అమ్మభాషతోనే అభివృద్ధి... అదే కలాం స్ఫూర్తి

  • 1001 Views
  • 104Likes
  • Like
  • Article Share

అవుల్‌ పకీర్‌ జైనులాబ్దీన్‌ అబ్దుల్‌ కలాం... ఎవరు?
శాస్త్రవేత్త... అందరికీ తెలిసిందే. 
భారత రక్షణరంగాన్ని సొంతకాళ్ల మీద నిలబెట్టిన మనీషి... దశాబ్దాలుగా ఆ విజయగాథలు వింటున్నవే. 
భారతావని మెచ్చిన రాష్ట్రపతి... రాష్ట్రపతి భవన్‌ సాక్షిగా ఆయన ప్రస్థానమంతా కళ్లారా చూసిందే.
అక్షరాల్లో సత్యాగ్ని శిఖలను కూర్చి, స్ఫూర్తి వెలుగులను పంచిన రచయిత... ఆయన రచనలన్నీ చదివినవే. 
ఇంకా చెప్పండి... ఇంకా ఇంకా ఆలోచించండి... కలాం అంటే ఎవరు?
 
ఓ మాతృభాషాభిమాని. విశ్వవిజ్ఞానమంతా భారతీయ భాషల్లోకి రావాలని కోరుకున్న స్వదేశీ భాషా ప్రేమికుడు. అమ్మభాషలో విద్యాబోధనే దేశ ప్రగతికి తొలిమెట్టు అని చెప్పిన ఆలోచనాపరుడు. మాతృభాషను మరచిపోయిన సమాజం, సృజనాత్మకతకు సుదూరంగా ఉండిపోతుందని కరాఖండీగా హెచ్చరించిన విజ్ఞానవేత్త. 
      సరయు మకర్‌... అయిదో తరగతి చిన్నారి. నాగ్‌పుర్‌లో నివాసం. ఎందుకొచ్చిందో ఏంటోగానీ, ఆ చిట్టిబుర్రకు ఓ సందేహం వచ్చింది. ఆంగ్లంలో చదువుకోవడం మంచిదా... అమ్మభాషలో విద్యాభ్యాసం మేలైందా అని! వెంటనే అబ్దుల్‌ కలాంకు మెయిల్‌ పెట్టేసింది. అప్పట్లో ఆయన రాష్ట్రపతి. అయినా, చిన్నారుల ఈమెయిళ్లకు స్పందించేవారు. సరయుకు కూడా ఆయన సమాధానమిచ్చారు. ఏమనో తెలుసా... 
      ‘‘ఉన్నత పాఠశాల వరకూ నేను నా మాతృభాషలోనే చదువుకున్నా. కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలోకి మారా. కళాశాలల్లో కూడా మాతృభాషా మాధ్యమంలోనే బోధన జరిగితే బాగుంటుందన్నది నా భావన. పసిమెదళ్లలో సుళ్లు తిరిగే ఆలోచనలకు ఆలంబన అమ్మభాషే. అయితే, మిగిలిన ప్రపంచంతో అనుసంధానమవడానికి మాత్రం ఆంగ్లం వంటి ఒక భాష కావాలి’’.
      అంటే, కలాం దృష్టిలో ఆంగ్లం కేవలం ఓ అనుసంధాన భాష. విజ్ఞాన సముపార్జనకు అక్కరకొచ్చేది మాత్రం అమ్మభాషే. ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ పంగారియా కూడా కలాం మాటలతో ఏకీభవించారు. ‘‘మాతృభాషలో చదువుకుంటున్నప్పుడు మెదడులోని నియోకోర్టెస్క్‌ విశేషంగా స్పందిస్తుంది. ఫలితంగా చిన్నారుల్లో సూక్ష్మబుద్ధి, కొత్త ఆలోచనలను వ్యక్తీకరించగల సామర్థ్యం వృద్ధి చెందుతాయ’’ని అంటారాయన. మాతృభాషకు అంతటి శక్తి ఉంది కాబట్టే, ఔరంగాబాద్‌ ఇఖ్రా ఉర్దూ ప్రాథమిక పాఠశాల విద్యార్థి అమర్‌ షరీఖ్‌ ఆరీఫీ ద్వారా జాతికి చక్కటి దిశానిర్దేశం చేశారు అబ్దుల్‌ కలాం. ఇంతకూ ఆ పిల్లాడు ఆయన్ను ఏమడిగాడు? 
      ‘‘మా కుటుంబంలో మాతృభాష (ఉర్దూ)లో చదువుకుంటున్న వాణ్ని నేనొక్కణ్నే. అమ్మానాన్నలతో సహా అందరూ ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్న వారే. వాళ్లతో మరి నేనెందుకు ఉర్దూలో చదువుకోవాలి అంటే, భవిష్యత్తులో ఎదుగుదలకు మాతృభాష బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అమ్మానాన్నల నిర్ణయం సరైందే అంటారా?’’ 
      ఏ విషయానికైనా ఉదాహరణ చూపించి చెబితే పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారు. ఆరీఫీ ప్రశ్నకు సమాధానమివ్వడంలో కలాం అదే పద్ధతిని అనుసరించారు. తననే ఉదాహరణగా చూపుతూ, రెండే రెండు వాక్యాల్లో బదులిచ్చారు. ‘‘నేను కూడా పదో తరగతి వరకు మాతృభాషా మాధ్యమ విద్యార్థినే. ఆ తర్వాత వృత్తివిద్య కోర్సుల కోసం నువ్వు ఏ భాష కావాలనుకుంటే అది నేర్చుకోవచ్చు’’! ఎప్పుడు ఏ భాష ఎలా అక్కరకొస్తుందో తెలిసిన జ్ఞాని మాట ఇది. అర్థం చేసుకోవడంలో మనదే ఆలస్యం! 
అమ్మభాషే పునాది
‘‘నువ్వు కాలం ఇసుకతిన్నెల మీద
నీ అడుగుజాడల్ని వదలదలుచుకున్నావా?

అయితే కాళ్లు భారంగా ఈడ్చకు!’’

      ఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టులో తలమునకలై ఉన్నప్పటి రోజుల్లో ఒకనాడు అబ్దుల్‌ కలాం తన డైరీలో రాసుకున్న మాటలివి. ఆయన వ్యక్తిత్వానికి ప్రతిరూపాలివి. తన ఆలోచనలకు తగ్గట్టుగానే, నడుస్తున్న కాలం మీద తనదైన ముద్ర వేశారు. మరి ఈ స్థాయికి రావడానికి ఆయన చదువుకుంది ఎక్కడ? మారుమూల ప్రాంతంలోని సర్కారీ బడిలో! తమిళ మాధ్యమంలో పాఠాలు నేర్చుకున్నారు. అవే తన భావిజీవితానికి పునాదులేశాయని సగర్వంగా చెప్పుకున్నారు. ముఖ్యంగా విజ్ఞానశాస్త్రం మీద నవతరంలో ఆసక్తి పెరగాలంటే అమ్మభాషలో బోధనే ఉత్తమ మార్గమని ఆయన నమ్మారు. అందుకే... ‘‘విజ్ఞానశాస్త్రాన్ని అమ్మభాషలో బోధించాలని ఉపాధ్యాయులను కోరుతున్నా. దానివల్ల చిన్నారుల్లో సైన్స్‌ సృజనాత్మకత పెరుగుతుంది. పాఠ్యాంశాన్ని త్వరగా అర్థం చేసుకునే శక్తీ సమకూరుతుంది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో పిల్లలు చూపించే సృజనాత్మకతే వారి భవిష్యత్తుకు పునాది. దాన్ని బయటికి తీయాల్సింది ఉపాధ్యాయులే. అయితే, ఆ సృజనాత్మకత మాత్రం అమ్మభాషలో చదువు వల్లే సాధ్యం’’ అని విస్పష్టంగా చెప్పారు. 
      ఈ వాదనను ఇస్రో ‘చంద్రయాన్‌’ ప్రాజెక్టు డైరెక్టరు మేల్‌స్వామి అన్నాదురై కూడా సమర్థించారు. ‘‘ప్రతి మనిషికీ అతని అమ్మభాషలోనే విజ్ఞానశాస్త్ర బోధన జరగాలి. ఆంగ్లేయులు తప్ప మిగిలిన అంతర్జాతీయ శాస్త్రవేత్తలందరూ విజ్ఞానశాస్త్రం గురించి వాళ్ల భాషల్లోనే మాట్లాడతారు. రాస్తారు. అధ్యయనాలు కొనసాగిస్తారు. నేనూ నా అమ్మభాష తమిళంలోనే చదువుకున్నా. మా అనుభవంలోంచి మేం చెప్పే మాట ఒక్కటే... మాతృభాషలో విద్యాభ్యాసం వైజ్ఞానికరంగానికి అత్యావశ్యకమైన సొంత ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. సహజ మేధస్సుకు వన్నెలద్దుతుంది’’ అన్నది అన్నాదురై అభిప్రాయం. వైజ్ఞానిక రంగంలో అద్భుతాల సాధనకు అమ్మభాషే పెట్టుబడి అన్న కలాం మాట, ఇప్పటికైనా మన పాలకులకు తలకెక్కుతుందా?
అనుకరించడం కాదు...
‘‘జ్వలిస్తున్న జాతి ఆత్మగౌరవ కాంతితో
దాన్ని మరింత వెలగనివ్వు’’

      ‘అగ్ని’ క్షిపణి ప్రయోగం విజయవంతం అయిన రోజు రాత్రి కలాం గుండెల్లోంచి పొంగుకొచ్చిన అక్షరాలివి. ఆ క్షణంలో అవి ఆ విజయానికి మాత్రమే సంబంధించినవి కావచ్చు. కానీ, ఇప్పుడు వాటికి సార్వజనీన విలువ ఉంది. అరువు తెచ్చుకున్న విజ్ఞానంతో ఏ రంగంలోనైనా స్వావలంబన సాధ్యం కాదు. శాస్త్రసాంకేతిక రంగాల్లోనూ ‘భారతీయ ముద్ర’ కనిపించాలంటే, భారతీయులకు మాత్రమే సాధ్యమైన విజయాలు సాధించగలగాలంటే... వైజ్ఞానిక శాస్త్ర బోధన అంతా భారతీయ భాషల్లో సాగాలి. మన పిల్లలు మనవైన అనుభవాల ద్వారా విజ్ఞానాన్ని ఒడిసిపట్టుకోవాలి. అప్పుడే వారు భారతీయాత్మ ప్రతిబింబించే కొత్త ఆలోచనలు చేయగలరు. కలాం ఆశ, ఆశయమూ ఇదే. వచ్చే ఇరవై ఏళ్లలో దేశం ఆ స్థాయికి చేరుకుంటుందని చెప్పేవారాయన. ‘‘విజ్ఞానశాస్త్రానికి మూలాధారమైన జ్ఞానమంతా ఆంగ్ల భాషలోనే ఉంది. రాబోయే రెండు దశాబ్దాల్లో అదంతా మన భాషల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం జపనీయుల్లాగా పూర్తిస్థాయిలో మన భాషల్లోనే చదువుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు నిర్దేశిత స్థాయి వరకూ విజ్ఞానశాస్త్రాన్ని స్థానిక భాషల్లో బోధిస్తున్నాయి. అయితే, ఉన్నతవిద్య స్థాయిలో వైజ్ఞానిక పరిభాషను మన భాషల్లోకి తెచ్చుకునే పని మిగిలి ఉంద’’న్నది కలాం అభిప్రాయం. ఆయన కలలు తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఈడేరుతున్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అంతకంతకూ పరిస్థితి దిగజారిపోతోంది. దార్శనికత లోపించిన వ్యవస్థే దీనికి కారణం. 
తమిళమంటే ప్రేమ
‘‘ప్రేమ లేకుండా పెట్టిన రొట్టె చేదుగా ఉండటమే కాదు, అది ఆకలిని సగమే తీరుస్తుంది’’
      అబ్దుల్‌ కలాంకు బాగా ఇష్టమైన ఈ ఖలీల్‌ జిబ్రాన్‌ వాక్యం... ఆంగ్లానికి బాగా వర్తిస్తుంది. కన్నపేగుతో అనుబంధం లేని ఆ భాష కేవలం అవసరాన్ని తీర్చగలదు. అక్షరంతో అనుబంధాన్ని పెంచలేదు. అంటే, చదువు మీద ఆసక్తిని ఇనుమడింప చేయలేదు. సరికదా, అత్తెసరు తెలివితేటలను ప్రసాదిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక విద్యాసంబంధిత పరిశోధనల్లో ఈ విషయం రుజువైంది. అనుబంధాల వారధి మీద జ్ఞానతీరాలకు చేర్చే అమ్మభాషను కలాం అంతగా అభిమానించడానికి కారణమిదే.   ‘‘తమిళం నా మాతృభాష. నేను తమిళ భాష ప్రాచీనతకు గర్విస్తుంటాను. రామాయణానికి ముందునుంచీ అగస్త్యుడి కాలం నుంచీ ఉన్న భాష అది. దాని సాహిత్యం క్రీ.పూ.అయిదో శతాబ్దం నుంచీ వికసిస్తూ ఉంది. సైన్సు ఈ అద్భుతమైన భాషకి అతీతంగా ఉండిపోగూడదన్నదే నా ఆతృత’’ అని తన ఆత్మకథలో చెప్పుకున్నారు. అంటే, వైజ్ఞానిక సమాచారమంతా తమ అమ్మభాషలోకి రావాలని ఆయన కోరుకున్నారు. తమిళులు ఆ దిశగా ఇప్పటికే చాలా కృషి చేశారు. చేస్తున్నారు. మరోవైపు, తమిళంలో  కవిత్వమూ రాసిన కలాం... మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుకుంటున్నప్పుడు స్థానిక తమిళ సంఘం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నారు. ‘మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం’ అనే వ్యాసాన్ని తమిళంలో రాసి మొదటి బహుమతి పొందారు. భాష మీద కలాంకు ఇంత ఇష్టం పెరగడానికి ఆయన తల్లిదండ్రులే కారణం. అమ్మ చక్కటి కథలు చెబితే, నాన్న ‘చాలా సరళమైన తమిళంలో క్లిష్టమైన ఆధ్యాత్మిక అంశాలను చెప్పేవారు’. అవి కలాం వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేయడమే కాదు, ఆయనలో భాషాభిమానాన్నీ పెంచాయి. 
ఎందరో మహానుభావులు...
‘‘అన్ని రోజులకూ ఒక్కలానే సంసిద్ధుడివిగా ఉండు
నువ్వు దాగరవైనప్పుడు దెబ్బలకు ఓర్చుకో,
సమ్మెటవైనప్పుడు దెబ్బమీద దెబ్బ తియ్యి’’

సుదీర్ఘ ప్రస్థానంలో వెనుతిరిగి చూడకుండా సాగిపోవడానికి కలాంకి స్ఫూర్తినిచ్చిన కవి పలుకులివి. వాటి అంతరార్థానికి అనుగుణంగానే ఆయన జీవిత గమనం సాగింది. మరి ఇంతటి మనోధైర్యం ఆయనకు ఎలా వచ్చింది? పుస్తకాలతో చేసిన స్నేహంలోంచి అది పుట్టింది. కలాం ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉంది. వేల పుస్తకాలకు అది నెలవు. ‘‘పుస్తకాలే నా ఆత్మీయ నేస్తాలు. మా ఇంట్లోని గ్రంథాలయమే నాకున్న గొప్ప ఆస్తి. కొత్త ఆలోచనను రేకెత్తించే ఏ పుస్తకమైనా సరే నాకు స్ఫూర్తిదాయకమే. చదవడాన్ని, కవిత్వం రాయడాన్ని నేను ఆస్వాదిస్తా. మనసుకు సాంత్వన చేకూర్చే సంగీతమంటే చాలా ఇష్టం’’  అనేవారాయన. ఉత్కృష్టమైన సంతోషం లోంచి, లోతు తెలియని బాధల నుంచి కవిత్వం పుడుతుందన్నది ఆయన విశ్వాసం. 
      త్యాగరాజ స్వామి తెలుగు కృతి ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’ అంటే కలాంకు ప్రాణం. మొదటిసారి ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి స్వరంలో ఆ కీర్తన విన్నప్పుడు ఆయన పరవశించిపోయారు. అది ఆయనపై ఎంతగా ప్రభావం చూపిందంటే... జులై 25, 2002 నాడు రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన మొదటి ప్రసంగాన్ని ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’ అంటూనే ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానితో సహా మహామహులు కొలువైన ఆ సమావేశంలో ఆయన అలా అనడం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత సంగీత విద్వాంసుడు రామవర్మ రాష్ట్రపతి భవన్‌లో కచేరీ చేశారు. ‘ఎందరో మహానుభావులు’ను ఆలపించారు. ఆ సందర్భంలో వేదిక ముందు ఆసీనులైన కలాం... గాయకుడితో పాటు తనూ ఆ పాట సాహిత్యాన్ని పలుకుతూ, తాదాత్మ్యం చెందారు. యూట్యూబ్‌లో ఆ వీడియోను చూస్తే... కింద ఒక వ్యాఖ్య దర్శనమిస్తుంది. ‘‘హిందీ రాష్ట్రంలో (దిల్లీ) ఒక తమిళుడి ముందు ఓ మలయాళీ (రామవర్మ) ఓ తెలుగు కృతిని ఆలపిస్తున్నాడు. ఇది కదా భారతీయత అంటే’’ అని! ఈ వ్యాఖ్య సందర్భోచితమే కాదు, వైవిధ్యభరితమైన భారతీయ సామాజిక వ్యవస్థలోని ఏకత్వానికి అక్షరరూపం కూడా!! 
      చిన్నారులకు భారతీయ విలువలు ఒంటబట్టేలా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు బోధించాలని కలాం కోరుకునేవారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకోవడంతో పాటు భారతీయ వారసత్వ విజ్ఞానాన్ని నవతరానికి అందించాలనే వారు. దీనికోసం వారంలో ఒక తరగతిని నైతిక విలువల బోధనకు ప్రత్యేకించాలని సూచించేవారు. 
      జాతి ఆత్మగౌరవాన్ని ఇనుమడింప జేయడానికి పరిశ్రమించిన అవిశ్రాంత శ్రామికుడు అబ్దుల్‌ కలాం. శాస్త్రపరిశోధనా రంగాల్లోనే కాదు, అమ్మభాషా వినియోగంలోనూ ఆయన ఆలోచనలు ఆచరణీయాలు. మరి కలాంని దార్శనికుడిగా కొనియాడుతున్న నేతలు, అమ్మభాషల విషయంలో ఆయన ఆవేదనను అర్థం చేసుకుంటారా? కలాంని స్ఫూర్తిప్రదాతగా కొలుస్తున్న జాతిజనులు, ఆయన మాట మేరకు మాతృభాషను గుండెల్లో పొదుపుకుంటారా?


వెనక్కి ...

మీ అభిప్రాయం