జీవన రాగధుని.. ఆది ధ్వని

  • 817 Views
  • 8Likes
  • Like
  • Article Share

శతాబ్దాల సంగీత చరిత్ర కళ్లముందు ప్రత్యక్షమై ప్రతి మదిలో ఆత్మీయ ఊటలు ఊరించింది. జానపదులు, గిరిజనుల సృజనాత్మక కళావైభవాన్ని కళ్లకు కడుతూ 124 వాద్యాలు సరికొత్త రాగలోకంలోకి తీసుకెళ్లాయి. హైదరాబాదులో అయిదు రోజుల పాటు నిర్వహించిన ఆదిధ్వని ప్రదర్శన మనదైన ఘన సంగీత వారసత్వాన్ని తెలియజెప్పింది.  
నూట
ఇరవైనాలుగు జానపద, గిరిజన సంగీత వాద్యాలు.. ప్రతి దానిదీ తనదైన ప్రత్యేకత.. చరిత్ర! కోయడోళ్లు, కడ్డీ వాద్యాలు, డింకీ, అక్కుం, రావణ్‌హట్ట, డోలికొయ్య, ఘటవీణ, డొడొంకా... ఇలా అన్నీ ఈ గడ్డ వారసత్వ సంపదలే. బతుకు మూలాల్లోంచి మన పూర్వికులు సృజించుకున్న సంగీత సవ్వడులే. వీటిలో కొన్ని సంగీత క్షేత్రం నుంచి ఇప్పటికే తప్పుకున్నాయి. మరికొన్ని అంతర్ధానానికి అడుగు దూరంలో ఉన్నాయి. వీటన్నింటినీ  భాగ్యనగరంలోని మాదాపూర్‌ చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో నవంబరు 9 నుంచి 13 వరకు జరిగిన ‘ఆదిధ్వని’ జానపద, గిరిజన సంగీత వాద్య ప్రదర్శన మరోసారి పరిచయం చేసింది. ఈ అపురూప కళా సంపదను చూసిన ప్రతి ఒక్కరూ మన సంగీత చరిత్ర ఇంత గొప్పదా అని సంభ్రమంతో పొంగిపోయారు. శాశ్వత ప్రదర్శనశాల లాంటిది ఏర్పాటు చేసి వాటిని పరిరక్షించుకోవాలని అభిప్రాయపడ్డారు.
      ‘‘కనుమరుగైపోతున్న ఇలాంటి అపురూప వాద్యాలతో ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయం. ప్రాచీన జానపద కళారూపాలను భావితరాలకు వారసత్వంగా అందించే ఇలాంటి ప్రయత్నాలకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉంది’’ అని ఈ ప్రదర్శనను తిలకించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. నాలుగో రోజున తన భర్త సౌందరరాజన్‌తో కలిసి ఆమె ఈ ప్రదర్శనకు వచ్చారు. ప్రతి సంగీత పరికరం గురించీ నిర్వాహకులను అడిగిమరీ తెలుసుకున్నారు. చాలా పరికరాలను స్వయంగా వాయించి మురిసిపోయారు. 
వెలకట్టలేని సంపద
‘‘సంగీతం, సాహిత్యం వైదికీకరణకు లోనయ్యి అదే సంగీతం, అదే సాహిత్యం, అదే మాట, అదే పాటలాగ ప్రస్తుతం చలామణి అవుతున్నాయి. వాటిని దాటి ఆలోచించలేకపోతున్నాం. ఈ వాద్య పరికరాలు అంతరించకుండా ఉండాలంటే ఆ భావజాలం నుంచి మనం విముక్తం కావాలి. దానికి ఇవాళ ఈ ప్రదర్శన ద్వారా నాందీ ప్రస్తావన జరుగుతోంది’’ అన్నారు జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి. ప్రదర్శన ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అంతకుముందు ‘ఆదిధ్వని’ సమన్వయకర్త ఆచార్య గూడూరి మనోజ మాట్లాడుతూ... 2019 మార్చిలో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 200 మంది కళాకారులు, 60 జానపద సంగీత వాద్యాలతో నిర్వహించిన ‘మూలధ్వని’ కార్యక్రమం ఈ ప్రదర్శనకు మూలమని చెప్పారు. మూలధ్వని తర్వాత ఈ వాద్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పలువురు సూచించారని, అందుకే ఈసారి 124 పరికరాలతో ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 
వాద్య పరికరాల సేకర్త ఆచార్య జయధీర్‌ తిరుమలరావు మాట్లాడుతూ...  జానపద సంగీత వాద్యాలు మనోధర్మాల్ని మేల్కొలిపి ఒక సౌహార్ద్రతను, సామూహికతను పెంచుతాయని అన్నారు. మన జాతి సృజనాత్మకతకు అద్దంపట్టే వీటి వెనుక ఒక చరిత్ర, సామాజిక జీవితం, సామూహిక ఆలోచన, నైపుణ్యాలు కనిపిస్తాయని, కళ్లముందే అంతరించిపోతున్న వీటిని బతికించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉందని గుర్తుచేశారు. ‘‘మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో అనాథలుగా ఉన్న ఈ వాద్యాల్ని శిశువుల్లాగ మేం అక్కున చేర్చుకున్నాం. ఇప్పుడు వాటి ఉనికి కోసం మ్యూజియం అనే ఆశ్రయం వెతుక్కుంటున్నాం. ప్రభుత్వం తలచుకుంటేనే అది సాధ్యమవుతుంది’’ అని చెప్పారాయన. వీటి గురించి తెలుగు ప్రజలందరూ ఒక ఆలోచనకి వచ్చి, ఒక రాగం తీసి ఆ రాగాల మూటని ఒక ప్రదర్శనశాలలో వినిపించే చారిత్రక ప్రయత్నానికి ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రముఖ చిత్రకారులు తోట వైకుంఠం మాట్లాడుతూ.. ఇదంతా వెలకట్టలేని సంగీత సంపద అని అన్నారు. దీన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సంగీతం మనది అని, ఇవన్నీ మరుగున పడుతున్నాయంటే బాధ కలుగుతోందని గౌరవ అతిథులుగా హాజరైన సినీ దర్శకులు శేఖర్‌ కమ్ముల, నాగ్‌ అశ్విన్‌లు ఆవేదన వ్యక్తంచేశారు. తమ చిత్రాల సంగీతంలో తప్పకుండా వీటికి స్థానం కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
చిన్నారుల సంభ్రమం
అయిదు రోజుల ‘ఆదిధ్వని’ ప్రదర్శనని ఎందరో సంగీతాభిమానులు, విద్యార్థులు, అధికారులు, సమాజ సేవకులు సందర్శించారు. ప్రతీ పరికరం గురించీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. దిల్లీ, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేకంగా ఈ ప్రదర్శనకు పలువురు తరలివచ్చారు. మైసూరులో మెల్డీ వరల్డ్‌ మైనపు ప్రదర్శనశాల నిర్వహిస్తున్న శ్రీజీ భాస్కరన్‌ తన భార్య రీనా, కుమార్తె జీనాతో కలిసి ప్రత్యేకంగా ఈ ప్రదర్శనకు వచ్చారు. తమ ప్రైవేటు మ్యూజియాన్ని 2010లో ప్రారంభించామని, అందులో వంద మైనపు బొమ్మలు, పన్నెండు వందల సంగీత వాద్య పరికరాలు ఉన్నాయని చెప్పారు. ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని సంగీత వాద్యాలు సేకరించి ప్రదర్శనకు ఉంచినట్లు చెప్పారు. ఇక్కడి కిక్రి, ఏక్‌తారా లాంటివి తమ దగ్గర కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాదు గాంజెస్‌ వ్యాలీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఎం.శ్వేత అనే విద్యార్థిని ఈ సంగీత పరికరాల మీద లఘుచిత్రం తీసేందుకు వచ్చింది. తన స్నేహితురాలు వీడియో తీస్తుండగా ప్రతి పరికరం గురించి అడిగి తెలుసుకుని వివరాలు రాసుకుంది. కళాకారులు వాద్య పరికరాలు వాయిస్తుంటే వింటూ పొంగిపోయింది. హైదరాబాదు హస్తినాపురం గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌ ఎనిమిది, తొమ్మిదో తరగతి విద్యార్థులు చివరి రోజు ప్రదర్శనకు వచ్చారు. ఈ పరికరాల్లో చాలా వరకు తమకు తెలియదని, వాటన్నింటినీ చూస్తుంటే మన నేల మీద ఇంత గొప్ప సంగీత వాద్యాలు ఉన్నాయా అనిపిస్తోందని అబ్బురపడుతూ చెప్పారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా ప్రదర్శనను తిలకించారు. ఈ పరికరాల్ని చూస్తుంటే శతాబ్దాల మన సంగీత చరిత్ర తెలుస్తుందని, ఆధునిక సంగీతం వీటి ముందు ఏమాత్రం నిలవలేదని అన్నారు సంపాదకులు, సమాజ సేవకులు ఎం.వేదకుమార్‌. రెండో రోజు ప్రదర్శనకు వచ్చిన ఆయన ‘తెలుగువెలుగు’తో మాట్లాడుతూ ‘‘వీటి పరిరక్షణ అంటే మన సంస్కృతిని మనం కాపాడుకోవడమే. ఈ కళాకారులకు ప్రభుత్వం పారితోషికాలు అందివ్వాలి. కొత్త తరం వీటిని నేర్చుకునేలా చెయ్యాలి. చదువుల్లోకి వీటిని తీసుకురావాలి’’ అని సూచించారు. సినీ సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్‌ ప్రదర్శనకు వచ్చి ప్రతి సంగీత వాద్యాన్ని స్వయంగా వాయిస్తూ అందరికీ వినిపించారు. వీటిలో చాలా పరికరాలను తన సినీ గీతాల్లో ఉపయోగించానని చెప్పారు. 
ప్రదర్శనశాల తప్పనిసరి
‘‘ఐరోపాలో ఎక్కడ చూసినా చిన్నచిన్న ప్రదర్శనశాలలు కనిపిస్తాయి. ఇలాంటి అపురూప సంపదను పరిరక్షించుకోవడానికి మనకి కూడా ఒక ప్రదర్శనశాల ఉండాలి’’ అన్నారు సినీ దర్శకులు బి.నరసింగరావు. చివరి రోజు సమాపన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ.. వీటి సేకరణలో తిరుమలరావు కృషి అసమానమైందని కొనియాడారు. ‘‘ఈ కళాకారుల వివరాలు సేకరించి రాబోయే రోజుల్లో ఒక వేదిక పెట్టి.. పెళ్లిళ్లు, పుట్టినరోజులు లాంటి వాటిలో ప్రదర్శనలు ఏర్పాటు చేసేలా చూస్తాను. త్వరలో గిరిజన విశ్వవిద్యాలయం వస్తుంది. అందులో తప్పకుండా వీటికి స్థానం ఉంటుంది’’ అన్నారు తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్య కార్యదర్శి బి.జనార్దన్‌ రెడ్డి. సమాపన కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వాద్యాలు అంతరించే ప్రమాదం రాకుండా చూడాలని పిలుపునిచ్చారాయన. గౌరవ అతిథిగా హాజరైన స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ సంచాలకులు కె.లక్ష్మి మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో ఆర్ట్‌ గ్యాలరీలోనే వీటికి శాశ్వత స్థానం కల్పించేలా ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ అయిదు రోజుల ప్రదర్శనలో రుంజ, బుర్రవీణ, దుబ్బు, కిక్రీ, కిన్నెర బుర్ర కళాకారులు తమ వాద్యాలను ప్రేక్షకులకు వినిపించి రాగాలవిందు చేశారు. ఈ అపురూప సంగీత వాద్య పరికరాలను అందరికీ పరిచయం చేయడంలో ఈ ప్రదర్శన విజయవంతమైంది. మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే వీటి పరిరక్షణకి అందరూ ఒక్కటిగా ముందుకు కదలాలనే సంకల్పాన్ని కలిగించింది. 


ఇక్కడి వాద్యపరికరాలన్నీ తెలంగాణ ప్రజల సాంస్కృతిక, సంగీత వారసత్వానికి ప్రతీకలు. వీటికోసం ఒక ప్రదర్శనశాల ఏర్పాటు చేయడం తప్పనిసరి అవసరం. వీటిలో దాదాపు 15 వాద్యాలు ఒక్కొక్కటి చొప్పున మాత్రమే ప్రస్తుతం మిగిలాయి. గవర్నర్‌ స్వయంగా ప్రదర్శనకు వచ్చి ప్రదర్శనశాల ఏర్పాటుకు కృషిచేస్తానని చెప్పడం ఆనందం కలిగించింది. 

- ఆచార్య జయధీర్‌ తిరుమలరావు 


ఔజం
కొండరెడ్ల పవిత్ర డోలు వాద్యం. దీని శబ్దం చాలాదూరం వినిపిస్తుంది. పనస కొయ్యతో తయారుచేస్తారు. చిక్కుడు పండగ, ముత్యాలమ్మ పండగ సమయాల్లో మాత్రమే దీన్ని బయటికి తీస్తారు. పాటలు పాడుతూ వాయిస్తారు. మిగిలిన రోజుల్లో ముత్యాలమ్మ గుడిలో భద్రపరుస్తారు.


దుబ్బు: 
పరిమాణంలో చిన్నదైనా ధ్వనిలో ఘనమైంది. గ్రామాల్లో దుర్గమ్మ కొలుపుల సమయంలో గంగపుత్రుల బెస్తవారు అమ్మవారి పట్నం గీసి దుబ్బుల వాయిస్తూ రాత్రంతా దుర్గమ్మ కథ చెబుతారు. కింద కూర్చొని ఒక కాలిని ముందుకు సాచి పాదంపై దుబ్బు వాద్యాన్ని ఆన్చి వాయిస్తారు. కొందరు కాలికి గజ్జెలు కట్టుకుంటారు. అలా వాటి శబ్దం కూడా దుబ్బు ధ్వనికి తోడవుతుంది. ఒకవైపు వంకర తిరిగిన పుల్లతో దీన్ని వాయిస్తారు.


రావణహట్ట: 
తంత్రీ వాద్యాలకు మూలంగా దీన్ని భావిస్తారు. కొబ్బరి చిప్ప మీద మేక తోలును కప్పి టేకు కర్రతో తయారుచేస్తారు. శ్రీలంకతో పాటు దక్షిణ భారతదేశం అంతటా, ఉత్తర భారతదేశంలో కొన్నిచోట్ల ఇది కనిపిస్తుంది. రావణాసురుడి పాలన సమయంలో లంక వాసులు దీన్ని రూపొందించారట. శివారాధనలో రావణుడు దీన్ని వాయించేవాడని, అందుకే ఈ పేరు వచ్చిందని చెబుతారు. శారద కథలు, వీధి భాగవతాలు చెప్పేటప్పుడు దీన్ని వాడతారు. ప్రస్తుతం మరుగునపడిపోయింది.


ఘటవీణ
ఇదొక వైవిధ్య సంగీత పరికరం. కుండని బోర్లించి దాని మీద చేట కప్పుతారు. తర్వాత ఆ చేట మీద విల్లుని ఆన్చి వెదురుని చీల్చి చేసిన చిన్న బద్దకి గజ్జెల్ని కట్టి విల్లుకి రాపిడి చేస్తూ సంగీతం సృష్టిస్తారు. ఇద్దరు స్త్రీలు రెండు కుండలతో ఒకేలా వాయిస్తూ పాటలు పాడతారు. వాయించడం ఆపిన వెంటనే కుండల్లో ధాన్యం లేదా నీరు పోసుకుంటారు. విల్లు తీసుకుని వేటకి వెళ్తారు. 


కిన్నెర బుర్ర
సొరకాయ బుర్ర, జిట్రేగి, టేకు కర్రలతో తయారు చేస్తారు. మద్దెల, తాళం దీని సహవాద్యాలు. తోటి కులస్థులు దీన్ని వాయిస్తూ 18 పర్వాల మహాభారత కథలు చెబుతారు. మూడేళ్లకోసారి ఏటూరు నాగారం వైపు వెళ్లి నాలుగు నెలల పాటు నాయకపోళ్లకి కథలు చెప్పి బహుమతులు తెచ్చుకుంటారు. ప్రస్తుతం ఈ వాద్యం కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది.


డొడొంకా/డుడంకా
కర్రను చెక్కి చేసిన సంగీత వాద్యమిది. మెడలో వేసుకొని రెండు కర్రలతో వాయిస్తారు. కొన్నిచోట్ల కర్రల లోపల రెండు చెక్కలను వేలాడదీస్తారు. వాద్యాన్ని కదిలించినప్పుడు అవి కొయ్య జేగంటలా మోగుతాయి. డప్పులాగా కూడా శబ్దం చేస్తుందిది. ఈ వాద్యంతో ఉండే పలకలపై దారుశిల్పంతో ఆదివాసుల జీవన దృశ్యాలు చిత్రిస్తారు. ప్రస్తుతం గిరిజన సమూహాల నుంచి ఈ వాద్యం తొలగిపోతోంది. 


డోలి కొయ్య/ గండ్జ
వేగిస చెట్టు కాండంతో తయారుచేస్తారు. ఒకవైపు మేక చర్మం, మరోవైపు గొడ్డు చర్మంతో కప్పి నారతో బిగించి కడతారు. కోయలు, గుత్తికోయలు సంప్రదాయ పండగలు, పెళ్లిళ్లలో మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. మగవారు వాయిస్తుంటే మహిళలు నృత్యం చేస్తారు. ఒకవైపు చేత్తో, మరో వైపు ‘సిర్ర’ అనే కర్రతో వాయిస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లోని ఆదివాసీల్లో కూడా ఇది కనిపిస్తుంది. 


 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం