పప్పన్నం పెడతారా?

  • 914 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డాక్టర్‌ జి.వి.పూర్ణచందు

  • విజయవాడ
  • 9440172642
డాక్టర్‌ జి.వి.పూర్ణచందు

వేడి మంగలములో వేయించి వేయించి గరగర విసిరిన కందిపప్పు
సరిపడ్డ లవణంబు సంధించి వండిన కనకంబుతో సరి కందిపప్పు
అన్నంబులో జొన్పి యాజ్యంబు బోసియు కల్పి మర్దించిన కందిపప్పు
పట్టి ముద్దలు చేసి భక్షణ సేయంగ కడుపులో జొచ్చిన కందిపప్పు
పైత్య వాతంబు లెల్లను పారద్రోలి
కాంతపై యాశ పుట్టించు కందిపప్పు
బక్క దేహుల కెల్లను బలమునిచ్చి
ఘనత దెచ్చును ఏ ప్రొద్దు కందిపప్పు!  

 - నాదెళ్ల నృసింహ కవి

పప్పు తినే శాకాహారుల్ని పప్పుగాళ్లని మాంసాహారులు గేలి చేస్తుంటారు. దీనికి ప్రతిగా, దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్ములని మాంసాహారుల్ని శాకాహారులు భావిస్తారు.
      పప్పు తినేవారు తాము మేథావులం అనుకుంటారు. ప్రపంచంలో నోబెల్‌ బహుమతి గ్రహీతలంతా గొడ్డుమాంసం తినే వారే అని మాంసాహారులు వాదిస్తారు. ఎవరి ఆహారం వారికి గొప్ప. మనిషన్నాక ఆ మాత్రం స్వాతిశయం అవసరం కూడా! 
      ‘‘భోజనం దేహి రాజేంద్రా! ఘృతసూప సమన్వితం...’’ అనే ప్రసిద్ధ శ్లోకంలో పప్పన్నం పెట్టాల్సిందిగా రాజును కోరతాడు కవి. పప్పన్నం కులమతాలకు అతీతమైన ఒక శారీరక అవసరం. ఓ వైద్యపరమైన అంశం కూడా! ‘‘ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య/ ఉండ్రాళ్ల మీదికీ దండు పంపు/ కమ్మని నెయ్యయ్య కడు ముద్ద పప్పయ్య/ బొజ్జ నిండా తినుము పొరలుకొనుచు’’ అంటూ వినాయకుడికి ముద్దపప్పును నైవేద్యంగా పెట్టేది స్థూలకాయం తగ్గుతుందనే!
      ‘పప్పులో కాలేసినట్టే, నీ పప్పులింక ఉడకవు, అప్పు చేసి పప్పుకూడు, పప్పుకూటికి ముందు, వెట్టిమూటకు వెనక’ లాంటి జాతీయాలు తెలుగువారికీ ముద్దపప్పుకూ ఉన్న అనుబంధాన్ని చాటి చెప్తాయి. ‘‘అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్‌ మూడట్లోయ్‌’’ అనే బాలల గేయంలో అట్లను ముద్దపప్పుతో తినడం గురించి ఉంది. ‘పప్పన్నం ఎప్పుడు పెడతావు?’ లాంటి పిలుపులు, పలకరింపులూ ఒకప్పుడు ఉండేవి. కరవు ప్రాంతాల్లో ప్రజలు పెళ్లిలాంటి సందర్భాల్లో మాత్రమే పప్పుతో కూడిన షడ్రసోపేతమైన భోజనం తినే అవకాశం ఉండేది. అందుకే అంత ఆత్మీయంగా పెళ్లెప్పుడు చేసుకుంటావు అనడగటానికి పప్పన్నం ఎప్పుడు పెడతావని ఆశగా అడిగేవారు. రోజూ పప్పన్నం తినడం అంటే నిత్యకల్యాణమే!
      వంటకాల్లో రారాజు ముద్దపప్పు. దాన్ని ‘జీవితాన్ని కాపాడే వంటకం’ అని సిమోన్‌ మజుందార్‌ పిలిచారు. కందిపప్పులో పసుపు, తెలుపు, ఎరుపు ఇలా మూడు రకాలున్నాయి. పచ్చ కందిపప్పు చలవనిస్తుందనీ, ఎర్ర పప్పు వేడి చేస్తుందని, తెల్లది ఆరోగ్యానికి మంచిది కాదనీ ఆయుర్వేద గ్రంథాల్లో చెబుతారు. తెల్ల కందిపప్పుకు పసుపు రంగు వేసి అమ్ముతున్న మోసాలు ఇప్పుడు పెరిగాయి.
మంగలంలో వేపిన కందిపప్పు
వేడి మంగలంలో వేయించి వేయించి గరగర విసిరిన కందిపప్పు గురించి పైన పద్యంలో ముందుగా ప్రస్తావించాడు కవి. కందిపప్పుని వేయించడం దేనికీ?
      ఏ ధాన్యాన్నయినా వేయించితే దాన్లో ఉండే ‘అరోమా’ అంటే సహజ సుగంధం బయటికొస్తుంది. రుచి పెరుగుతుంది. అలా వేయించిన ధాన్యాలు తేలిగ్గా అరుగుతాయి. పప్పు తింటే గ్యాసు వస్తుందనేవాళ్లు తమ జీర్ణశక్తి మందం అని ఒప్పుకోలేక పప్పు మీద ఆ నింద వేస్తుంటారు. పప్పుని మంగలంలోనో, భాండీలోనో దోరగా వేయించి వండుకుంటే గ్యాసు పుట్టదు. ఆ రోజుల్లో ఇళ్లలో తిరగళ్లు ఉండేవి, వాటిని విసిరే తీరికా జనాలకు ఉండేది. కందుల్ని వేయించి, తిరగట్లో విసిరి, డబ్బాల్లో దాచుకుని రోజూ వండుకునే వారన్నమాట. అలాగే, మినప్పప్పుని వేయించి విసరడంతోనే సున్ని ఉండలకు ఆ ప్రత్యేకమైన రుచి కలుగుతుంది. వేయించి వండితే ఏ ధాన్యమైనా రుచికరంగా, తేలికగా అరిగేవిగానూ ఉంటుంది.
      ఇంతకీ, మంగలం అంటే ఏంటీ? అంబరిషం, భ్రాష్ట్రం, వేపుడు చట్టి అని నిఘంటువులు దీనికి అర్థాలిచ్చాయి. ద్రావిడ భాషల్లో ‘కలం’ అంటే నావ, పల్లెం, పాత్ర, కుండ ఇన్ని అర్థాలున్నాయి. ఆఫ్రో ఏషియాటిక్‌ భాషల మూలరూపాల్లో కూడా ‘కలం’ ఇదే అర్థంలో కనిపిస్తుంది. తెలుగులో కలమారి అంటే నావికుడు. కన్నడంలో కల అంటే పెద్ద కుండ. నీళ్లు కాచుకునే పెద్ద గంగాళం అనే అర్థంలో ‘కలాయి’ అనే మాట ఇంకా తెలుగులో వాడకంలో ఉంది. ‘కలశం’ అనే సంస్కృత పదం వెనుక ఈ ద్రావిడ మూలాలు తొంగి చూస్తున్నాయి.
      కుండ(కలం)తో పాటు గరిట కూడా ఉండాలి కదా! గరిటని తెడ్డు అనడం గమనిస్తే ‘కలం’ (నావ, కుండ) లాంటి ప్రాచీన పదాల మూలాలకు ఎంత అర్థవిస్తృతి ఉందో అర్థమవుతుంది. 
      మంగలంలోని కలం అంటే కుండే! ముక్కలైన కలాన్ని మంగలం అన్నారు! కుండ రెండు ముక్కలైతే, అందులో పెద్ద ముక్క అంటే, దాదాపు సగం కుండని పొయ్యి మీద పెట్టి అందులో కందిపప్పు, శనగపప్పు, వేరుశనక్కాయలు, పేలాల్లాంటివి వేయిస్తుంటారు. చిన్న కుండ పెంకుని కూడా పొయ్యి మీద పెట్టి దోసెలు, రొట్టెలు, పూతరేకుల్లాంటివి కాలుస్తారు. అందుకే పెనాన్ని ‘పెంకు’ అనే అలవాటు ఈనాటికీ ఉంది. ఇక నాదెళ్ల నృసింహ కవి వర్ణించిన కందిపప్పు గొప్పతనాన్ని చూద్దాం.
సరిపడ్డ లవణంబు సంధించి వండిన కనకంబుతో సరి కందిపప్పు: కందిపప్పుని ఉడికించి తగినంత ఉప్పు కలిపి తింటే అది బంగారంతో సమానమట! వండిన పప్పు పసిడిరంగులో ఉంటుంది కాబట్టి ఆ పోలిక!
అన్నంబులో జొన్పి యాజ్యంబు బోసియు కల్పి మర్దించిన కందిపప్పు: అన్నంలో పప్పు జొనిపి, నెయ్యి పోసి బాగా మర్దించి అంటే పిసికి తింటే నెయ్యి వల్ల పప్పు రుచి ఇనుమడిస్తుంది. కందిపప్పు దోషాలకు నెయ్యి విరుగుడు. అగ్నికి ఆజ్యం అన్నారు కదా! నెయ్యి వేసుకుంటే జఠరాగ్ని పెరుగుతుంది.
పట్టి ముద్దలు చేసి భక్షణ సేయంగ కడుపులో జొచ్చిన కందిపప్పు: ముద్దలుగా పప్పన్నాన్ని తింటే కడుపులో పైత్యాన్ని, వాతాన్ని పోగొట్టి, లైంగిక సమర్థతని పెంచుతుంది. చిక్కిపోతున్న వారికి ఈ పప్పన్నం పెడితే బలం పుంజుకుంటారు.
      ప్రపంచం మొత్తం ఇప్పుడు మాంసాహారం లోంచి పప్పన్నం వైపు దృష్టి సారిస్తోంది. సగం కూర, సగం మాంసం కలిసిన అన్నాన్ని మెడిటరేనియన్‌ డైట్‌ అంటున్నారు. ఇది తొలి అడుగు. మాంసాన్ని తినడం మొదట సగం తగ్గించుకుంటే, రెండో విడతలో ఆ సగం కూడా తగ్గించుకుని శుద్ధ పప్పన్నంలోకి రావడం తేలిక అని శాస్త్రవేత్తల విశ్వాసం.
పప్పులో మాంసకృత్తులు
శరీరాకృతి నిర్మాణం, మాంస కండరాలకు మరమ్మతులు, వాటి పనితీరు మెరుగుపరచుకోవడం అనే విధుల్ని మాంసకృత్తులు (ప్రొటీన్లు) నెరవేరుస్తుంటాయి. ఈ ప్రొటీన్లు అటు మాంసాహారం నుంచీ ఇటు శాకాహారం నుంచీ సమృద్ధిగానే లభిస్తుంటాయి. కానీ, మాంస ప్రోటీన్లకీ, శాక ప్రొటీన్లకీ మౌలికంగా కొంత తేడా ఉంది. దేని వలన వచ్చే ప్రొటీన్లు ఏ విధమైన లాభనష్టాలను కలిగిస్తాయనే అంశం చర్చించాల్సిందే!
      ప్రోటీన్లను అమైనో యాసిడ్లు తయారు చేస్తాయి. శరీరానికి ఇరవైరెండు రకాల అమైనో యాసిడ్లు కావాలి. వాటిలో తొమ్మిది అత్యవసర అమైనో యాసిడ్లను శరీరం తనకు తానుగా తయారు చేసుకోలేదు. పప్పన్నం ద్వారానే పొందగలగాలి. ఈ తొమ్మిది రకాల అమైనో యాసిడ్లు ఏ భోజనంలో ఉంటాయో అది సంపన్న భోజనం అవుతుంది. ఆహారం ద్వారా ప్రొటీన్లే కాదు, ఇంకా ఇతర పోషకాలు కూడా కావాలి కదా..! అవి మాంసం కంటే పప్పుధాన్యాల్లో ఎక్కువ. అలా పప్పన్నం మాంసాహారం కంటే మెరుగైందని శాస్త్రవేత్తల విశ్లేషణ.
      కూరగాయలు లేదా ఆకుకూరలతో పప్పు వండుకుని తింటే ఆహారపీచు (డైటరీ ఫైబరు), ఇనుము, బీ కాంప్లెక్సు లాంటి ఇతర పోషకాలు తేలికగా శరీరానికి వంటబడతాయి. కేన్సరు లాంటి వ్యాధుల్ని నిరోధించే విటమిన్లు ఎ, సి, ఇ; బీటా కెరోటిన్‌ లాంటివి కందిపప్పులోనే ఎక్కువ. మాంసాహారం మాత్రమే తినేవారికి ఇవి తగినంతగా అందవు. చెడ్డ కొవ్వు మాంసాహారం ద్వారా శరీరంలోకి ఎక్కువగా వెడుతుంది. ముఖ్యంగా గొడ్డు మాంసం ద్వారా వెళ్లే కొవ్వు గుండెకు ఎక్కువ అపకారం చేస్తుంది.
      నీళ్ల విరేచనాలు, కలరా లాంటి వ్యాధుల్లోనూ, జీర్ణకోశ వ్యాధులన్నింటిలోనూ కందిపప్పుని కమ్మగా వండిపెట్టవచ్చు. రోగి బలాన్ని కాపాడగలిగితే రోగ బలం తగ్గుతుంది. అమీబియాసిస్‌ వ్యాధిలో సైతం తినదగిన ఆహార పదార్థం ఇది. కందిజావ లేదా కందికట్టులో దానిమ్మ గింజలు చేర్చి తాలింపు పెట్టుకుని తింటే రుచికరంగా ఉంటాయి. పేగుపూతకు ఇది మంచి ఔషధం కూడా! కందిపప్పును ఉడికించి తాలింపు పెట్టి, కొద్దిగా మిరియాల పొడిగానీ, ధనియాలపొడిగానీ కలుపుకుని తింటే మంచి ఉపాహారంగా ఉపయోగ పడుతుంది. కామెర్ల వ్యాధిలో ఇది మేలు చేస్తుంది. రక్తశుద్ధిని కలిగిస్తుంది. శరీర తత్వాన్ని మృదువు పరుస్తుంది. రక్తస్రావాన్ని ఆపుతుంది. గుండె జబ్బులున్న వారికీ¨, శస్త్రచికిత్సలు అయిన వారికీ కందిపప్పు పెట్టాలి.
పప్పన్నం ఓ ఘనత!
కందిపప్పుని వేయించి పుట్నాల పప్పులా చేస్తారు. దీని సున్ని తేలికగా అరుగుతుంది. ఆరుద్ర, తన ఇంటింటి పజ్యాలలో ‘‘నన్ను ముంచకపోతే నిన్ను ముంచుతానంటుంది కందిసున్ని’’ అంటారు. నెయ్యి వేసుకుని తింటే కందిసున్ని తేలికగా అరుగుతుందన్న మాట! మరోవైపు, సాంబారుకు అలవాటు పడి తెలుగువాళ్లు మన అమ్మమ్మల కాలం నాటి పప్పుచారుని మరిచిపోతున్నారు. చింతపండు పరిమితంగా వాడితే కందిపప్పు ఎలాంటి అపకారం చేయదు. మాంసానికి ప్రత్యామ్నాయంగా కందులను మనం సద్వినియోగం చేసుకోవాలి. అత్యంత శక్తిమంతమైన ఎద్దు, గుర్రం, ఏనుగు లాంటి జంతువులు నూరుశాతం శాకాహారులుగానే ఉన్నాయి. కాబట్టి కేవలం బలం కోసం బలవంతంగా మనుషులు మాంసాహారులు కానవసరం లేదు. వైద్యపరంగా మాంసాన్ని నిషేధించడం అసాధ్యం. కానీ, జీవకారుణ్యం కూడా అవసరమే! అందుకు ప్రత్యామ్నాయం కందిపప్పు!!
      పప్పుధాన్యాలలో కందుల వాడకమే ఎక్కువ. ప్రపంచం మొత్తం మీద పండుతున్న కందుల్లో 85 శాతం మన దేశంలోనే పండుతున్నాయి. ప్రతీ కంది మొక్కా ఒక ఎరువుల కర్మాగారం లాంటిది. ఆ మొక్క పెరిగిన నేలలో నత్రజని శాతం పెరుగుతుందట. అలా ఒకసారి కంది, ఒకసారి వరి... ఇలా పండిస్తుంటే ఎరువుల వాడకం తగ్గుతుంది కూడా! మొత్తం మీద నృసింహ కవి చెప్పినట్టు ‘‘ఘనత దెచ్చును ఏ ప్రొద్దు కందిపప్పు’’ అనేది పచ్చి నిజం. ఈ మాటని అమెరికన్‌ శాస్త్రవేత్తలే అంటున్నారు. కందిపప్పు తినడమే ఓ ఘనత!


వెనక్కి ...

మీ అభిప్రాయం