అట్లుపోయంగా... ఆరగించంగా

  • 1729 Views
  • 52Likes
  • Like
  • Article Share

    డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు

  • తెలుగు శాఖాధిపతి, హిందూ కళాశాల
  • గుంటూరు,
  • 9848543520
డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు

తెలుగునాట తరతరాలుగా వస్తున్న పండుగలు, వ్రతాలు సరదాలకు లోగిళ్లుగా సంతోషానందాలకు తెరిచిన వాకిళ్లుగా ఉన్నందువల్లే ఆధునికత ఎంతగా విస్తరించినా వాటి ఉనికి కనుమరుగు కాలేదు. సంస్కృతిని ఊతంగా చేసుకొని ప్రవహించే జీవనదుల్లాంటివి కనుకనే వాటి ఉనికికి ఏనాటికీ ప్రమాదం ఉండదనిపిస్తుంది. అలాంటి పండుగల్లో ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం పెట్టిన పండుగ అట్లతద్ది. దాదాపుగా దీన్ని పోలిన పండుగే ఉండ్రాళ్లతద్ది. అట్లతద్దికి ఓ నెలరోజుల ముందు ఉండ్రాళ్లతద్ది వస్తూ ఉన్నా అట్లతద్దిలో ఉన్న ఆనందంపాలు మరికొంత ఎక్కువ. అందుకనే పాలుకారే బుగ్గల పసిపాపల నుంచి పండుముసలి ముత్తైదువల దాకా అట్లతద్ది విషయంలో కొంత హుషారుగా ఉండటం కనిపిస్తుంది. దీనికి కారణం ఈ పండుగ జరుపుకొనే నాటికి ఉండే చిరుచలి వాతావరణం కూడా కావచ్చు. అట్లతద్ది నోము, కథలకు ఉండే ప్రత్యేకతలతోపాటు ఈ పండుగ రోజున ఆటలాడుతూ పాడుకొనే పాటల్లో కూడా తెలుగింటి ఆడపడుచుల చిరునవ్వుల సవ్వడి, సరసాల మువ్వల మాటున రవళించే తెలుగుదనాల పరిమశాలు ఎంతో ఉల్లాసంగా ఉన్నట్టు కనిపిస్తాయి. 
      అట్లతద్ది ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ తదియనాడు జరుపుకుంటారు. అంతకుముందు రోజు వచ్చే విదియనాడు భోగి పండుగ ఉంటుంది. ఉండ్రాళ్లతద్దికి, మకర సంక్రాంతికి ఉన్నట్టుగానే ఈ పండుగకు కూడా భోగిపండుగ ముందుగా వస్తుంది. సంప్రదాయబద్ధంగా మనకున్న వ్రతగ్రంథాలు చంద్రోదయఉమావ్రతం అనే వ్రతాన్ని ఆ రోజున జరుపుకోవాలని దానివల్ల పెళ్లికాని ఆడపిల్లలకు మంచి భర్తలు వస్తారని, పెళ్లైన వారికి సుదీర్ఘకాల సౌభాగ్యం సమకూరి జీవితాలు సుఖమయంగా ఉంటాయన్నది నమ్మకం. చంద్రోదయ ఉమావ్రతం అనే వ్రతమే అట్లతద్ది అనే పేరున విస్తృత ప్రచారంలోకి వచ్చిందంటారు పెద్దలు. ఈ పండుగ పరిధి కూడా అంత సామాన్యమైనది కాదు. అన్ని కులాలవారు దీన్ని జరుపుకుంటారు. అందుకే అష్టాదశవర్ణాలకు అట్లతద్ది అనే నానుడి కూడా బహుళ ప్రచారంలో ఉంది. 
      చంద్రోదయోమావ్రతం అనే నోరుతిరగనంత పెద్దమాట చాలా చక్కగా అందరికీ విషయం అర్థమయ్యేలా అట్లతద్ది అని మారిపోవటంలోనే ఈ పండుగ ప్రత్యేకత, ప్రజాదరణ స్పష్టంగా కనిపిస్తాయి. ఆడపిల్లలంతా తెల్లవారుజాము నుంచి రోజంతా ఎంతో స్వేచ్ఛగా,  సంతోషంగా ఆటలాడుకొనే పండుగ కనుక ఈ పండుగ తదియనాడు వచ్చింది. కనుక మొదట ఇది ఆటల తదియ అయింది. ఆటపాటలన్నీ అయ్యాక చంద్రోదయ సమయాన అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ప్రత్యేకంగా అట్లు ఉంటాయి కనుక అట్లతద్ది అని మారింది. ‘తద్ది, తద్దె’ పదాలు సమానార్థకాలే. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా అంటుంటారు. ఈ రెండు పదాలకు మూలం మాత్రం తదియే. ఈనాటి ఆటల్లో హుషారుగా గెంతటం, పరుగెత్తటం లాంటివి వయస్సు మీదపడిన ముత్తైదువలు చెయ్యకపోవచ్చు కానీ, వయసుకొచ్చిన పిల్లలు, నవవధువులు, ఒంట్లో ఓపిక ఉన్న గృహిణులు మాత్రం సై అంటే సై అంటూ ఆటల కోసం కొంగు బిగిస్తుంటారు. మరీ చిన్నారులు తమ అమ్మలు, అక్కలు లాంటి వారిని చూసి అవన్నీ నేర్చుకొంటుంటారు.
అతివల శోభ
అట్లతద్ది భోగితో కలిపి రెండు రోజులపాటు చేసుకొనే ముచ్చటైన పండుగ. పడతులకు సంపూర్ణతృప్తిని కలిగిస్తూ ఆ సంతోషాల పులకరింతలు ముందు సంవత్సరంనాడు రాబోయే అట్లతద్దిదాకా వారి మనసులలో పదిలంగా ఉంటుంటాయి. మిగతా పండుగల్లో వండి వార్చటం, అందరికీ కావలసినవన్నీ సమకూర్చటంతో ఎక్కువకాలం సరిపోతుంటుంది. కానీ అచ్చంగా ఇది ఆడవారి పండుగే కావటంతో ఆ ఆనందమంతా తమ సొంతమన్న భావన వారి ఎదలోతుల్లో మిగిలి పోతుంది.
పండుగ జరిగే తీరును పరిశీలిస్తే ప్రశాంతంగా, హాయిగా, తీరికగా చంద్రోదయఉమావ్రతం చేసుకోవటానికి కావలసినంత సమయం దొరుకుతున్నట్టుంటుంది. ముందురోజు భోగినాడు తెల్లవారుజాము సమయాన నిద్రలేచి తలస్నానాలు చేసి చద్ది తింటారు. ఇక ఇక్కడ నుంచే సరదాలన్నీ ఒక్కొక్కటిగా ప్రారంభమవుతాయి. ముందుగా చేతులకు గోరింటాకు పెట్టుకొంటారు. గోరు+అంటు+ఆకు గోరుకు అంటుకొనే రంగును కలిగించే ఆకు కనుక గోరింటాకు అయింది. గోరింటాకు దగ్గర నుంచే పండుగలో ఆరోగ్యసూత్రాలు చెప్పకనే చెబుతున్నట్లు మొదలవుతాయి. గోరింటాకు పెట్టుకోవటంవల్ల గోళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. దీనికే నఖరంజని అనే పేరు కూడా ఉంది. ఆయుర్వేదశాస్త్రాన్ని అనుసరించి గోరింటాకు ఆరోగ్యపరిరక్షణకు పనికొచ్చే మంచి వనమూలిక కూడా. భోగినాడు అలా గోరింటాకు పెట్టుకోవటంలాంటి సరదాలు ఆటపాటలతో కాలం గడుపుతారు. ఆ మరునాటి తెల్లవారుజాము సమయానికి చేయవలసిన పనులన్నీ ఒక్కొక్కటి తీరికగా చేసుకుంటూనే ఆటపాటలు, ఉయ్యాల ఊగటం తదితరాలతో కాలం గడిపేస్తారు. తద్దిపండుగలో కొట్టొచ్చినట్టు కనపడే ప్రత్యేకత ఉయ్యాల ఊగటం. ఉయ్యాల ఊపులు శారీరక, మానసిక ఆరోగ్యాలకు, ఉల్లాసానికి దోహదం చేస్తాయి. 
అట్లతద్ది తెల్లవారుజామున తినే అన్నంలో ఉపయోగించే గోంగూరపచ్చడి, నువ్వులపొడి, పెరుగుపచ్చడి, ఉల్లిపాయలు, ఇతర కాయగూరముక్కలు వేసిన పులుసు ఉంటాయి. మరికొన్నిచోట్ల కందిపచ్చడి, పొట్లకాయకూర, పొట్లకాయ పెరుగు పచ్చడి, గోంగూర ఉంటాయి. ఈ ఆహార పదార్థాలు ప్రాంతాలవారీగా ఒక్కొక్క చోట ఒక్కోలా ఉన్నా అవన్నీ స్త్రీల ఆరోగ్యానికి ఉపకరించేవిగా ఉండటమే విశేషం. భోజనం అయిన తర్వాత తాంబూలం వేసుకోవటం తప్పనిసరి. తాంబూలాన్ని ‘విడెము’ అని కూడా అంటారు. దీనిలో ఆకు, వక్క, సున్నం మాత్రమే కాదూ ఇంకా ఎన్నెన్నో రకాల సుగంధ ద్రవ్యాలను కూడా వాడతారు. ఈ తాంబూలానికి మన సాహిత్యంలో అగ్రతాంబూలమే ఉంది. మనుచరిత్రకారులు ఊరక కృతులను రచించమంటే ఎలా? చక్కని రచన చేయటానికి ‘‘నిరుపహతి స్థలములాంటి వాటన్నిటితోపాటు రమణీప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడెము’’ కావాలన్నాడు. అంతే కాదూ ప్రవరుడికి, వరూధినికి నడుమ తొట్టతొలిగా పూలవంతెన వేసిన ఘనత తాంబూలానికే దక్కుతుంది. ఆ రోజుల్లో స్త్రీలు, పురుషులు వేరువేరుగా ఉండే సుగంధ ద్రవ్యాలను తాంబూలంలో వాడుతూ ఉండేవారు. అందుకే అక్కడెక్కడో వరూధిని వేసుకొన్న తాంబూలం తాలూకు సుగంధ పరిమళం ప్రవరుడి ముక్కుపుటాలకు సోకేసరికి ప్రాణం లేచొచ్చినట్లై తన ఇంటికి దోవదొరికినట్లేనని అనుకున్నాడు. అలా ఆ ఇద్దరినీ అక్కడ కలిపిన ఘనతను తాంబూలానికే ఇచ్చి ఇక మీ ఇష్టం, మీరు తన్నుకుంటారో ఏం చేస్తారో నాకనవసరం అన్నట్టు పెద్దన తన పెద్దరికాన్ని అలా నిలుపుకున్నాడు. ఈ పండుగలో కనిపించే గోరింటాకు తాంబూలాలకు ప్రత్యేకత ఏమంటే చెయ్యి ఎంతగా ఎర్రగా పండితే, నోరు మరెంత పండితే అంత మంచి మెగుడు వస్తాడన్నది సరసంతో కూడిన ఓ నమ్మకం.
తాంబూలాల పండుగ
అట్లతద్దిలో తాంబూలం అన్నం తిన్న తర్వాత ఒక్కసారి మాత్రమే వేసుకోరు. పగలంతా దాదాపు ఓ పది తాంబూలాలు నములుతూనే ఉంటారు. ఎందుకంటే తెల్లవారుజామున తిన్న అన్నం తర్వాత పగలంతా ఉపవాసం ఉండి చంద్రోదయం అయ్యాక వ్రతాన్ని పూర్తి చేసుకొని ముత్తైదువులకు వాయనాలిచ్చి భోజనం పెట్టి ఆ తర్వాత మాత్రమే అన్నం తినాలి. ఈ లోపున నోరు ఎండిపోకుండా సుగంధ పరిమశాల మధ్యన ఆ తాంబూలం నములుతున్న జవ్వని జాజిమొగ్గలా సంతోషాల రేకులు విచ్చుకుంటూ తోటివారితో కులాసాగా కాలం గడుపుతుంది. పగలంతా పాటలు పాడుతూ ఆటలాడుతూ, ఉయ్యాల ఊగుతూ సాయంత్రానికి వ్రతం ముగిస్తే ఎంతో మేలు జరుగుతుందన్నది నమ్మకం. ఆ మేలేమిటంటే పెళ్లి కాని ఆడపిల్లలకు అందమైన మేటిగాడైన మొగుడు వస్తాడు. పెళ్లైన స్త్రీలకైతే మొగుడు ఎటూ వచ్చాడు కనుక ఆ సంసారం సుఖవంతంగా ఉంటూ పదికాలాలపాటు ఆ ఇల్లాలు పిల్లాపాపలతో, భర్త ప్రేమానురాగాలతో సౌభాగ్యవతిగా చిరకాలం వర్థిల్లుతుంది.
      వ్రతగ్రంథాలు మాత్రం నియమాలను పాటించే విషయంలో అంటే తెల్లారగట్ట గోరింటాకు పెట్టుకోవటం, అన్నం తినడం, తాంబూలం వేసుకోవటం, ఉయ్యాల ఊగటం, చంద్రోదయఉమావ్రతాన్ని అంటే గౌరీ దేవి పూజను చేశాక రాత్రికి అన్నం తినటం లాంటివన్నీ కచ్చితంగా నియమం ప్రకారం చెయ్యాలంటున్నాయి. ఈ నియమాలలో లోపం జరిగితే ముసలి మొగుడు రావటం తప్పదు అనే భయాన్ని హెచ్చరికగా చేసి అట్లతద్ది వ్రతకథ ఆడపిల్లలను నియమం తప్పవద్దంటోంది.
      ఇవన్నీ వ్రతానికి సంబంధించిన పూర్వాపరాలు. అయితే అట్లతద్దిలో వినిపించే పాటలు, ఆటలు అన్నీ ఆడపిల్లలకు ఆరోగ్యసూత్రాలను నేర్పించకనే నేర్పిస్తున్నట్టుంటాయి. ఈ పండుగనాడు ఏ ప్రాంతంలోనైనా వినిపించే మొదటిపాట ‘‘అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌ చప్పట్లోయ్‌ తాశాలోయ్‌ దేవుడి గుళ్లో మేశాలోయ్‌ పప్పూ బెల్లం దేవుడికోయ్‌ పాలు నెయ్యి పాపాయికోయ్‌.....’’ అనేది. ఈ పాటలో పైపైకి చూస్తే అట్లతద్ది సంబరాన్ని చప్పట్లతో తెలియచెప్పినట్టు కనిపిస్తుంది. పాటలోని ఆరట్లు, ముద్దపప్పుతో కూడిన మూడట్ల సంగతి కొస్తే అట్టు వెయ్యటానికి ఉపయోగించే వాటిలో మినప్పిండి, బియ్యపిండిల మిశ్రమంతో తయారైన అట్లు రుచికరంగా ఉండటమేకాదూ స్త్రీల ఆరోగ్యానికి ఔషధంలా ఉపయోగపడతాయి. అలాగే ఋతుక్రమం సరిగారాని స్త్రీలలో ఆ సమస్య పోతుంది. గర్భధారణలో సమస్యలు రావు. ఆరోగ్యసూత్రాలతోపాటు ఈ అట్లలో జ్యోతిషశాస్త్ర సంబంధమైన వ్యవహారం కూడా ఉందని పెద్దలు చెబుతారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. వీటి మిశ్రమంతో తయారయ్యే అట్లనే అమ్మవారికి నైవేద్యం పెట్టడం, ముత్తైదువులకు వాయనాల రూపంలో ఇవ్వటం వల్ల ఆ గ్రహదోషాలుపోయి వాయనాలిచ్చిన స్త్రీలు పిల్లాపాపలతో, సంసార సుఖంతో సౌభాగ్యవతులుగా ఉంటారన్నది నమ్మకం.
      ఈ అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ పాటలోని చరణాలు ప్రాంతాల వారీగా ఆర్థికస్థితిగతుల నేపథ్యంలో పేద, ధనిక వర్గాల వారీగా కొద్దిపాటి మార్పులతో వినిపిస్తుంటుంది.
చెమ్మ చెక్క... చేరడేసి మొగ్గ
అట్లతద్ది పాటల్లో ఆరోగ్యరక్షణకు సంబంధించిన సూచనలు వినిపించే పాటల్లో అందరికీ తెలిసిన పాట మరొకటి ఉంది.
      ‘‘చెమ్మచెక్క చారెడేసి మొగ్గ అట్లుపోయంగా, ఆరగించంగా, ముత్యాల చెమ్మచెక్కా ముగ్గులేయంగా, రత్నాల చెమ్మచెక్కారంగులేయంగా, పగడాల చెమ్మచెక్క పందిరేయంగా చూసి వద్దాం రండి సుబ్బరాయుడి పెళ్లి మా వాళ్లింట్లో పెళ్లిమళ్లీ వద్దాం రండి’’ ఈ పాటలో ఔషధాల ప్రస్తావన ఉంది. అంతేకాదు ఆ ఔషధాల విషయాలు తెలిసినా తెలియకపోయినా ఈ పాట పాడుతూ ఆటలాడుతారు ఆడపిల్లలు. పాటతోపాటు తమ రెండు చేతుల్నీ బాగా వెనక్కి లాగి వేగంగా ముందుకు తెచ్చి ముందున్న పిల్ల అరచేతుల మీద తమ అరచేతులతో కొడతారు. ఇది ఓరకంగా ఇటీవలికాలంలో ప్రచారంలో కొచ్చిన ‘‘ఆక్యుప్రషర్‌’’ వైద్య విధానానికి దగ్గరగా ఉండే ప్రక్రియ. దానికి ఆ పేరు ఉందని తెలిసినా తెలియకపోయినా మనవాళ్లు ఆనందంతో చప్పట్లు కొట్టడం, పొద్దున్నే భజనచేస్తూ నగర సంకీర్తన చేయడం, ఇలా చెమ్మచెక్కలాడటం లాంటివన్నీ ఏ నాటి నుంచో చేస్తూనే ఉన్నారు. ఇలా చేయటం వల్ల ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. దాంతో ఊపిరితిత్తుల సంబంధంగా వచ్చే వ్యాధులు రావు. అంతేకాదూ చేతుల్ని బలంగా, వేగంగా ముందుకు, వెనుకకు కదుపుతూ ఉండటం, కాళ్లను పాటకు తగ్గట్టుగా నేలకు బలంగా అదుముతూ ముందుకూ వెనుకకు గెంతుతూ ఉండటం వల్ల శారీరకంగా మంచి వ్యాయామం లభిస్తుంది. ఇదే పాటలో పెళ్లైన స్త్రీలకు నూకలిస్తే మూకలు (సంతానం) ఇచ్చే నాగేంద్రుడి రూపంగా సంతానప్రదాతగా చెప్పుకొనే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పెళ్లి ప్రస్తావన ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడిని సుబ్బారాయుడు అని అంటుంటారు. వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి కల్యాణం చేయటం సర్వశుభప్రదం, సంతానప్రదమూ అన్నది నమ్మకం. ఆ సుబ్బరాయుడి పెళ్లికి చక్కగా పందిళ్లు వెయ్యటం, ముగ్గులు పెట్టడంలాంటి సేవలు చెయ్యడం స్త్రీలకు సౌభాగ్యప్రదం. ఆ విషయాన్ని ఈ పాట నేర్పుతుంది. అసలీ పాటలోని మొదటి పదం ‘‘చెమ్మచెక్క చారడేసి మొగ్గ అట్లుపోయంగ ఆరగించంగా’’ అనే దానిలోనే స్త్రీల ఆరోగ్యరక్షణకు సంబంధించిన ఔషధ విషయం కనిపిస్తుంది. చెమ్మచెట్టు అనే కూరగాయమొక్క ఒకటుంది. ఈ విషయాన్ని సంపూర్ణాంధ్ర నిఘంటువు, శబ్దార్థచంద్రిక కూడా పేర్కొంటోంది. చెమ్మకాయ అనేది వృక్షలతాది వాచకమని, కూరగాయ, ఒక జాతి చిక్కుడుకాయలాంటి కాయ అని, ఒక దినుసు అని దేశీయ విశేషంగా చెమ్మకాయకు అర్థాలను చెబుతోంది. చెమ్మకాయ అనే పేరుగల కూరగాయతో అట్టుపోసుకొని తింటే ఋతు సంబంధదోషాలు పోతాయన్నది ఆయుర్వేద వైద్యులు చెబుతున్న మాట. అలాగే చెమ్మకాయ చెక్కతో పాటు రత్నం, పగడం లాంటి వాటికి ఆయుర్వేదంలో వైద్యశాస్త్ర రీత్యా గొప్పస్థానం ఉంది. వీటిని మందుల్లో వాడుతుంటారు.
      ఆ తర్వాత కనిపించే పాట ‘‘కాశ్ళా గజ్జి కంకాళమ్మా వేగూచుక్కా వెలగామొగ్గ మొగ్గా కాదూ మోదుగ బావి నీరుకాదూ నిమ్మల వారీ’’ అనేది. ఇది చాలా పసితనంలో ఉన్న పిల్లలు సహితం తేలికగా ఆడుకొనే ఆట. దీంట్లో కూడా చర్మవ్యాధి చికిత్స విధానాలు దాగి ఉన్నాయి. అట్లతద్ది అంటే మొదటిగా చేతులకు కనిపించేది గోరింటాకు. అది గోళ్లతోపాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఈ పాటలో కూడా ఓ అద్భుత ఔషధీ విలువలున్న ఆకు గురించిన ప్రస్తావన ఉంది. పాట మొదటి పాదంలో కాశ్ళాగజ్జి అంటే కాళ్లకు వచ్చే గజ్జి అనే కానీ గజ్జెలు అనే అర్థంలో అలంకార విశేషం మాత్రం కాదు. కంకాలమ్మ అనే పదం కంకోలం అనే పదానికి ప్రతిరూపం. కంకోలం అనే ఆకును గంగగారపాకు అని కూడా అంటారు. ఈ ఆకుని కూడా గోరింటాకును రుబ్బినట్టే రుబ్బి కాళ్లకు గజ్జి ఉన్నచోట రాస్తారు. అప్పటికీ నయం కాకపోతే లేత వెలగకాయలోని గుజ్జును తెల్లారగట్ల రాస్తారు. అయినా తగ్గకపోతే మోదుగచెట్టు ఆకులను రుబ్బి రాస్తారు. వ్యాధి తగ్గుముఖం పడుతుందని గమనించినప్పుడు పలుచగా చేసిన నిమ్మరసాన్ని రాస్తారు. వ్యాధి తగ్గుముఖం పట్టే సమయంలో నిమ్మరసం పని చేసినట్టే గుమ్మడిపండులోని గుజ్జు కూడా బాగా పనిచేస్తుందని వైద్యశాస్త్ర సంబంధ చిట్కాలను చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆటపాటల రూపంలో మనవాళ్లిలా నేర్పించమని చెప్పారు.
ఇలా ఎన్నెన్నో అట్టతద్ది పాటలు ఆరోగ్య నేపథ్యంలో ఉన్నట్టు కనిపిస్తాయి. ఆరోగ్యంతోపాటు ఆనందం, ఉల్లాసం సమ్మిళితమై ఉండే పాటలు కూడా అట్లతద్ది పాటల్లో ఉన్నాయి. వీటిలో వరసైన వారితో సరసాలాడటం, చిలిపి మాటలతో ఆటపట్టించడం, పొడుపు కథల మాటున ఆశ్చర్యకరంగా విడుపులను ఉంచటం లాంటివెన్నో ఉన్నాయి. ఈ పాటలు పాడుతూ పెద్దపెద్ద చెట్లకు కట్టిన ఉయ్యాలలో తూగుటుయ్యాలూగుతూ పొందే ఆనందం ఆంధ్రదేశాన కేవలం అతివల సొంతం. నవవధువును ఉయ్యాల ఎక్కించి ఊపుతూ మొగుడి పేరు చెప్పమని అన్నప్పుడు ఆమె బిడియపడుతూ ఉంటుంది. బిడియంతో బిగిసిన కొద్దీ ఊపుజోరు పెరుగుతుంది. ఆ జోరు తట్టుకొనేందుకు ఆమె ముసిముసిగా నవ్వుతూ మొగుడి పేరు చెబుతుంది. అప్పటికి కానీ ఉయ్యాల ఊపు తగ్గి ఆ యువతి నేలకు దిగటానికి అవకాశం కుదరదు.
ఒకరికి చేతులిచ్చి... ఒకరికి కాళ్లనిచ్చి
మరో సరసాల పాట కూడా ఉంది. ఇది ఓ బావ, మరదలకు నడుమ జరిగే సంవాదం. మరదలు తన బావను ఉడికించటానికి ‘‘ఒకరికి చేతులిచ్చి ఒకరికి కాళ్లనిచ్చి ఒకరిని చేతబట్టి కూకున్నానోయ్‌ బావ కూకొన్నానోయ్‌’’అని మరదలన్నప్పుడు వాళ్లంతా ఎవరో చెప్పు అని బావ ఆత్రంగా అడిగినప్పుడు ‘‘గాజులకు చేతులిచ్చి కడియాలకు కాళ్లనిచ్చి డబ్బును చేతపట్టికూకున్నానోయ్‌ బావ కూకున్నానోయ్‌’’ అంటూ సమాధానం చెబుతుంది ఆ కొంటె మరదలు. ఇలా సరదాగా ఆ ప్రశ్నలు, జవాబుల పరంపర సాగుతూ వినేవారికి ఆనందాన్ని, దానితోపాటు తెలుగుభాషా వైభవాన్ని, శ్లేషాలంకారం చమత్కారాలను కూడా ఇలాంటి పాటలు కలిగిస్తుంటాయి. అనుకోవటానికి ఇవేవో అట్లతద్ది నాటి ఆడపిల్ల పాటలు అని ఎవరైనా తేలికగా అనుకొంటే పొరపాటే. ఈ పాటల్లో ఆరోగ్యం, సంప్రదాయం, పురాణకథలు, పదాల విరుపుల మెరుపులు, అలంకారాల సొగసులు అన్నీ సమకూరి ఉంటాయి. అందుకే అట్లతద్ది నోము గౌరీమాత అనుగ్రహాన్ని ప్రసాదిస్తే ఆ సంబంధంగా వినిపించే పాటలు తెలుగుతల్లి మెడలోని రత్నహారాల్లా భాసిల్లుతుంటాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం