కైలాసాన కార్తీకాన శివరూపం

  • 762 Views
  • 15Likes
  • Like
  • Article Share

సంకల్పం ఉండాలేగాని ఏ కళ అయినా వశమవుతుంది. సలక్షణ సాధనతో మనతో నిలబడుతుంది. దాన్ని కాలాంతరాలకు అందించే స్థితిని కలిగించినప్పుడు ఏ కళకైనా అంతం అనేది ఉండదు. వీటిలో సంగీత సాహిత్య సమ్మిళితమైన నాట్యం జీవితానికి సరికొత్త భాష్యం చెబుతుంది. ప్రకృతి గమనాన్ని, మానవ జీవితాల్లోని వేదనానుభూతిని ఆవిష్కరిస్తూ రసస్ఫూర్తిని కలిగించే శక్తి నాట్యానికి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజెప్పే పాట.. ‘‘నాదవినోదము నాట్యవిలాసము’’.
నాట్యానికి
సంగీతం ముఖ్యం. సంగీతానికి సాహిత్యం ప్రధానం. ఈ మూడూ సమస్థాయిలో అమరితేనే ప్రేక్షకుడికి రసాస్వాదన కలుగుతుంది. ఎంత గొప్ప నాట్యమైనా రసికులకు ఆనందం కలిగించకపోతే.. ప్రేక్షకుల్లో కదలిక తీసుకురాకపోతే అది నిరర్థకం అంటాడు భట్టనాయకుడు. ‘‘త్రైలోక్య స్వాస్థ్య సర్వస్య నాట్యం భావానుకీర్తనం..’’ అంటారు నాట్యశాస్త్రంలో భరతముని. ముల్లోకాల్లోనే కాదు.. అన్ని కళల్లోనూ నాట్యం సర్వోత్కృష్టమైందే. దేశంలో చాలా నాట్య సంప్రదాయాలున్నాయి. వాటిలో దేని ప్రత్యేకత దానిదే. అవన్నీ ఈశ్వరార్చనకు సాధనాలే. ఆ నాట్యరీతులను ఆపోశన పట్టాలి.. విలక్షణ విభిన్న స్వరూపాలున్న వాటినన్నింటినీ ఏకం చేసి ‘భారతీయ నాట్యం’ అనే ఏకైక నాట్య సంప్రదాయాన్ని తీసుకురావాలి.. తద్వారా తన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలనుకున్న ఓ కళాకారుడి కథే ‘సాగరసంగమం’. 1982లో వచ్చిన ఈ చిత్రంలో పాటలన్నీ ఆపాతమధురాలే! 
      ఏటా జరిగే అఖిల భారత సంగీత నాట్యోత్సవాలకు వెళ్లి విభిన్న కళారీతులనూ.. ఆ కళాకారుల నాట్య విన్యాసాలనూ చూడాలి.. తోటి కళాకారుల మధ్య తన కళను ప్రదర్శించాలన్నది కథానాయకుడి స్వప్నం. అది తనకు అసాధ్యమైపోయినప్పుడు మాధవి అనే కళోపాసకురాలి ప్రోత్సాహంతో ఆ ఉత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఈ నేపథ]్యంలో వచ్చే ‘‘నాదవినోదము నాట్యవిలాసము’’ పాట చిత్రంలోని కళాకారుడికే కాదు, గీత రచయితగా వేటూరికీ పరీక్షే! ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ పాటను ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం, శైలజ ఆలపించారు. ఈ చిత్రంలోని పాటలన్నీ ఒక ఎత్తు.. ఈ ఒక్క పాటా మరొకెత్తు. ఇందులో విశేషం ఏంటంటే! ఆ గీతం ఎత్తుగడలోనే వేటూరి గమ్మతైన ప్రయోగం చేయడం!
వేటూరి ప్రత్యేకత
మహాకవి కాళిదాసు రఘువంశం కావ్య రచనలో ప్రారంభంలో ‘‘వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే/ జగతఃపితరౌవందే పార్వతీపరమేశ్వరౌ...’’ అంటూ శివపార్వతుల స్తుతి చేశాడు. శబ్దార్థాల మాదిరిగా విలసిల్లుతూ నిత్యసంబంధ స్వరూపులు, ఈ లోక తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు తనకు శబ్దార్థ జ్ఞానాన్ని ప్రసాదించాలని అర్థిస్తూ నమస్కరిస్తున్నానన్నది ఈ శ్లోక భావం. ప్రస్తుతం ఇక్కడి కళాకారుడిదీ ఇదే పరిస్థితి! ఇంతకాలం గురువులను సేవించి ఎంతో నేర్చుకున్నాడు. నేర్చుకుంటూనే ఉన్నాడు. నలుగురి మెప్పూ పొందాలనే గొప్పకోసం కాదుగానీ.. ఇన్నాళ్లకి తన కళను ప్రదర్శించే అవకాశం వచ్చింది! దాన్ని నిలబెట్టుకోవాలి. కథానాయకుడు 
నటరాజ పాద సుమరజాన్ని తిలకంగా దిద్దుకోవాలనే సంకల్పం ఉన్నవాడు కాబట్టి ముందుగా నాట్యవేదానికి మూలపురుషుడైన ఆ నటరాజును తలచుకుంటున్నట్టుగా ప్రారంభించారు వేటూరి. ‘‘వాగర్థావివ సంపృక్తౌ..’’ అంటూ ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల స్తుతి సూచకంగానే కాదు, అ శ్లోకాన్నీ ఒడుపుగా విరిచి హరిహర స్మరణ కూడా చేసేందుకు వీలు కల్పించారు. ‘‘పార్వతీపరమేశ్వరౌ..’’ అనే పాదాన్ని ‘పార్వతీప రమేశ్వరౌ’ అని సముచితంగా విరిచినప్పుడు రెండు భిన్నార్థాలు కనిపిస్తాయి. ‘పార్వతీప’ అనే పూర్వపదానికీ పార్వతీదేవి భర్త శివుడనే అర్థమూ, ‘రమేశ్వరౌ’ అనే ఉత్తర పదానికి రమాదేవి విభుడు విష్ణుమూర్తి అనే భిన్నార్థ స్ఫురణ కలిగిస్తూ హరిహరనాథులకు ఏకత్వభావనతో స్తుతి చేయడం విశేషం. ఇక తక్కిన పాటంతా నటరాజుని కొనియాడుతూ అందుకు అనుకూలమైన ప్రతీకలతో సాగుతుంది.
నాదవినోదము నాట్యవిలాసము 
పరము సుఖము పరము
అభినయవేదము సభకనువాదము
సలుపు పరమ పదమూ
భావములో భంగిమలో.. 
గానములో గమకములో..
ఆంగికమౌ తపమీ గతిసేయగా.. 

      నాట్యానికి వేద ప్రామాణ్యం ఉంది. అనాది నుంచి, అంటే ఆటవిక దశ నుంచి ప్రకృతి శక్తులను సంతృప్తిపరిచే క్రతువుల్లో భాగంగా ఉంటూ వచ్చింది కాబట్టి వేదవిహిత వ్రతాలతో పాటూ నాట్యాన్నీ పరానికి కొనిపోయే సాధనంగా రుషులు భావించారు. యజ్ఞాదికార్యాల్లో ఈ నాట్యవిలాసం అవసరాన్నీ, ప్రాధాన్యాన్ని వారు దృష్టిలో పెట్టుకున్నారు. రుగ్వేదం నుంచి అక్షరాలనూ, యజుర్వేదం నుంచి అభినయాన్నీ, సంగీత ప్రధానమైన సామవేదం నుంచి గానాన్నీ, అధర్వణ వేదభాగం నుంచి రసభావాలనూ సమ్మిళితం చేసి ‘నాట్యవేదాన్ని’ రూపొందించారు. నాట్యంలో కేవలం కదలికలు మాత్రమే ఉండవు. సాహిత్యం నుంచి భావమూ.. సంగీతంలోంచి రాగమూ ఉత్పన్నమయ్యి అభినయం ద్వారా కొత్త భావావిష్కరణ జరుగుతుంది. ఇక్కడ భావమూ.. భంగిమ అనేవి నాట్యానికి చెందుతాయి. గానమూ గమకమూ సంగీతంలోనివి. ఆంగిక తపం ద్వారా శివసాయుజ్యం కలుగుతుంది. నాట్యనివేదన ద్వారా ఈశ్వరసన్నిధికి ద్వారాలు తెరచుకుంటాయి.
కైలాసాన కార్తీకాన శివరూపం
ప్రమిదేలేని ప్రమధాలోక హిమదీపం
నవరస నటనం జతియుత గమనం
సితగిరి చలనం సురనది పయనం 
భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం
తపముని కిరణం తామసహరణం
శివుని నయన త్రయలాస్యం...

      శివుడు తాండవ నృత్యం చేస్తాడు. అదీ ఎప్పుడంటే సాయంసంధ్యలో. కైలాసంలో శివపార్వతుల నాట్యకేళీ విధానం ఒక్కటిగా ఉన్నప్పటికీ సూక్ష్మంగా పరిశీలిస్తే కొంచెం బేధం కనిపిస్తుంది. శివుడు చేసే నృత్యం తాండవమైతే పార్వతి చేసేది లాస్యం. నాట్య సంప్రదాయం ప్రకారం తాండవం వీరత్వాన్ని సూచిస్తుంది. ఇది పౌరుషానికీ, పురుషత్వానికి సంబంధించిందైతే.. లాస్యం లలితమైంది, మృదువైందీనూ. మగవారు చేసే గంభీర నృత్యాన్నే తాండవం అనవచ్చు. ప్రమధగణాల సేవలో.. భృంగి నందీశ్వరుల స్తుతుల నడుమ పరమశివుడు కైలాసంలో తాండవం చేస్తుంటే.. ఆ అకాల ప్రళయజ్వాల అంతటినీ లయాన్వితం చేసేసినప్పుడు ఆ హిమనగమంతా ఒక దీపంలా కాంతివంతమైందంటారు వేటూరి. ఆ నాట్యం నవరసజనితమయ్యింది. అందులో వేదనలుంటాయి. అనుభూతులుంటాయి. జీవితంలోని స్థితులన్నీ నాట్యంలో ప్రతిబింబిస్తాయి కనుకే ‘బతుకు నిత్య నృత్యం’ అనేది. తాపాన్ని హరించి.. తమస్సును ఛేదించే రక్షాకవచాలు ప్రళయకాల రుద్రుడి త్రినయనాలు.  
నమక చమక సహజం 
నటప్రకృతి పాదజం 
నర్తనమే శివకవచం 
నటరాజ పాదసుమరజం...

      శివారాధనలో ముఖ్యంగా రుద్రాభిషేకంలో ప్రముఖమైనవి నమక చమకాలు. లోకేశ్వరుని సకలరూపాలనూ వర్ణించేది నమకం. ఆ పరమశివుడితో జనుల కోరికల నివేదనకు ఉపకరించేది చమకం. శివతత్వం అనేది నిర్గుణం.. నిరాకారం. ప్రకృతిని ఆరాధించడంలో ఒక భాగం. శివతాండవంలో ఆత్మానందభావన.. నిత్య నిర్మలానంద స్థితి ఒనగూడుతుందనే విశ్వాసాన్ని పాదుకొల్పడమే ఈ పాట ఉద్దేశం.


వెనక్కి ...

మీ అభిప్రాయం