ఏకాంత కోకిల

  • 147 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎస్‌.ఎన్‌.శర్మ

అక్షర తపస్సు చేసి మరీ వరాలు పొందిన రచయిత.. ఆ వరాలు ఆయన హృదయ స్వరాలై పాటలై పద్యాలై, రూపకాలై, యక్షగానాలై పత్రికా రచనలై, వ్యాసాలై నలుదిక్కులా పరిమళించాయి. ‘చపల చిత్తరంగం’ అని కొందరనుకునే చలన చిత్ర రంగంలోనూ తన కృషి తాను చేసుకున్నారు. ‘ఈయన గొప్పవాడు’ అని ఆకాశవాణే నినదించింది. సృజనకాంతులు వెదజల్లే ఆయన ‘ఇంటి పేరు ఇంద్రగంటి’. నామకరణం వల్ల శ్రీకాంతశర్మ అనే పేరున్న వారయినా, తెలుగు సాహితీచరిత్రలో ‘పేరున్నవారు’ పేర్కొనవల్సిన వారు అయ్యారు అనంతర కాలంలో.
శ్రీకాంతశర్మ
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో వేంకటరత్నమ్మ, హనుమచ్ఛాస్త్రిలకు 1944 మే 29న పుట్టారు. హైదరాబాదులో 2019 జులై 25వ తేదీన కీర్తిశేషులయ్యారు. 75 ఏళ్ల జీవితంలో యాభై ఏళ్లు సాహితీరంగంలోనే జీవించారు. ఆయన పూర్వులు తెలంగాణకు చెందినవారు; తెలంగాణలోని ‘ఇంద్రకల్‌’ ఊరే ఇంద్రగంటి అంటే.
      తెలుగు సాహిత్యంలో మరచిపోకూడని మణిహారం ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. సాహిత్య వారసత్వ పాండిత్యాన్ని, ఉత్తమాభిరుచుల్ని శ్రీకాంతశర్మ కైవసం చేసుకున్నారు; కవితా సరస్వతిని వశం చేసుకున్నారు. సంస్కృతాంధ్ర సాహిత్యాల్లో పేరొందిన గ్రంథాలెన్నింటినో ఆయన మథించారు. శ్రీకాంతశర్మ సాహితీవ్యాసంగం 1961లో ప్రారంభమైంది. కవిత్వ ప్రారంభం 1965లో జరిగింది. ‘భారతి’లో పడిన ‘పాలరాతిబొమ్మలు’ అనే పద్యాలు శర్మ ప్రారంభ కవిత.  1976లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగం చేయడం, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో పనిచేయడంతో సాహిత్య కవిత్వ ప్రముఖులు శర్మకు సన్నిహితులు కావడానికి దోహదపడింది. ‘ఎదుగు, ఎదిగే వాళ్లకి ప్రోత్సాహపు పాలు అందించు’ అనే ఆయన సహృదయ సాత్విక గుణం వల్ల ఎందరో మిత్రుల బృందాలకు సాహిత్య అయస్కాంత శర్మ అయ్యారు. ఆయన రచించిన రూపకాలకు అభిమానుల సంఖ్య పెరిగింది.
ఆ అక్షరాల్లో నిజాయతీ..
శ్రీకాంత శర్మ పాటలు అంటే 1997 నాటికి విరచితమైనవి ‘ఆలాపన’ సంపుటిగా వచ్చింది. శ్రీకాంత కోకిల ‘ఏకాంతకోకిల’ పేర 2012లో పద్య ఖండికల్ని అనుభవసార కృతులుగా గానం చేసింది. 1994లో శర్మ వ్యాస సంపుటి ‘సంచలనమ్‌’ సంచలనాన్ని నిజంగానే సృష్టించింది. శర్మ గేయ కవిత్వ రచనా వైశిష్ట్యానికి ‘శిలామురళి’ దర్పణమైంది. 21వ దశాబ్ద ద్వితీయ దశకంలోని ఆయన రచనల వెలుగు దశ, దిశ తిరిగింది. శ్రీకాంతశర్మ సమగ్ర సాహిత్యాన్ని నవోదయా వారు ‘సృజన, సమాలోచన’ అనే బృహత్సంపుటాలుగా తీర్చిదిద్దింపజేసి వేశారు. సృజనలో, కవిత్వం, లలితకళలు, యక్షగానాలు, కథలు లాంటివి ఉన్నాయి. సమాలోచనలో సాహిత్యదీపాలు, అలనాటి నాటకాలు, ఆలోచన, సంచలనమ్, మనలో మాట, ఇంద్రధనస్సు లాంటివి అనేకాంశాల, అనేక వ్యక్తులపై వ్యాసాలుగా వెలిగాయి.
      ఒక ఆంగ్ల విమర్శకుడు ‘జీవితంలో నలభై ఏళ్లు పాఠ్యగ్రంథం వంటిది. దాని తర్వాత భాగం మొదటి దానికి వ్యాఖ్యానం లాంటిది’ అన్నారు. అంటే జీవితంలో నాలుగో దశకం తర్వాత ‘అప్పుడిలా చేశాను. అప్పుడిలా రాశాను లాంటివి మాత్రమే వస్తాయని భావం. అయితే శ్రీకాంతశర్మ లాంటి కొందరి రచయితల జీవితాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. తర్వాత కూడా సృజనలుంటాయి. ‘అలా చేశాను ఇలా రాశాను’ అనేవి కూడా చారిత్రాత్మక సంఘటనలే అవుతాయి. అందువల్లే శ్రీకాంతశర్మ తన ఆత్మకథను సైతం రాసుకున్నారు. అదే ‘ఇంటిపేరు ఇంద్రగంటి’; 430 పుటల పెద్ద స్వీయచరిత్ర. శ్రీకాంతశర్మలో ఓ సుగుణం ఉంది. ఆయన రచనలు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి అని విశ్లేషించేలోగానే అడపాదడపా తన రచనల గురించి తానే చెప్పుకుంటారు. ఇది అత్యుక్తులతో కాక నిజాయతీతో రాసుకోవడం వల్ల విశ్లేషకులకూ పాఠకులకూ లాభం ఒనగూరుతుంది. ఇంటి పేరు ఇంద్రగంటిలో ప్రవేశికలో ‘‘నేను ఏ ఉద్యమాల్లోనూ పనిచేసిన వాడిని కాను. నేనెరిగినది తెలుగు సాహిత్యం గురించి; అందు నిమిత్తంగా నడిచిన సంఘటనల గురించి ఆధునిక సాహిత్యంతో మా కుటుంబానికున్న సంబంధం గురించి, నేనెరిగిన ఘటనలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది’’ అన్నారు. ఈ స్వీయ చరిత్ర చదివాక ఇంద్రగంటి కుటుంబం గురించి, వారి పూర్వోత్తరాల గురించి, శర్మ జీవితం గురించి ఇన్ని విశేషాలు ఉన్నాయా అనిపిస్తుంది. మన పఠనాశక్తి, ఆసక్తిగా పెరుగుతుంది గానీ, ఓపికకు పరీక్షపెట్టదు. కారణమేమిటంటే శ్రీకాంతశర్మలోని లోతులెరిగిన పండితుడిలో ప్రసిద్ధ పత్రికా రచయిత కూడా ఉండడం.
రచనలో రసదృష్టి
చెళ్లపిళ్ల, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చలం, మొక్కపాటి, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాథ లాంటి వారి రచనల్ని శ్రీకాంతశర్మ అధ్యయనం చేశార[ంటే చిన్నమాటవుతుంది. వాటిని, వాటిలోని స్ఫూర్తులతో బాటు రక్తాణువుల్లో నిక్షిప్తం చేసేసుకున్నారనడమే సమంజసం. ఉదాహరణకు ‘అపూర్వ కవిస్తుతి’లో కృష్ణశాస్త్రి గురించి - ‘‘ఖండకృతికేమి, గీతుల గతులకేమి/ భావనా భార హృదయైక బాధకేమీ/ కేతనము లెత్తినిలుచును కృష్ణశాస్త్రి కవిత, వచనమ్మునందును కలలుమప్పు’’ అన్నారు. మనకు కృష్ణశాస్త్రి కలలు మప్పుతారనడం గుణగణనీయం. అలాగే చలం గురించి - ‘‘చలమనగ నొక్కచేత వాజ్వాల నిజము/ అరసి ప్రశ్నింపనట్టి లోకాను సరణమేదియును లేదు;/ స్త్రీ మనస్సెరిగి, బాసటగ నిలిచి వారి భావ గాఢతలజెప్పె’’- స్త్రీల భావగాఢతలు చలం చెప్పడం చారిత్రాత్మకం కదా!  
      చిన్న, పెద్ద పద్యాలతో సూటిగా అలవోకగా భావకాంతుల్ని ప్రసరింపజేస్తారు శ్రీకాంతశర్మ. యౌవనస్మృతి ఖండికలు ఓ రత్నం - ‘‘పుట్టిగోదావరీ తీర భూమియందు/ పచ్చనైనట్టి ప్రాణమ్ము బడసినాను/ నిత్యయౌవన గానమ్ము నేర్చినాను/ హాస్య జీవనరక్తి ఉపాస్యమయ్యె’ అన్నారు. మెరిసేకళ్లతో విరిసే నవ్వులతో సాహిత్యకారుల గురించిన హాస్యసంఘటనలు ఆయన చెబుతూంటే కడుపు చెక్కలయ్యేది. శర్మ సుగుణాలలో నవ్వడం నవ్వించడం, ఏ కృష్ణశాస్త్రి కవితలో చెప్పి ఏడ్పించడం ప్రధానమైనవి.
      పండితుడు, కవి, భావుకుడు అయిన శ్రీకాంతశర్మ తనకాల వృద్ధకవులను గౌరవించుకున్నారు. సమానులైన వారిని సమాదరించారు. వర్ధమాన కవులను ప్రోత్సహించారు. గోదావరిలో ప్రయాణాలు ఎన్నిసార్లు చేసినా ఆయనకు ఇంకా కావాలనే అనిపిస్తుంది. చలనచిత్రాల్లో ఆయన పాటల్లో కాంతివంతమైనవీ రాకపోలేదు. పిల్లలకు ఆయన రాసిన ‘‘తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా’’ అనే గేయం పెద్దల్నీ అలరించింది. వ్యాసరచయితగా శ్రీకాంతశర్మ ఇచ్చే సమాచారం సాహిత్య రసదృష్టితో కూడుకునేది. చెప్పినట్టే రాయగలగడం ఆయన ప్రత్యేకత. ఉన్నవ, పింగళి నాగేంద్రరావు, శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి లాంటి వారి గురించి చరిత్ర కెక్కనివి మన తలకెక్కించుకోవల్సినవి రాశారు. గురజాడ, శ్రీశ్రీ లాంటి వారిపై ఎవరైనా రాస్తారు. అప్రసిద్ధ అంశాల్ని సుప్రసిద్ధం చేయడం ఆయన నైజం.
కెరటాల చీకటులలో..
శ్రీకాంత శర్మ ప్రధానంగా కవి. మందిలో ఒకరుగా కాక కొందరు అనుభూతికవులలో తానూ ఒకరవడం ఆయన కవిత్వ శ్రమైక ఫలం. నిజానికి అనుభూతి కవుల్ని జి.వి.సుబ్రహ్మణ్యం లాంటి వారు బేరీజు వేసినా, అనుభూతి కవుల సొంతగొంతులు- వ్యక్తీకరణల గురించి ఇంకా రావల్సిన అంశాలే ఉన్నాయి. అనుభూతి గీతాలు శ్రీకాంతశర్మ హృదయకవాటాన్ని చీల్చుకు వచ్చిన వివిధ వస్త్వనుభూతులు. తాను అనుభూతి చెందడం కాదు, కవిత్వంతో ఆ అనుభూతిని పొందగలిగేలా చేయాలి. అందుకే ఆయన ‘‘కెరటాల కెరటాల చీకటులలో/ నిశ్శబ్ద రోదసీ తీరం కునుకు తీరి/ మెలమెల్లగా రెప్పలు వీడి/ ఒక్క అనుక్షణం, విస్ఫోటాలు పొందినపుడు/ సూర్య రుతువు తొలకరించి/ పొగలై సెగలై పలు అలంకారాలావిష్కరిస్తున్న కళ అంతరాంతర వర్తులాల్లో/ కేంద్రీకరించిన అగ్నికణం ఈ ప్రాణం/ మెరుపు అరుపుతోనే మేఘాన్ని చీల్చి/ భూమికి ఉదయించిన జల బిందువు సోకి/ జలదరించి తలపు లెత్తిన మొలకలు కనుకొలకుల్లో/ తళుకొత్తిన రాగరేఖ ప్రాణం;/ చింతన చిగురై మొగ్గై నాదం జనించి జ్వలించినప్పుడు/ ఉబికి ఉదయించిన చైతన్యరక్త బిందువు ప్రాణం’’.
      మన ప్రాణాన్ని పట్టుకునే అనుభూతి కవిత అయ్యింది. నిత్యయౌవన కవితాగాయకుడైన ఏకాంత కోకిల శ్రీకాంత కోకిల. ఎక్కడికెగిరిపోయిందో, పద్య గేయ కవితావాద్యాల మధ్య.


వెనక్కి ...

మీ అభిప్రాయం