సదువునీదే సామునీదే గననాతా

  • 324 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

జానపదుల భక్తి గీతాల్లో వినాయకుడి స్తుతి శిష్టసంప్రదాయానికి కాస్త భిన్నంగా ఉంటుంది. భాషలోనూ, భావంలోనూ, అభివ్యక్తిలోనూ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. పల్లెవాసుల జీవనశైలికి తగ్గట్టుగా వారి జీవితానికి అతి సామీప్యమున్న వ్యక్తిగా గణపతి, సాంప్రదాయిక పూజా క్రతువుల్లో విలక్షణతను కలిగి ఉంటాడు. ఈ నేపథ్యంలో జానపద కళారూపాల్లో ముఖ్యంగా నాట్యరీతుల్లో, పాటల్లో గజాననుడి స్తుతి ఎలా సాగిందీ! ఆ ఆత్మీయ ఆరాధన ఎలాంటిదో చూద్దాం. 
భక్తి
అంటే కొలుపు. భగవంతుడితో స్నేహం. దైవానికి చేరువకావడం కోసం పాటనొక సాధనంగా చేసుకోవడం శిష్టసంప్రదాయంలో ఉన్నట్టే జానపదుల్లోనూ ఉంది. అయితే జానపదుల పూజలూ, క్రతువులూ, పండగలు విలక్షణంగానూ వైవిధ్యంగానూ ఉంటాయి. పల్లీయుల పాటల్లో భగవంతుడు చాలాసామాన్యమైన పాత్ర పోషిస్తాడు. జానపదుల్లో తానూ ఒకడిగా మారిపోతాడు. అలౌకిక భావన లేకుండా, అతీంద్రియ శక్తియుక్తులు ప్రదర్శించకుండా గ్రామీణుల కష్టసుఖాల్లో సమంగా భాగం పంచుకోవడం వల్ల దైవారాధనలో సరళత కనిపిస్తుంది. 
      జానపదుల భక్తిలో భజనలకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. భజన పాటల్లో ఒక నిబద్ధత, నిష్ఠ కనిపిస్తాయి. తరంగాలు, తాళాలు, చిఱుతలు, కోపులు, కరతాళాలు, తప్పిడి కుండలు ఇలా జానపదుల భజన విభిన్న రూపాల్లో కొనసాగుతుంది. ఇలాంటి భజన కార్యక్రమాల్లో గణపతి ప్రార్థన చాలా కీలకం. పర్వదినాల్లో గణపతి పీఠానికి ఎదురుగా కూర్చుని కరతాళాలు పట్టుకుని భజన చేస్తారు. సంగీత సాహిత్యాల్లో అనుభవం ఉంటేనే ఈ భజన రక్తికడుతుంది. ఎందుకంటే ఒక తాళం నుంచి మరొక తాళానికి మారుస్తూ ఒకే కీర్తనలో వైవిధ్యాన్ని సాధిస్తారు.
ఇభరాజవదన పార్వతీ పరమేశనందనా 
పరమేశనందనా భక్తసుచందనా  ।।ఇభరాజ।।
ఫాలాక్షసుతుడని నిన్ను నే పాటలు పాడితి
నిను కొనియాడితి               ।।ఇభరాజ।।
శరణన్న జనులను మరువక రక్షించువాడవు
రక్షించువాడవు పోషించువాడవు  ।।ఇభరాజ।।
జయ విజయ నగరీ పురిగౌరీవరకుమార
కరిముఖ నీపేరా కరుణతో ప్రోవరా 
।।ఇభరాజ।। 

      ఇలా జానపదుల భజనగీతాల్లో కొంత మార్గ కవితాధోరణి కనిపిస్తుంది. అక్కడక్కడ సంస్కృత పదాడంబరమూ ఉంటుంది. అయితే, ఇది భజన గీతాల్లో మాత్రమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది తప్ప వ్యవసాయ నేపథ్యంగా పాడుకునే పాటల్లో ఇంత క్లిష్టత ఉండదు.
ఊడ్పులకు ఊతగా
పల్లెల్లో తొలకరికి వరినాట్లు ఊపందుకుంటాయి. గ్రామాలన్నీ జలకళతో నిండిపోతాయి. వరినాట్ల సమయంలో పనిలో శ్రమ తెలియకుండా ఉండటం కోసం పాటలు పాడుకోవడం పల్లెల్లో ఇప్పటికీ చూడొచ్చు. ఇలా పాడుకునే పాటలని ఊడ్పుపాటలని అంటారు. ఊడ్పుల ప్రారంభంలో గణపతిని స్తుతించడం జానపదుల ఆచరణలో భాగం. మట్టితో గణపతి బొమ్మను చేసి, మందారపూలను గుచ్చి పసుపు కుంకుమతో అర్చించి.. ధూప దీప నైవేద్యాలతో పూజించిన అనంతరం ఇలా పాడుకుంటూ ఊడ్పు (వరినాట్లు వేయడం) ప్రారంభిస్తారు. 
గనపతయ్య 
గనపతయ్య
ఉండ్రాళ్లు నీకు పోతుమురా
ఓ గనపతయ్య
మందకొడిగా వుండబోకురా
గనపతయ్య
గనపతయ్య
జమ్మిపత్రి పూజసేతురా
ఓ గనపతయ్య
మనసునిండా పూజసేతురా
ఓ గనపతయ్య
మమ్ము ఎపుడూ మరువబోకురా!

      ఇలాంటి పాటలెన్నింటినో సేకరించి ఎల్లోరా తన ‘జానపద గేయాలు’ సంకలనంలో భద్రపరిచారు.
      పురాణాల్లో దేవతల రూపురేఖలన్నీ ప్రతీకాత్మకంగా ఉంటాయి. వినాయకుడి రూపం కూడా అలాంటిదే. సమస్త దేవతలందరిలో ప్రథమ పూజలందుకునే అధినాయకుడు వినాయకుడు. సాధించదలచుకున్న కార్యం నిర్విఘ్నంగా కొనసాగడానికి గణపతిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. గణపతి ఆరాధనలోని లక్ష్యం ఒకటే అయినా పూజావిధానాల్లో వైవిధ్యముంది.
      రాయలసీమలో జ్యోతిని వెలిగించి నెత్తిమీద పెట్టుకుని నృత్యం చేస్తూ చౌడమ్మ దేవతను ఆరాధిస్తారు. దీన్నే జ్యోతి నృత్యమని, జ్యోతుల బోనాలని పిలుస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే జరిపే ఈ నృత్యంలో కంచుతో చేసిన తాళాలకి సాయంగా చేతులతో చప్పట్లు కొడుతూ పాటకు తగ్గట్టుగా తాళగతిని మారుస్తుంటారు. ఒకరు జ్యోతిని ఎత్తుకుని నట్టనడుమ నిలబడి పాటకనుగుణంగా, చుట్టూ వృత్తాకారంగా నిలబడి ఉన్నవారంతా అడుగులు మారుస్తూ తిరుగుతారు. 
పార్వతీ పుత్రుని పరమేశ్వరుని సూడ
ఎలుక వాహనమెక్కి వెళ్లే తన వేడ్క
అమరంగ బెనకయ్యను ఆత్మలో తలచేరు

సంతోషమున కల్గు సకల జనులకును అంటూ ఈ చౌడమ్మ జాతరని గణపతి ప్రార్థనతోనే ప్రారంభిస్తారు.  
      జానపద నృత్యాల్లో కోలాటానికి విశిష్టమైన స్థానముంది. ఇది జడకోలాటమూ, నృత్యకోలాటమూ అని రెండు రకాలుగా ఉంటుంది. నృత్యకోలాటంలో చిడతలను వాయిస్తూ, అడుగులు లయాత్మకంగా వేస్తూ, అంగవిన్యాసం చూపిస్తూ స్త్రీ పురుషులు నాట్యం చేస్తారు. కోపులు అనేది కూడా కోలాటంలో ఒక భాగం. ఇది కొంచెం శ్రమతోకూడిన నృత్యం కూడా. వేపకర్రలు కానీ, పాల కర్రలు కానీ, చిడతలు కానీ పట్టుకుని చేసే ఈ నృత్యం చూడటానికి ముచ్చటగా ఉంటుంది. ఈ కోపుల భజనలు కూడా గణపతి ప్రార్థనతోనే ప్రారంభమవుతాయి.
శివశివ మూరితివి గననాతా నువ్వు 
శివునీ కుమారుడవు గననాతా       ।।శివ।।
బుద్దినీదే బుద్దినీదే గననాతా
ఈ జగతి గొలుచు దేవుడవు గననాతా ।।శివ।।
సదువునీదే సామునీదే గననాతా

సారస్వతి నీకు దండం గననాతా... అంటూ సాగే ఈ పాటను గణపతి స్తుతిగా తాలుపుగట్టే కోపుల్లో కడపజిల్లా జానపదులు పాడుకుంటారు.
      నవవిధ భక్తిమార్గాల్లో కీర్తనం ఒకటి. అంటే పాటల ద్వారా పరమపథానికి బాటలు వేయడం. జానపద భక్తిసాహిత్యమంతా ఏలలు, దరువులు, భజనలు, కొరంజి, యక్షగానాలు లాంటి కళారూపాలతో కూడుకుని ఉంటుంది. నృత్యానికి తగినట్టుగా పాటలను సృష్టించుకుని విలక్షణమైన రాగ తాళాలతో వాటిని కార్యరూపమివ్వడంలో జానపదులు తమ జీవితాంశాలనే ఇతివృత్తంగా చేసుకుంటారు.
రావయ్య గణనాయకా మము
కావవే గణనాయకా
విద్యలకు ఆదివయ్య వేద్యశ్రీ గణనాయక..  
       ।।రావయ్య।।
ఎలుక వాహనమెక్కేవయ్య 
ఏకదంతము గలవాడవయ్య
సాంబశివపుత్రుడవయ్య! 
స్వామిశ్రీ గణనాయక             ।।రావయ్య।।           
తొండముతో నీళ్లుదీసి 
తోరంపు బొజ్జగడిగి 
నిండుమోదముతోడ నుండు 
నిర్మలా గణనాయక               ।।రావయ్య।।
గుజ్జురూపపు బొజ్జ కదలగ 
గజ్జెలందెలు ఘల్లుమనగా
గజ్జకాయలుండ్రాళ్లు 
కుడుములు గైకొను 
గణనాయకా                      ।।రావయ్య।।

      ఈ పాటల్లోనూ, ఆరాధించే పద్ధతిలోనూ, పలకరింపుల్లోనూ ఆత్మీయ చొరవ కనిపిస్తుంది. గణపతిని నిరాడంబరంగా, నిగర్విగా, సాధారణ మానవుడిగా ఎంచి స్తుతించడం జానపదుల్లోనే కనిపిస్తుంది. ఏ దేవుడైనా ఆప్తమిత్రుడే వీరికి.. గణపతి అయితే మరీనూ!


వెనక్కి ...

మీ అభిప్రాయం