింది. మిగతాది తితిదే అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా పూర్తయింది. ఆచార్య పి.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 22 సంపుటాల మేరకు పదవిభజన జరిగింది. పదిహేను వేల కీర్తనలకు పన్నెండు లక్షల ఆరోపాలు తయారయ్యాయి. దీంతో అన్నమయ్య భాషా పరిశీలన సులువైంది. ఆయన వాడిన అపారమైన పదజాలం, చేసిన నూతన పదకల్పన, నూతన పదసృష్టి, ధ్వనిభేదాలు, సమాస నిర్మాణం, పదబంధాల ప్రయోగం వంటివీ వెలుగులోకి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి.
మోపెడన్ని పదాలు...
అన్నమయ్యకు పల్లెపట్టులతో పరిచయమెక్కువ. అందుకే ఆయన కవిత్వంలో వాడుక మాటలు... అందులోనూ వ్యవసాయ పదాలు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయి. వాములు, మోపులు, కసవుకట్టలు, నారుపోయడం, తూర్పెత్తడం, గాదెలు, కాగులు, కసవుససరాలు, విత్తనాలు, చేలు, అడ్డెడు, మానెడు, చేటెడు, గంపెడు వంటివి అడుగడుగునా దర్శనమిస్తాయి. తాను చెప్పదలచుకున్న విషయం సామాన్యులకు సైతం అర్థం కావాలంటే... ఆ సామాన్యుల భాషనే ఉపయోగించాలన్న కిటుకు తెలిసిన కవి కాబట్టే పల్లె పదాలతో పదకవితలల్లాడు. 
      గడ్డిమోపు, గడ్డివాము అన్న అర్థాలతోనే అన్నమయ్య... ‘మోపు, వాము’ పదాలను వాడినా తన కవితాపాటవంతో వాటి అర్థక్షేత్రాన్ని పెంచాడు. వలపు, యౌవనం, నవ్వు, సిగ్గు వంటి భావాల తీక్షణతను చూపడానికి ఆ పదాలను చక్కగా ఉపయోగించుకున్నాడు. ‘జవ్వనాన్ని మోపులుగా మూటకట్టుకున్నదానా...’ అంటూ ‘మోపులాయ బులకలు’ అని చమత్కరించాడు అలమేలుమంగని ఓచోట! ‘వినయాలు మోపుకట్టి, వాములైన తన నవ్వుకు, వలపు వాములాయ’ అంటూ వర్ణించాడు మరోచోట!! సిగ్గులు చాటెడేసి, చిరునవ్వు మూటెడేసి, సరసాలు గంపెడేసి అంటాడు ఇంకో కీర్తనలో!!! పదకవితా పితామహుడి పదప్రయోగ కుశలతకు ఇవన్నీ తార్కాణాలే.  
సొమ్ముగలవాడు తన సొమ్ము చెడనిచ్చునా
కమ్మి నీ సొమ్మును నేను, కాపాడవే హరీ
పసుర మడవిబడ్డ, బసురము కలవాడె
దెసల వెదకింటికి దెచ్చుకొన్నట్లు
వాసిగా నాసలలో వడిబడ్డ నా మనసు
మెసగ మళ్లించవే నన్నేలిన గోవిందుడా
గొంది బంటై సేయువాడు కొలుచులు పరకళ్ల
జిందకుండ గాదె బ్రోసి చేరి కాచని
కందువ మమ్ము బుట్టించి కన్నవారి వాకిళ్ల
జెంది కావనీయకువే జీవునిలో దేవుడా!...

      ‘అడవిలో పశువు తప్పిపోతే, దాని యాజమానే దాన్ని వెతికి తెచ్చుకుంటాడు. అలాగే, ఆశల్లో చిక్కుకున్న నా మనసును వాటినుంచి మళ్లించవా’ అని స్వామిని వేడుకున్నాడు అన్నమయ్య ‘పంట చేతికొచ్చాక రైతు ఆ ధాన్యాన్ని గాదెలో పోసుకుని రక్షించుకుంటాడు కదా! అలాగే, నాకు జన్మనిచ్చిన నువ్వే నన్ను రక్షించు’ అని అర్థించాడు. మొదటి చరణంలో... ఆశల్లో పడిన మనసుకు, అడవిలో చిక్కుకున్న పశువును; రెండో చరణంలో... తనకు జన్మనిచ్చిన దైవానికి, పంట పండించిన రైతును ఉపమానంగా తీసుకున్నాడు. ఈ రెండూ వ్యవసాయ సంబంధమే. భగవంతుడి సంపదేంటి? భక్తులే కదా. సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత దాని సొంతదారుదే. అంటే, భక్తులను బ్రోవడం భగవంతుడి కర్తవ్యం. ఈ వేదాంత సారాన్ని సామాన్య పరిభాషలో ‘నేను నీ సొమ్మును... నన్ను కాపాడు’ అంటూ అడిగాడు. లోతైన భావాన్ని సైతం అరటిపండు ఒలిచిపెట్టినంత సులువుగా... అదీ సృజనాత్మకంగా చెప్పడమే అన్నమయ్య కవిత్వం. 
వెన్నెల నవ్వులు
పదకవితా పితామహుడి శృంగార సంకీర్తనల్లో నవ్వులు, సిగ్గులు, వలపులు, రతులు, చేతలు, సరసాలు, అలకలు, కోరికలు, ఆశలు, చూపులు తదితర భావాల తాకిడి ఎక్కువ. మళ్లీ ఒక్కొక్క భావంలో ఉన్న వైవిధ్యాలను సూక్ష్మంగా పరిశీలించాడు. వర్ణించాడు. నవ్వుకు ఆయన చెప్పినన్ని భేదాలు సాహిత్యంలో మరెవ్వరూ చెప్పలేదు. నాయిక నవ్వుల్లో 240 భేదాలను ఉదహరించాడాయన. ‘అన్నమయ్య నవ్వులు’ వ్యాసంలో పేర్కొన్నారు ఆ నవ్వులను గుదిగుచ్చారు ఆచార్య రవ్వా శ్రీహరి.
      ఈ 240 నవ్వుల్లోనూ ‘నాలుగు’ తేడాలున్నాయి. కలకల, కిలకిల, కేరికేరి, పకపక, వికవిక, ముసిముసి... ఇలా ధ్వన్యనుకరణ పదం చేర్చినవి ఒక రకం. కమ్మని, కప్పురపు, చిక్కని, చిఱుత, చల్లని, చూపుల, పలుచని, వాడిన, పచ్చని, శాంతపు, సంతోసపు... విశేషణాలు అద్దుకున్నవి మరో రకం. చిగురు, వెఱ్ఱి, తేనె, వేడుక, వెన్నెల, వట్టి, గుట్టు, ముత్యపు, లేత... ఉపమానాలు అలంకరించుకున్నవి ఇంకో రకం. వీటికి తోడు... చెదిరిన నవ్వు, ఏడ్వలేని నవ్వు, నగరాని నవ్వు, నాటకపు నవ్వు, వెక్కసపు నవ్వులాంటి వ్యతిరేక భావాన్ని తెలిపేవీ  అన్నమయ్య కీర్తనల్లో ఉన్నాయి. ఆయా నవ్వులకు అద్దం పట్టే పదాలన్నీ తమదైన భావచిత్రాలను కలిగిస్తాయి. 
పాలకూడు తింటారా?
అన్నమయ్య తిక్కన మార్గాన్ని అనుసరించి దేశి కవిత్వానికి పట్టం కట్టాడు. ఆయన వాడిన అచ్చమైన తెలుగు పదాల్లో కొన్ని అంతకుముందే ఉండొచ్చు లేదా తనే సొంతంగా సృష్టించినవి కావచ్చు. ఏదిఏమైనా ఆ పదాలన్నీ అన్నమయ్యకు తెలుగు మీద ఉన్న అభిమానానికి నిదర్శనాలు. సంస్కృత క్షీరాన్నాన్ని ‘పాలకూడు’గా తెనుగీకరించాడు. చక్కటి తెలుగు పదమైన ‘కూడు’కు ఇప్పుడు గౌరవార్థం లేదు. కానీ, అప్పట్లో అది సభ్యపదమే. అందుకే ‘పనివడి వెన్నెల పాలకూడు గుడిచి/ తనిలోని పెండ్లి దగిలెగా నీకు...’ అని వర్ణించాడు అన్నమయ్య. శరీరాన్ని ‘తోలుబొంత’, ‘గాలిమూట’; అస్థిపంజరాన్ని ‘ఎముకల ఇల్లు’ అంటూ సంబోధించాడు. ‘గాలిమూట జిక్కితిమి కన్నచోటే తొక్కితిమి’ అంటూ చెప్పుకొస్తాడు. గాలిమూట చిక్కటం అంటే శరీరాన్ని ధరించడం. పసిడిచీరవాడు (పీతాంబరుడు), పాముపడకవాడు (శేషశాయి)... ఇలా ఏడుకొండలవాణ్ని అందమైన తెలుగులో కీర్తిస్తాడు. ముగ్ధ, సంధ్యాసమయం, తారాపతి, కర్ణపేయం, దీపావళి వంటి సంస్కృత పదాలకు ‘కొత్తవయసు పడుచు, దివ్వెలెత్తు పొద్దు, చుక్కలరాయడు, చెవులపండుగ, దివ్వెలపండుగ’ అని మనవైన మాటలతో కొత్త పదబంధాలను సృష్టించాడు.
భాషలో అప్పటికే ఉన్న పదాల పోలికతో కొత్తవాటిని తయారుచేయడం కొత్తపద నిర్మాణం. అది తద్ధితపదాల్లో బాగా కనిపిస్తుంది. తద్ధితం అంటే... పరోక్షంగా విభక్తులు ధ్వనించే పదాల్లో కనిపించే ప్రత్యయాలు. ఉదాహరణకు ‘మగతనం’లో ‘తనం’ తద్ధిత ప్రత్యయం.    అన్నమయ్య తన సంకీర్తనల్లో వందలకొద్దీ తద్ధితాంత ప్రయోగాలు చేశాడు. వాటిలో కొన్ని వ్యాకరణ విరుద్ధాలైనప్పటికీ అవి జనరంజకాలు. ‘తన’ అని పైన చెప్పుకున్న ఆ ప్రత్యయం షష్ఠీ విభక్తి పదాలపైనే వస్తుంది. ఈ నియమానికి విరుద్ధంగా అన్నమయ్య ‘సుగుణతనం’ అని భాషాప్రయోగంలో ఎంతో స్వతంత్రించాడు. వ్యాకరణ సూత్రాల ప్రకారమైతే అక్కడ ‘సుగుణునిత్యం’ అని ఉండాలి. ఆ పదం కఠినంగా ఉంది కాబట్టి దాన్ని పక్కనపెట్టి ‘సుగుణతనం’ అన్నాడు. జనానికి అర్థం కావడమే భాష లక్షణం అనుకున్నప్పుడు లాక్షణికుల నిర్దేశాలను దాటడానికి అన్నమయ్య మొహమాటపడలేదు. విటతనం, రసికతనం, జారతనం, దొరతనం అంటూ ఆయన ప్రయోగించిన పదాలూ ఇలాంటివే.
      ‘కాడు, కత్తియ’ ప్రత్యయాలు సాధారణంగా వేటకాడు, వేటకత్తె లాంటి ఆచ్ఛిక (అచ్చతెలుగు) శబ్దాల్లోనే కనిపిస్తాయి. కానీ అన్నమయ్య తత్సమాల (సంస్కృత శబ్దాలకు తెలుగు ప్రత్యయాలు కలిపితే వచ్చే పదాలు) మీద కూడా ప్రయోగించాడు. కోపకాడు, అంజనగాడు, రచనకాడు, కోపగత్తె, పాత్రగత్తె అనే పదాలను సృష్టించాడు. అలా భాషా బాహుళ్యాన్ని పెంచాడు. ఉబ్బరికాడు, గడుసుకాడు, జాణకాడు, జాణకత్తె, దాయగాడు, దాయకత్తె, బడిగికాడు, దొరకత్తె, మేటికాడు, చిటారికత్తె, సిగ్గరికాడు, గొల్లకత్తె (గొల్లెత), దొరకత్తె లాంటి ప్రయోగాలు చేశాడు. ఇది పద విస్తృతిని పెంచే ప్రక్రియ. ఇలా తయారుచేసిన పదాలతో ఏకంగా ఓ కీర్తనే రచించాడు అన్నమయ్య...  
వెలలేని వలపుల వేడుకకాడవు
చలమరి చేతల జాజరకాడవు
ఇప్పుడె శ్రీవేంకటేశ యేలితిని నన్ను నిట్టె
తొప్పుదోసే రీతులకు దొమ్మికాడవు
సమాసాల్లో సృజన

సంస్కృత, తెలుగు పదాలను కలిపితే ‘వైరిసమాసా’లవుతాయి. అలాంటి వాటిని రాయకూడదన్నది పండితుల వాదన. కానీ అన్నమయ్య భాషలో వైరిసమాసాలు అడుగడుగునా ఉన్నాయి. సూత్రబొమ్మలు, బాలనాడు, లోకదొంగ, దినపెండ్లి, నిజసిరులు, రక్తగుండాలు, విష్ణుమూరితి, ప్రాణబందుగుడు, పురుషోత్తమానతి, కంటకమాల, నిచ్చకల్యాణము, జవ్వనరాజ్యము, సింగారవిభుడు... ఇవన్నీ వైరిసమాసాలే. వీటన్నింటినీ స్వేచ్ఛగా వాడాడు అన్నమయ్య. ఇలాంటి వాటినే కాదు ఎంతో విలక్షణత ఉన్న సమాసాలనూ అన్నమయ్య రూపొందించాడు. సమాసంలో పూర్వపదానికీ ఉత్తరపదానికీ అన్వయం ఉంటుంది. సమాసం చివర్లో చేరాల్సిన అనుబంధ పదం మధ్యలో చేరడం అన్నమయ్య సమాసాల్లోని విలక్షణత. ‘ఎవ్వతె చేతులో/ ఎవ్వరి మాటలో’ అన్నది ప్రామాణిక ప్రయోగం. కానీ అన్నమయ్య ‘ఎవ్వతో చేతుల, ఎవ్వరో మాటలు’ అన్నాడు. ‘నీ, నా, మా’ అనేవి పదం మొదట్లో ఉండాలి. అన్నమయ్య మాత్రం... నీ చీకటి తప్పులకు మారుగా- ‘చీకటి నీ తప్పులు’, సవతి ఆడేటి మాటకు మారుగా- ‘ఆడేటి సవతి మాట’ అని ప్రయోగించాడు. మరి అన్నమయ్య వ్యాకరణ విరుద్ధంగా రాశాడా? అంటే జన వ్యవహారాన్ని సంకీర్తనల్లోకి చేర్చి వాటికి కావ్యగౌరవం కల్పించాడు.
ఎండమావుల నీళ్లు
నుడికారం భాషకు జీవం. దీన్నే జాతీయాలు, పదబంధాలు, పలుకుబళ్లు అంటాం. ఇవి జానపదుల సృష్టి. భావాన్ని విలక్షణంగా చెప్పే ప్రయత్నంలోంచి నుడికారం పుడుతుంది. వ్యక్తీకరణలో ఆలంకారికత, స్పష్టత, ఊనిక ఉండాలనుకోవడం నుడికారానికి ప్రాణంపోస్తుంది. ‘కొంచెం’ అని మామూలుగా అనకుండా ‘రవ్వంత, కాస్తంత, ముత్తెమంత, ఇసుమంత, గోరంత, చింతాకంత, ఆవంత, మినుకంత, చిన్నమంత, వీసమంత’ అనడంలో ప్రత్యేకత ఉంది. కడుపులోపలి పుండు, అద్దం లోపలి నీడలు, తాడుపై తపసు, మనసు తాగిన పాలు, రావిమాని పువ్వులు, తాటిమాని నీడ, నెత్తిమీది చిచ్చు, చమురు దీసిన దివ్వె... వంటి వందలాది పలుకుబళ్లు అన్నమయ్య సంకీర్తనల్లో ఉన్నాయి. సతులతో నవ్వులు చందమామ గుటకలు/ మతితల పోతలెండమావుల నీళ్లు/ రతులలో మాటలు రావిమాని పువ్వులు/ తతివిరహపు కాక తాటిమానినీడ/ లలనల జవ్వనాలు లక్కపూస కపురులు/ నెలకొని సేసే బత్తి నీటిపై వ్రాత/ చెలువపు వినయాల చేమకూర శైత్యాలు (ఇవన్నీ అసంభవం) కీర్తనైతే మొత్తంగా పలుకుబడులతోనే సాగుతుంది.
      అన్నమయ్య అప్పటి వ్యావహారిక పదాలకు కావ్యగౌరవం కల్పించాడు. వాడుకలో ఉన్న పదాలకు కొత్త అర్థాలు కల్పించాడు. కొత్తపదాలను సృష్టించాడు. విలక్షణ పదబంధ నిర్మాణం చేశాడు. జానపదుల వాడుకలోని ధ్వని భేదాల్ని సంకీర్తనల ద్వారా లిపిబద్ధం చేశాడు. 
      ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా తెలుగును సుసంపన్నం చేసుకోవడానికి అన్నమయ్య మార్గం ఆచరణీయం. తెలుగులోకి వెల్లువెత్తుతున్న ఆంగ్ల పదాలకు సరిపోయే పదాలెన్నో పల్లెల్లో వినిపిస్తాయి. పదకవితా పితామహుడు చూపిన బాటలో ప్రయాణించి ఆ పల్లె పలుకులను ఒడిసిపట్టుకోగలిగితే... విస్తృతంగా వాటిని వాడుకలోకి తెచ్చుకోగలిగితే మన ‘మాట’ మీద మనం నిలబడతాం. భాషనూ నాలుగు తరాల పాటు నిలబెట్టుకోగలుగుతాం. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం