హాస్యపు హరివిల్లు... పాటల పొదరిల్లు

  • 1639 Views
  • 24Likes
  • Like
  • Article Share

    శాంతి జలసూత్రం

  • పెదపాడు, పశ్చిమగోదావరి shanti.rfc@gmail.com
శాంతి జలసూత్రం

నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వకపోవడం ఒక రోగం అంటూ హాస్యాన్ని పండించిన మాటల రచయిత, దర్శకుడు ఒకరు. ‘తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా’ అంటూ తెలుగుదనాన్ని కాచి వడబోసిన పాటల రచయిత మరొకరు. వీళ్లెవరో ఇప్పటికే అర్థమైపోయింది కదూ! హాస్యబ్రహ్మ జంధ్యాల... సినీ గేయ రచయిత వేటూరి సుందర్రామ్మూర్తి. వీళ్లిద్దరికీ అభిమానులు కోకొల్లలు. వాళ్లలో కొందరు తమ అభిమాన దిగ్గజాల కృషిని అంతర్జాల వేదికపై పునరావిష్కరిస్తున్నారు. jandhyavandanam.com పేరిట జంధ్యాల గురించి, veturi.in అని వేటూరి గురించి వెబ్‌సైట్లను ప్రారంభించడమే కాదు... ఆ సృజనశీలురపై ప్రత్యేక వ్యాసాలు రాస్తున్నారు. మరొక విశేషమేమంటే ఆ రెండు సైట్లనూ నిర్వహిస్తున్నది ఒకరే!
జంధ్యావందనం.కామ్‌
హాస్యానికి మరో పేరు జంధ్యాల. రచయితగా, దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి. ఆయన జీవనశైలి, అందుకున్న అవార్డులు, సినీ జీవిత ప్రస్థానంలాంటి విశేషాల సమాహారమే జంధ్యావందనం.కామ్‌. ‘ఈ చెమ్మంతా ఇరిగేలోపు మన కళ్లు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో! ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే! జూ వాళ్లు చూస్తే కోతులు తప్పించుకున్నాయని పట్టుకెళ్లిపోతారు. జనమెవరైనా చూస్తే రాళ్లుచ్చుకుని కొడతారు’ అంటూ ‘వివాహభోజనంబు’ చిత్రంలో జంధ్యాల రాసిన ఛలోక్తులు నవ్వుల్లో ముంచెత్తుతాయి. కోట శ్రీనివాసరావుతో పిసినారి వేషం వేయించి హాస్యాన్ని పండించిన ‘అహనా పెళ్లంట’ చిత్ర విశేషాలు కడుపుబ్బ నవ్వు తెప్పిస్తాయి. బావాబావా పన్నీరు, విచిత్ర ప్రేమ, బాబాయ్‌ అబ్బాయ్, విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ మొదలైన చిత్రాల్లోని హాస్య సన్నివేశాలను ఇక్కడ చూడొచ్చు. జంధ్యాల గురించి కె.విశ్వనాథ్, నరేష్, శ్రీలక్ష్మి, రాఘవేంద్రరావు, సుత్తివేలు వంటి సినీ ప్రముఖుల అభిప్రాయాల్లో ఆయన నిరాడంబరత కనిపిస్తుంది. తరలిరాని లోకాలకు/మరలెళ్లిన జంధ్యాలని/ తల్చుకుంటే జారినట్టి అశ్రుబిందువా! అంటూ జంధ్యాలను తలచుకుంటూ తనికెళ్ల భరణి రాసిన గేయం కంటతడిపెట్టిస్తుంది. పడమటి సంధ్యారాగం సినిమాలోని ‘ముద్దుగారే యశోద’ పాట వెనుక జంధ్యాల ఆంతర్యం ఆయన సృజనాత్మకతను తెలియజేస్తుంది. జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్ర విశేషాల్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు. ‘రసపిపాసులకు తన కలం నుంచి వెలువడిన హాస్యరస కలశాలను అందించిన తెలుగుజాతి చిరునవ్వు జంధ్యాల’ అంటూ వేటూరి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన వైనం, ‘ఎవర్నీ నొప్పించకుండా ఆబాలగోపాలాన్ని మెప్పించే హాస్యం ఆయనతోనే మొదలయ్యింది’ అంటూ జంధ్యాలను గుర్తుచేసుకున్న సుత్తివేలు మాటలన్నీ ఇందులో కనిపిస్తాయి.
వేటూరి.ఇన్‌
‘ఒరేయ్‌ రాముడూ
సుందర్రాముడూ
అలా ఉలిక్కి పడతావేంట్రా’ అంటూ తనికెళ్ల భరణి వేటూరికి సమర్పించిన సన్మాన పత్రం, ‘అక్షరాల వెనుక అనుభూతిని పొదిగిన రచయిత వేటూరి’ అన్న భువనచంద్ర అభిప్రాయం, ఔరా అనిపించే వేటూరి పాటల విశ్లేషణలు... ఇలా వేటూరి గురించి పూర్తి సమాచారాన్ని వేటూరి.ఇన్‌లో చూడవచ్చు. వేటూరి జీవిత విశేషాలతో పాటు, ఆయన సినీ ప్రస్థానం ఎలా కొనసాగిందో సవివరంగా తెలుసుకోవచ్చు. ఆయనకి ఇచ్చిన పురస్కారాల సమాచారం, పుస్తక ప్రచురణ వివరాల్ని చదువుకోవచ్చు. వేటూరి ఇచ్చిన ముఖాముఖిలు వ్యాస రూపంలో ఉన్నాయి. ఆయన గురించి ఛానెళ్లలో వచ్చిన వీడియోలు కనిపిస్తాయి. సంప్రదాయ కవిత్వం దగ్గర నుంచి జానపద గీతాలవరకూ వేటూరికున్న ప్రతిభా పాటవాలు అబ్బురపరుస్తాయి. ‘కొమ్మకొమ్మకో సన్నాయీ! కోటిరాగాలు ఉన్నాయీ/ఎందుకీ మౌనం! ఏమిటీ ధ్యానం!’ అంటూ సాగే ఆయన పాటల్లోని మాధుర్యం వర్ణనాతీతం. అలాంటి ఎన్నో పాటలను వేటూరి ఎలా విశ్లేషించారో కళ్లకు కట్టినట్లుగా వ్యాసరూపంలో అందించారు. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే/తోటమాలి నీ తోడు లేడులే!’ ... అన్న పాట విని కళ్లు చెమ్మగిల్లని తెలుగు వారుండకపోవచ్చు. ఈ పాటతో జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఆ విశేషాలన్నీ విపులంగా వివరించారు. ‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ వంటి అపురూప భావవిన్యాసాలు వేటూరి రచనల్లో ఎన్నో కనిపిస్తాయి. కొంతమంది ప్రముఖలు వేటూరిని ఉద్దేశిస్తూ చెప్పిన అభిప్రాయాలను ఇక్కడ చదువుకోవచ్చు. ఆయన ఎవరితో ఎలా ఉండేవారు, మనస్తత్వం ఎలాంటిది, రచనా శైలి ఎంత గొప్పదిలాంటి విశేషాలన్నీ తెలుసుకోవచ్చు. ‘ఎందరులేరు మిత్రులెందరులేరట సాహితుల్‌ హితుల్‌/చందురువంటి చల్లనయ్య సాహితి సాహితి’ అంటూ వేటూరి గురించి దాశరథి చెప్పిన పద్యవిశేషాలతో పాటు తొలినాళ్లలో వేటూరి రాసిన ‘పప్పణ్ణం ఎప్పుడు?, ఇంటర్వ్యూ ప్రీవ్యూ, విపర్యయాలు కథ’ మొదలైన కథలన్నీ పత్రికల్లో వచ్చాయి. వాటినీ సేకరించి ఇక్కడ భద్రపరిచారు. 
రూపకర్త ఎవరంటే..
పప్పు శ్రీనివాసరావు. ముంబైలో ఓ ప్రైవేట్‌ షిప్పింగ్‌ కంపెనీ ఉద్యోగి. మూడేళ్ల కిందట శ్రీనివాసరావు మిత్రులతో కలిసి జంధ్యావందనం సైట్‌ను ప్రారంభించారు. దీనికి జంధ్యాల అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. అదే స్ఫూర్తితో  వేటూరి గురించి కూడా వెబ్‌సైట్‌ పెడితే బాగుంటుందనిపించింది. ఇంకేముంది సుందరాకాండ ఉపశీర్షికతో వేటూరి.ఇన్‌ సైట్‌ను కూడా ప్రారంభించారు. ప్రారంభించిన నెలరోజుల్లోనే పూర్తి సమాచారంతో ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఆయన మిత్రులందరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డవారైనా జంధ్యాల, వేటూరి మీదున్న అభిమానంతో తీరిక చేసుకుని వ్యాసాలు రాసి పంపుతున్నారు. వీరిద్దరికి సంబంధించిన సమాచారం ఎక్కడ దొరికినా వెంటనే అప్‌డేట్‌ చేస్తుంటారు. ఒకవేళ పత్రికల్లో వచ్చినవి అయితే ఆ పత్రిక అనుమతితో ఆ సమాచారాన్ని తీసుకుంటారు. ప్రస్తుతం వారానికి ఒక కొత్త వ్యాసం చొప్పున వీటిలో పెడుతుంటారు. ఈ రెండు సైట్లకు అభిమానులెవరైనా వ్యాసాలు పంపొచ్చు. వాటిలోని అక్షర దోషాలను మాత్రం సరిచేసి ప్రచురిస్తారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం