నదీనాదాలు

  • 481 Views
  • 0Likes
  • Like
  • Article Share

    రామవరపు వెంకటరమణమూర్తి

  • ఆకాశవాణి విశ్రాంత ఉద్యోగి
  • విశాఖపట్నం
  • 9440798301
రామవరపు వెంకటరమణమూర్తి

లక్షల సంవత్సరాల కిందట మొదలైన మానవ పరిణామ క్రమం కీలకమైన మలుపు తిరిగింది నదీతీరంలోనే. అక్కడే నాగరికత నేర్చిన మనిషి, జీవజాతుల్లో సమున్నతుడిగా ఎదిగాడు. అలా ఎదగడంలో కళలది ప్రధాన పాత్ర. కాయకష్టం చేసి అలసిన శరీరానికి కాస్త సాంత్వన కలిగించే క్రమంలో పుట్టిన ఈ కళలు... తర్వాత్తర్వాత భాషాభివృద్ధికి మూలమయ్యాయి. అంటే... నదీమతల్లుల ఒడిలోనే భాష పుట్టి పెరిగిందన్న మాట. ఆ నదీతీర ప్రాంతాల్లో అన్వేషిస్తే విశిష్ట జానపద కళారూపాలతో పాటు తెలుగులో తరగిపోయిన పల్లె పదాలెన్నో కనిపిస్తాయి.
మనుషులు
ఆటవిక స్థితి నుంచి క్రమక్రమంగా నాగరికత వైపు అడుగులు వేస్తుంటే, భావవ్యక్తీకరణ అరుపులు, సంజ్ఞల నుంచి పదాలు, మాటల్లోకి మారింది. కాలగమనంలో మౌఖికంగా సాగిన విద్యార్జన ప్రక్రియ మొదట తాళపత్రాలు, తరువాత పుస్తక రూపంలో సాగింది. శిలాశాసనాలు, తాళపత్రాలు, అచ్చు పుస్తకాలు... ఇవన్నీ భాషాభివృద్ధికి పరికరాలయ్యాయి. అయితే, లిపి పుట్టిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలాకాలం వరకూ మౌఖికంగానే భాషాభివృద్ధి జరిగింది.
      వ్యవసాయం, దాని అనుబంధ వృత్తుల్లో నిమగ్నమయ్యే గ్రామీణులు కాయకష్టం చేసి అలసిపోతారు. శారీరక శ్రమను మర్చిపోవడానికి ఆనాడు వాళ్లు వివిధ కళలను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే పాటలు, యక్షగానాలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలతోపాటు ఎన్నో కళారూపాలను సృష్టించుకున్నారు. అవన్నీ ఆ నోటి నుంచి ఈ నోటికి, ఒకరి నుంచి ఇంకొకరికి చేరేవి. పెళ్లి పాటలు, లాలిపాటలు, సీమంతం పాటలు, వ్యవసాయపు పాటలు... ఇలా లిఖిత రూపం లేని సాహిత్యం తరం నుంచి తరానికి వారసత్వ సంపదగా అందేది.
      కొన్ని శతాబ్దాలుగా పరిణామం చెందుతూ, పరిపుష్టమవుతూ వచ్చిన జానపద కళావాఙ్మయం మారిన పరిస్థితుల్లో అంతర్ధానమయ్యే పరిస్థితి ఏర్పడింది. భాషా శాస్త్రవేత్తలు, పండితులు, పుస్తక ప్రచురణకర్తలు, సాహిత్య అకాడమీలు పూనుకుని... మౌఖికంగా మిగిలిన జానపద సాహితీ సంపదను అక్షరబద్ధం చేయకపోతే తెలుగుభాషలోని విశిష్ట కోణాలెన్నో అదృశ్యమవుతాయి.
      ఈ విషయంలో ఆకాశవాణి కృషిని గుర్తించక తప్పదు. జానపద గేయాలు, యక్షగానాలు, బుర్రకథలు, జముకుల కథలు, తూర్పు భాగవతాలు, తప్పెటగుళ్లు, ఉరుముల వాయిద్యాలు, చెక్కభజనలు వంటి వాటిని ధ్వని ముద్రణ (క్యాసెట్, సీడీలలో రికార్డు చేయడం) చేసి ప్రసారం చేస్తోంది ఆకాశవాణి. ప్రత్యేక సందర్భాల్లో కళాకారులను ప్రజల మధ్యకు తీసుకెళ్లి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విశ్వవిద్యాలయాలు, భాషాపరిరక్షణ సంస్థలూ ఇలాంటి ధ్వని ముద్రణ బాధ్యతను తీసుకుంటే జానపద సాహిత్యం భావితరాలకు అందుతుంది.
నదీతీరాలే ఆధారం
ఇంకా గ్రంథస్థం కాని మౌఖిక జానపద సాహిత్యాన్ని వెతికి పట్టుకోవాలంటే నదీతీర గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఎందుకంటే... నాగరికత భాషాభివృద్ధికి కారణమైతే, నాగరికత వికాసానికి నదులే కారణం. తొలి రోజుల్లో మానవ ప్రగతి అంతా నదీ పరివాహక ప్రాంతాల్లోనే చోటుచేసుకుంది. నదుల కారణంగా వ్యవసాయం వృద్ధిచెంది, ఆహారానికి లోటులేకపోవడంతో... మానసిక సంతోషం కోసం సాహిత్య సృష్టి జరిగింది. అది మౌఖికంగానైనా, లిఖితరూపంలోనైనా! ఇప్పటికీ జానపద కళారూపాల్లో అత్యధికం నదీతీర ప్రాంతాల్లోనే కనిపిస్తాయి.
      కొన్నేళ్ల కిందట ఆకాశవాణి అనంతపురం కేంద్రం పెన్నానదిపై కొన్ని రూపక కార్యక్రమాలను ప్రసారం చేసింది. వీటిలో భాగంగా ‘పెన్నానది- జానపద సంపద’ కార్యక్రమంలో ప్రముఖ జానపద కళాకారుడు అమళ్లదిన్నె గోపీనాథ్‌ (కీ.శే) ఆనాటి పెన్నానది ఉద్ధృతిని తెలిపే పాట పాడారు. ఆ రోజుల్లో ఆ నదిని ఎందుకు ‘పీనుగుల పెన్న’ అనేవారో ఆ పాటతోనే చెప్పారు. వరద ఉద్ధృతికి ఊళ్లకు ఊళ్లు, జన, పశుసంపద ఎలా విలవిలలాడిపోయిందో తెలియజేస్తుందీ పాట...
నీదు మహిమ తెలియలేదుగా, గంగా భవానీ
నాకు తెల్పా నలవి కాదుగా...
ఆదివారం కరువుదొడ్డి, సోమవారం వాన కురిసె
మంగళవారం మాపుటేలకు ఏరులే పొంగిపారె
ఎంత మోసమాయె పెన్నా, నీ మహిమ తెలియకుండా
ఏమి మోసమాయె గంగా నీ మహిమ తెలియలేదు.
అద్దాల చెఱువు తెగి గట్టిగా పెన్నేటి కొచ్చె 
పేరూరు గంగమ్మ గుడి పేరు గాని, లేచెనన్నా
గూళము చంద్రాని గుడి గుద్దుకొని పారెనన్న
ఎంత మోసమాయె పెన్నా నీ మాయ తెలియలేదు
...
...
కత్రిమోల కట్టుకాల్వ కదలకుండా లేచిపోయె
...
...
తాడిపత్రి, రామేశ్వరం గోపురాలె తన్నుకొనె
ఎంత మోసమాయె పెన్నా 
నీ మాయ తెలియలేదు.

పెన్నానదీ ప్రాంతంలో పరిశోధన చేస్తే ఆనాటి గ్రామీణుల ఆచార వ్యవహారాలు బయటపడతాయి. అక్కమ్మ, చౌడమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, సుంకులమ్మ, మాంకాళమ్మ, గంగమ్మలను ఎలా ఆరాధించేవారో, ఎలాంటి పండగలను జరుపుకునేవారో తెలుస్తుంది. ఉరుముల వాయిద్యాలు, పైడిమాండ్ల ఆటలు, జమెకలు, గురవయ్యలు, దాసర్లు, బీరప్పలు మొదలైన కళారూపాల విశేషాలు వెలుగులోకి వస్తాయి. 
చిత్రావతి తీరంలో...
చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో (అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలో) ఒకనాడు దాదాపు ఇరవై కళా రూపాలుండేవి. ప్రస్తుతం చాలా వరకు కనుమరుగయ్యాయి. నిమ్మలకుంటలో సాకేవారు, సింధేవారు...  సుబ్బారావు పేటలో స్థానికులు తోలుబొమ్మలాటలు ఇంకా ఆడిస్తున్నారు. పెనుకొండ ప్రాంతం చాకర్లపల్లెలోనూ కొన్ని కళారూపాలున్నాయి. ప్రసిద్ధ నారసింహ క్షేత్రాల్లో కదిరి నరసింహస్వామి దేవాలయం ఒకటి. దీనికి దగ్గర్లో చిత్రావతి ఉపనది మద్దిలేరు/ అర్జున నది ఉంది. ఈ ప్రాంతంలో నరసింహస్వామిని కీర్తిస్తూ ‘బేట్రాయిసామి దేవుడా’ అన్న పాట ప్రచారంలో ఉంది. ఇందులో దశావతారాల వర్ణన కనిపిస్తుంది. (దీనికి సంబంధించిన పూర్తి వివరణ అక్టోబరు 2013 తెలుగువెలుగు సంచికలో ఉంది) ఇలాంటి జానపద గీతాలు ఒకరు రాసినవి కావు. అనూచానంగా గ్రామీణుల్లో ప్రచారమైన పాటలివి. చిత్రావతి నది దగ్గర్లోనే ఉన్న గోరంట్ల ప్రాంతంలో జోగప్పలు ఉండేవారు. ధర్మవరం చుట్టుపక్కల నేటికీ జానపద గీతాలు, విసురుపాటలు పాడేవారు ఇంకా ఉన్నారు.
      అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఆత్మకూరు చుట్టుపక్కల పడమటి వీరయ్య పండగ జరుపుతారు. పడమటి వీరయ్య పశువుల దేవుడని, ఈయన్ను పూజిస్తే పశువులకు వచ్చే రోగాలు నయమవుతాయని ఆ ప్రాంతీయుల నమ్మకం. ఈ చిత్రావతి నదీ పరివాహక ప్రాంత విశేషాలను గ్రంథస్థం చేస్తే స్థానిక మౌఖిక సాహిత్యం, అందులోని మాండలిక పద సౌందర్యం వెలుగు చూస్తుంది.
వీరనారి గున్నమ్మ
శ్రీకాకుళం జిల్లా మందస స్వాతంత్య్రానికి పూర్వం ఓ జమీందారి ప్రాంతం. ఇక్కడ సునాముది ఏరు పారుతోంది. దీన్నే ‘సునాముద్య’, ‘ఊసరెల్లిగెడ్డ’ అనీ అంటారు. 1940 మార్చి నెల చివరి రోజుల్లో రాజమణిపురం, ఇంకా పరిసర గ్రామాల రైతులు జమీందారి రిజర్వు అడవుల్లో కట్టెలు కొట్టారు. ఏప్రిల్‌ ఒకటిన జరిగిన పోలీసు కాల్పుల్లో కొందరు రైతులతోపాటు గున్నమ్మ అనే మహిళ మరణించింది. ఆ తరువాత ఆమె ‘వీరనారి గున్నమ్మ’గా జానపదుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ ప్రాంత మాలదాసర్లు ఆమెను ‘మేల్‌ భళాజీ’ అంటూ ఇలా పాడుతుంటారు... ‘‘ఎంత గట్టిరా ఆడదాయిరా వీరగున్నమ్మ ‘మేల్‌భళాజీ’/ తుపాకీతోనూ కొట్టాడండీ గున్నమ్మకైతే/ గున్నమ్మ రామా శ్రీరామాయని ధరణికి వొరిగింది...’’! ఇక గంగిరెద్దుల పాటలో ‘‘గున్నమ్మా... గున్నమ్మా... గున్నమ్మా... సాసుపెల్లి గున్నమ్మా/ ఎంతటిదాయెరా సాసుపెల్లి గున్నమ్మా/ రెండు కర్రలతోని బీపు సాపు జేసిందా/ వడిసె కర్రలతోటి ఒళ్లు చితగ్గొట్టిందా మరి...’’ అని పాడతారు. వీరనారి గున్నమ్మ మీద ఉన్న ఇలాంటి పాటలను డా।। కె.ముత్యం సేకరించారు. ‘సునాముది - జీవధార’ పుస్తకంలో వాటిని పొందుపరిచారు. ఈ సునాముది ఏటి ప్రాంతంలో ఇలాంటి రైతు గీతాలు ఇంకా ఎన్ని ఉన్నాయో!
చంపావతీ చెంత...
విజయనగరం జిల్లాలోని చంపావతీ నదీ తీర గ్రామాల్లో జడకోలాటం లాంటివి ప్రచారంలో ఉన్నాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పన్నెండేళ్ల కిందట ‘గిశ’ గ్రామస్థుల జడకోలాటం పాటను ప్రసారం చేసింది. విజయనగరం పరిసర గ్రామాల్లో పులివేషాలూ కనిపిస్తాయి. శ్రీకాకుళం జిల్లా నాగావళి, వంశధార తీరగ్రామాల్లో తూర్పు భాగవతం, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలు ఇంకా బతికి ఉన్నాయి.
విశాఖపట్నం జిల్లాలోని గోస్తనీ తీర ప్రాంతంలో విజయనగరం రాజు చిన విజయరామరాజు, ఆంగ్లేయుల మధ్య పద్మనాభ యుద్ధం (1794) జరిగింది. ఈ ప్రాంతంలో ఆ యుద్ధ సంబంధ జానపద గీతాలు కొన్ని లభించవచ్చు. గోస్తనీ తీర గ్రామాలైన జామి తదితరాలకు చెందిన ఎందరో జానపద కళాకారులు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో పలు జానపద కార్యక్రమాల ప్రసారానికి సహకరించారు. 
దొర వారి నరసింహారెడ్డి
కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కంపెనీ పాలనపై తిరుగుబాటు చేశాడు. ఆయన్ను 1847 ఫిబ్రవరిలో ఉరి తీశారు. జానపదుల పాటలను బట్టి నరసింహారెడ్డిని జుర్రేటి (జుర్రేరు) ఒడ్డున ఉరి తీసినట్లు తెలుస్తోంది. ఈ నరసింహారెడ్డి వీరగాథ మీద బాగా ప్రచారంలో ఉన్న కోలాటపు పాట ఇలా సాగుతుంది... ‘‘దొర వారి నరసింహారెడ్డి/ నీ దొరతనము కూలిపోయె రాజా నరసింహారెడ్డి/ ...కోయిల్‌కుంట్లా గుట్టలెంటా కుందేరూ వొడ్డులెంటా/ గుర్రమెక్కి నీవూ వస్తే కుంఫణీకి గుండెదిగులూ...’’! ఆకాశవాణి జానపద విభాగంలో ప్రొడ్యూసర్‌గా పనిచేసిన ఆరవేటి శ్రీనివాసులు ఈ పాటను స్వయంగా పాడి ప్రసారం చేశారు. 
గోదావరి ఒడ్డున...
తెలంగాణ గోదావరి తీరప్రాంత గ్రామాలకు వెళ్తే మరుగునపడిన కళారూపాలెన్నో కనిపిస్తాయి. తెలంగాణ మొత్తమ్మీద దాదాపు 135 జానపద కళలు ఇంకా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా చిందు భాగవతం. ఆదిలాబాదు జిల్లా బాసరకు చెందిన ఎల్లమ్మ చిందు కళా నైపుణ్యం బయటి ప్రాంతాల వారికీ సుపరిచితమే. మెహినీ రుక్మాంగద, సారంగధర తదితర  రూపకాలను ప్రదర్శించే చిందు కళాకారులెందరో ఇప్పటికీ వరంగల్లు, నిజామాబాదు జిల్లాల్లో ఉన్నారు. వరంగల్లు, కరీంనగర్‌ తదితర గోదావరీ తీర ప్రాంతాలతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతం నల్గొండలో ఒగ్గు కళాకారులు ఉన్నారు. వీళ్లు చెప్పే ఒగ్గుకథలు ఎంతో రసస్ఫోరకంగా ఉంటాయి. బీరన్న, కాటమరాజు, మల్లన్న, ఎల్లమ్మ తదితర ఒగ్గుకథల్లోని సాహిత్యాన్ని గ్రంథస్థం చేస్తే అపురూపమైన గ్రామీణ పదబంధాలెన్నో భాషలోకి ప్రవహిస్తాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా లింగాల ప్రాంతానికి చెందిన మొగులయ్య అరుదైన పన్నెండు మెట్ల కిన్నెరను వాయిస్తూ గీతాలాపన చేస్తారు. ఇలా పాడేవారు అత్యంత అరుదు. 
కాటిపాపల పాటలు, బైండ్ల కథలు, మందెచ్చుల కథలు... ఇవన్నీ అచ్చమైన పల్లె భాషలోనే ఉంటాయి. వాటిని పరిశోధించాలి. నదీ తీరాల్లో ఆనాటి నుంచి ఈనాటి వరకూ వినిపిస్తోన్న తెలుగు సాహిత్య నాదాలను ఒడిసిపట్టుకోగలిగితే వెలకట్టలేని సాహితీ సంపద లభ్యమవుతుంది. మట్టివాసన నింపుకున్న పల్లె పలుకులతో తెలుగు మరింత సంపద్వంతం అవుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం