కాటనుం తం నమామ్యహం

  • 181 Views
  • 0Likes
  • Like
  • Article Share

నీటివనరులె జాతిసిరులని
జనుల కొఱకే మనిన
కారణ జన్ముడవు నీవు
ఇది నీవు పెట్టిన దీపమే

జనం బాగుకోసం దీపం పెట్టిందెవరో కాదు... ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణ బాధ్యతలు తలకెత్తుకున్న కాటనే. 19వ శతాబ్దం తొలినాళ్ల నాటికి కోస్తా ప్రాంతం అక్కడక్కడా కొన్ని జమీందారీలు మినహా మిగతా ప్రాంతం అంతా బ్రిటిష్‌వాళ్ల హస్తగతమైంది. అంతకుముందు వివరాలు అంతగా తెలియవు కానీ, బ్రిటిష్‌ పాలన మొదలైనప్పటి నుంచి మనదేశంలో సంభవించిన కరవు కాటకాలు, తద్వారా జరిగిన నష్టం గురించి వివరాలు ప్రభుత్వ రికార్డుల నుంచి అందుబాటులో ఉన్నాయి. 1765లో బ్రిటిష్‌ పాలన మొదలైన ఏడాది నుంచి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం ముగిసిన 1858 వరకు- అంటే తొంభై ఏళ్ల కాలంలో ఏడేళ్లకు ఒకటి చొప్పున పన్నెండు కాటకాలు పలకరించాయి. 1800- 40ల మధ్య గోదావరి జిల్లాలను అతివృష్టి అనావృష్టి పరిస్థితులు చుట్టుముట్టాయి.
ప్రకృతి విపత్తులు ఇలా పీడిస్తుంటే... పరాయి దేశస్థుల పాలనలో సాగుతున్న బలవంతపు భూమిశిస్తు వసూలు, మాంచెస్టర్‌ వస్త్రాల దిగుమతితో కుదేలైన చేనేతరంగం నుంచి నేతకార్మికులూ వ్యవసాయాన్ని ఆశ్రయించటం, నిరక్షరాస్యత, ఉపాధి అవకాశాలు అసలే లేకపోవడం లాంటివాటితో ఇప్పటి గోదావరి జిల్లా పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ లేదు. ఈ ప్రాంతంలో 1821లో సుమారు ఏడున్నర లక్షల జనాభా ఉంటే... అది మరో రెండు దశాబ్దాలకు అయిదున్నర లక్షలకు తగ్గిందంటేనే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలుస్తుంది. ఇలాంటి సంకట సమయంలోనే ఆపద్బాంధవుడిగా వచ్చాడు ఆర్థర్‌ కాటన్‌.
      ఆర్థర్‌ కాటన్‌ 1803 మే 15న ఇంగ్లాండులోని కాంబర్‌మిర్‌ ఆబిలో హెన్రీ కాల్వెలీ కాటన్‌ దంపతులకు జన్మించాడు. ఇంజినీరింగ్‌లో శిక్షణ పొంది తన 18 ఏట 1821లో ప్రెసిడెన్సీ ఛీఫ్‌ ఇంజినీర్‌కు సహాయకుడిగా మద్రాసుకు వచ్చాడు. నీటిపారుదల పనులను పర్యవేక్షిస్తూ, నీటి నిర్వహణకు సంబంధించిన ఆనుపానులన్నింటినీ ఒడిసిపట్టుకున్నాడు. అలా 1836 నాటికి పూర్తిచేసిందే తంజావూరు జిల్లా కావేరీ నదిమీద కాలెరున్‌ ఆనకట్ట. ఈ ఆనకట్ట నిర్మాణం తర్వాత తంజావూరు జిల్లా దశ తిరిగిపోయింది. ఆ తర్వాత కాలంలో కాటన్‌ విశాఖపట్నానికి ఇంజినీరుగా వచ్చాడు. ఆ సమయంలోనే గోదావరి ప్రజల స్థితిని చూసి చలించిన కాటన్‌... ‘తమ పాదాల దగ్గర సమృద్ధిగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ, నీళ్లను సద్వినియోగం చేసుకోలేక ఇక్కడి ప్రజలు దీనస్థితిలో మగ్గుతున్నార’ని అప్పటి మద్రాసు గవర్నర్‌ గ్రాంట్‌డఫ్‌కి నివేదిక ఇచ్చాడు. గోదావరి జిల్లాల్లో సాగుభూమి లభ్యత 13 లక్షల ఎకరాలు ఉండగా, సాగులో ఉన్నది లక్ష ఎకరాలే. ఆదాయానికి భూమిశిస్తు మీదే ఆధారపడ్డ ప్రభుత్వానికి ఈ ప్రాంతం నుంచి ఆదాయం అంతగా అందేదికాదు. దాంతో ఈ ప్రాంతంలో గోదావరి జలాల సద్వినియోగానికి ఆనకట్ట నిర్మించాలని తలపెట్టింది. బాధ్యతల్ని కాటన్‌కు అప్పజెప్పింది.
      అలా 1844 ఆగస్టు నుంచి 1845 ఏప్రిల్‌ మధ్య గోదావరి డెల్టాను సర్వే చేసిన కాటన్‌ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాడు. ఆ సూచనల మేరకు ప్రభుత్వం 1846 డిసెంబరులో ఆనకట్ట నిర్మాణానికి అనుమతినిచ్చింది. 1847 ఏప్రిల్‌లో ప్రారంభమైన ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం 1852లో పూర్తయింది. తనది కాని ప్రాంతంలో, తన భాష కాని వేలాది మంది కూలీలతో పనులు నైపుణ్యంగా, చాకచక్యంతో చేయించుకోవడం అంటే మాటలా? ఈ కార్యాన్ని తనమీద వేసుకుంది తెలుగువాడైన వీణెం వీరన్న. ఇక ఆనకట్ట నిర్మాణంలో ఉండగా ఆరోగ్యం బాగాలేక కాటన్‌ ఆస్ట్రేలియాకు వెళ్తే.... ఆయన స్థానాన్ని ఛార్లెస్‌ అలెగ్జాండర్‌ భర్తీచేశాడు. చివరికి ఆనకట్ట నిర్మాణానికి అయిన మొత్తం వ్యయం పదిహేను లక్షల రూపాయలే. ఆ కాలంలో ప్రపంచంలో అతి తక్కువ వ్యయంతో నాణ్యమైన ఆనకట్టలు నిర్మించే వ్యక్తిగా కాటన్‌ ప్రసిద్ధిచెందాడు. ఈ ఆనకట్ట మొత్తం 11,849 అడుగుల పొడవుతో నాలుగు డివిజన్లుగా ఉంటుంది. ఇది పాతబడటంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాని స్థానంలో కొత్త ఆనకట్టను నిర్మించింది. దానికి కాటన్‌ పేరేపెట్టి ఆయనను గౌరవించింది.
ఆ తర్వాత
అప్పటివరకు గోదావరి జిల్లాలను రాజమండ్రి జిల్లాగా వ్యవహరించేవాళ్లు. ఆనకట్ట తర్వాత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలనే భౌగోళిక ప్రాంతాలుగా అవతరించాయి. అప్పటివరకు కరవుకాటకాల వల్ల జనాభా వృద్ధి తగ్గుతూ ఉండగా... ఆ తర్వాత జనాభా ఇంతలంతలుగా పెరిగిపోయింది. సాగునీటి వసతి ఏర్పడటంతో ఇతర జిల్లాల నుంచీ వలసలు పెరిగాయి. పంటలు బాగా పండటంతో భూమిశిస్తు సక్రమంగా వసూలై ప్రభుత్వ ఖజానా కళకళలాడింది. భూముల ధరలకూ రెక్కలొచ్చాయి. రవాణా సదుపాయాలు పెరగడంతో వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి. పట్టణీకరణ వేగవంతమైంది. 
      ఈ సంధి కాలంలోనే కొత్తగా చదువుకున్నవాళ్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, హోటళ్లు తదితర రంగాలకు చెందిన వాళ్లతో మధ్యతరగతి వర్గం ఆవిర్భవించింది. మద్రాసు ప్రెసిడెన్సీలో న్యాయవాదుల సంఖ్యలో తంజావూరు తర్వాత రాజమండ్రి రెండో స్థానంలో ఉండేదట. ఈ సమయంలోనే కందుకూరి వీరేశలింగం, న్యాయపతి సుబ్బారావు, టంగుటూరు ప్రకాశం, కూర్మా వెంకట రెడ్డినాయుడు, పిఠాపురం రాజా, గుమ్మడిదల దుర్గాబాయి, భోగరాజు పట్టాభిసీతారామయ్య తదితర ప్రముఖులు మనకు దర్శనమిస్తారు. మొత్తానికి ఆనకట్ట నిర్మాణం అనంతరం రాజమండ్రి, మద్రాసుకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. అందుకే మనకు సంస్కరణ హృదయాలు, సాహితీ పర్వాలు, న్యాయవాదుల వాదనలు, రాజకీయ రాజసాలు, స్వాతంత్య్రోద్యమ సైనికులతో రాజమండ్రి పరిసర ప్రాంతాలు సందడిగా ఉన్నట్లు 20వ శతాబ్దపు తొలి యాభై ఏళ్లనాటి పుస్తకాలు తిరగేస్తే తెలుస్తుంది. మరి ఇదంతా కాటన్‌ చలవే. 
అందుకే ఈ నాటికీ గోదావరి జిల్లాల ప్రజలు ఆ అపర భగీరథుని పేరుతో 
నిత్యగోదావరీ స్నాన/ పుణ్యతోయా మహామతిః/ స్మరామ్యాంగ్లదేశీయం/ కాటనుం, తం భగీరథం అని సంకల్పం చెప్పుకుంటారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం