రాజు..రాణి...రెండూళ్లు!

  • 487 Views
  • 9Likes
  • Like
  • Article Share

    జి.మురళీమోహన్‌ గౌడ్‌

  • కడప
  • 9394450040
జి.మురళీమోహన్‌ గౌడ్‌

తీర్చిదిద్దిన భుజకీర్తులు, తీరైన కనుముక్కులతో చూడగానే నచ్చేస్తాయి ‘రాజు- రాణి’ బొమ్మలు! వీటి తయారీతో హస్తకళా క్షేత్రంలో తెలుగువారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్నాయి. కడపజిల్లాలోని శెట్టిగుంట, లక్ష్మీగారిపల్లె. ఈ కొయ్య బొమ్మలకు జీవం పోయడంలో ఈ గ్రామస్తుల సృజనకు వందేళ్ల చరిత్ర ఉంది. తరాలు మారినా, ఆటంకాలెన్ని ఎదురైనా తమదైన వారసత్వాన్ని వదులుకోకుండా కళాఖండాలు సృష్టిస్తున్న ఈ కళాకారుల ప్రస్థానమిది..!
కడప
జిల్లా కేంద్రం నుంచి వంద కిలోమీటర్ల దూరంలోని రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట, లక్ష్మీగారిపల్లె గ్రామాలకి వెళ్తే  ‘ఠక్‌.. ఠక్‌’ మనే చెక్కల్ని చెక్కుతున్న చప్పుళ్లు లయబద్ధంగా గాలిలో నాట్యం చేస్తూ ఉంటాయి. చీర్ణాలతో చెక్కుతున్నప్పుడు పచ్చి చెక్క వాసన అలలు అలలుగా నాసికాపుటాలను తాకుతుంది. పక్క పక్కనే ఉండే ఈ రెండు గ్రామాల వాసులు కొయ్య బొమ్మలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. దాదాపు ప్రతి ఇంట్లోని కుటుంబసభ్యులందరూ కళాకారులే. ఈ కళకు సుమారు శతాబ్దం చరిత్ర ఉంది.  
      వందేళ్ల కిందట శెట్టిగుంట, లక్ష్మీగారిపల్లెలో నలుగురు ఆచారులు జీవిక కోసం సమీపంలోని అడవి నుంచి ఎర్రచందనం దుంగలు తెచ్చి బొమ్మలు తయారు చేయడం మొదలుపెట్టారు. శేషాచలం అటవీ ప్రాంతం కావడంతో రైల్వే కోడూరు చుట్టూ ఎర్రచందనం చెట్లు విరివిగా ఉంటాయి. మొదట్లో చిన్నచిన్న జోడుబొమ్మలు, ఊరగాయ నిల్వ ఉంచుకునే డబ్బాలు, గ్లాసులను ఎర్రచందనంతో తయారు చేసి విక్రయించేవారు. రాన్రానూ జోడుబొమ్మల మీదే ఎక్కువ దృష్టి సారించి వాటికి ‘రాజు-రాణి’ అనే పేరుపెట్టారు. అప్పట్లో పావలా, అర్ధరూపాయి, రూపాయి చొప్పున ఈ బొమ్మల జతను తిరుమల, తిరుపతి సమీపంలోని ఆలయాల దగ్గర విక్రయించేవారు. వీటికి ఆదరణ బాగా ఉండటంతో కళాకారులకు చేతి నిండా పని ఉండేది. దాంతో క్రమంగా ఇతర కుటుంబాలు కూడా ఈ కళను నేర్చుకొన్నాయి. తిరుమలకు వచ్చే తమిళనాడు భక్తులను ‘రాజు-రాణి’ బొమ్మలు బాగా ఆకట్టుకునేవి. అలా మద్రాసులో నిర్వహించే హస్తకళల ప్రదర్శనకు రావాల్సిందిగా 40 ఏళ్ల కిందటే శెట్టిగుంట, లక్ష్మీగారిపల్లె కళాకారులకు ఆహ్వానం అందింది. అందులో వీరి బొమ్మలు పెద్దసంఖ్యలో అమ్ముడు పోయాయి. ఆ తర్వాత దిల్లీ, జైపూర్, నాగపూర్, సేలం, బెంగళూరు, మైసూరు, గ్వాలియర్‌ లాంటి అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలకు ఈ బొమ్మలు తీసుకెళ్లారు. క్రమంగా దేశవ్యాప్తంగా వీటికి ప్రాచుర్యం పెరిగింది. 
ప్రత్యామ్నాయం
‘రాజు-రాణి’ బొమ్మలకు లభిస్తున్న ఆదరణ చూసి లేపాక్షి సంస్థ శెట్టిగుంట, లక్ష్మీగారిపల్లెల మీద ప్రత్యేక దృష్టి సారించింది. 1995 కాలంలో ఈ రెండు గ్రామాల నుంచి నలుగురు మాస్టర్లను ఎంపిక చేసి, ఇతర కుటుంబాలకు చెందిన నలభై మందికి రెండు నెలల పాటు శిక్షణ ఇప్పించింది. అనంతర కాలంలో కళాకారులు తయారు చేసిన ఎర్రచందనం బొమ్మలను తనే కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. కొన్నేళ్లకు ఎర్రచందనం నరికివేత మీద ప్రభుత్వం నిషేధం విధించింది. దాంతో లేపాక్షి వారే అటవీ శాఖ అధికారులతో ఒప్పందం చేసుకుని ఎర్రచందనాన్ని కొనుగోలు చేసి ఆ రెండు గ్రామాలకు సరఫరా చేసేవారు. ఎనిమిది అంగుళాల ఎర్రచందనం రాజు-రాణి జతకు రూ.300, పద్నాలుగు అంగుళాల జతకు రూ.800 చొప్పున చెల్లించేవారు. ఇక్కడి కళాకారులు నాలుగు అంగుళాల నుంచి నలభై ఎనిమిది అంగుళాల వరకు బొమ్మలు చేయగల నేర్పరులు.
      ఎర్రచందనానికి అంతర్జాతీయంగా గిరాకీ పెరిగిన నేపథ్యంలో 2015 నుంచి శెట్టిగుంట, లక్ష్మీగారిపల్లెలకు దాని సరఫరా నిలిచిపోయింది. ఆ తర్వాత ఇక్కడి కళాకారులు ప్రత్యామ్నాయాల మీద దృష్టి సారించారు. టేకు, నెరడి, పాలకొయ్య, సీమచింత, తుమ్మ, కంపచెట్ల కొయ్యలతో బొమ్మలు చేయడం మొదలుపెట్టారు. 2018లో లేపాక్షి మరోసారి నాలుగు నెలలపాటు శిక్షణ ఇవ్వగా ముప్ఫయి మంది రాటుదేలారు. ప్రస్తుతం రెండు గ్రామాల్లో 250 మంది కళాకారులు ఉన్నారు. వీరంతా ‘శ్రీలక్ష్మీ వెంకటేశ్వర కొయ్యబొమ్మ కళాకారుల పరిశ్రమ సహకార సంఘం’ ఏర్పాటు చేసుకున్నారు. ఈ హస్త కళాకారుల్లో అరవై మంది మహిళలు. డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారు ముప్పయి మంది వరకు ఉన్నారు. గతంలో లేపాక్షి నుంచి వచ్చే ఆర్డర్ల మేరకు బొమ్మలు రూపొందించేవారు. ప్రస్తుతం అవి ఆశించినంత మేర ఉండకపోవడంతో ప్రైవేటు వ్యాపారస్థులకు బొమ్మలు విక్రయిస్తున్నారు. ప్రధానంగా ‘రాజు-రాణి’ బొమ్మలను తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి, గోవిందరాజ స్వామి ఆలయాల ప్రాంతాల్లోని వ్యాపారస్థులకు విక్రయిస్తున్నారు. రోజువారీగా వారి నుంచి ఆర్డర్లు తీసుకుని బొమ్మలు తయారు చేస్తున్నారు. ఆరు అంగుళాల రాజు-రాణి బొమ్మలను లేపాక్షికి రూ.200లకు విక్రయిస్తే, ప్రైవేటు వ్యాపారస్థులు రూ.220 చెల్లిస్తున్నారు. అయితే, ఆ వ్యాపారస్థులు ఈ బొమ్మలకు రంగులు వేసి, దుస్తులు తొడిగి రూ.2 నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ బొమ్మలకు కర్ణాటకలో మంచి గిరాకీ ఉంది. అక్కడ చాలా కుటుంబాలు తమ ఇళ్లలో పెళ్లికి ముందు ‘రాజు-రాణి’ బొమ్మలకు వివాహం జరిపించడం ఆనవాయితీ. 
కొయ్యకు ఇబ్బంది
‘రాజు-రాణి’ బొమ్మలను తయారు చేయడానికి కళాకారులు కోత యంత్రం, బాడిశ, సుత్తి, నెమ్మ, చీర్ణాలు, రంపం, సానరాయి లాంటి ఇరవై రకాల పని ముట్లను వినియోగిస్తారు. ముందుగా కొయ్యను నిర్ణీత పరిమాణాల్లో కోసి ఒక రోజంతా నీటిలో నానబెడతారు. దాంతో చెక్కడం సులువవుతుంది. సాధారణంగా ఒక కొయ్యముక్కను మధ్యలోకి చీల్చి రెండు బొమ్మలు తయారుచేస్తారు. ఇటీవల కాలంలో కొందరు కళాకారులు ‘రాజు-రాణి’ బొమ్మలతో పాటు దేవుడి బొమ్మలను కూడా రూపొందిస్తున్నారు. వీటికి అలంకరణలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తయారీకి ఎక్కువ సమయం పడుతుంది. పెద్ద బొమ్మలు చేయాలంటే పది నుంచి ఇరవై రోజులు అవసరమవుతాయని ఇక్కడి కళాకారులు చెబుతున్నారు. వాటి ధరలు కూడా వేలల్లోనే ఉంటున్నాయి. మరికొందరు కళాకారులు ఇంటి తలుపులకు నగిషీలు చెక్కుతూ కళానైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. కొంతమంది తమ ఇళ్లలోనే బొమ్మలు చెక్కుతుండగా, కొన్నిచోట్ల మూడు నాలుగు ఇళ్ల వారు కలిసి ఖాళీ స్థలంలో గుడిసె ఏర్పాటు చేసుకుని తయారీలో మునిగిపోతారు. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకి నాలుగు జతల బొమ్మలు చేస్తారు. పురుషులు పూర్తిగా ఈ పనిలో నిమగ్నమైతే, స్త్రీలు ఇంటి పనులు చూసుకుంటూ బొమ్మలు చేస్తుంటారు. ఇలా ఒక్కో కుటుంబం రోజుకు రూ.15 వందల నుంచి రూ.రెండు వేల వరకు సంపాదించుకోగలుగుతోంది.
ఏళ్లుగా బొమ్మలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న తమకు ప్రస్తుతం కొయ్య దొరకడం కష్టంగా మారిందని ఇక్కడి కళాకారులు చెబుతున్నారు. అడవి నుంచి కొయ్యలు తెచ్చివ్వడానికి ఈ గ్రామాల్లో ప్రత్యేకంగా కొంతమంది మనుషులున్నారు. గతంలోలా టేకు, నెరడి, పాలకొయ్య, సీమచింత, తుమ్మ లాంటి చెట్లు ఎక్కువగా లభించకపోవడంతో ప్రస్తుతం కంపచెట్ల కొయ్యలనే వీరు ఎక్కువగా అందిస్తున్నారు. పది అడుగుల దుంగను రూ.వందకు విక్రయిస్తున్నారు. అయితే, అటవీ శాఖ అధికారులు ఈ కంపచెట్టు కొయ్యలను కూడా అటవీ ఉత్పత్తులుగా భావించి, బొమ్మలు చెయ్యడానికి అనుమతించట్లేదని కళాకారులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమకు అవసరమైన కొయ్య సరఫరా చేసి చేయూత అందించాలని అభ్యర్థిస్తున్నారు. తెలుగునేలకు ఓ ప్రత్యేకతను తెస్తున్న ఈ కళాకారుల కోరిక న్యాయమైందే! మరి పాలకులు దాన్ని ఆలకించి, ఆదరువు అందిస్తారా!?


వెనక్కి ...

మీ అభిప్రాయం

  హస్తకళలు