ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు...

  • 495 Views
  • 5Likes
  • Like
  • Article Share

    డా.పి.శశిరేఖ

  • విశ్రాంత ఆచార్యులు
  • హైదరాబాదు
  • 9346664116

ఒక ఉపాధ్యాయుడు, వ్యాకరణజ్ఞుడు, కవి, విమర్శకుడు, వ్యాసరచయిత, పండితుడు, వ్యాఖ్యాత, అనువాదకుడు... ఇన్ని రూపాలు ఒక్కరిలోనే ఉంటే ఆ రూపం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిదే. అలంకారశాస్త్రం, వ్యాకరణం, వేదాంతం, ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు ఇలా భారతీయ భాషా సాహిత్య సంస్కృతుల మూలాలను సంస్కృత భాష నుంచి చక్కటి తెలుగులో పరిచయం చేసిన మహామహోపాధ్యాయుడు ఆయన. 
      పుల్లెల శ్రీరామచంద్రుడు 1927 అక్టోబరు 24న తూర్పుగోదావరి జిల్లా ఐనవోలు మండలం ఇందుపల్లిలో జన్మించారు. సత్యవతి, సత్యనారాయణశాస్త్రి దంపతులు ఆయన తల్లిదండ్రులు. దేశమంతా వెలుగులు నింపే దీపావళి పర్వదినాన జన్మించిన ఆయన వేసిన ప్రతి అడుగూ ప్రగతిపథం వైపే సాగింది. ఆడిపాడే వయసులోనే తండ్రి దగ్గర వ్యాకరణం, పంచకావ్యాలు చదువుకున్నారు. తర్వాత నరేంద్రపురంలో కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి దగ్గర ప్రౌఢకావ్యాలు, వ్యాకరణ గ్రంథాలు అధ్యయనం చేశారు. ఆయన ప్రోత్సాహం శ్రీరామచంద్రుణ్ని మద్రాసు సంస్కృత కళాశాల విద్యార్థిగా నిలిపింది. ఆయన అక్కడ రెండు స్వర్ణ పతకాలు అందుకున్నారు. 
      ఆ క్రమంలోనే తెలుగు ‘విద్వాన్‌’, హిందీ ‘విశారద’ పట్టాలనూ పొందారు. తర్వాత మలికిపురం ఉన్నత పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. అక్కడ ఉన్నప్పుడే బి.ఏ. ఉత్తీర్ణులయ్యారు. తర్వాత కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో చేరి, సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషా సాహిత్యాల్లో ఏకంగా మూడు స్నాతకోత్తర పట్టాలు అందుకున్న విశిష్టుడు శ్రీరామచంద్రుడు. వ్యాకరణ, వేదాంత, అలంకార శాస్త్రాలలో ఆయనది నిరుపమాన పాండిత్యం. ఆయన కావ్య కన్యకకు సంస్కృతం, హిందీ, తెలుగు భాషలే కాదు ఆంగ్లమూ తెలుసు. 
      శ్రీరామచంద్రుడు 1960లో వరంగల్లు ఆర్ట్స్, సైన్సు కళాశాలలో అధ్యాపకులుగా నియమితులయ్యారు. అక్కడ ఉన్నప్పుడే రవీంద్రుని గీతాంజలిని మందాక్రాంత వృత్తంలో సంస్కృతంలోకి అనువదించారు. ఇంకా రాఘవ, కుమతీ శతకాలను రాశారు. 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాలకి ఆయనకు బదిలీ అయింది. 27 ఏళ్లపాటు ఆయన ఇక్కడే ఆచార్య పీఠాన్ని అధిష్ఠించారు. విశ్వవిద్యాలయంలో బోధిస్తూనే ఎన్నో సంస్కృత గ్రంథాలకు తెలుగు అనువాదాలు, వ్యాఖ్యలు సమకూర్చారు. ఆయన తెనిగించిన లఘుసిద్ధాంత కౌముది వ్యాఖ్యానం ఎంఏ తెలుగు విద్యార్థులకు అపురూప కానుక. సంస్కృత అలంకారశాస్త్ర గ్రంథాలకు తెలుగులో అనువాదాలు లేని కొరతను... కావ్యాలంకారం, కావ్యప్రకాశ తదితర రచనలతో తీర్చారాయన. ఇక బోధన విషయానికి వస్తే... ఆయన నోటి నుంచి వెలువడితే ఎంత జటిలమైన విషయమైనా అది ద్రాక్షాపాకమే.
      ఆర్యేంద్రశర్మ పర్యవేక్షణలో పుల్లెల శ్రీరామచంద్రుడు ‘జగన్నాథ పండితరాయల సాహిత్యం’ మీద పరిశోధన చేశారు. దానికి 1985లో ఆల్‌ ఇండియా ఓరియెంటల్‌ కాన్ఫరెన్సు వాళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికచేశారు. ఆచార్యులుగా ఉంటూనే సంస్కృత అకాడమీ సంచాలకులుగా, సురభారతి కార్యదర్శిగా సేవలందించారు. సంస్కృత అకాడమీ సంచాలకులుగా ఉన్నప్పుడు వెలువడ్డ సంచికలైతే విజ్ఞానకోశాలే. సురభారతి కార్యదర్శిగా దాదాపు 25 గ్రంథాలు ప్రచురించారు. బ్రహ్మసూత్ర శాంకరభాష్యం, భగవద్గీతా శాంకరభాష్యం, సర్వదర్శన సంగ్రహం తదితరాలు సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించి ఆయన అందించిన శాస్త్రరత్నాలు. ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి... వాల్మీకి రామాయణాన్ని లోతుగా పరిశీలించి అధ్యయనం చేసి 10,000 పేజీల్లో తెలుగువారికి అందించిన శ్రీమద్రామాయణం. ఆయన హిందూమతం అనే గ్రంథం కేవలం హిందూమతం గురించే కాకుండా మరిన్ని ఇతర మతాల పుట్టుపూర్వోత్తరాలనూ అందిస్తుంది. 
      శ్రీరామచంద్రుడి కృషికి గుర్తింపుగా 2011లో భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించింది. వేదాంత విశారద, వేదాంత వారధి, శాస్త్రకళానిధి ఆయన పాండిత్యానికి కొలమానాలుగా నిలిచిన బిరుదులు కొన్నిమాత్రమే. ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారాయన. కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని తెలుగులోకి అనువదించిన ఆయన చాణక్యుణ్ని ‘ఇండియన్‌ మాకియవెల్లి’ అంటే ఒప్పుకునేవారు కారు. మాకియవెల్లి రాజకీయం నిరాశాపూరిత మైంది కాగా, కౌటిల్యుడిది మంచిని పెంచేదిగా చెబుతారాయన.
      ఓమారు సరస్వతీ దేవి పురుషాకృతి దాల్చాలనుకుని, బాణునిలా జన్మించిందని ఓ కవివాక్కు. ఇది శ్రీరామచంద్రుడికీ వర్తిస్తుంది. బ్రహ్మదేవుడు ఎంతగా ఎదురు చూశాడో కానీ, ఇక్కడ శ్రీరామచంద్రుడి రూపంలో ఉండిపోయిన ఆ చదువులతల్లి గత జూన్‌ 24న తన పురుషరూపాన్ని వదిలి బ్రహ్మలో లీనమైపోయింది. సంస్కృత భాషలో ఉన్న వెలుగును తెలుగుకు అందించిన తెలుగువెలుగు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు.

*  *  *


వెనక్కి ...

మీ అభిప్రాయం