గోపాల కాల్వలు

  • 225 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఎస్‌.సంపత్‌కుమార్‌

  • యోగాచార్యులు,
  • కరీంనగర్‌.
  • 9346435123
ఎస్‌.సంపత్‌కుమార్‌

ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేట నుంచి ఆరేడు కిలోమీటర్ల దూరంలో పచ్చని పల్లెలు వెంకట్రావుపేట, దౌడపల్లి, ఇంజన్‌బట్టి, కొమ్ముగూడెం. చుట్టుపక్కల తోటగూడెం, జగ్గయ్యపేట, రాజంపేట... అన్నీ అందమైన పల్లెటూర్లే. అడవిలోనే ఊర్లన్నీ. కొంచెం లోపలికి పోతే గోండు, లంబాడి తండాలు ర్యాలి, తలమల, కొర్రు రాగట్ల.
      పచ్చని అడవిలో కొన్ని పెంకుటిండ్లు, మరికొన్ని గుడిసెలు. ఇళ్ల చుట్టూ దడి. దానికన్నీ చెట్ల తీగలు. అన్నిట్లోనూ చిక్కుడు తీగలే ఎక్కువ. ఆకుపచ్చని ఆకులు, నీలిరంగు పువ్వులు చూస్తేనే కడుపు నిండిపోతది. చిక్కుడు కాతకు వస్తే గుత్తులు గుత్తులుగా కాయలు. సంవత్సరం పొడవునా, అందరిండ్లలోనూ చిక్కుడుగింజల పప్పు నిలువ ఉంటుంది. జొన్నగట్కయినా మక్కగట్కయినా ఎల్లిపాయ కారం, చిక్కుడు పప్పు ఉంటేనే ముద్ద దిగేది.
      ఈ ప్రాంతంలో కృష్ణ జన్మాష్టమి పెద్ద పండగ. పండగ మూడు రోజులూ సయ్యాటలు, సంబురాలే. చిక్కటి చింతకాయ పులుసుబెట్టి తలంటి పోసి కొత్తబట్టలేస్తే పిల్లలు చూడాలె... లేడిపిల్లలు, లేగదూడల లెక్క చెంగలిస్తుంటరు. ఆడపిల్లలను చూస్తే చిలుకలు, గడ్డిచిలుకలు, రామచిలుకలు అన్నీ చిన్నవోతాయి.
      ‘‘మూడు రోజులు బడి బందు. అందరూ ఇండ్లకు పోండ్రి’’ అని పెద్ద పంతులు ఎలాన్‌ చెయ్యంగనే చుట్టిగంట కొట్టి ఎయ్యిమని ఎగురుకుంట ఇంటి తొవ్వలు బట్టి ఉరికినం పిల్లలందరం. 
      గంగవుతలికి పోయి చుట్టాలతో కలిసి గడపాలంటే కరీంనగరపోళ్లకు బహు ఆనందం. చూడచక్కటి ప్రకృతి. వెంకట్రావుపేటకు చేరినాంక చిన్నాయిన, పెద్దనాయిన, అన్నలు, అక్కలు, చెల్లెళ్లు, పాత సోపతిగాండ్లు అంతా ఒకచోటికి చేరుకున్నం. ముచ్చట్లు పెట్టుకుంట నిద్రలు బోయినం.
      తెల్లారి లేస్తనే సోపతిగాండ్లతో కల్సి జంగల్‌ చూడ బయలెల్లినం. పెద్ద పెద్ద బురుజులున్నయక్కడ. రాళ్లగోడలు, ఇంకా ముందుకుపోతే కొండగుహలు. అన్నీ చూసుకుంటపోయి మొర్రిపండ్లో, తునికి పండ్లో, బుడ్డకాశేపండ్లో తిన్నం. నీళ్లు తాగాల్నాయె. పాలకొండలకు పోయి గుట్టల మీదికెల్లి కిందికి దుమికే జలపాతాలను చూస్తే ఒళ్లు తెలుస్తలేదు. పడేటి నీళ్ల కింద బట్టలిడిచి తానాలు జేస్తే ఉల్లాసం. నవ్వుకుంటు, ఎగురుకుంటూ దోసిట్ల నీళ్లు బట్టి తాగినం. కొన్ని నీళ్లు పుక్కిట్లబట్టి ఎండదిక్కు ఊసితే ఇంద్రధనుసులు కనబడబట్టె.
      పక్కనే ఓ కొలనున్నది. దాన్ల ఈత గొడ్తామని పోతే ఒక ముసలామె మమ్ములను ఆగబట్టి కత జెప్పింది. ‘‘వెనుకటికి ఓ జమీందారు తన దగ్గరున్న బంగారమంతా మోటబొక్కెన్ల బోసి కొలనుల పారేసిండు. దాన్ని తీస్తామని అంగ్రెజోళ్లు, నిజామోళ్లు బహుప్రయత్నం జేసిండ్రు. ఆ మోటబొక్కెన ఎంతదీసినా మీదిదాంకచ్చి మునిగి పోతదట. కొలనుల లచ్చిందేవో, పోచవ్వతల్లో ఉన్నది’’ అని చెప్పేసరికి ఇక ఈతలు బందువెట్టినం.
      బాగా ఆకలిగావట్టె. చెట్ల పొంటబోయి జిట్రేగు పండ్లు, చిటిమొటిపండ్లు తెచ్చుకున్నం. జిట్రేగ్గాయలు తెంపవోతె ముండ్లన్నీ గీరుకపాయె. కొంచెం నల్లాలం ఆకులు నలిచి పసరుపూస్తే మంటే మండె. కాని ఎంతటి పుండ్లయినా నల్లాలం పెడ్తే మగ్గిపోతయంటరు.
      పాలకొండల మీంచి పడ్డ నీళ్లు కాల్వలై కల్సిపోయి ఏరై పారుతున్నయి. గలగల పారేటి నీళ్లల్లో చేపలు జరజరా పాక్కుంటు పోతున్నయి. కొన్ని గడసరి చేపలు నీళ్ల మీదికెగిరి తళుక్కుమని దుముకుతున్నయి. అట్లా పొయ్యేటి చేపలను కొమురు చిన్నాయిన పునుకుబట్టి పంచెలో కట్టుకొచ్చిండు. కొంచెం ఎండు పొరకతోటి మంట రాజేసి చేపలను చిట్టర పొట్టర కాల్చి పిల్లగాండ్లకిచ్చిండు. చేపలనట్ల కొరుక్క తింటుంటే ‘‘మెల్లగరో! ముండ్లు జూస్క తినుండ్రి. కుత్కల గుచ్చుకపోతయి’’ అని గదరాయించిండు.
      మళ్ల కొన్ని నీళ్లు దాగి వెంకట్రావుపేటకు జేరినం. ఆ ఊర్ల మూడు రోజులు ముచ్చట్లే, సంబురాలే. అక్కడ అనాదిగా ఓ ఆచారం ఉన్నది. అక్కడ కోరికలు కోరుకుని తీరినోండ్లు గోపికల వేషం గట్టాలె. మొగోండ్లయినా సరే! కృష్ణుని తోటి వాడల పొంటి సయ్యాటలాడాలె. ఆకరి నాడు నడివీధిల ఉట్టిగొట్టాలె.
      ఈసారి గురువయ్య కృష్ణుడేషం కట్టిండు. చూడబుద్దిగావట్టె. బొచ్చెకు బొచ్చె మనిషి వేషం గడ్తే చూసి ఈడు మీదున్న పొల్లగాండ్లు సరసాలాడబట్టిరి. పరదాలు గట్టిండ్రు. బల్లలేసిండ్రు. నీళ్ల కోసం బొయ్యేటి గోపికలకు అడ్డం దిరిగి కృష్ణుడు, ‘‘నీళ్లకు బొయ్యేటి ఓ నీలవేణి’’ అని రాగమందుకుంటే సాటి గోపికలే కాదు, ఊర్లో ఉన్న యువతులందరి గుండెలు జల్లుమన్నయి.
      ఇలా సంవాదం చక్కగా సాగుతుంటే మధ్యలో గట్టిగా పాడుకుంటూ ఒకడు వచ్చి ‘‘బందరు మియా సాయబును నేను, నన్ను బహదూరందురు’’ అలా తనను తాను పరిచయం చేసుకున్నడు. నవ్వించాలని మరొక పల్లవి ఎత్తుకున్నడు. ‘‘మేరానామ్‌ తేలుకోండి, ఏమీ లేదనుకోండి, ఊరు దిరిగే పిల్లదాన్ని, ఉడుత మింగిందనుకోండి’’.. ఇట్లన్న మాట. అసలు కతలో కొసరోలె బుడర్‌ఖాన్‌ రావటం, కోలాటాలు, నవ్వులు, కేరింతలతోటి సంబురం ముగిసింది. ఊరు ఊరంతా ‘కృష్ణాష్టమి’ పండగను మూడు రోజులు ముచ్చటగా చేసుకున్నది. ఈ సంబురాల్నే ‘గోపాల కాల్వలు’ అని పిల్చుకుంటరు.


వెనక్కి ...

మీ అభిప్రాయం