భాషతోనే భవిష్యత్తు

  • 590 Views
  • 0Likes
  • Like
  • Article Share

''భాషను ఎవరైతే కాపాడతారో... భాషను ఎవరైతే సంరక్షిస్తారో... భాషను ఎవరైతే గౌరవిస్తారో... ఆ దేశం తన భవిష్యత్తును శక్తిమంతంగా మలచుకుంటుంది'' - మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ అక్షర ప్రేమికుడన్న సంగతి తెలిసిందే. స్వయంగా కవి అయిన ఆయనకు ‘భాష’ లోతులు తెలుసు. ఉజ్బెకిస్థాన్‌ రాజధాని తాష్కెంట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ లోతులను తడిమారాయన. భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తున్న ఉజ్బెకిస్థాన్‌ చరిత్రకారులు, హిందీని నేర్చుకుంటున్న స్థానిక విద్యార్థులు, ప్రవాస భారతీయులతో నిర్వహించిన ఓ సమావేశం ఇందుకు వేదిక అయింది. భాషా మాహాత్మ్యాన్ని వివరిస్తూ, మోదీ అక్కడ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దాని సారాంశమిది...
‘‘సభకు
హాజరైన పెద్దలు, భారత్, ఉజ్బెకిస్థాన్‌ సంస్కృతులు, సంప్రదాయాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్న మహానుభావులను కలుసుకునే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు ఇక్కడ ఉజ్బెకిస్థాన్‌ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ప్రదర్శన కోసం వారు సాధారణ స్థాయికి మించి సాధన చేశారు. మనసు పెట్టి, అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు.
      నిన్న ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షులు, ప్రధానితో చాలా విషయాలు చర్చించాను. రాత్రి భోజన సమయంలో సంగీత విభావరి నిర్వహించారు. పాశ్చాత్య వాయిద్యాల సాయంతోనే భారతీయ గీతాలను ఎంతో మధురంగా ఆలపించారు. విభావరిలో తర్వాతి పాట ఏంటో అధ్యక్షులు ముందే చెప్పేసేవారు. ఇక్కడ అన్ని గ్రామాల్లోనూ సంగీత పాఠశాలలు ఉన్నాయని అధ్యక్షులు, ప్రధాని ఎంతో గర్వంగా చెప్పారు. గడచిన అయిదేళ్లలో కొన్ని సంగీత పాఠశాలలను ప్రారంభించాం... భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అన్నారు. భారతీయ సంగీతం పట్ల ఇక్కడ చాలామంది ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ‘‘సంగీతం ద్వారా మంచి సంస్కారాన్ని పెంపొందించేందుకే మేం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచానికి యుద్ధం నుంచి విముక్తి లభించాలంటే సంగీతాన్ని ఆశ్రయించాలి. సంగీతం మనిషిని ఎప్పుడూ హింసవైపు వెళ్లనీయదు’’ అన్న అధ్యక్షుల మాటలు చాలా సంతోషాన్ని కలిగించాయి.
      వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. వ్యక్తిత్వ వికాస శిక్షణలో అనేక విషయాలు నేర్పిస్తారు. కానీ, నా దృష్టిలో వ్యక్తిత్వాన్ని వికసింపచేయడంలో భాషకు ఎంతో శక్తి ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీకు పరిచయం అయిన విదేశీయులు మిమ్మల్ని మీ భాషలోనే పలకరిస్తే మీరు నివ్వెరపోతారు. తర్వాత ఎలాంటి దాపరికాలు లేకుండా వాళ్లతో మాట్లాడతారు. భాషలో అంతటి శక్తి ఉంటుంది. విదేశీయులు ఎవరైనా భారతీయులకు తారసపడి ‘నమస్తే’ అని పలకరిస్తే... ఆత్మీయులను కలిసినట్లుగా అనిపిస్తుంది.
      భాషను ఎవరైతే కాపాడతారో... భాషను ఎవరైతే సంరక్షిస్తారో... భాషను ఎవరైతే గౌరవిస్తారో... ఆ దేశం తన భవిష్యత్తును శక్తిమంతంగా మలుచుకుంటుంది. అంతేకాదు ఆ భాషలోని సారాన్ని నిరంతరం ఆస్వాదిస్తుంది. ఏదైనా ఓ భాష మనకు తెలిస్తే.. ఇక ఆ భాషా జ్ఞానసాగరంలో మునిగితేలవచ్చు. అమితానందం పొందొచ్చు.
      మా దగ్గర ఓ నానుడి ఉంది... ‘‘పానీ రే పానీ, తేరా రంగ్‌ కైసా?’’ (జలమా ఓ జలమా నీకు ఈ రంగు ఎలా వచ్చింది?) నీట్లో ఏ రంగు వేస్తే, అదే రంగు వస్తుంది నీటికి. భాషకు సైతం ఎప్పటికప్పుడు ఓ కొత్త నేస్తం దొరుకుతాడు. భాషతో స్నేహం చేసి చూడండి. తోటలోని ఏ పువ్వుల మీదుగా గాలి వీస్తుందో... ఆ పూల సువాసనే గాలికీ వస్తుంది.  భాష కూడా అలాంటి సువాసనలను వెదజల్లే సమీరమే. భాష ఎక్కడి నుంచి వెళ్లినా అక్కడి సుగంధాలను తన వెంట తీసుకెళ్తుంది. ఏ యుగం నుంచి ప్రయాణిస్తుందో ఆ యుగపు విశేషాలను తనతో మోసుకెళ్తుంది. ఏ ప్రాంతం నుంచి వెళ్తుందో ఆ ప్రాంతపు విశిష్టతలను తనలో ఇముడ్చుకుంటుంది. ఏ సంప్రదాయంలోంచి ప్రవహిస్తుందో ఆ సంప్రదాయపు వైశిష్ట్యానికి వాహకమవుతుంది. నందనవనంలోని ప్రతి సుగంధాన్నీ మనం గుర్తించినట్లుగానే.. భాషలోని అన్ని గుణాలనూ మనం గుర్తించగలుగుతాం.
      భాషకు ఆర్థిక వ్యవస్థతో నేరుగా సంబంధం ఉంది. ఏ దేశం ఆర్థికంగా సమృద్ధి సాధిస్తుందో, ఆ దేశపు భాష వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలోని ప్రజలందరూ ఆ భాషను నేర్చుకోవడానికి ఆరాటపడతారు. అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే, ఆ భాషతో వ్యాపారానికి మంచి వెసులుబాటు కలుగుతుంది. అప్పుడే భాష ఆర్థికానుబంధంగా మారిపోతుంది. రాబోయే రోజుల్లో భారతీయ భాషల ప్రాశస్త్యం మరింత విస్తరించబోతోందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే, భారత్‌ ఆర్థికంగా ఎదిగేకొద్దీ... ప్రపంచ దేశాలన్నీ భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. 
      భాష ఒక వస్తువో... నమూనానో అయి ఉంటే.. లేదా దాని డీఎన్‌ఏను పరీక్షించే అవకాశం ఉండి ఉంటే... నా దృష్టిలో అది అందరి చేతిలో ఇమిడిపోయేది. భాష హృదయం విశాలమైందని, దాని డీఎన్‌ఏను పరిశీలిస్తే అర్థమవుతుంది. భాష అనేది అందరినీ తనలో కలుపుకుంటుంది. దానికి ఎలాంటి బంధనాలు లేవు. రంగు, కాలం, ప్రాంతం అనే సంకెళ్లు భాషకు ఉండవు. భాషా హృదయం ఎంత విశాలమైందంటే, ప్రతి ఒక్కరినీ అది తనలో ఇముడ్చుకుంటుంది. ఓసారి రష్యాలోని ఓ ప్రాంతానికి వెళ్లాను. నేను ‘‘టీ’’ అని అడిగితే అక్కడివాళ్లకి అర్థం కాలేదు. ‘‘చాయ్‌’’ అంటేే అర్థమయ్యేది. ‘డోర్‌’ అంటే అర్థమయ్యేది కాదు. ‘ద్వార్‌’ అంటే తెలిసేది. పుచ్చకాయను మా దేశంలో చాలామంది ‘తర్‌బూజ్‌’ అని పిలుస్తారు. వాళ్లు కూడా ‘తర్‌బూజ్‌’ అనే అంటారు. భాష అందరినీ ఆదరిస్తుందనేందుకు ఇదొక ఉదాహరణ. ఇక్కడ మీ దేశంలో ‘దుతార్‌’ వాయిస్తారు. మా దగ్గర ‘సితార్‌’ వాయిస్తారు. మీరు ‘తంబుర’ అంటారు కదా, మా దేశంలో ‘తంపుర’ అని పిలుస్తాం. మీ దగ్గర ‘నగారే’ మోగితే.. మా దగ్గర ‘నగాడే’ వినిపిస్తుంది. ఈ సారూప్యతలకు అసలు కారణం భాషా హృదయం విశాలమైంది కావడమే. అది ప్రతి విషయాన్నీ తనలో కలిపేసుకుంటుంది.
      మీరు ఎంత పెద్ద విద్వాంసులైనా సరే... ఎంత గొప్ప భాషావేత్త అయినా సరే ఈశ్వరుడు మనకంటే ఒక అడుగు ముందే ఉంటాడు. మనం ప్రతి భాషకూ శల్యపరీక్ష చేయగలం. దాని రచన ఎలా ఉంటుంది, వ్యాకరణం ఎలా ఉంటుంది, అక్షరాలెందుకు అలా కనిపిస్తాయి... వీటన్నింటినీ పరిశీలించగలం. అన్నీ చేయగలం. కానీ మానవ మూల సంపదను వ్యక్తీకరించే రెండు అంశాలున్నాయి. వాటిని ఆ ఈశ్వరుడే ఇచ్చాడు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా.. ఏ జాతికి, ఏ యుగానికి చెందిన వ్యక్తిలోనైనా రెండు భాషా సారూప్యతలు ఉంటాయి. ఒకటి ‘ఏడుపు’, రెండోది ‘నవ్వు’! ఏడవడంలో ప్రతి ఒక్కరిదీ ఒకే భాష. అలాగే నవ్వే విషయంలోనూ ఒకే భాష ఉంటుంది. అందులో ఎలాంటి తేడా ఉండదు. ఇప్పటివరకూ ఏ పండితుడూ వీటి వ్యాకరణాన్ని విప్పి చెప్పలేకపోయాడు.
      ఈ రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు కేవలం ప్రభుత్వాలకే పరిమితం కావడం లేదు. రెండు దేశాల సంబంధాల దృఢత్వం ఆధారంగా ప్రజల మధ్య సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఒకరి సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, చరిత్రలను మరొకరు తెలుసుకోగలుగుతున్నారు. దీనికి ఎంతో శక్తి ఉంది. మీరు చేసిన ఈ ప్రయత్నం భారత్‌- ఉజ్బెకిస్థాన్‌ ప్రజా సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు అతిపెద్ద వేదికగా నిలిచింది. ఈ సంబంధాలు ఎంతో బలంగా... ఎంతో కాలం నిలిచి ఉంటాయి. ప్రభుత్వాలు మారినా.. వ్యవస్థలు మారినా.. నాయకులు మారినా.. ఈ బంధం మాత్రం ఎప్పుడూ మారదు. బంధాల బలోపేతానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
      మధ్య ఆసియాలోని అయిదు దేశాల్లో ఒకేసారి పర్యటించే అదృష్టం చాలా కొద్దిమందికి లభిస్తుంది. నాకు అది దక్కింది. ఈ పర్యటన ఉజ్బెకిస్థాన్‌తో ప్రారంభమైంది. ఇక్కడ ఇదే నా చివరి కార్యక్రమం. చాలా ఆనందంతో, గర్వంతో చెబుతున్నాను.. ఈ పర్యటన సఫలీకృతమైంది. సుదీర్ఘకాలం పాటు సుఫలాలను అందించే యాత్రగా నిలిచింది. రాబోయే రోజుల్లో భారత్‌- ఉజ్బెకిస్థాన్‌ ఆర్థిక- సామాజిక సంబంధాలు మరింత బలపడతాయి. ఫలితంగా రెండు దేశాలూ మరింతగా శక్తిమంతమవుతాయి. మానవజాతి కల్యాణం కోసం.. సామాన్య మానవుల ఆశలు నెరవేర్చేందుకు ఈ దేశంతో కలిసి మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాం. ఈ విశ్వాసంతోనే ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షులు, ప్రధానమంత్రి, ప్రజలతోపాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన నిర్వాహకులకు మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. ఇక్కడ చర్చించిన విషయాలు రాబోయే రోజుల్లో అనేక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతాయి.
      ఇది సాంకేతిక యుగం. అంతర్జాల మాధ్యమంతో భాషను నేర్చుకోవచ్చు. వినడం ద్వారా కూడా భాషను నేర్చుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే, ప్రపంచాన్ని మన అరచేతిలో ఇమిడ్చే మాధ్యమం అందుబాటులోకి వచ్చింది. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి చేస్తున్న ప్రయత్నాలకు సాంకేతిక పరిజ్ఞానంతోడైతే... దృశ్య శ్రవణ ఉపకరణాలు, లిఖితరూప నమూనాల ద్వారా భాషను నేర్చుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది. ఈ దిశగా చేసే ప్రయత్నాలకు భారత్‌ తరఫున ఎలాంటి సహకారాన్ని అయినా అందించేందుకు సిద్ధం. మరోసారి మీ అందరికీ అభినందనలు... ధన్యవాదాలు!’’

*  *  *

అనువాదం: నవనీత్‌రెడ్డి, హైదరాబాదు


వెనక్కి ...

మీ అభిప్రాయం