నిన్ను నిన్నుగా ప్రేమించుటకు...

  • 1367 Views
  • 4Likes
  • Like
  • Article Share

ఓ పాట... నిజమైన ప్రేమకు నిర్వచనమిస్తుంది. మనిషిని మనిషిగా అభిమానించడమంటే ఏంటో చెబుతుంది. ఒకరికి తోడుగా నిలవడమంటే ఎంతటి బాధ్యతను భుజానికెత్తుకోవడమో స్పష్టం చేస్తుంది.  అనుబంధాలు పెళుసుబారుతున్న ఈ రోజుల్లో ఆ గీత సాహిత్యాన్ని మననం చేసుకోవడం సముచితం. 
కిక్కిరిసిపోయిన
రైలు బోగీ లాంటిది మనసు. అడుగడుగునా ఏవో అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు...! బతుకు మజిలీల లోతుల్లో కొన్ని ఇంకిపోతుంటాయి. ఆ ఖాళీలను నింపడానికా అన్నట్లు ఎక్కడెక్కడి నుంచో కొత్తవి కొట్టుకొస్తాయి. వీటన్నింటి మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతూ... ఈ గందరగోళంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ మనిషి సాగిపోతుంటాడు! ఈ ఒంటరి ప్రయాణంలో ఇంకెవరైనా తనకు తోడవుతారేమోనని అప్పుడప్పుడూ ఆశపడుతుంటాడు. కాలం కలిసివచ్చి కల నెరవేరితే... ఇక ఆ ప్రయాణం వసంత వనాల్లో వెన్నెల విహారమవుతుంది. మది ఊసుల్లో ఎప్పటికీ కరిగిపోని కమ్మని గుర్తవుతుంది. జీవితమిలా మధుర జ్ఞాపకాల మణిపూస కావాలంటే, తోడు దొరకాల్సింది మనిషికి కాదు. అతని మనసుకు! మరి ఎలాంటి తోడు ఆ మనసును మురిపిస్తుందో... జీవితప్రయాణ బడలికను మరిపిస్తుందో చెప్పే గీతమే ‘మనసున మనసై’! అభ్యుదయ కవి శ్రీశ్రీ మనసులో మాట అయిన ఈ గీత సాహిత్యం... బతుకుపాఠాల ఊటబావి.
      అన్నట్టు, ‘కొ కొ కొ రా కో’... తెలుసా? ‘‘ప్రజలకు కథలు చదివే రుచి చూపించి, అలవాటు చేసి, దాన్ని ఒక వ్యసనంగా పెంచి- పుస్తకాలు కొనుక్కుని, తిట్లు తిని, దిండు కింద దాచుకుని చదివి ఆనందపడేలా చేసిన కర్మవీరులు, కార్యశూరులు నలుగురైదుగురు ఉన్నారు’’ అని చెప్పారు ముళ్లపూడి వెంకటరమణ తన ఆత్మకథ ‘కోతికొమ్మచ్చి’లో. ఎవరండీ ఆ మహానుభావులు అని అడిగితే... ‘కొ కొ కొ రా కో’ అని సమాధానమిచ్చారు! అంటే... కొవ్వలి లక్ష్మీనరసింహారావు, కొడవటిగంటి కుటుంబరావు, కొమ్మూరి సాంబశివరావు, రాధాకృష,్ణ కోడూరి కౌసల్యాదేవి! వీళ్లలో ‘కో’ సృష్టించిన నవలా ప్రభంజనం ‘చక్రభ్రమణం’. మానవ అనుబంధాల లోతులను తడిమిన రచన ఇది. దీన్ని 1961లో, ‘ఆంధ్రప్రభ’ పత్రిక ఉగాది పోటీల కోసం రాశారు కోడూరి కౌసల్యాదేవి. అప్పట్లో ఆమె వయసు పందొమ్మిదేళ్లు. ‘చక్రభ్రమణం’ తన మొదటి నవల. అయితేనేం... అదే మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. తర్వాత పత్రికలో ధారావాహికగా వచ్చింది. విశేష పాఠకాదరణ పొందింది. కొన్నాళ్లకు ‘డాక్టర్‌ చక్రవర్తి’గా వెండితెర మీద ఆవిష్కృతమైంది. ఆ చిత్రం విడుదలై ఇప్పటికి యాభై ఒక్క ఏళ్లు! కానీ, అందులోని పాటలు ఇంకా జనం నోళ్లలో నానుతూనే ఉన్నాయి. వాటిలో ఒకటి... ‘మనసున మనసై’. 
      చిత్రంలో ఈ పాటకు ముందు సన్నివేశం... ఆ రోజు డాక్టర్‌ చక్రవర్తి భార్య నిర్మల పుట్టినరోజు. వేడుక జరుగుతుంటుంది. ఆ సమయంలోనే చక్రవర్తి స్నేహితుడు రవీంద్రకు ప్రాణం మీదకువస్తుంది. అతని భార్య మాధవి వచ్చి చక్రవర్తి సాయం కోరుతుంది. తన వృత్తిధర్మం మేరకు అతను వెంటనే బయల్దేరుతాడు. రవీంద్రను రక్షించి ఇంటికి వస్తాడు. ఇక్కడ చిర్రుబుర్రులాడుతూ ఉంటుంది  నిర్మల. పండుగనాడు కూడా రోగుల గోలేనా అని ఈసడించుకుంటుంది. ప్రాణాపాయంలో ఉన్నవారికి వైద్యం చేయడం నా బాధ్యత అని చక్రవర్తి చెప్పినా వినిపించుకోదు. వేడుక మధ్యలోంచి వెళ్లి, స్నేహితుల మధ్యలో నాకు తలవంపులు తెచ్చారంటూ పరుషంగా మాట్లాడుతుంది. ఆమె మాటలకు చక్రవర్తి ఖిన్నుడవుతాడు. భార్య తన మనసును అర్థం చేసుకోవట్లేదనే బాధతో... ‘తగిన తోడు’ ఉంటే జీవితం ఎంత బాగుంటుందో తనకు తాను చెప్పుకుంటాడు. అతని గుండెఘోషే పాటగా మారి ఇలా ప్రవహిస్తుంది...
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
ఆశలు తీరని ఆవేశంలో ఆశయాలలో 
ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే 
కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
చెలిమియె కరవై వలపే అరుదై
చెదిరిన హృదయమే శిలయై పోగా
నీ వ్యథ తెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము

      చాలామంది ఈ గీత సాహిత్య సృష్టికర్త ఆత్రేయ అనుకుంటారు! ఎందుకంటే, ఆయన ‘మనసు కవి’ కదా మరి! ఆత్రేయకు ఆ బిరుదు ఉన్న మాట నిజమే కానీ, ఈ గీతం మాత్రం ఆయనది కాదు. నరనరాన్ని మెలిపెట్టి మరీ కర్తవ్యబోధ చేసే శ్రీశ్రీ కలమే ఈ పాటకు ప్రాణం పోసింది. హిందుస్థానీ రాగం ‘జయజయవంతి’లో సాలూరి రాజేశ్వరరావు ఈ పాటను స్వరపరిచారు. ఘంటసాల ఆర్ద్రంగా ఆలపించారు. అయితే, ఈ గీతాన్ని అజరామరం చేసింది మాత్రం శ్రీశ్రీ సాహిత్యమే. చిన్న చిన్న మాటల్లో బరువైన భావాన్ని కూర్చడం ఆ మహాకవికి కొత్తేమీ కాదు. రక్తాన్ని మరిగించే మహాప్రస్థానాన్ని గానం చేసిన ఆయన... హృదయ తంత్రులను వేణువులా మీటే పాటకు అక్షరాలందివ్వడమే ఇక్కడి విశేషం. ఆ సవ్యసాచిత్వం ఆయనకే సాధ్యం. 
      రెండే రెండు పదాలతో పల్లవిని ప్రారంభించిన శ్రీశ్రీ... వాటితోనే ‘తగిన తోడు’కు నిర్వచనం ఇచ్చేశారు. నూనెకు నీరెప్పుడూ తోడు కాలేదు. రెండింటినీ బలవంతంగా కలిపినా దేని దారి దానిది అన్నట్లుగానే ఉంటాయి. మనుషులూ అంతే. మనసులు అతకనప్పుడు... భుజాలు రాసుకుని తిరిగినా బంధాలు బలపడవు! అదే మనసులు రెండూ పాలూ పంచదారలైతే... జీవితం మధురాతి మధురమవుతుంది. మనసున మనసవడం అంటే ఇదే. మరి ‘బ్రతుకున బ్రతుకవడం’ అంటే? ఒకరి జీవితం... మరొకరి జీవితంలో ప్రతిబింబించడం! జోడీకట్టిన జంట హృదయాలు ‘నువ్వు-నేను, నాది-నీది’ అన్న సంకుచిత పరిధుల్లోకి ఇరుక్కుపోనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అర్థం చేసుకుని... జీవితంలో తోడూనీడగా నడిచే వ్యక్తి దొరకడం కన్నా భాగ్యం ఇంకేముంటుంది? అన్యోన్యతే శ్వాసగా మార్చుకున్న జీవితాలకు, తమ అనుభవాలకు మించిన స్వర్గాలెక్కడ ఉంటాయి? 
      ఆశ నిరాశల వెల్లువలో తెరచాపలా దారిచూపడం, ఆశయాల అధిరోహణలో చెయ్యందివ్వడం, గుండెను పిండే ఆవేదనను అనునయించడం... తోడుగా నిలవడమంటే ఇదే. అన్నింటికన్నా ముఖ్యంగా... లోకమంతా వెలివేసినా సరే, పట్టుకున్న చేతిని విడవకపోవడం! అలాంటి తోడునే కోరుకుంటున్నాడు కవి. 
      రెండో చరణంలో శ్రీశ్రీ ప్రతిపాదించిన ‘షరతుల్లేని ప్రేమ’ ఉదాత్తమైంది. ‘‘అలరిన నాలో అంతర్యామివి/ కలుష మెడయ నను గాతువు గాకా’’ అంటాడు అన్నమయ్య ‘దీనుడ నేను దేవుడవు నీవు’ కీర్తనలో. అంటే... ‘నాలో అంతా నువ్వే నిండిపోయావు. కాబట్టి, నా పాపపుణ్యాలకు అతీతంగా నన్ను దగ్గరికి తీసుకో’ అని! ఒక మనిషిని ప్రేమిస్తున్నామూ అంటే వారి లోపాలనూ ఇష్టపడాలి. బలాన్ని మోహించి, బలహీనతను ఈసడించే ప్రేమ నిజమైంది కాదు. అలాంటి ప్రేమ వల్ల అవతలి హృదయానికి సాంత్వన దొరకదు. ‘నీ ఆనందాన్ని నాకివ్వు... నీ కన్నీళ్లను మాత్రం నువ్వే ఉంచుకో’ అనే తోడు ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఉండదు!  ఎదుటి వారి కన్నీటికి తన కంటిని అరువిచ్చే మనిషి తోడు... మండుటెండలో మురిపెమైన చెట్టు నీడ లాంటిది! తోడన్నది అలాగే ఉండాలన్నది శ్రీశ్రీ అభిలాష.
      లోకంలో చాలామంది లెక్కలేసుకుంటూ బతుకుతారు. సూత్రాల ప్రకారమే చేతులు కలుపుతారు. నవ్వులు రువ్వుతారు. వాళ్ల లెక్కల్లో ఏమాత్రం తేడా వచ్చినా, పట్టుకున్న చేతిని నిర్దయగా విసిరికొడతారు. అలాంటి వాళ్లు ఎంతమంది ఈసడించుకున్నా సరే, దెబ్బతిన్న గుండె పగిలిపోకుండా కవచంలా కాపుగాసేదే నిజమైన తోడంటే! శ్రీశ్రీ అదే చెప్పారు... మూడో చరణంలో! మొత్తమ్మీద శ్రీశ్రీ చెప్పిన ఈ ‘తగిన తోడు’... ఒక్క భార్యాభర్తల బంధానికే పరిమితం కాదు. తండ్రీబిడ్డలు, అన్నాదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు, స్నేహితులూ... ఇలా ఎవరి మధ్య అయినా సరే, ఇలాంటి అనుబంధం ఉంటే అది ఇలలో స్వర్గానికి నిచ్చెనలు వేసేదే!


వెనక్కి ...

మీ అభిప్రాయం