గద్దలకొండ గణేశ్‌,  సైరా నరసింహా రెడ్డి - సమీక్షలు

  • 248 Views
  • 9Likes
  • Like
  • Article Share

కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...!
గజగజలాడించే సరదా చిత్రం 

మనం బతుకుతున్నామని పదిమందికి తెల్వకపోతే ఇక బతుకుడెందుకురా.. అని కథానాయకుడు తెలంగాణ యాసలో చెప్పిన మాటే గద్దలకొండ గణేశ్‌ కథకు మూలం. ‘నా పైన పందాలేస్తే గెలుస్తరు.. నాతోనే పందాలేస్తే సస్తరు’ అని మాటలతో భయపెట్టే నాయకుడే ‘జిందగీల ఉత్త గీతలే మన శేతిల ఉంటయ్‌.. రాతలు మన శేతిల ఉండవ్‌..’ అని వేదాంతమూ చెబుతాడు. గవాస్కర్‌ సిక్సు కొట్టుడు, బప్పీలహరి మ్యూజిక్‌ కొట్టుడు, నేను బొక్కలిరగ్గొట్టుడు.. సేమ్‌ టూ సేమ్‌.. అంటూ తమాషాగా సాగే హరీష్‌ శంకర్‌ మాటలు యువతను మెప్పించాయి. 
  ‘కల్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటరు.. ఏమంటవు..’ అని అడిగితే.. ‘ఏమంటానండీ.. నాకు మాత్రం కల్యాణం అంటే కక్కొచ్చేలా చేశారు..’ అంటూ వాపోవడంతో నవ్వులు హోరెత్తుతాయి. ఇంకా టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌లో టైప్‌రైటర్‌ను ఎత్తి ‘అన్నా మస్తు బరువుందే.. దీంతో కొడితే ఒక్క దెబ్బల సస్తడు’ అంటే.. ‘దాంతో కొట్టకూడదు బాబూ.. దాన్ని కొట్టాలి..’ అని యజమాని పొదుపు మాటలతో వ్యథను వ్యక్తం చేయడం తమాషాగా ఉంటుంది. కథంతా ఇలాంటి సన్నివేశాలతోనే ఆహ్లాదంగా నడుస్తుంది.
   ఇక కథానాయకుడి గతంలో శ్రీదేవి అభిమానిగా చేసిన హంగామా అందరినీ అలరిస్తుంది. మరోసారి వెల్లువై వచ్చిన వేటూరి పాట గోదారి అందాల నడుమ మంచి అనుభూతిని ఇస్తుంది. మరోపాటలో ‘మనసు గీతిలో మధుర రీతిలో ఎగిసిన పదములా.. నడచిన దారంతా మన అడుగుల రాత..’ అంటూ వనమాలి పదప్రయోగాలు తీయగా వినిపిస్తాయి.


సైరా మాటల తూటా.. 
స్వాతంత్య్రోద్యమానికి ముందే జరిగిన ఒక పోరాట యోధుడి కథ సైరా నరసింహా రెడ్డి. కాలానికి తగినట్టుగా బుర్రా సాయి మాధవ్‌ కలం కూడా కదిలి చక్కటి సంభాషణలతో సన్నివేశాలు రక్తికట్టాయి. ‘అతని పుట్టుకలోనే యుద్ధం ఉంది.. ఆ యుద్ధం పుట్టుకలోనే మరణాన్ని గెలిచింది..’ అంటూ ఝాన్సీ లక్ష్మీబాయితో చెప్పించిన కథా ప్రారంభం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ‘చంపడమో చావడమో ముఖ్యం కాదు.. గెలవడం ముఖ్యం.. నువ్వే ఒక యుద్ధం కావాలి’ అంటూ సైరా గురువు గోసాయి వెంకన్న మార్గనిర్దేశనం చేయడం కథను మరోస్థాయికి తీసుకెళ్లే తొలిమెట్టు. పాలెగాళ్లను పోరాటంలో ఏకతాటి మీదికి తెచ్చే క్రమంలో ‘నీ పౌరుషాన్ని ద్వేషం కోసం కాదు.. దేశం కోసం చూపించు.. అంటూ తోటి పాలెగాడైన అవుకురాజును సైరా అభ్యర్థించడం హుందాగా కనిపిస్తుంది. ప్రేమ దక్కలేదన్న మనోవేదనలో ఉన్న లక్ష్మిని సైరా కర్తవ్యోన్ముఖురాలిని చేసే సన్నివేశం ఈ తరం వారిని కూడా ఆలోచింప జేసేదే. దేవుడు కొందరికే కళనిస్తాడు.. నీకు జనాల్ని సంఘటితం చేసే గొప్ప కళనిచ్చాడు. అది నీకోసమో ఆ దేవుడికోసమో కాదు.. స్పందించే అందరి కోసం.. దాన్ని మధ్యలో ఆపే హక్కు నీకు లేదు.. ప్రతి ప్రాణానికీ ప్రయోజనం ఉండాలి.. ప్రతి మరణం ఈ మట్టికి మరో ఊపిరవ్వాలి..’ అంటూ సాగే సంభాషణ కథ ముగింపునకు మూలాధారం అయ్యేలా రాశారు. ఏకాకి అయిపోయాడని అనుకున్న సైరాతో సామాన్యులు ఎలా కలిసి పోరాటానికి తోడొచ్చారో తెలియజేసే సన్నివేశంలో ‘దొరా.. నీతో నేనున్న దొరా.. వాళ్లెవ్వరు రాకపోయినా నీతో నేనొస్తా దొరా.. అంటూ బల్లెం నేలకు దింపి.. ఈ రోజొస్తదని తెలుసు దొర.. నా మట్టి నేనే దున్నిన.. నా పంట నేనే తిన్నా.. నా కండ నేనే పెంచిన.. నీ వెనక నేనున్న.. నడిపించు దొరా..’ అని చెప్పించిన సంభాషణలకు కరతాళధ్వనులు జోరెత్తుతాయి.    
      ఉషస్సు నీకు ఊపిరాయెరా అంటూ సిరివెన్నెల రాసిన సైరా ప్రేరణ గీతం చిత్రానికి అదనపు బలాన్ని అందించింది. ‘చరిత్రపుటలు విస్మరించ వీలులేని వీర.. రేనాటి సీమ కన్న సూర్యుడా.. యశస్సు నీకు రూపమాయెరా..’ అంటూ ఉద్యమానికి స్ఫూర్తికారకంగా నిలిచేలా ఈ పాటను చిత్రీకరించారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం