అక్షరమే అస్త్రం... అభ్యుదయమే ఆరోప్రాణం

  • 1245 Views
  • 6Likes
  • Like
  • Article Share

    అద్దేపల్లి రామమోహనరావు

  • కాకినాడ
  • 9849150303
అద్దేపల్లి రామమోహనరావు

తన వినూత్న వస్తు, శైలీ, అభివ్యక్తి మార్గాలతో పాఠకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన కవి రాసిన కావ్యం చిరస్థాయిగా నిలుస్తుంది. అలాంటి గొప్ప కవి శ్రీశ్రీ. ఆయన మహోన్నత కవితా సంపుటి ‘మహాప్రస్థానం’. ఆ కలానికి శ్రీశ్రీ చెప్పిన భావాలు కొత్తవి. ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ఆయన ప్రారంభించిన కవిత్వోద్యమ శీలత సరికొత్తది. శైలి, శిల్పం మీద ఆయన స్పృహ అత్యంత వినూత్నమైంది. వీటన్నిటి సమ్మిళిత సంచలిత కవితావిష్కృతే ‘మహాప్రస్థానం’.
ప్రాచీన
సంస్కృత, తెలుగు కావ్యాల్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న విద్వత్కవి శ్రీశ్రీ. అంతేకాదు, ఆయన ఆంగ్ల భాషా ప్రవీణుడు. దేశదేశాల సాహిత్యాన్ని అధ్యయనం చేసి, ఆయా మహాకవుల కవితారీతులు, ప్రయోగాత్మక సంవిధానాలూ ఆత్మకు పట్టించుకున్న సాహితీవేత్త. మొదట్లో శ్రీశ్రీ పద్యకవి. విశ్వనాథ, కృష్ణశాస్త్రి అంటే అభిమానం. వారి ముద్రలతో రాసిన ‘ప్రభవ’, శ్రీశ్రీ ప్రౌఢ పద్యరచనకి నిదర్శనం. ఆ తర్వాత తనదైన మార్గంలోకి ప్రవేశించారు. తన ప్రత్యేక ముద్రతో గొప్ప సాహిత్య సామాజిక చైతన్యం కలిగించారు.
      శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’లోని గీతాలన్నీ 1933-47 మధ్య రాసినవే. ఆ గీతాల్లోని భావధారకు మూలమైన నేపథ్యం చాలా ముఖ్యమైంది. రష్యాలో సామ్యవాద ఉద్యమం (1917) విజయవంతమైన తర్వాత, ప్రపంచం మొత్తం రష్యా వైపు చూసింది. ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థకు రష్యా మార్గం అనుసరణీయమని మేధావులు, రచయితలు భావించారు. ప్రపంచమంతటా సామ్యవాద సాహిత్య సంస్థలు ప్రారంభమయ్యాయి. వ్యవస్థలోని పేదరికానికి కారణమైన రెండు వర్గాల స్పృహ, శ్రామికవర్గంపై జరిగే శ్రమదోపిడీ, ఉద్యమశీలత గల కార్మిక కర్షకుల చైతన్యం, గతి తార్కిక చారిత్రక అవగాహన - ఇలాంటి భావాలను ప్రపంచవ్యాప్తంగా కవులు, రచయితలు ప్రచారం చేశారు. తెలుగులో మొదటి సారిగా అపూర్వమైన ఆవేశంతో, కవితా శిల్పంతో, కవితలు ‘మహాప్రస్థానం’ రూపంలో వెలువడ్డాయి. పాఠకుల హృదయాల్ని కదిలించాయి. అనేకమంది నవకవులు శ్రీశ్రీ మార్గంలో కవిత్వం రాశారు. భావకవిత్వాన్ని చీల్చుకుని అభ్యుదయ కవిత్వం ప్రచురితమైంది. దాని తొలి ప్రతినిధి శ్రీశ్రీ.
కరుణ రసాత్మకంగా...
సమాజ సంబంధమైన వాస్తవికత మూడు రకాలు. సామాజిక వాస్తవికత, విమర్శనాత్మక వాస్తవికత, సామ్యవాద వాస్తవికత. ‘మహాప్రస్థానం’లో సామ్యవాద వాస్తవికతకు సంబంధించిన కొన్ని ప్రధాన కవితలున్నాయి. మిగిలిన రెండూ బలంగా రూపుదిద్దుకున్నాయి. సామాజిక అన్వయం లేని ఇతరేతర భావాలూ ఆవిష్కృతమయ్యాయి.
      ‘హంగ్రీ థర్టీస్‌’... 1930లలో పేదరికం, ఆకలి- ప్రధాన వస్తువుగా ఎక్కువ కవిత్వం వచ్చింది. అది అభ్యుదయ కవిత్వంలో ముఖ్యాంశం అయింది. శ్రీశ్రీ మీద కూడా ఆ ప్రభావం ఉంది. ‘మహాప్రస్థానం’లోని ‘బాటసారి’, ‘బిక్షువర్షీయసి’ కవితలు ఇందుకు నిదర్శనాలు. పల్లెటూళ్లో బతకలేక, పట్టణంలో కూలి చేసి కూడు సంపాదిద్దామనుకుంటాడు ‘బాటసారి’లో ఓ పేద. తల్లిమాట వినకుండా బయల్దేరి వెళ్లాడు. ఎటువెళ్లాలో తెలియదు. తోవలో తీవ్రంగా జ్వరపడ్డాడు. కటిక చీకటి. కుంభవృష్టి. ‘రాత్రి అతని గుండె మీద నల్లని రాయిలా కూర్చుంది’ అంటారు కవి. రాత్రికీ నల్లదనానికీ పోలిక అలా ఉంచి, అతని గుండె బరువుకీ, గుండె ఆగిపోతున్న సందర్భానికీ కూడా తగినట్లు ఉంది. తల్లి గుర్తుకొస్తుంది. అలాగే వెళ్తుంటే కోడికూసింది. వేగుచుక్క అతణ్ని వెక్కిరించింది.
      ‘‘బాటసారి కళేబరంతో/ శీతవాయువు ఆడుకుంటోంది’’... గాలికి కూడా అతని కళేబరం ఆటవస్తువులా కనబడింది. ఎవరూ అతణ్ని పట్టించుకోలేదు. ‘‘పల్లెటూళ్లో తల్లికేదో/ పాడుకలలో పేగు కదిలింది’’ అంటూ కవితని తల్లితోనే ముగించడంతో, కథ చెప్పడంలోని కరుణ రసపోషణ ఉద్దీప్తమవుతుంది.
      ‘బిక్షువర్షీయసి’ అనే కథనాత్మక గేయం కూడా కరుణ రస ప్రధానమే. ముసలి బిచ్చగత్తె వర్ణన తెలుగు నుడికారంతో సాగుతుంది. ‘‘దారిపక్క చెట్టుకింద/ ఆరిన కుంపటి విధాన/ కూర్చున్నది ముసల్దొకతె/ మూలుగుతూ, ముసురుతున్న/ ఈగలతో వేగలేక’’... ఇక్కడ ‘ఆరిన కుంపటి’ చాలా అర్థవంతమైన ఉపమానం. ఈ కవితలోని కథ అంతా ఆమెకు తిండి లేని సందర్భం మీదే ఆధారపడింది. వండుకునేందుకు బియ్యమే లేవనే పరిస్థితిని ‘ఆరినకుంపటి’ స్ఫురింపజేస్తుంది. మొదట్లోనే ఈ పోలిక చెప్పడం కథనాత్మక రచనలోని ఓ శిల్ప వైఖరి. కవితలోని నాలుగు భాగాలూ ఆమె వర్ణనే. ‘‘ఎముక ముక్క కొరుక్కుంటూ ఏమీ అనలేదు కుక్క’’ అనీ ‘‘ఈగను పడవేసుకు తొందరగా తొలగె తొండ’’ అనీ చెప్పడంలో, స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటూ, దీనుల వంక చూడని మనుషులు వ్యక్తమవుతారు. ఆమె ఆకలితో మరణించింది. ఎగిరి వచ్చిన ఎంగిలాకు, ఇది నా పాపం కాదంది. అంటే, తాము సుష్ఠుగా తింటూ, తిండిలేని వాళ్లని పట్టించుకోని వారి పాపం ఇది. ఇది శ్రమదోపిడీకి సంబంధించింది కాదు. అమానుషమైన మానవ ప్రవృత్తికి సంబంధించింది. అందుకే ఇది సామాజిక వాస్తవికత.
అలాంటి వ్యవస్థ వద్దు
ఓ సామాజిక విషయాన్ని చెబుతూ, అందులోని సామంజస్యాన్ని విమర్శించినప్పుడు, అది ‘విమర్శనాత్మక వాస్తవికత’ అవుతుంది. ఈ కోవలో, చాలా ప్రభావితం చేసే కవిత ‘వ్యత్యాసం’. ఇందులో రెండువర్గాల విభిన్న జీవన తత్వం ఉంది. సుఖంగా జీవించే వర్గం ఒకటి; నిరంతరం బాధలు పడుతూ తిరుగుబాటు చేసే వర్గమొకటి. ఇద్దరి జీవిత క్రమమూ, విశ్వాసాలూ, స్వభావాల్లోని విభిన్నతను ఈ కవిత ఇలా చెబుతుంది...‘‘మీ కన్నుల చూపులు సరళరేఖలు/ రేఖ చెదిరితే గొల్లుమని పోతారు/ రేఖ కవతలి వాళ్లంతా నేరగాళ్లు/ రేఖను రక్షించడానికే/ న్యాయస్థానాలు, రక్షకభట వర్గాలు.../ మా దృష్టిది వర్తుల మార్గం/ ఆద్యంత రహితం/ సంధ్యా జీవులం, సందేహభావులం/ ప్రశ్నలే, ప్రశ్నలే/ జవాబులు సంతృప్తి పరచవు/ మాకు గోడలు లేవు/ గోడలను పగులగొట్టడమే మా పని!’’ ఏ జీవన విధానం సువ్యవస్థకు సహకరించదో, అలాంటి వ్యవస్థను సూటిగా విమర్శించడం వల్ల ఇది విమర్శనాత్మక వాస్తవికత.
సామ్యవాద మార్గంలో...
సామ్యవాద సూత్రాలపై ఆధారపడి, సామ్యవాద స్థాపనకు దారి తీసేది ‘సామ్యవాద వాస్తవికత’. శ్రమదోపిడీ, దోపిడీకి గురయ్యే కర్షక, కార్మికాదుల తిరుగుబాటు, పాలకవర్గాలతో సంఘర్షణ మొదలైనవన్నీ ఇందులో వస్తాయి. శ్రమదోపిడీ గురించి గొప్ప తెలుగు నుడికారంతో, భావ పరిణామ క్రమంతో, నిర్మాణ మార్మికతతో రాసిన కవిత ‘వాడు’. ఇందులో కర్మాగార యజమాని, కార్మికులు - వీరిమధ్య సంఘర్షణ ప్రధాన వస్తువు. ఆరేసి పాదాల్ని, మూడు భాగాలుగా విభజించి, పరిణామ క్రమాన్ని వాస్తవికంగా చెప్పిన, వచన కవితాత్మకమైన రచన ఇది.
      వస్తువులన్నీ కార్మికులు తయారు చేస్తున్నారు; ఒక్కడే వీటి ఫలితం అనుభవిస్తున్నాడు. శ్రామికులు ‘అన్యాయం’ అన్నారు. ‘అనుభవించాలి మీ కర్మం’ అన్నాడు యజమాని - ఇది మొదటి భాగం. ఎద్దుల్లా పనిచేసే వాళ్లని ముద్దకి దూరం చేశాడు. అది ‘ఘోరం, దారుణం’ అన్నారు వీళ్లు. వాడు ‘ఆచారం, అడుగు దాటరాదు’ అన్నాడు - ఇది రెండో పరిణామం. ఇది ఇంకా ముదిరింది. కార్మికులు భరించలేకపోయారు. పనిముట్లు కింద పడేశారు. ‘చెయ్యలేం, ఛస్తున్నాం, జీవితానికి ఆసరా చూపించ’మన్నారు. దీంతో వీళ్లది దౌర్జన్యం అనడానికి యజమానికో మిష దొరికింది. వెంటనే నోరుమూసి, జోడు తీసికొట్టి, ‘దౌర్జన్యానికి దౌర్జన్యం మందు’ అన్నాడు.
      రెండు వర్గాల సంఘర్షణలో పరాకాష్ఠ దశకి, సహకరించిన ముందరి రెండు దశల్లోని క్రమపరిణామమే ఇందులో శిల్పం. దానికి సముచితమైన వ్యావహారిక భాషా వినియోగం అభివ్యక్తి చాతుర్యం.
ఆ ప్రభావాలూ...
సామాజిక వాస్తవికతతో అన్వయించని ఎన్నో కవితలు ‘మహాప్రస్థానం’లో ఉన్నాయి. ఎందుకంటే, ఆనాడు శ్రీశ్రీ మీద అనేక ప్రభావాలున్నాయి. భావకవిత్వంలోని ఆత్మాశ్రయత్వం, సౌందర్యం, ప్రేమ మొదలైనవి; పాశ్చాత్య ప్రభావాలైన డాడాయిజం, సర్రియలిజం మొదలైనవి; ఇంకా ఎన్నో ఉన్నాయి. మనసు లోతుల్లోని అవ్యక్త భావాల్ని కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం కొన్ని కవితల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి ‘గంటలు’. ఈ గంటలు - దేనికి ‘ప్రతీక’నో చెప్పడం కష్టం. ‘యుగాల రథనాదం’ అనే ఒక విచిత్ర అనుభూతి శ్రీశ్రీ కవితల్లో కనిపిస్తుంది. ‘అన్నిచోట్లా, అన్ని అనుభూతుల్లో గంటలు మోగుతూ ఉంటాయి’ అంటారు. ‘ప్రాణస్పందన’ అనుకోవచ్చు; ‘అణుభ్రమణ సంగీతం’ అనుకోవచ్చు.
      ఒక్క క్షణంలోని మనోనుభూతిని ‘ఒక క్షణంలో’ అన్న కవితలో విచిత్రంగా వర్ణించారు. అది చివర్లో ప్రపంచ గమనంతో ఏకీభావన పొందుతుంది. ఈ కవిత చివర్లో శ్రీశ్రీ ఇలా అంటారు... ‘‘ఒక క్షణంలో/ సకల జగం/ సరభస గమనంతో/ పిమ్మట నిశ్శబ్దం/ ఆ క్షణమందే/ గుండెల కొండలలో/ మ్రోగును మార్మోగును/ హుటాహుటిన పరుగెత్తే/ యుగాల రథనాదం!’’ బహుశ ఇలాంటివన్నీ అధివాస్తవిక వాదాల ప్రభావం వల్ల వచ్చినవి కావచ్చు. 
శిల్పం అనర్ఘం
‘అవతారం’ కవితలోని గాఢమైన రచనాబంధం, శిల్ప విశేషాలను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని వెనక ఓ పురాణ కథ ఉంది. ఆ కథని, వినూత్న వ్యవస్థాపనకు ప్రతీకగా వినియోగించారు. బీభత్సం ద్వారా సిద్ధించే కొత్త సృష్టి మీద శ్రీశ్రీకి ఒక భావనాత్మక ఏకీభావన చాలాచోట్ల కనిపిస్తుంది. దీనికి ‘వరాహావతార కథ’ సరిపోతుంది. హిరణ్యాక్షుడు, భూమిని సముద్రంలో ముంచేశాడు. విష్ణువు వరాహావతారం లో భూమిని ఉద్ధరించాడు. అది కొత్తసృష్టికి నాంది అయింది.
ఆదిసూకర/ వేదవేద్యుడు/ ఘుర్ఝురిస్తూ కోరసాచాడు/ పుడమి తల్లికి/ పురుటి నొప్పులు/ కొత్తసృష్టిని స్ఫురింపించాయి.
      ఈ రెండు భాగాల్లోని భావమే కవితలోని పరమార్థం. విష్ణువు వరాహం అవతారంలో వచ్చి, భూదేవిని ఉద్ధరించాడు. భూమి మీద ఉన్న జీవ, నిర్జీవ పదార్థాలన్నీ మునిగిపోయాయి. మళ్లీ కొత్తసృష్టి జరగాలి. భూదేవి విష్ణువు భార్య. ఆమెని దగ్గరికి తీశాడు. అందుకే పురుటినొప్పులు. ఈ సన్నివేశంతో, పైన చెప్పిన అయిదు భాగాలు అన్వయించాలి. ఈ భాగాల్లోనివి భూమి మీదివికావు. పైలోకాల్లోవి. ఇక్కడ ఈ మహాసన్నివేశం జరుగుతుంటే, అవన్నీ కళవళపడ్డాయి. ధ్వనులు చేశాయి. యముడి మహిషం లోహఘంటలు ఖణేల్‌మన్నాయి; నరకలోకపు జాగిలాలు గొలుసు తెంచుకుని ఉరికిపడ్డాయి; సూర్యుడి గుర్రాలు నురుగులెత్తే పరుగుపెట్టాయి; కనకదుర్గ సింహం జూలు దులిపి ఆవులించింది; ఇంద్రుని ఏనుగు ఘీంకరిస్తూ సవాలు చేసింది; నందికేశుడు రంకెలేస్తూ గంగడోలు కదిపి గంతులు వేశాడు. ఈ చేష్టలన్నీ చివర చెప్పిన సన్నివేశానికి గొప్ప వాతావరణం కల్పిస్తాయి. ఇలా ఒక పట్టికలాగానే పద్యం ధ్వనింపజేయడం శ్రీశ్రీకి చాలా ఇష్టం. కవితా నిర్మాణ మార్గం మీద శ్రీశ్రీకి ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పడానికి ఆయన కవితలన్నీ నిదర్శనమే. 
తిరుగులేని శబ్దాధికారం
‘శబ్దం’ మీద శ్రీశ్రీకి ఉన్న అధికారం అపారం. సంస్కృతంగాని, తెలుగుగాని, ఆయన ‘స్వేచ్ఛా శబ్దలయ’... భావ అభివ్యక్తికి అనుకూలంగా ప్రవహిస్తుంది. ఈ లయల కోసం శ్రీశ్రీ, ప్రాచీన సంస్కృత తెలుగు కావ్యాల్లోని లయలను ఆత్మగతం చేసుకున్నాడు. పాశ్చాత్య కవుల శైలీ రహస్యాల్నీ అవగతం చేసుకున్నాడు.
‘మహాప్రస్థానం’ కవిత ప్రారంభ వాక్యాల లయకు ప్రేరణ భజగోవిందం. భజగోవిందం, భజగోవిందం- మాదిరే ‘మరోప్రపంచం’ రెండుసార్లు పునరుక్తం చేశారు. అయితే మూడోసారి ‘గోవిందంభజ’ అని మార్చి శంకరాచార్యులు లయ సౌందర్యాన్ని పెంచాడు. అది తనకు కుదరలేదని శ్రీశ్రీనే చెప్పుకున్నారు. లయ/ శిల్పాల మీద ప్రేమ ఉన్నవారు, వాటిని ఏ కవిలోంచి అయినా గ్రహిస్తారు. భావసామ్యత ఉండనక్కర్లేదు.
      శ్రీశ్రీ భావాల్లోని ఆవేశానికి, ఆయన లయలు సమాంతర ప్రకంపనలు. అందుకే అవి శబ్దధ్వనితో ఆగిపోక, పాఠకుని గుండెల్ని కదిలిస్తాయి. కొన్నిచోట్ల శ్రీశ్రీ అనుప్రాసలు, లయలు- కేవలం ప్రయోగాత్మకమే అయినా, చాలాచోట్ల శబ్దధ్వనీ, భావధ్వనీ- విడదీయరానివిగానే ఉంటాయి. ఉదాహరణకు ‘జగన్నాథుని రథచక్రాలు’... మీ కోసం కలంపట్టి,/ ఆకాసపు దారులంట/ అడావుడిగ వెళిపోయే,/ అరుచుకుంటు వెళిపోయే/ జగన్నాథుని రథచక్రాల్,/ రథచక్ర ప్రళయఘోష/ భూమార్గం పట్టిస్తాను/ భూకంపం పుట్టిస్తాను
      మొత్తం మీద పైపాదాలన్నీ ఒక్క వాక్యమే. ఆవేశ లయ సాగిసాగి, చివరి రెండు పాదాలకు వచ్చేసరికి... అంత్యప్రాస, భావాన్ని పరాకాష్ఠలోకి తీసుకుపోతుంది. శ్రీశ్రీ శబ్దశక్తిలోని ప్రధానాంశం ఇదే.
ఛందస్సు అంటే...
శ్రీశ్రీకి మాత్రాగణ ఛందస్సు ఇష్టం. ప్రజాకవిత్వానికి బాగా వినియోగపడేవి, పాటకు దగ్గరగా ఉండేవి మాత్రాగణాలే అని నిర్ణయించారు గురజాడ. ‘ముత్యాలసరం’ ఛందస్సు రూపొందించారు. రగడలూ, జానపద గేయాలూ, గజల్‌ - లాంటివాటి రూప సంబంధమైందే ముత్యాలసరం. శ్రీశ్రీ మాత్రాగణాల్నే కూర్చినా, ఆ నడకల్లో అత్యంత సంకీర్ణతను కూడా అనుసరించారు. భావానుగుణంగా ప్రవహించే ఓ స్వేచ్ఛా మాత్రాగణ గమనం కూడా వినియోగించారు. ఛందస్సులో ఆయన తెచ్చిన వినూత్న శైలి ఇదే. ఇది ఆవేశానికనుగుణంగా, నిరాటంకంగా సాగిపోతుంది. చలం ‘‘పాతపదాలు, డిక్షన్, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు, ఆచారాలు, కవిత్వంలోవీ, జీవితంలోవీ ఇంక మళ్లీ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టాడు శ్రీశ్రీ’’ అనడం పూర్తి నిజం కాదు. అన్నింటినీ తన భావాభివ్యక్తికీ, శైలికీ అనుగుణంగా వినియోగించుకున్నారు. ఒక కొత్తదనాన్ని స్థాపించుకున్నారు. 
      ఛందస్సు, శ్రీశ్రీ కవిత్వంలోని ప్రధాన ద్రవ్యం. అయితే చాలా చోట్ల అది స్వేచ్ఛా ఛందస్సు. ఛందోగంధి. ఉదాహరణకి... ‘‘ఆ చెలరేగిన కలగాపులగపు/ విలయావర్తపు/ బలవత్‌ ఝరవత్‌ పరివర్తనలో’’ - ‘‘ఆచెల/ రేగిన/ కలగా/ పులగపు/ విలయా/ వర్తపు/ బలవత్‌/ ఝరవత్‌/ పరివ/ ర్తనలో’’- అన్నీ నాలుగు మాత్రల గణాలే. ఛందస్సు అంటే ‘ప్రాచీన ఛందస్సు’ అన్నది శ్రీశ్రీ అభిప్రాయం. ఆ సర్పపరిష్వంగం వదిలేశానన్నారు. అంటే పద్యరచన నుంచి మాత్రమే విముక్తుడయ్యారు. ఆయన అవలంబించిన స్వేచ్ఛా ఛందోమార్గం, ఆ మార్గానికి ఒదిగించి పలికించిన భాష, ఆ భాషలోని అపూర్వ విప్లవతత్వమూ - అన్నీ ఆయన్ని ఓ నూతన యుగకర్తగా చేశాయి. 
అపురూపమైన ధ్వనిశక్తి
శ్రీశ్రీలోని ధ్వని, భావచిత్ర, ప్రతీకాది అభివ్యక్తి మార్గాలన్నీ, ఆయన ప్రధాన ప్రేరణయైన ‘విప్లవ ప్రయోగవాదా’నికి అనుకూలంగా రూపుదిద్దుకున్నాయి. ‘నేను ఒకటంటే పది’ అని తన ధ్వనిశక్తిని గురించి కూడా శ్రీశ్రీ చెప్పుకున్నారు. ధ్వని, సామ్యవాదాన్ని ధ్వనించాలనీ అన్నారు. ‘మహాప్రస్థానం’ కవితల్లో చాలాచోట్ల ధ్వనిశక్తి కనిపిస్తుంది. 
      ‘ఆః’ లో ‘‘నిప్పులు చిమ్ముకుంటూ/ నింగికి నేనెగిరిపోతే/ నిబిడాశ్చర్యంతో వీరు -/ నెత్తురు కక్కుకుంటూ/ నేలకు నేరాలిపోతే/ నిర్దాక్షిణ్యంగా వీరె...’’ అంటారు. ఇందులో పాదాల మొదటి అక్షరం నకారం కావడం యాదృచ్ఛికం కాదు. కవి భావంలోని ఒత్తిడిని అధికంగా వ్యక్తం చేసే ‘ధ్వని’ శక్తి అది. ఇందులోని రెండుభాగాలూ మూడేసి పాదాలతో, దాదాపు ఒకే లయతో ఉండటం, రెండింటిలోని ‘విరుద్ధభావ’ స్ఫూర్తిని పెంచుతున్నాయి. పైభాగం చివర ‘వీరు’ అనీ, రెండోభాగం చివర ‘వీరె’ అని వదిలెయ్యడం, ‘వారి’ దుర్మార్గాన్ని అనేక విధాలుగా ధ్వనింపజేస్తోంది. వీరే నీచంగా చూశారు, అవహేళన చేశారు, నన్ను వదిలేశారు- ఇలా ఎన్నయినా ఊహించుకోవచ్చు. ఇదంతా సామ్యవాద అనుకూలమైన ధ్వనిశక్తియే.
గుండెకు హత్తుకుపోయేలా...
ఆంగ్ల కవిత్వ సంబంధ శిల్పరీతుల్ని కూడా శ్రీశ్రీ జీర్ణించుకున్నారు. టీఎస్‌ ఇలియట్‌ ‘ఆబ్జెక్టివ్‌ కోరిలేటివ్‌’ అనే అభివ్యక్తి మార్గం శ్రీశ్రీకి చాలా ఇష్టం. ఒక భావోద్రేకాన్ని తెలియజేయడానికి, కొన్ని వస్తువుల వరసగానీ, సన్నివేశాల క్రమాన్నిగానీ ఒక జాబితాలాగా చెప్పి, ఆ ఉద్రేకాన్ని స్ఫురింపజెయ్యాలి. కేవలం ఉద్రేకాన్ని వర్ణించకూడదు. ‘నవకవిత’లో... ‘సింధూరం, రక్తచందనం/ బంధూకం, సంధ్యారాగం/ పులి చంపిన లేడినెత్తురూ/ ఎగరేసిన ఎర్రని జండా/ రుద్రాలిక నయన జ్వాలిక/ కలకత్తా కాళిక నాలిక/ కావాలోయ్‌ నవకవనానికి’ అంటారు. ఎర్రని వస్తువుల వరసని చెప్పడం ద్వారా, తీవ్రమైన ఆవేశం వ్యక్తమౌతుంది.
      ‘భావచిత్రాల’ వినియోగంలో కూడా శ్రీశ్రీ సమర్థుడు. ‘ఒకరాత్రి’ కవితలోని ‘‘ఆకాశపుటెడారిలో కాళ్లు తెగిన/ ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి’’ భావచిత్రం బాగా ప్రసిద్ధం. ఏకాంతస్థితి, ఆ స్థితిలోని భయమూ, సమ్మిళితంగా  ద్యోతకమవుతున్నాయి ఇందులో. అనంతమైన ఆకాశం, ఏమీ మొలవని ఎడారి, ఒంటరి ఒంటె - అన్నీ ఒంటరితనంలోని బీభత్సాన్ని వ్యక్తపరచేవే. ఆహ్లాదం కలిగించాల్సిన అందమైన చంద్రుడు కూడా, కాళ్లు తెగిన ఒంటెలా ఉన్నాడు. ఈ భావచిత్రంలో ఒంటరితనమూ, భయమూ అపూర్వంగా వ్యక్తమౌతున్నాయి. 
      కవితానిర్మాణ మర్మజ్ఞతపై శ్రీశ్రీ ప్రత్యేక దృష్టికి ఉదాహరణ... ‘సంధ్యా సమస్యలు’. ఓ సాయంత్రం, ఒక విద్యార్థికి తెలుగు సినిమా చూడాలా, ఇంగ్లీష్‌ సినిమా చూడాలా అనే సమస్య; ఒక ఉద్యోగికి స్వీటు తినాలా, హాటు తినాలా అనే సమస్య; ఒక సంసారికి ఉరి పోసుకోవాలా, సముద్రంలో పడిపోవాలా అనే సమస్య; కవితలోని ఈ మూడు సమస్యలూ, దాదాపు సమానమైన మూడు భాగాలు. అయితే, సమస్య విద్యార్థికి ‘తగిలింది’; ఉద్యోగికి ‘కలిగింది’; సంసారికి ‘ఘనీభవించింది’; క్రియాపదాలు, ముగ్గురికీ వారి వారి తత్వాన్ని బట్టి అర్థవంతంగా అమరాయి. ఇది ఆలోచనాత్మకమే!
ముందుమాట కాదు కానీ...
ఆ రోజుల్లో చలంలోని సంప్రదాయ వ్యతిరేకతను అందరూ వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఎక్కడ ఎవరు ఏ సంప్రదాయ విచ్ఛిన్నతను ప్రదర్శించినా, దాన్ని చలం సంతోషంగా సమర్థించడం సహజమైన విషయం. అలాగే ‘మహాప్రస్థానం’ ముందుమాటలో శ్రీశ్రీని ఆధారం చేసుకుని, తన తీవ్రమైన భావాలన్నీ చెప్పారు. చలం శైలి ఝంఝామారుతం. అది వెంటనే ఎవరినైనా ఆకట్టుకుంటుంది. అందుకే ‘మహాప్రస్థానం’ ఒక ఎత్తయితే, చలం ‘యోగ్యతాపత్రం’ ఒక ఎత్తుగా పేరు పొందింది. ముందు వాక్యంలోనే చలం అన్నాడు.. ‘‘ఇది మహాప్రస్థానం సంగతి కాదు; ఇదంతా చలం గొడవ’’ అని. శ్రీశ్రీది ఏ సామాజిక భావ ప్రపంచమో, ఆయన్ని ఎందుకు సామ్యవాదులు తమ గళఘోషగా భావించారో, ఆ విశ్లేషణ చలం చెయ్యలేదు. చలం ‘ముందుమాట’ ఆయన రచనగా గొప్పదేగాని, ముందుమాటకు ఉండాల్సిన సమగ్ర లక్షణాలు లేవు. అయితే, ‘‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ/ ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ’’ అన్న చలం మాట కీలకమైంది. ఇందులో భావ కవిత్వాన్నిగానీ, కృష్ణశాస్త్రిని గానీ నిరసించలేదు. ఎందుకంటే చలం కూడా మౌలికంగా వైయక్తిక భావవాది. కృష్ణశాస్త్రిది ఆత్మాశ్రయ కవిత్వమనీ, శ్రీశ్రీది సామాజికమనీ మాత్రం భావ లయబద్ధంగా మంచి నిర్వచనం ఇచ్చారు. 
      శ్రీశ్రీది కేవలం నినాద ప్రధానమైన కవిత్వం కాదు. లోతైన ఆలోచనలు, విప్లవాత్మక భావధార, అభివ్యక్తి ప్రత్యేకత, శబ్దలయ లోని భావౌచిత్యమూ - అన్నీ మిళితమై ప్రవహించే ఒక జీవనది. అందుకే ఆధునిక కవితా సంపుటుల్లో ‘మహాప్రస్థానం’ చిరస్మరణీయంగా మిగిలిపోయింది. నవతరం కవులకు ‘దీపిక’గా నిలిచిపోయింది. 


వెనక్కి ...

మీ అభిప్రాయం