మన వైభవ శిఖరం.. ఏకశిలానగరం

  • 1198 Views
  • 1Likes
  • Like
  • Article Share

    కె.విజయబాబు

  • చరిత్ర, పర్యాటక శాఖ ఆచార్యులు కాకతీయ విశ్వవిద్యాలయం,
  • వరంగల్‌.
  • 9440349593
కె.విజయబాబు

ఓరుగల్లు కోట మీద అప్పుడు ఎగిరిన కాకతీయ విజయధ్వజం ఇప్పటికీ తెలుగుజాతి పౌరుష పతాకమే. సువిశాల రాజ్యాన్ని సుదీర్ఘంగా ఏలిన కాకతీయుల రాజధాని ఓరుగల్లు ఎప్పటికీ తెలుగుజాతి వారసత్వ నగరమే. జాతి చారిత్రక ప్రస్థానానికి ప్రత్యక్షసాక్షి అయిన ఈ నగర చరిత్ర అంతా వైభవోపేతమే.  
అది
క్రీ.శ.1323. ఓరుగల్లు కోటమీద నిల్చుని ఉన్నాడు ఉల్గుఖాన్‌ (జునాఖాన్‌/ మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌)... నిల్చున్న వాడు నిల్చున్నట్లే తన్మయత్వంతో ఊగిపోతున్నాడు. కారణం... ఎటుచూసినా నీరు చిమ్ముతున్న బుగ్గలు, మామిడి, అరటి, పనస తోటలు- సంపంగి, జాజి తదితర పూల తోటలతో పురివిప్పిన మయూరంలా కనిపిస్తున్న ఓరుగల్లు నగర సౌందర్యం! 
      ఓరుగల్లు కోట మీదికి దండెత్తి వచ్చిన ఉల్గుఖాన్‌ ప్రత్యక్ష అనుభవంగా చరిత్రలో నమోదైన విషయమిది. దీనికి పద్నాలుగేళ్లకు ముందు, అంటే 1309లో ఈ నగరాన్ని మాలిక్‌ కాఫర్‌ ముట్టడించాడు. అతనితోపాటు అమీర్‌ఖుస్రూ కూడా ఇక్కడికి వచ్చాడు. ‘మట్టితో కట్టిన ఆ కోటగోడలోకి బల్లెం దిగదు. ఆగోడకు తగిలిన గుండు కూడా తేలిపోతుంద’ని అనుభవం మీద చెప్పాడు. ఇదీ కాకతీయ నిర్మాణ చాతుర్యం! ఇదీ గణపతిదేవ చక్రవర్తి కాలంలో నిర్మితమైన కోట గొప్పదనం! 12,546 అడుగుల వైశాల్యంతో నిర్మితమైన ఆ కోట చుట్టూ ఎత్తయిన రాతి బురుజులు, వాటి మీదికి ఎక్కడానికి రాతిమెట్ల వరుసలు ఉంటాయి. ఈ రాతికోటకు వెలుపల ఎత్తయిన మట్టికోట కనిపిస్తుంది. దీని గురించే అమీర్‌ఖుస్రూ చెప్పింది! ఆయన రచనల ప్రకారం... యుద్ధంలో ఓడిన ప్రతాపరుద్రుడు దిల్లీ సుల్తానులకు వేలాది ఏనుగులు, గుర్రాలతోపాటు అపారమైన బంగారం, వెండి, ధనరాశులను ఇచ్చాడు. వాటిలో ‘ప్రపంచంలోనే సాటిలేని మణి’ ఒకటి కూడా ఉందని ఖుస్రూ రాశాడు. మొత్తమ్మీద బరాని, అమీర్‌ఖుస్రూ, ఇసామీల రాతలనుబట్టి ఆనాటి కాకతీయ సామ్రాజ్యం ఎంత సుభిక్షంగా ఉండేదో తెలుస్తుంది. ఫ్రయర్‌ జోర్డనెస్‌ (1323-1330) తన ‘వండర్స్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’లో నాటి తెలుగు దేశ వైభవాన్ని వర్ణిస్తూ... ‘‘తిల్లింగ్‌ రాజ్యంలో ధాన్యం, చక్కెర, మైనం, తేనె, పప్పులు, గుడ్లు, గొర్రెలు, గేదెలు, పాలు, వెన్న, అనేక రకాల నూనెలు, ఎన్నో రుచికరమైన పండ్లు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి!’’ అని చెప్పుకొచ్చాడు. ప్రతాపరుద్రుడి ఓటమికి ముందువరకూ కాకతీయ రాజ్యలక్ష్మి సర్వాలంకృత సమేతగా శోభిల్లింది.
      అనుపమాన తేజోవంతమై, అసమాన వైభవోపేతమై వెలిగిన కాకతీయుల పౌరుష ప్రాభవాలకు నిలువెత్తు సాక్ష్యం... వాళ్ల రాజధాని ఓరుగల్లు. ఆనాటి రాజకీయాలకు, వ్యాపార వాణిజ్యాలకు, విద్యా వైదుష్యాలకు కేంద్రంగా, కళలకు కాణాచిగా, భాషా సాహిత్యాలకు భాగ్యరేఖగా దాదాపు 300 ఏళ్లు వర్ధిల్లిందీ నగరం. శాసనాలు, సాహిత్యం, సనదులలో ‘ఆంధ్రనగరం, త్రికూటనగరం, ఏకశిలానగరం’గానూ ప్రశస్తి పొందింది ఓరుగల్లు. కాకతీయుల వల్ల ఓరుగల్లు... ఓరుగల్లు వల్ల కాకతీయులు... చరిత్రలో నిలిచిపోయారు. 
      కాకతీయుల మొదటి రాజధాని అనుమకొండ. ‘అది ఆంధ్ర దేశానికే భూషణమనదగిన అందమైన పట్టణం’ అని గణపేశ్వర శాసనం అభివర్ణించింది. వినుకొండ వల్లభరాయుని ‘క్రీడాభిరామం’లో ఓరుగల్లు నగరం మనోహరంగా చిత్రితమైంది. ఉత్తరాన గోదావరి, దక్షిణాన కృష్ణానది పరివాహక ప్రాంతాలకు మధ్య వ్యాపించి ఉన్న జిల్లాకు ప్రస్తుతం ముఖ్యపట్టణమైన ఇది ఒకప్పుడు మొత్తం తెలుగునాడుకే రాజధాని. 
ఏనాటి మానవుడు... 
వరంగల్‌ చరిత్ర పుటలను వెనక్కి తిప్పుకుంటూ వెళ్తే ఎక్కడ ఆగుతామో తెలియదు. ఎందుకంటే... క్రీ.పూ.లక్ష - రెండు లక్షల సంవత్సరాల కిందటే ఇక్కడ ఆది మానవుడు సంచరించాడు. ఇటీవలే దామరువాయి, గంగారాల్లో ఆదిమానవుడు వాడిన గోకుడురాళ్లు, ఈటెల పనిముట్లు, రాతిగొడ్డళ్లు దొరికాయి. నాటి మానవుడు నివసించినట్లు భావిస్తున్న గుహలాంటి రాతి కట్టడాలు, సమీపంలో ఆరున్నర అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పు గల రాతితొట్టి, అందులో ఎముకలు బయల్పడ్డాయి. ఇవి సూక్ష్మ శిలాయుగం నాటివి. 
      జైన, బౌద్ధమతాలు దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు, ఆంధ్రులు వాటిని బాగా ఆదరించారు. వరంగల్‌ జిల్లా అంతటా జైన బసదులు, బౌద్ధ విహారాలు, ఆరామాలు కనిపిస్తాయి. శాతవాహనుల కాలంలో గోదావరి పరివాహక ప్రాంతం గొప్ప సాంస్కృతిక కేంద్రం. నేటి కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల శాతవాహనుల మొదటి రాజధాని. 
శాతవాహనుల పాలనలో ఓరుగల్లు
శాతవాహనులు తమ పాలనను అస్సక (నిజామాబాద్, మహబూబ్‌నగర్‌ మధ్యప్రాంతం), ములక (ఓరుగల్లు నుంచి ఔరంగాబాద్‌ వరకు) రాజ్యాల నుంచే ప్రారంభించారు. ఆ తర్వాత కృష్ణా తీరప్రాంతంలోని ధాన్యకటకాన్ని, గోదావరి పరివాహక ప్రాంతాన్ని కలుపుకుని సువిశాల రాజ్యాన్ని నెలకొల్పారు. శాతవాహన మూలపురుషుడైన సాద్వాహన నాణెం ఓరుగల్ల్లులో లభించింది. సమీపంలోని గీసుకొండ ప్రాంతం వర్తక వాణిజ్య కేంద్రంగా ఉండేదని ఇటీవల అక్కడ లభించిన వస్తుసామగ్రి, తూనికరాళ్లు, దేవతా ప్రతిమలు, ఆటబొమ్మలు, పూసలు వంటివి సాక్ష్యమిస్తున్నాయి. బహుశా ఆనాటి గ్రీసు దేశస్థుల వ్యాపార స్థావరమే క్రమంగా గీసుకొండగా మారిందేమో! 
      శాతవాహనుల అనంతరం ఇక్ష్వాకుల, అభీర, విష్ణుకుండిన రాజవంశాల పాలనలో ఓరుగల్లు కొనసాగింది. శాతవాహన చాళుక్య యుగాల మధ్యకాలంలో (క్రీ.శ.200-600) తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు తమ రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయాయి. ఈ కాలంలో సముద్రతీర ప్రాంతాలు వ్యావసాయికంగా బలపడి ప్రధాన ఆర్థిక, రాజకీయ కేంద్రాలయ్యాయి. విష్ణుకుండినుల అనంతరం తెలంగాణ పశ్చిమ చాళుక్య, రాష్ట్రకూట, కల్యాణి చాళుక్యుల వశమైంది. హనుమకొండ (అర్మకొండ) ఈ రాజ్యాల అధీనంలో ఉండేది. కల్యాణి చాళుక్యుల అధికారం తెలంగాణలో బలహీనపడిన తర్వాత ముదిగొండ చాళుక్యులు కొరవి కేంద్రంగా పరిపాలించారు. 
భద్రకాళిని మొక్కిన పులకేశి
క్రీ.శ.612లో రెండో పులకేశి కర్ణాటక, మహారాష్ట్ర, కళింగ ప్రాంతాలను జయించాడు. వేంగి రాజ్యం మీద దండెత్తాడు. ఈ కాలంలో అనుమకొండ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నాడన్నది స్థలపురాణం. అప్పట్లో అనుమకొండ బాదామి చాళుక్య పాలనలో ఉండేది. జైనమతానికి ప్రజాదరణ ఎక్కువ. అనుమకొండ పద్మాక్షి దేవాలయ పరిసరాలు జైన సన్యాసులతో నిండిపోయేవి. నేటి జనగామ కూడా నాటి జైనగ్రామమే. ఆ తర్వాత రాష్ట్రకూటులు, వేంగి చాళుక్యులు, పశ్చిమ చాళుక్యుల అధికార ఛాయలో ఓరుగల్లు కొనసాగింది. వీళ్ల తర్వాత వచ్చిన కాకతీయులతో ఈ నగర ఖ్యాతి విశ్వ విఖ్యాతమైంది. 
కాకతీయ ప్రభావం
ప్రతాపరుద్రుడి ఆస్థానకవి విద్యానాథుడి ‘ప్రతాపరుద్రీయం’ గొప్ప సంస్కృత కావ్యం. నాటి సామాజిక, రాజకీయ విశేషాలను అందించే రచన ఇది. వినుకొండ వల్లభరాయుడి ‘క్రీడాభిరామము’ నాటి ఓరుగల్లు కోట విశేషాలను వివరిస్తుంది. పాల్కురికి సోమనాథుని ‘పండితారాధ్య చరిత్ర’, ‘బసవ పురాణము’, కాసె సర్వప్ప ‘సిద్ధేశ్వర చరిత్ర’,  కొలను గణపతిదేవుడి ‘శివయోగసారము’, రుద్రదేవుడి ‘నీతిసారము’, శ్రీనాథుడి ‘పల్నాటి వీరచరిత్ర’ కూడా కాకతీయ రాజుల కీర్తిని గానం చేస్తాయి. ఓరుగల్లు కోటలో ‘కాకతి’ పేరిట ఓ ఆలయం ఉండేదని ‘క్రీడాభిరామం’ చెబుతోంది. ‘కాకతి’ (దుర్గాదేవి).. కాకతీయుల కులదేవత. 
      కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు (క్రీ.శ.1199-1262) తన 63 సంవత్సరాల పాలనా కాలంలో తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చాడు. ఓరుగల్లు పట్టణాన్ని మట్టికోట, రాతికోటలతో పటిష్ఠం చేశాడు. రాజధానిని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. ఆయన పరిపాలనా దక్షుడు. వ్యవసాయాన్ని, వర్తకాన్ని, పరిశ్రమలను ప్రోత్సహించాడు. విదేశీ వర్తకులకు రక్షణ కల్పిస్తూ మోటుపల్లి రేవులో ‘అభయ శాసనం’ వేయించాడు. ఆయన కుమార్తె రుద్రమ... ఆంధ్రదేశాన్ని ఏలిన గొప్ప పాలకుల్లో ఒకరు. ఆమె కాలంలోనే మార్కోపోలో అనే వెనిస్‌ యాత్రికుడు ఓరుగల్లును సందర్శించాడు. ‘ఇక్కడ శ్రేష్ఠమైన సన్నని వస్త్రాలు నేస్తారు. వాటిని ధరించడానికి ఇష్టపడని రాజులుకానీ, రాణులుకానీ ప్రపంచంలో ఉండర’ని చెప్పాడు. రుద్రమదేవికి పుత్రసంతతి లేదు. దాంతో ఆమె పెద్దకుమార్తె ముమ్మడమ్మ పెద్ద కుమారుడు ప్రతాపరుద్రుణ్ని దత్తత తీసుకుంది. ప్రతాపరుద్రుడి (క్రీ.శ.1295-1323) కాలంలో కాకతీయుల అధికారం ఒక వెలుగు వెలిగి అస్తమించింది. 
      మార్కోపోలో వంటి యాత్రికులు నాడు ఇక్కడ జరిగిన వజ్రపు గనుల తవ్వకాలను గురించి రాశారు. నిర్మల్‌ సమీపంలోని కూన సముద్రంలో శ్రేష్ఠమైన ఇనుము దొరికేది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన డమాస్కస్‌ కత్తుల తయారీకి ఈ ఇనుమునే ఉపయోగించేవారు. కర్రపని, దంతపుపని, నగల తయారీ, ఉన్ని, తివాచీలు, అద్దకపు పనులు ఆ రోజుల్లో విరివిగా సాగేవి. ఓరుగల్లు పట్టణం నాటి నుంచి నేటి వరకు తివాచీలకు ప్రసిద్ధి. 
      కేతన ‘ఆంధ్ర భాషా భూషణం’లో అయోధ్య నుంచి ఓరుగల్లు, నెల్లూరుల మీదుగా కాంచీపురానికి ఒక మార్గం ఉన్నట్లు చెప్పాడు. మోటుపల్లి, కృష్ణపట్టణం వంటి రేవు పట్టణాల ద్వారా దేశవిదేశాలతో కాకతీయులు వర్తక వ్యాపారాలు నిర్వహించారు. మోటుపల్లి ‘అభయ శాసనం’లో గణపతిదేవుడి మాటలు... ‘సముద్ర వ్యాపారుల మీద దయకొద్దీ కొత్త పన్నులు తీసేశాం...’- ఆ కాలంలో వర్తకానికి దక్కిన ప్రాధాన్యతకు నిదర్శనాలు. బర్మా, సింహళం, చైనా, తూర్పు ఇండియా దీవులు, అరేబియా, పర్షియా, ఈజిప్టు వంటి దేశాలతో పెద్దఎత్తున వ్యాపారం జరిగేది ఆనాడు. అలా పెరిగిన సంపదతో ఓరుగల్లు తులతూగేది. 
జైనం... శైవం...
కాకతీయుల కాలం నాటికి జైనమతం ప్రబలంగా ఉండేది. దీన్ని ధ్వంసం చేసినవారు వీరశైవులు. రాజులను ప్రభావితం చేసి శైవాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. శైవానికి పోటీగా వైష్ణవం కూడా విజృంభించింది. శైవంలో పాశుపతం, కాలాముఖం, కాపాలికం అనే శాఖలుండేవి. గణపతిదేవుడి కాలంలో పాశుపత శైవం ఉచ్ఛస్థితిలో ఉండేది. గణపతిదేవుని గురువు విశ్వేశ్వర శివాచార్యుడు ఎన్నో శైవమఠాలను స్థాపించాడు. అవి కాళేశ్వరం, త్రిపురాంతకం, ఏలేశ్వరం, అమరావతి తదితర ప్రాంతాల్లో కనబడతాయి. ఇవి విద్యాలయాలుగా, వైద్యాలయాలుగా పనిచేసేవి. 
      కాకతీయుల కాలానికే బౌద్ధం క్షీణించింది. హిందూమతంలో కలిసిపోయింది. జైనం మాత్రం తన వ్యక్తిత్వాన్ని వీడలేదు. అయితే... శైవం ధాటికి తన ప్రాముఖ్యతను కోల్పోయింది. ఇక్కడో విషయం... కాకతీయ రాజులు శైవులైనప్పటికీ వారి సామంతులు వైష్ణవులు. నాటి వైష్ణవాలయాలు అనుమకొండ ప్రసన్న కేశవాలయం, చిలుకూరు, మక్తల మన్ననూరు, అన్నారెడ్డిగూడెం, బూరుగడ్డ, కలువలకొలను, వెల్లటూరుల్లో ఉన్నాయి. మరోవైపు... ఏకవీర, కాకతమ్మ, మాహూరమ్మ, పోలేరమ్మ, పోతురాజు వంటి గ్రామదేవతలూ పూజలందుకున్నారు. 
భాషా సారస్వతాలు...
కాకతీయుల రాజభాష సంస్కృతం. వారి శాసనాల్లో చాలావరకు సంస్కృతంలోనే ఉన్నాయి. అయితే... కాకతీయులు తమ శాసనాలను తెలుగులోనూ వేయించారు. చేబ్రోలు శాసనం రచించిన భీమయ పండ (క్రీశ.1145) మార్గ, దేశీ రీతుల్లో కవిత్వం చెప్పగలడట! ఈశ్వర భట్టోపాధ్యాయుడు మంచి తెలుగు పండితుడు. శైవ, వైష్ణవ మతోద్యమాలు తెలుగు భాషా వికాసానికి విశేషమైన సేవచేశాయి. కాకతీయ కాలంనాటి కావ్యాల్లో తిక్కన రచించిన ‘నిర్వచనోత్తర రామాయణం’ మొట్టమొదటి గ్రంథం. ‘ఆంధ్ర మహాభారతం’ ఉత్తమ గ్రంథం. తిక్కన సమకాలికులలో కేతన ‘దశకుమార చరిత్ర’ను రచించాడు. తెలుగులో ప్రథమ వచన కావ్యకర్త కృష్ణమాచార్యులు ఈ కాలంవాడే. అప్పయమంత్రి ‘చారుచర్య’ అనే వైద్య గ్రంథాన్ని వెలయించాడు. ‘పురుషార్థసారం’ రాసిన శివదేవయ్య గణపతిదేవుడు, రుద్రమదేవి కాలాల్లో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ కాలంలోనే భాస్కర రామాయణాన్ని మల్లికార్జునభట్టు, కుమారదేవుడు, భాస్కరుడు, హుళక్కి భాస్కరుడు, అయ్యలార్యుడు అనే అయిదుగురు కవులు రాశారు. గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’, మడికి సింగన ‘సకలనీతి సమ్మతం’, నన్నెచోడుని ‘కుమార సంభవం’, పాల్కురికి సోమనాథుని ‘బసవ పురాణం’, ‘వృషాధిప శతకం’, ‘పండితారాధ్య చరిత్ర’, మల్లికార్జున పండితారాధ్యుని ‘శివతత్త్వసారం’, రావిపాటి త్రిపురాంతకుని ‘అంబికా తారావళి’ తదితర తెలుగు దీపాలన్ని కాకతీయుల కాలంలోనే వచ్చాయి.  
శిఖరాయమానమైన కళ
ఓరుగల్లులో పదిహేను వందల మంది చిత్రకారుల ఇళ్లు ఉన్నట్లు ‘ప్రతాపరుద్ర చరిత్ర’ చెప్పింది. గణపతిదేవుడి గజసేనాని, సంగీత విద్యాపారంగతుడు అయిన జాయప గీతారత్నావళి, వాద్య రత్నావళి, నృత్తరత్నావళి గ్రంథాలను రాశాడు. పేరిణి నృత్యం అప్పట్లో ప్రఖ్యాతి పొందింది. కాకతీయులు సంగీత, నృత్యకారులకు దేవదాసీలకు పెద్దఎత్తున దానధర్మాలు చేశారు. వాళ్లు నిర్మించిన దేవాలయాల్లో కూడా నాటి నాట్య కళారూపాలు కనిపిస్తాయి. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి, కోటలోని నాట్యశిల్పాలు, రామప్ప శిల్పాలు కాకతీయుల నృత్య కళాభిమానానికి పరాకాష్ఠ.
      కాకతీయ దేవాలయాలు ఆంధ్రదేశమంతటా ఉన్నాయి. వరంగల్, అనుమకొండ, ఐనవోలు, కొరవి, గూడూరు, ఇనుగుర్తి, కొండపర్తి, పాలంపేట, మాటూరు, పమ్మి, ముప్పవరం, చినకందుకూరు, కటాక్షపూర్, ఘనపూర్, జాకారం, మొగిలిచర్ల, రామానుజపురం వంటి అనేక ప్రదేశాల్లో ఇవి విస్తరించాయి. ఆనాటి రాజులు వారి సామంతులు, దండనాయకులు యుద్ధాలలో గెలిస్తే దేవాలయాలు కట్టించారు. వాటిలో ప్రతిష్ఠించిన దేవతలను తమ పేర్లతోనే పిలిచారు. అందుకే, రుద్రదేవ మహారాజు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రుద్రేశ్వరుడు (వేయిస్తంభాల గుడి) అయ్యాడు. 
శిల్పం అనర్ఘం
కాకతీయుల కాలంనాటి పెద్దపెద్ద దేవాలయాలు అన్నీ భూమి నుంచి అయిదారు అడుగుల ఎత్తులో ఉన్న సువిశాలమైన పీఠాల మీద నిర్మితమయ్యాయి. వేయిస్తంభాల గుడి, రామప్పగుడి, పిల్లలమర్రి ఆలయాలు అందుకు నిదర్శనాలు. అంతపెద్ద రాతి పీఠానికి అనువుగా భూమిలో ఏడెనిమిది అడుగుల రాతి పునాది కట్టారు. ఆ రాతి పునాది కింద ఇసుక పోశారు. అంత పెద్ద దేవాలయాలు, బరువైన స్తంభాలు... ఎనిమిది వందల ఏళ్లుగా చెక్కుచెదరక పోవడం విశేషం. ఆ స్తంభాలపై పెట్టిన మెరుగు వల్ల అవి వందల సంవత్సరాలుగా అద్దాల్లా మెరుస్తూనే ఉన్నాయి. రామప్పగుడి స్తంభాల మీద ‘సముద్రమథనం’, ‘కోలాటం’, ‘దండలాస్యం’ వంటివి కనిపిస్తాయి. అసలు కాకతీయ శిల్పకళే ఓ ప్రత్యేక అధ్యయనాంశం. 
      రామప్ప ఆలయం చుట్టూ, ద్వారాల దగ్గర, మూలల్లో నిలువెత్తు 12 సుందరీమణుల విగ్రహాలున్నాయి. అవి పైకప్పులకు తాకి ఉండేటట్లు... స్తంభాల మధ్య భాగం నుంచి పైకప్పు వరకు ఊతగా ఉండేటట్లు ఏర్పాటయ్యాయి.  ఈ నర్తకీమణుల శిల్పాలు ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో కనబడతాయి. కాకతీయ శిల్పాలు జీవచైతన్యాన్ని వెలువరిస్తూ దర్శనమిస్తాయి. దేవతామూర్తులు గాని, చామరగ్రాహులు గాని, నర్తకీమణుల శిల్పాలు గాని కదలికను సూచించే భంగిమల్లోనే కనిపిస్తాయి.
      కాకతీయుల శిల్పకళ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కాకతీయ ద్వార (కీర్తి) తోరణం. ఓరుగల్లు కోటలో ఉన్న ఈ నాలుగు ద్వారాలు పెద్దపెద్ద శిలలతో నిర్మితమయ్యాయి. ముందుగా రాతి పునాదులు వేసి, ఆ పునాది రాళ్లను తొలచి వాటిలోకి ఈ ద్వారాల స్తంభాలను చొప్పించారు. వాటిమీద వివిధ శిల్పాలను తీర్చిదిద్దారు. కాకతీయ శిల్పులు రూపకల్పన చేసిన నంది అత్యద్భుతం. ఇక రామప్ప దేవాలయంలోను ఓరుగల్లు కోటలోను ముగ్గురు మనుషులను కలిపి ఆరుకాళ్లకు బదులు నాలుగు కాళ్లనే చెక్కిన శిల్పం విశిష్టమైంది. అయినా విడివిడిగా చూస్తే దేనికదే సమగ్ర రూపంలో కనిపిస్తాయి. మొత్తమ్మీద బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సిద్ధాంతాలకు అనుగుణంగా పురాణగాథలు, జానపదుల జీవన నేపథ్య దృశ్యాలు ఆలయాల గోడలపై చెక్కారు.
      తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చిన రాజులు కాకతీయులు. సమర్థమైన, పటిష్ఠమైన పరిపాలనా వ్యవస్థలను ఏర్పరిచి ప్రజారంజకమైన పాలనను అందించారు. చెరువులను నిర్మించి వ్యవసాయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. భిన్నమతాల శాఖలు, వర్గాల మధ్య సమభావానికి, సద్భావనకు కృషిచేశారు. కళలకు పట్టంకట్టారు. ఓరుగల్లు నగరంలో అడుగడుగునా వారి అడుగుజాడలు కనిపిస్తాయి. అవే ఇప్పటికీ ఈ నగరాన్ని సమున్నతంగా నిలబెడుతున్నాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం