వెన్నెలదారుల్లో కవితా వికాసం

  • 112 Views
  • 0Likes
  • Like
  • Article Share

    పార్థసారథి చిరువోలు

  • హైదరాబాదు
  • 9908892065
పార్థసారథి చిరువోలు

మీకు కృతజ్ఞుణ్ణి. వైతరణి ఒడ్డుని విడజాలని హరిజనులకు కృతజ్ఞుణ్ని/ నన్ను వాళ్ల గుడిసెల్లోకి రానిచ్చారు/ గుడిసె ముందు.. మురికిగుంటల ఒడ్డున నులకమంచం కోడు పొందించి దగ్గరకు రావచ్చునో లేదో అనే భయభ్రాంతి పొడుస్తుంటే../ సగం చెప్పి.. సగం చెప్పక... పూర్తిగా బాధ చెప్పుకోటానికి మాటలు రాక../ అర్జీ రాసుకోటానికి ఇంట్లో కాగితాలు లేక.. చేతుల్లో కలాలు లేక../ ఏకలవ్యుల్లా వారు నాకు బొటిమనవేళ్లిచ్చారు/ ఒక లక్ష బొటిమనవేళ్లు నేను రాశాను.. చదివాను../ ముదుసళ్లవీ, వయస్కులవీ, స్త్రీలవీ, పురుషులవీ, ఆరోగ్యవంతులవీ, రోగులవీ, పాపులవీ, వీరులవీ...’’ 
      సి.వి.కృష్ణారావు.. తన తొలికవితా సంపుటి ‘వైతరణి’ (1968)కి ముందు మాటలో ఇలా చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలు దళిత పోరాటల పట్ల ఆయన నిబద్ధతను చాటుతాయి. తర్వాత రచనల్లోనూ కృష్ణారావు ఇదే దృక్పథాన్ని కొనసాగించారు. దళితులు, గిరిజనుల హక్కుల సాధనకు కవిగానే కాదు, వ్యక్తిగా కూడా కృషి చేశారు. ఉద్యోగ జీవితంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారిగా.. ఎన్నో గిరిజన గూడేలను సందర్శించారు. ఆత్మీయునిలా వారికి సేవలందించారు. ‘‘నా ను విస్మరించి... నలుగురిలో నలుసుగా మెలుగు... అందరితో ఒకేసారి రోదించు. ఒకే స్వరంతో స్పందించు.. భుజం భుజం కలిపి సంఘర్షించు..’’- ఇలాంటి పదునైన వాక్యాలు కృష్ణారావు కవిత్వంలో తళుక్కున మెరుస్తాయి. అయితే వ్యక్తిగా ఆయన మృదు స్వభావి. స్నేహాభిలాషి. ప్రతిరోజూ తెల్లవారుఝామున మూడున్నర కల్లా లేచి ఏకాంతంలో చదువుకోవటం, రాసుకోవటం ఆయనకు అలవాటు. తెలుగు కవిత్వంతోపాటు, తత్వశాస్త్రం, ఆంత్రోపాలజీలపైనా అధ్యయనాన్ని కొనసాగించారు. 
      ‘నెలనెలావెన్నెల’ పేరుతో కృష్ణారావు నిర్వహించిన కవిసంగమం ఎందరికో గొంతుకనిచ్చింది. దాదాపు మూడుదశాబ్దాలకు పైగా నిరాటంకంగా ఈ కార్యక్రమం సాగింది. కృష్ణారావు ‘అవిశ్రాంతం, మీదీ మా ఊరే, వైతరణి నుంచి...’ లాంటి కవితా సంకలనాలతో పాటు నెలనెలా వెన్నెల కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. ఈ మధ్యనే తన జీవనయానంలో వివిధ ఘట్టాలను అక్షరీకరిస్తూ.. ‘నడకనావ’ను వెలువరించారు. ‘‘మేధావుల సన్నిధిలో కూర్చోవటం ఇష్టమైన ప్రాపకం.. పాదచారి తన బాటలో కందకం బారిన పడకుండా ముల్లును తొలగించటం నేను నమ్మిన ఆదర్శం’’ అని కృష్ణారావు అనేవారు.  కాలాన్ని ప్రతిఫలించే తత్వం కవిత్వానికి ఉండాలని చెప్పేవారు. ‘‘కవిత్వం పదాల కూర్పు. ప్రతి పదానికీ ప్రాణం ఉంటుంది. వస్తువుకి పేరుపెడితే దానికి ప్రాణం పోసినట్టు. అలాగే వ్యక్తి అనుభూతి కవిత్వం ద్వారా అవగాహనలోకి వస్తుంది. ఆ కవిత్వం కాలాన్ని ప్రతిఫలించేటట్టు ఉండాలి. లేకపోతే రాత చీకట్లోనే ఉండిపోతుంది. కాలాన్ని ప్రతిఫలిస్తేనే హృదయాలకు చేరువవుతుంది. కాల ప్రవాహంలో ప్రజ్వరిల్లే వస్తువూ, శిల్పం సమతుల్యమైన ఆవిష్కరణ నేటి కవిత్వానికి గమ్యం’’ అని ఆయన ఓ సందర్భంలో వివరించారు.   కవిగా సుప్రసిద్ధులైనప్పటికీ కృష్ణారావు కథకుడిగానే తొలుత సాహితీరంగ ప్రవేశం చేశారు. అయిదారు కథలు రాసి.. ఆ తర్వాత కవిగానే కొనసాగారు. తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో ఆయన వెలువరించిన ‘నోటీసు’ కథ ప్రాచుర్యం పొందింది. కృష్ణారావు 94 ఏళ్ల సంపూర్ణ జీవితంలో ఎన్నో అనుభవాలను చవిచూశారు. ఏడాది కిందట ఆయన జీవనసహచరి దూరమయ్యారు. ఎదిగిన బిడ్డ ఆకస్మిక మరణాన్నీ గుండె నిబ్బరంతో ఎదుర్కొన్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యలు ఆయన మీద దాడి చేశాయి.   ఓ రాత్రి మన మధ్య నుంచి ఆ ప్రేమైకమూర్తి వెళ్లిపోయారు. అచ్చులో మిగిలిన ఆయన అక్షరాలు సజీవంగా మిగిలిపోయాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం