మాండలికంపై మనసు పారేసుకుని...

  • 1311 Views
  • 4Likes
  • Like
  • Article Share

    సి.బి.వి.ఆర్‌.కె.శర్మ

  • విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
  • రాజమండ్రి
  • 9849354754
సి.బి.వి.ఆర్‌.కె.శర్మ

ఆరేసు కోబోయి పారేసు కున్నాను
    కోకెత్తు కెళ్లింది కొండ గాలి’’
ఇది ‘అడవిరాముడు’ చిత్రంలోని పాట. రచయిత వేటూరి. ఈ పాటను ఇలాగే విభజిస్తూ రాస్తే అది ముమ్మూర్తులా సీస పద్యపాదం అంటే నమ్మలేం. కానీ, గణాలూ యతులూ చక్కగా సరిపోతాయి. అదలా ఉంచితే, గ్రామ్య భాషలో పద్యాలు రాయడం సాధ్యమేనా? ఓ... భేషుగ్గా రాయవచ్చు. అలా రాసినవాళ్లూ ఉన్నారు. అలాంటి పద్యాలే కాదు ఏకంగా శతకాలే ఉన్నాయి మరి! 
‘ఎంకివంటి
పిల్ల లేదోయి లేదోయి...’ అంటూ ఎదను గిల్లే ఎంకి పాటలను విన్నాం. చదివాం. బంగారిమామ, కిన్నెరసాని, కూనలమ్మ... మొదలైనవీ మనకు తెలుసు! వీటిలో గణాలు, యతులు లాంటి ఛందస్సు ఛాయలు లేవు. అయితే ఇవి పాటలు. ఇక పద్యాలనూ ఛందోబద్ధంగా మాండలికంలో రాసినవాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లలో ముందుగా పేర్కోవాల్సిన వ్యక్తి దాసు శ్రీరాములు కవి. ఆయన ‘తెలుగునాడు’ అని ఓ ఖండకావ్యం రాశారు. పన్నెండో ఏటనే శతావధానం చేసిన ప్రతిభావంతుడు ఆయన. రత్నావళి, ముద్రారాక్షసం, మాళవికాగ్నిమిత్రం మొదలైన సంస్కృత నాటకాలను తెలుగులోకి, అభిజ్ఞాన శాకుంతలాన్ని అచ్చ తెలుగులోకి అనువాదం చేసిన పండితుడు. దేవీ భాగవతాన్ని పద్దెనిమిది వేల పద్యాలలో ఆశువుగా తెనిగించారు. ఏలూరు సబార్డినేట్‌ కోర్టులో ఉద్యోగం చేశారాయన. నూజివీడు సంస్థానాధిపతి శ్రీరాములుకు అల్లూరు గ్రామాన్ని ఈనాముగా ఇచ్చారు. ఒక పద్యంలో నాటి బ్రాహ్మణ స్త్రీల వ్యవహార భాషను ఉపయోగించి ఆయన రాసిన పద్యమిది...
అస్సే! చూస్సివషే! చెవుడషే! అష్లాగషే!యేమషే!
విస్సావఝ్జలవారి బుర్రినష యావిస్సాయికిస్సారుషే!
విస్సండెంతటివాడె! యేళ్లు పదిషే! వెయ్యేళ్ల కీడేషుమా!
ఒస్సే! బుర్రికి యీడషే! వియిషు కేముంచుందిలే! మంచి వ
ర్చెస్సే! యందురు శ్రోత్రియోత్తపద స్త్రీలాంధ్ర దేశంబునన్‌!

బహుశా వరుడి పేరు విశ్వేశ్వరుడు అయి ఉంటుంది. ఆ విశ్వేశ్వరుణ్నే ‘విస్సాయి’ అని ముద్దుగా పిలుచుకుని ఉంటారు. ఈ విస్సాయికి విస్సావఝ్జల ఇంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. ఆ నేపథ్యంలో పదేళ్లు కూడా లేని విస్సాయికి పెళ్లేంటి? పాపం తగులుకుంటుందని ఒకావిడ అంటే... వయసుదేముంది, అమ్మాయికి, అబ్బాయికి ఈడూజోడూ కుదిరాయని ఇంకో ఆమె సమాధానం. కొన్ని వర్గాల్లో ‘ట’తో ముగిసే పదాల్లో ‘ట’కు బదులుగా ‘ష’ వాడటం ఉంది. కన్యాశుల్కంలో ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అన్న అగ్నిహోత్రావధాన్ల మాటలు ప్రసిద్ధమే కదా! ‘తెలుగునాడు’లో ఇది ఒక్కటే మాండలిక పద్యం. దీని స్ఫూర్తితో ఇంకా కొంతమంది తెలుగు కవులు పద్యాల్ని మాండలికంలో మధురంగా చెప్పారు.
యతి లేని పద్యాల శతకం
దాసు శ్రీరాములు తర్వాత చెరువు సత్యనారాయణశాస్త్రిని ప్రస్తావించాలి. ఆయన ఆరితేరిన సంస్కృతాంధ్ర పండితులు. ‘శిశుపాలవధ’ మీద పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. సంస్కృతం, తెలుగు భాషల్లో అష్టావధాని. విశేషించి సంస్కృతంలో శతావధానం చేసి ‘ధారణా వాచస్పతి’ బిరుదు పొందారు. ఆయనకు ఓ ఊహాసుందరి ఉండేదట. ఆమె పేరు ‘చల్లా వెంకట సుబ్బలక్ష్మి’ట. ఆవిడ పేరు మీద ఏకంగా మాండలిక భాషా శతకమే రాశారు శాస్త్రి. ఆ శతకం మకుటం... ‘సల్లావెంకట సుబ్బలచ్మి బతుకేలా నీవు లేకుండినన్‌’. ‘ల్ల’ ప్రాసతో మూడువందల పాదాలు రాయడం ఆయనకు మాత్రమే సాధ్యం. అంతగొప్ప విషయాన్ని ఆయనతో ప్రస్తావించి... మకుటంలో యతి తప్పిందండీ అంటే, ‘మతి తప్పిన తర్వాత యతి తప్పితే ఏమిలే’ అని చమత్కరిస్తూ ఆ మకుటాన్ని అలాగే ఉంచి, మిగిలిన మూడువందల పాదాలను కదం తొక్కించారు. శాస్త్రి సుబ్బలచ్మిని బతిమిలాడుతున్న వైనం...
తల్లోపూలు గొనిస్త! సేతులకు బందర్గాజులేయిస్త! యీ
ఊల్లోగాని యెవుత్తి కట్టనసుమంటుప్పాడ చెమ్కీ బుటా
మల్లీమొగ్గల తెల్లకోక యిగ యీమారెల్లి  పట్కొత్తనే!
సల్లా యెంకట సుబ్బలచ్మి బతుకేలా నీవు లేకుండినన్‌!

      తలలోకి పూలు కొనిపెడతా! చేతులకు బందరు గాజులు వేేయిస్తా! ఈ ఊళ్లో ఏ స్త్రీ కట్టనటువంటి చెమ్కీలు, బుటాలున్న మల్లెమొగ్గ లాంటి తెల్లచీరెను ‘ఉప్పాడ’ వెళ్లి కొనుక్కొస్తా! అందుకని, సుబ్బలచ్మీ దయచూపవే! నువ్వు లేకపోతే ఈ బతుకు నాకెందుకు? అంటూ సరదాగా సాగుతుందీ పద్యం. మాండలికంలో సాగిన ఆ శతకంలో ప్రతి పద్యం చదివించే చేవ గలదే. గొట్టిముక్కల సుబ్రహ్మణ్యశాస్త్రి నంద్యాల వాస్తవ్యులు. సంస్కృతం, తెలుగు భాషల్లో ఉద్దండ పండితులు. శ్రీనివాసప్రభు, త్రయీ మొదలైన పద్యకావ్యాలు, ‘శృంగార తిలక భాణం’, ‘అహోబల మాహాత్మ్యం’ వంటి సంస్కృత అనువాదాలతో కలిపి ఓ ఎనభై కావ్యాలు రాశారు. సత్యనారాయణశాస్త్రిని ఆదర్శంగా తీసుకుని రాయలసీమ మాండలికంలో ‘మల్లీ! ఓ మల్లీ!’ అనే శృంగార జానపద శతకం రచించారు. అందులోనిదీ పద్యం.
పిల్లా! కేసి కెనాలు కాడ తొలి మార్పేరెట్టి నన్పిల్సినా
వల్లాతోడని సెప్పినావపుడు! బావా పేనమన్నావు న
న్మల్లారే! మనువాడతానని మజామాటల్‌ పిటారించినావ్‌
మల్లీ! బంగరు బంతిపూవ! మరువమ్మా! నిన్ను మర్సేదెలా!

      కడప కర్నూలు కాలువను సంక్షిప్తంగా కేసీ కెనాలు అంటారు. మిగిలిన పద్యం తేలికగా అర్థమయ్యేదే. ‘నువ్వే నా ప్రాణమ’ని బాస చేసిన మరదలిని మరచిపోలేక ఓ బావ చెప్పిందే ఈ పద్యం. ఆయనే మరో పద్యంలో... ‘నా కలలల్లో కనిపిస్తవే! మఱదలా! కాసింత దైసూపవే!’ అని బతిమిలాడతారు.
గొట్టుముక్కల గోపాలయ్య కూడా రైలుబండి గురించి రాయలసీమ యాసను మేళవించి...
గుడగుడ నీలుతాగుతది గుప్పున ఊత్తది దాని తోకలో
మడుసులు కూకుతారు, బవు మందది, బేగి లగెత్తుతాది బల్‌
దుడుకున లాగుతాది, తెలతోలోడు పీకిని వత్తుతాడు యె
క్కడ కనిసించినాడొ ఒక కంపెనివోడట యేమి సిత్రమో 

      అని చమత్కారంగా రాశారు. విజిల్‌ వేయడానికి పీకిని వత్తుతాడు అంటూ సరదాగా చెప్పారు. ఆ తర్వాత చెప్పుకోదగిన మరో కవి గాడేపల్లి సీతారామమూర్తి. సంస్కృతాంధ్రాలలో కింకవీంద్ర భట్టారకులు, స్వర్ణకంకణధారి, కనకాభిషేక సమ్మానితులు. గద్వాల సంస్థాన ఆస్థానకవి గాడేపల్లి వీరరాఘవశర్మ మనుమడు. సబ్‌జడ్జిగా పనిచేసి, ప్రకాశంజిల్లా ‘అద్దంకి’లో ఉంటున్నారు. వెంకటాద్రీశ్వర శతకం, మోహ ముద్గరం, అశ్వత్థామ తదితర కావ్యాలేగాక, ఉత్పలమాల పద్యాలలో సుందరకాండను అనువదించారు. చెరువు సత్యనారాయణశాస్త్రి సుబ్బలచ్మి శతకానికి ముగ్ధులై ‘చెరువువారి సత్తిబాబు పావుశతకం’ పేరుతో ఒక నక్షత్రమాల (27 పద్యాలు) రచించారు. 
      సుబ్బలక్ష్మిని ఉద్దేశించి సత్యనారాయణశాస్త్రి ఆ శతకాన్ని రాస్తే, దానికి సుబ్బలచ్మి ప్రతిస్పందిస్తే ఎలా ఉంటుంది అన్న కోణంలో గాడేపల్లి వీటిని రాశారు. చిన్నతనంలో ఆడామగా తేడా లేకుండా కలిసిమెలిసి ఆడుకోవడాలు, కొట్టుకోవడాలు సహజం. కొంచెం ఉడికిస్తే చాలు లంగాను గోచీగా బిగగట్టి మగపిల్లవాడితో దెబ్బలాటకు దిగడం... అప్పుడప్పుడు అబ్బాయిని బాదడమూ అంతే సహజం. సత్యనారాయణశాస్త్రి దుబ్బుమీసాలు పెంచుతారు. ఈ పద్యం ఆ మీసాలను వేళాకోళం చేస్తుంది ఇలా...
గోలీలాట మొగోల్ల ఆట! నువు కూకోమాకు! ఎల్లెల్లు, ల
చ్చీ! లచ్చీ! అని ఆడుపుట్టువునె ఆచ్చేపిస్తె, కూసోని, నీ
గోలీల్నీ, సహవాసగాళ్లవి సహా గొర్గింది గుర్తుంద! మీ
సాలింకెందుకు సత్తిబాబు! ఇకిలిస్తావేంది పిల్లాటలా!!

      సత్తిబాబు ఆడ పుట్టుకను ఆక్షేపిస్తే, సుబ్బలక్ష్మికి కోపం వచ్చి, సత్తిబాబుతో గోలీలాట ఆడి సత్తిబాబుకు శాస్తి చేసింది. ఎగతాళి చేస్తున్న సుబ్బలక్ష్మిని, ఏడవలేక నవ్వుతూ బిక్కమొగం వేసుకున్న సత్తిబాబుని మీరే ఊహించుకోండి! 
      నైపుణ్యం గల శిల్పిచేతిలోని ఉలి బండరాయిని సౌందర్యమూర్తిగా ఎలా మలచగలదో, ప్రతిభావంతుడైన కవి కలమూ అంతే! దానికి ప్రక్రియ, భాష లాంటివి అడ్డురావు. అంత ప్రతిభగల కవులు కాబట్టే భాష మాండలికం అయినా, యతి భంగం జరిగినా కవన ప్రపంచం వారిముందు మోకరిల్లింది. సంప్రదాయ సాహిత్యంలో గొప్ప అభినివేశం ఉన్న కవి కనుకనే, వేటూరి ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అన్నా ఛందోబద్ధంగానే సాగింది. ఇప్పుడు కొత్తగా పద్యాలు రాసేవాళ్లు దీనిని దృష్టిలో ఉంచుకుని తమ రచనలు సాగించాలి.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం