ఊర్మిళ నిద్రలేస్తే...!?

  • 864 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డాక్టర్‌. ప్రభల జానకి

  • హైదరాబాదు.
  • 9000496959
డాక్టర్‌. ప్రభల జానకి

సీతారాముల అడుగులు అడవికి దారితీస్తున్నాయి. 
వాటిని అనుసరిస్తున్నాడు లక్ష్మణుడు. మరి అతనితో ఏడడుగులు 
నడిచిన ఊర్మిళ...? ఎక్కడుందామె? జీవితాంతం తోడుంటానని బాస 
చేసినవాడు... తోడబుట్టిన వాడికి తోడుగా కానలకేగుతున్నాడే...! 
అయ్యో... ఊర్మిళమ్మా! నీ గురించి పట్టించుకునేదెవరు? 
తెలుగు జానపదుల గుండెలను కదిలించిన ఈ ప్రశ్నల్లోంచి ఓ కథాగేయం పుట్టింది. 
రసరమ్య రామాయణ కావ్యంలోని ‘మూగ’ పాత్ర ఊర్మిళకూ ఓ హృదయం ఉంటుందని, 
సమయం వచ్చినప్పుడు అది ఆర్ద్రంగా గొంతు విప్పుతుందని నిరూపించింది. తెలుగుతల్లికి 
జానపద సాహిత్యం అలంకరించిన పచ్చల పతకాల్లో ఒకటైన ఆ కథాగేయమే... ‘ఊర్మిళ నిద్ర’. 
భారతీయ కుటుంబ అనుబంధాల సుగంధాలను అద్దుకున్న ఆ గేయం... 
సామాన్యుల సృజనాత్మకతకు సాటిలేని నిదర్శనం.  
కుటుంబమే
ప్రపంచానికి ఆధారం. కుటుంబంలో నేర్చుకున్న సంస్కారం, సంస్కృతి విలువలే మానవాళి మనుగడను నిలబెడతాయి. అవకాశం వచ్చినప్పుడు, ఆ విలువల్ని ఓసారి తలచుకుంటే మనమధ్య ఆప్యాయతలు, అనురాగాలు పెరిగి కుటుంబ వ్యవస్థ సుస్థిరమౌతుంది. మనం కోల్పోతోంది ఏంటో గ్రహించినప్పుడే కదా, పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయగలం!
భారతీయ కుటుంబ జీవనానికి, కుటుంబ విలువలకు రామాయణ, భారతాలే ఆలంబనం. ఈ ప్రచారంలో శిష్టసాహిత్యం, జానపద సాహిత్యం ఒకదానికొకటి సహాయ సహకారాలు అందించుకున్నా... ఎక్కువగా జానపదగేయ సాహిత్యమే ప్రముఖపాత్ర పోషించింది. అందులోనూ స్త్రీల పాటల పాత్ర ప్రత్యేకం. మనకు తెలిసినంత మేరకు మొదటి స్త్రీల పాట అన్నమయ్య భార్య తిమ్మక్క రచించిన సుభద్రాకళ్యాణం. స్త్రీల సాహిత్యం పదిహేనో శతాబ్దంలో ఉధృతంగా ఆవిర్భవించింది. త్యాగరాజు సైతం తన కీర్తనలో ‘సీతారమణితో వామనగుంటలాడి గెలిచిన ముచ్చట విననాసగొని యున్నానురా’ అని కీర్తించటం... స్త్రీల గేయాల స్థాయిని సూచిస్తోంది. జానపద గేయాలకున్న గానయోగ్యత, జానపదుల మధ్యన అల్లుకున్న మానవ సంబంధాలే త్యాగరాజుకు స్ఫూర్తిదాయకమయ్యాయి కాబోలు!
ఆదిలక్ష్మిగా కాదు... 
రామాయణ సంబంధ గేయాలలో ‘ఊర్మిళాదేవి నిద్ర’ ముఖ్యమైన కథాగేయం. ఈ ఊర్మిళ కథ ద్వారా జానపద స్త్రీలు ప్రపంచానికిచ్చిన సందేశం ఏంటి? తరచిచూస్తే... ‘సీతమ్మ’ని వాళ్లు ఆదిలక్ష్మిగా గుర్తించలేదు. మహారాణి జీవితాన్ని తృణప్రాయంగా వదిలి, నారచీరలలో భర్త వెంట అడవులకు వెళ్లి అవస్థలు పడుతున్న ఓ సాధారణ స్త్రీగానే ఆమెను చూశారు. సీతారాముల్ని దైవస్వరూపాలుగా కొలిచినా సరే, ఆదర్శదంపతులుగానే ఆరాధించారు. ఈ నేపథ్యంలోనే... కానలకు వెళ్లిన సీతేకాదు, కనకపు మేడల్లో శయనించిన ఊర్మిళ సైతం జానపదులకు ఆరాధ్యురాలైంది. ఊర్మిళా లక్ష్మణ దంపతుల త్యాగం... వాళ్ల హృదయాలను కరిగించింది. మహాకవులందరూ సీతమ్మ గుణాలను కీర్తించి ఆమె కష్టాలను ఏకరువు పెడితే, పద్నాలుగేళ్ల ఊర్మిళమ్మ  సుషుప్తావస్థను హృదయవిదారకమైన గాథగా పాడుకున్నారు జానపదులు. భారతీయ భాషా సాహిత్యకారులెవ్వరూ ఊర్మిళా లక్ష్మణుల ప్రేమ, అనుబంధాల్ని గుర్తించలేదు. కానీ, తెలుగు జానపద స్త్రీలు మాత్రం వాళ్లిద్దరి అన్యోన్యతను, ఎడబాటులో కూడా వారి ఆప్యాయతలను అందంగా అల్లి మనకందించారు. 
      ఈ ‘ఊర్మిళాదేవి నిద్ర’ గేయాన్ని జానపదులు ‘ఉయ్యాలతొట్టి’ పాటగా పాడుకుంటారు. ‘కస్తూరి రంగరంగా’ అనే గేయబాణీలో సాగుతుంది. ఈ గేయ సాహిత్యాన్ని నేదునూరి గంగాధరం ప్రచురించారు. దేవేంద్ర సత్యార్థి ఆంగ్లంలోకి అనువదించారు. భారతీయ జానపద సాహితీ భిక్షువైన దేవేంద్ర... తెలుగు ప్రాంతాలకు వచ్చి మరీ రామాయణ సంబంధ గేయాలను సేకరించారు. వాటిని ‘మీట్‌ మై పీపుల్‌’ అనే గ్రంథంగా ప్రచురించారు.
అల్లికలో అందమెంతో!
రావణ సంహారం పూర్తయ్యింది. సీతారాములు తిరిగి వచ్చారు. అయోధ్య కళకళలాడుతోంది. శ్రీరామపట్టాభిషేక సన్నాహాలు జరుగుతున్నాయి. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అన్నగారి సేవలో నిమగ్నులయ్యారు. జానకి రామయ్యతో నెమ్మదిగా ఇలా అంటోంది...
ముందు మనమడవులకు పోగాను, ముద్దుమఱది వెంటనూ
పయనమై రాగ జూచి - తన చెలియ పయనమయ్యెను ఊర్మిళ
వద్దు నీఉండుమనుచూ సౌమిత్రి మనల సేవింప వచ్చెనూ
నాడు మొదలూ శయ్యపై కనుమూసి నాతి పవ్వళించుచున్నాది
ఇకనైన ఆనతిచ్చి తమ్ముని ఇందుముఖి కడకంపుడీ

      ఊర్మిళ త్యాగాన్ని ముందుగా గుర్తించింది సీతమ్మ ‘స్త్రీ’ హృదయమే. కానలకు సంసిద్ధమైన ఊర్మిళను మరిది లక్ష్మణుడు వద్దన్నాడు. అసలు ఊర్మిళ లక్ష్మణుణ్ని అనుసరించి ఉండి ఉంటే సీతాపహరణ జరిగేదే కాదేమో! ఏది ఏమైనా... పతికి దూరమైన క్షణం నుంచి ఊర్మిళ నిద్రపోతూనే ఉంది. లక్ష్మణుణ్ని వెంటనే ఆమె దగ్గరికి పంపండంటూ భర్తకు సూచించింది సీత. 
      జానకి మాటల్లోని అంతరార్థాన్ని రామయ్య అర్థం చేసుకున్నాడు. తమ్ముడిని పిలిచి చెప్పాడు. అన్నగారి ఆజ్ఞను మహాప్రసాదంగా భావించిన లక్ష్మణుడు... ఇన్నేళ్లుగా మనసులో అణచుకున్న ప్రణయ భావనలకు స్వేచ్ఛనిచ్చాడు. పెల్లుబికే గాఢానురాగంతో ఊర్మిళ శయ్యాగృహాన్ని చేరుకొన్నాడు.
      ఊర్మిళను నిద్రలేపి, తన తప్పిదాన్ని మన్నించాలని అర్థించి, ఆమెకు కొంచెం సమయం ఇచ్చి ఉండాల్సింది! కానీ లక్ష్మణుడు అలా చెయ్యలేదు. ‘కొమ్మ నీ ముద్దు మొగము - సేవింప కోరినాడే చంద్రుడు’ అంటూ సందడి చేశాడు.
      పద్నాలుగేళ్ల నుంచి మూసిన కన్నులు తెరవకుండా నిద్రపోతున్న ఊర్మిళ తత్తరపడి లేచింది. తన పాదాలపై స్పర్శను తెలుసుకుని లేచి కూర్చుంది. పరపురుషులెవరైనా ప్రవేశించలేదు కదా అని భయభ్రాంతురాలైంది. ఏళ్లకేళ్ల ఎడబాటుతో ఊర్మిళ, భర్త రూపురేఖలను సైతం మర్చిపోయింది! ఆమె ఊహాపథంలో లక్ష్మణుడి ఆలోచనలే ఉన్నాయి కానీ అతని ఆకారం మసకబారిపోయింది. అందుకే...
అయ్య మీరెవ్వరయ్యా మీరింత ఆగడంబుల కొస్తిరీ
సందుగొందులు వెతుకుతూ - మీరింత తప్పుసేయగ వస్తిరీ
ఎవ్వరును లేనివేళ మీరిపుడు - ఏకాంతములకొస్తిరా అని మందలించింది.
ఈ మందలింపులో ఆమె సిగ్గు, సౌశీల్యం వ్యక్తమౌతాయి.
మా తండ్రి జనకరాజు వింటె మిము - ఆజ్ఞసేయక మానరు
మాయొక్క బావవిన్న మీకిపుడు - ప్రాణములకు హానివచ్చు
మా అక్కమఱిది విన్న మిమ్మిపుడు - బ్రతకనివ్వడు జగతిలో అని హెచ్చరించింది.

      తండ్రి, బావ, అక్కమరిది(లక్ష్మణుడు) నిత్యం తన క్షేమాన్నే కోరుకుంటారని, తనకు ఆపదవస్తే వాళ్లు రక్షిస్తారనే ఆత్మవిశ్వాసం ఊర్మిళకు ఎప్పుడూ ఉంది. ‘భర్త’ అని చెప్పకుండా ‘మా అక్కమరిది’ అనడంలో తెలుగువాళ్ల సంప్రదాయ మధురిమ గోచరిస్తుంది. గాఢమైన నిద్రనుంచి ఊలిక్కిపడి లేవడం వల్ల భర్తను గుర్తించలేకపోయింది ఊర్మిళ. కానీ, వాళ్లు తన శ్రేయోభిలాషులన్న విషయాన్ని మాత్రం మర్చిపోలేదు. స్త్రీ రక్షణ బాధ్యత భర్తదే కాదు... పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లందరిదీ అన్న జానపదుల అభిప్రాయానికి ఈ మాటలు నిదర్శనాలు. 
హెచ్చయిన వంశానికి - అపకీర్తి వచ్చెనేనేమి చేతు
కీర్తిగల ఇంట బుట్టి - అపకీర్తి వచ్చెనేనేమి చేతు

      పరపురుషులు తన శయనమందిరం వరకూ రావడమా! పుట్ట¨నింటికి, మెట్టినింటికి అదెంత అపకీర్తి అంటూ దిగులు చెందుతోంది. ఇంతటి దుర్గతి పట్టిందేంటి తనకు అనుకుంటూ కుమిలిపోతోంది. అయినా ధైర్యం తెచ్చుకుని, తాను పరాయివాడనుకుంటున్న సొంతవాడికి హితవు చెబుతోందిలా... 
ఒకడాలి గోరిగాదా - ఇంద్రునికి ఒడలెల్లహీనమాయె
పరసతిని కోరి కాదా - రావణుడు మూలముతో హతమాయెను 

      రావణుడు సమూలంగా హతమైన విషయం ఊర్మిళకు ఎలా తెలిసింది? ఇది జానపదుల స్పృహను తెలిపే విషయం. 
      సాంఘిక దురాచారాలను ఎత్తిచూపటంలో జానపద స్త్రీలు ఎప్పుడూ విజ్ఞతనే ప్రదర్శించారు. ఏదో విధంగా ఆగంతకుని పంపించి వేయడం సబబు అనే ప్రాపంచిక పరిజ్ఞానంతో - ‘ఆడతోడూ బుట్టరా మా వంటి తల్లి లేదా మీకును’ అని నిలదీసిన ఊర్మిళ అచ్చమైన తెలుగింటి ఆడపడుచు. ఊర్మిళ ఇక్కడ నిస్సహాయ కరుణామూర్తిగా కనిపిస్తుంది. ఆనాటి ఆమె మాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంటాయి!  
      పరిస్థితిని గమనించిన లక్ష్మణుడు తానెవరో, ఊర్మిళకు తనకు సంబంధమేంటో చెప్పాడు.
సీత మరదిని గానటే - చేడెరో దయయుంచి మేలుకొనవే
నినుబాసినది మొదలూ - ప్రాణసఖి నిద్రాహారము లెరుగనే
నీవులేకయున్ననూ - ఓ సఖీ ప్రాణములు నిలువలేవే అంటూ ఒరలో ఉన్న కత్తితో తన తల తెగ్గోసుకోవడానికి సిద్ధపడ్డాడు. భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా పెనవేసుకుపోవాలో జానపద స్త్రీలు లక్ష్మణుడి ద్వారా సూచించారు. లక్ష్మణునికున్న ‘చిత్తశుద్ధి’ ప్రతి భర్తకూ ఉండాలని కోరుకున్నారు.
      ఊర్మిళ వెంటనే భర్తని గుర్తించింది. ప్రణమిల్లింది. లక్ష్మణుడు ఊర్మిళను హృదయానికి హత్తుకున్నాడు. అయినా... ఆమె దుఃఖం తీరలేదు.
మా తండ్రి జనకరాజు మిము నమ్మి మరచి కల్యాణమిచ్చి
మానవంతల్లుడనుచు తెలియకా మదిని యుప్పొంగుచుండె
చిత్తమొక దిక్కు నుంచి సమయమున చిన్నబుత్తురు ఇంతులా
అని వాపోయింది. ఇలా దెప్పడం స్త్రీ సహజమైన అలకతోనే. అప్పుడు లక్ష్మణుడు ఊర్మిళను బుజ్జగిస్తూ... ఓదార్చాడిలా...
తరుణి పదునాలుగేండ్లు నిను విడిచి ధరియిస్తినీ ప్రాణము
ఆహార ని్రëŸలున్ను యెరుగను అతివ నీమీద యాన
పుణ్యపురుషుల స్త్రీలను యెడబాపి పూర్వజన్మమున మనము
ఎన్నెన్ని యుగములైనా, ఇది మనకు అనుభవించక తీరదు   

      ఎడబాటును ఊర్మిళా లక్ష్మణులు పూర్వజన్మ కర్మఫలంగానే భావించారు. ఎవరినీ దోషుల్ని చేయడానికి ప్రయత్నించలేదు. ఇది భారతీయ జీవనంలో నిబిడీకృతమైన కర్మ సిద్ధాంతం.
మాటకు మాట...
దంపతులిద్దరికీ సంపెంగ నూనె అంటి స్నానాలు చేయించింది కౌసల్య. అనేక అలంకారాలు చేసింది. లక్ష్మణుడు దేవేంద్ర భోగంతో భోజనానికి ఆసీనుడయ్యాడు. ఇంటి పెద్దాడపడుచు శాంత ‘మరదలా మాణిక్యమా రమ్మని’ ఊర్మిళను తీసుకుని వచ్చింది. లక్ష్మణుడి పక్కన కూర్చోబెట్టింది. పిండివంటలతో ఇద్దరికీ కొసరి కొసరి భోజనాలు తినిపించారా పెద్దలు. 
      ఆనాడు ఊర్మిళ ముఖంలో కనిపించిన సౌందర్యం, ఆనందం వర్ణనాతీతం. అది చూసిన వదిన శాంతమ్మ మనసులో ముచ్చటపడినా...
కుందనపు ప్రతిమకళలూ - ఈ కళలు ఎందుండి దాగున్నవో
దృష్టి తగులకుండాను నీలాల నివ్వాళులివ్వరమ్మా...

      అంటూ ఊర్మిళకు దిష్టి తగలకుండా హారతివ్వమని సీతతో చెప్పింది. అందులోని వేళాకోళాన్ని సున్నితంగా గ్రహించిన సీత - ‘ఇంద్రాది చంద్రులను వలపించేటి చంద్రులు మీ తమ్ములు’... వారికే దిష్టి తీయమని ఎదురు వేళాకోళమాడింది. ‘అక్కచెల్లెండ్రు మీరు - మిక్కిలి సౌందర్య శాలురమ్మా/ మా తమ్ములు నలుగురిని  - వలపించు జాణలకు దృష్టితగులు’ అని శాంత సీతమ్మతో తిరిగి పరాచకమాడుతుంది. 
      ఓడిపోవడం సీతకు కాదు జానపదులకే ఇష్టం లేదు. వెంటనే సీతతో జానపద స్త్రీలు పలికించిన మాటలు, సున్నితమైన హాస్యాన్నే కాదు, దాంపత్యపు ప్రణయ ఘుమఘుమలను పట్టిస్తాయి.
మాయన్న ఋష్యశృంగుని - వనములో కూడి యెడబాయకున్న
ఏమి యెఱుగని తపసిని - ఓ వదిన కేళించి విడిచినావు
      ఋష్యశృంగుడంతటివాణ్ని వలచి వలపించుకున్నావు... నీకన్నా అధికులమా? అని చురక వేసింది చూశారా! కుటుంబ జీవనంలో ఈ ఒద్దికలు, సత్సంబంధాలు, ముచ్చట్లు, వేళాకోళాలు మనసుల్ని రంజింపచేస్తాయి. 
అదే ఉర్మిళ గొప్పతనం  
వేలు కొప్పమర విడిచి లక్ష్మణుడు నేర్పుతో జడలల్లెను
బొండుమల్లెలు జాజులు జడపైకి శృంగారముగ జడజుట్టనూ
తాంబూలములు వేయుచూ దంపతులు కలిసి ముచ్చటలాడిరీ

      ఊర్మిళా లక్ష్మణులు ఏకాంతంలో పట్టుపరుపులపై ఆసీనులయ్యారు. కర్పూర తాంబులాల్ని సేవిస్తూ ముచ్చటలాడుకుంటున్నారు. ఆ సమయంలో ఊర్మిళ భావోద్వేగం ఒక్కసారిగా పెల్లుబికింది. ప్రశ్నల రూపంలోకి మారిన ఆ ఉద్వేగం... లక్ష్మణుడికి ఊపిరాడనివ్వలేదు.
సింహ విక్రములు మీరుండగా - సీతెట్లు చెఱబోయెనూ?
రామలక్ష్మణులు మీరుండగా - రమణెట్లు చెఱబోయెను?

      ఒక స్త్రీ చెరబోవడాన్నే జానపదులు సహించలేదు. అలాంటప్పుడు... తోటికోడలు, అక్క సీతమ్మను రావణుడు అపహరించుకుపోవడాన్ని ఇక్కడ ఊర్మిళ ఎలా జీర్ణించుకుంటుంది? అందుకే... పద్నాలుగేళ్ల విరహానంతరం పతి ఆలింగనాన్ని ఆశిస్తూ కూడా ఊర్మిళ స్వార్థపూరిత కాలేదు. అక్కకు జరిగిన అన్యాయానికి కారణమేంటని ప్రశ్నించింది. ఈ ప్రశ్న ఊర్మిళ పాత్రనే కాదు... ‘ఊర్మిళ నిద్ర’ను గానం చేసిన జానపద స్త్రీలను సైతం ఉన్నత స్థానాలలో కూర్చోపెట్టింది. జానపద స్త్రీల ఉదాత్తత, సౌకుమార్యం సంస్కారం ఊర్మిళ పాత్రలో మూర్తీభవించాయి. సీత చెర గురించి అత్తగార్లు ప్రశ్నించకపోవడం, ఊర్మిళ మాత్రమే భర్తను తప్పుపట్టటం ... సీతతో ఊర్మిళకున్న అనుబంధానికి అద్దం పడుతుంది. 
జరిగిన కథ మొత్తాన్ని లక్ష్మణుడు ఊర్మిళకు చెప్పాడు. ఆ కథ విని ఆ క్షణంలో బాధపడింది ఊర్మిళ మాత్రమే కాదు! తెలుగు జానపద స్త్రీలందరూ కంటతడి పెట్టారు. అడవిలో సీత కష్టాలను తోటివారికి వినిపించింది ఊర్మిళ. సీతారాములిద్దరూ సుఖంగా అయోధ్య చేరినందుకు పొంగిపోయింది. ‘కాలవిధి గడుప వశమా -కడకు ఆ బ్రహ్మకైన గానీ’ అంటూ తనను తాను ఊరడించుకుంది. 
      కర్మసిద్ధాంతాన్ని అనుసరించే మనకొచ్చే కష్టసుఖాలన్నీ ఉంటా యని చెప్పడం జానపదుల ఆధ్యాత్మిక ఆలోచనలకు మచ్చుతునక. జానపదుల కథల్లో... కథ, కథాపరిణామం, రసానందం మాత్రమే కాదు, భావ సౌకుమార్యం, భాషాసౌందర్యం కనిపిస్తాయి. తేలిక మాటల్లో లోతైన అర్థాన్ని కూర్చడం వాళ్లకు మాత్రమే తెలిసిన విద్య. ‘ఉర్మిళాదేవి నిద్ర’లోని ప్రతి మాటా దీనికి సాక్ష్యమే.


వెనక్కి ...

మీ అభిప్రాయం