కథల లోగిలిలో పాటల పందిరి ...చిన్నారుల కోసం

  • 2039 Views
  • 436Likes
  • Like
  • Article Share

    శాంతి జలసూత్రం,

  • హైదరాబాదు shanti.rfc@gmail.com
శాంతి జలసూత్రం,

మా అబ్బాయికి ఆర్నెల్లు... వాడికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఏడుస్తున్నప్పుడు ఈ వీడియోను చూపిస్తే, ఏడుపు ఆపేసి అటే చూస్తూ ఉంటాడు. ఈ పాట పాడిన ఆవిడ ఎవరో గానీ, ఆమెకు ధన్యవాదాలు.
      యూట్యూబ్‌లో ఓ వీడియో కింద కనిపించే వ్యాఖ్య ఇది. అదేమీ అల్లాటప్పా వీడియో కాదు... 74 లక్షల హిట్లను సంపాదించుకున్న దృశ్యమాలిక. ఒకపక్క పసిపిల్లలకూ నచ్చుతోంది అంటున్నారు... మరోపక్క ఇంతమంది చూశారు... ఇంతకూ ఆ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదు... మన ‘‘చిట్టి చిట్టి మిరియాలు/ చెట్టు కింద పోసి/ పుట్టమన్ను తెచ్చి/ బొమ్మరిల్లు కట్టి’’ పాట ఉంది కదా! దాని యానిమేషన్‌ రూపమే. దానికే ఇంత ఆదరణ. అచ్చమైన తెలుగు పాటలు, కథల యానిమేషన్‌ వీడియోలు బోలెడు యూట్యూబ్‌లో ఉన్నాయి. వాటిని చూస్తున్న వాళ్లూ లక్షల్లోనే ఉన్నారు. ఈ కాలంలో అమ్మభాషను నవతరానికి చేరువ చేయడం ఎలా అని తలపట్టుకుంటున్న వాళ్లకు... ఈ యూట్యూబ్‌ వీడియోలు మంచి మార్గం. ఎందుకంటే... పుస్తకం ఇచ్చి వీటిని చదవరా నాన్న అంటే, పిల్లాడు పట్టించుకోడు. సరే అని పక్కన కూర్చోపెట్టుకుని చదివి చెబితే, కాస్త ఆసక్తిగా వింటాడు. అదే దృశ్యాన్ని చూపిస్తూ పాట వినిపిస్తే అక్కడే అతుక్కుపోతాడు.
      చదివినదానికంటే చూసిందే ఎవరికైనా బాగా గుర్తుంటుంది. కళ్లకు కనిపించిన ఏ విషయమైనా సరే మెదడులో నాటుకుపోతుంది. ఇదే పిల్లల్లో అయితే దృశ్యాలు ఇంకాస్త ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కొన్ని సంస్థలు చిన్నారుల కోసం ప్రత్యేకంగా యూట్యూబ్‌లో తెలుగు ఛానెళ్లను నిర్వహిస్తున్నాయి.
ఏంటా ఛానెళ్లు
ఇన్‌ఫోబెల్స్, ఎడ్‌తెలుగు, సి.వి.ఎస్‌ 3డి రైమ్స్, ఫెయిరీటూంజ్‌ తెలుగు తదితర సంస్థలు పిల్లలకోసం బోలెడు కథలు, గేయాలతో ఉన్న చక్కటి యానిమేషన్‌ వీడియోలను అందుబాటులో ఉంచుతున్నాయి. వాటిలో కొన్ని సంస్థలు పిల్లల పాటలు, గేయాలకు దృశ్య-శ్రవణ రూపం ఇస్తుంటే, ఇంకొన్ని సంస్థలు నీతి కథలు, పంచతంత్ర కథలన్నింటినీ అందిస్తున్నాయి. తెలుగు చిన్నారులు అమ్మభాషకు దూరమవుతున్న ఈ రోజుల్లో, వీటిని వాళ్లకు చూపిస్తే చక్కటి తెలుగు  అబ్బుతుంది. ఈ ఛానెళ్ల వీడియోలు వస్తున్నప్పుడు (ప్లే అవుతున్నప్పుడు) కింద ఆయా గేయాల సాహిత్యం కూడా కనిపిస్తుంది. దాంతో అటు వింటూ, ఇటు చదువుకుంటూ చూడొచ్చు. అంటే తెలుగు మాట, తెలుగు అక్షరంతో పిల్లలకు ఒకేసారి పరిచయం అవుతుందన్న మాట. 
      పిల్లల గేయాలనగానే మనం చిన్నప్పటినుంచీ వింటున్న బుజ్జిమేక బుజ్జిమేక, బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది, ఉడతా ఉడతా ఊచ్‌వంటి పాటలే అనుకుంటాం. కాని ఈ సంస్థలు వాటితో పాటుగా పెద్దగా ఎవరికీ తెలియని మంచి పాటలకూ దృశ్యరూపమిస్తున్నాయి. 
ఇన్‌ఫోబెల్స్‌ 
ఈ సంస్థ పిల్లలకు అర్థమయ్యేలా కొత్తగా, సరదాగా ఉండే పాటలను అందిస్తోంది.
మట్టికుండనుండి పెద్దవెన్నముద్ద తీశాడు/చేయంతా వెన్న, ముఖమంతా వెన్న/తుంటరి కృష్ణ.. మా కృష్ట!
      అంటూ కృష్ణుడి అల్లరి చేష్టలకు సంబంధించిన పాటలు బోలెడు ఉన్నాయి. 
చిలుకా చిలుకా రంగుల చిలుకా /పళ్లను ఇస్తాను రారా రా/ఎర్రటి ముక్కును కలిగిన చిలుకా/పాలను ఇస్తా రారా రా/ పళ్లను ఇస్తా.. పాలను ఇస్తా /నీళ్లను తాగు రారా రా!
      అంటూ చిలుకతో మాట్లాడే పాటలు భలే తమాషాగా ఉంటాయి.
బస్సు వచ్చింది గవర్నమెంటు బస్సు/ఎరుపు రంగులో ఉన్నా.. చూడరా కన్నా/ఆరు చక్రాలు ఉండును, రెండూ లైట్లు మెరియును/నే కండక్టర్‌ అవుతాను.. రైట్‌ రైట్‌ అంటాను.. విజిల్స్‌ కూడా వేస్తాను
అంటూ సరదాగా సాగే పాటలూ ఉన్నాయిక్కడ. ఈ సంస్థ వీటన్నింటిని యానిమేషన్‌ చిత్రాలతో రూపొందించింది. వీటితోపాటుగా మనకు తెలిసిన కాకి కాకి కడవల కాకి, వానవాన వల్లప్ప, చిట్టిచిలకమ్మా, ఏనుగు ఏనుగు నల్లన వంటి గేయాలన్నీ ఇందులో చూడొచ్చు. https://www.youtube.com/results?search_query=infobells+telugu+rhymes
సి.వి.ఎస్‌ 3డి రైమ్స్‌ 
ఈ సంస్థ రూపొందించిన ‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా..’ గేయం వీడియోను ఇప్పటికి 10 లక్షలమందికి పైగానే చూశారు. వాళ్లలో కొందరు ఏమన్నారో చూడండి....
‘‘ఈ పాటను మా మనుమరాలికి చూపిస్తే మళ్లీ మళ్లీ చూసేందుకు ఉత్సాహ పడుతోంది’’... ఓ తాతయ్య వ్యాఖ్య. 
‘‘ఈ పాటల వల్ల మన సంస్కృతి సంప్రదాయాల గురించి ఈ తరం పిల్లలకు తెలియజెప్పినట్లవుతుంది’’... ఓ నాన్న అభిప్రాయం
      చిన్నారుల మీద ఈ వీడియోల ప్రభావం ఎంతగా ఉంటుందో, తెలుగుదనాన్ని ఇష్టపడే తల్లిదండ్రులు వీటిని ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. 
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు/ సిరిమల్లె చెట్టేమో విరగబూసింది/ చెట్టు కదలకుండా కొమ్మ వంచండి/ పట్టి పూలు కోసుకొచ్చి బుట్ట నింపండి/ అందులో పెద్దపూలు దండ గుచ్చండి 
      ఇలాంటి పాటలు చూసేందుకు సరదాగా, వినేందుకు ఆహ్లాదంగా ఉంటాయి. పిల్లలను తెలుగు వైపు నడిపించేస్తాయి. తారంగం తారంగం అంటూ పాడుకునే పాటలోనైతే అల్లరి కృష్ణుడి విశ్వరూపమంతా చూడొచ్చు.
ఇంకా పిల్లలు తెలుగు నేర్చుకునేందుకు వీలుగా ‘లెర్న్‌ తెలుగు ఓనమాలు’ అనే వీడియోలున్నాయి. వీటితో పాటుగా పండ్లను, జంతువులను చిన్నారులు గుర్తించేలా వాటి పేర్లతో పాటలను కట్టి అందిస్తోందీ సంస్థ. 
https://www.youtube.com/results?search_query=cvs+3d+telugu+rhymes
ఎడ్‌ తెలుగు
చీమ ఎంతో చిన్నది.. పనిలో ఎంతో మిన్నది ముందుచూపు ఉన్నది.. పొదుపులోనే మిన్నది

      అంటూ నీతిని బోధించే గేయాలు ఈ ఛానెల్‌ ప్రత్యేకత. వాటితో పాటు ‘వచ్చే వచ్చే రైలుబండి.. బండిలోన మామ వచ్చే/ వచ్చిన మామ టీవీ తెచ్చే/ టీవీలోన బొమ్మ వచ్చే/ బొమ్మ పేరు అచ్చమ్మ.. నా పేరు బుచ్చమ్మ’ అంటూ సరదాగా పాడుకునే పాటలూ ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కోడిపిల్ల, బంగారు బాతుగుడ్డు కథలను, బోలెడు నీతి కథలు, పంచతంత్ర కథలకు సంబంధించిన వీడియోలను చూడొచ్చు. ఇంకా చిన్నప్పటి గుడుగుడుగుంజం గుండేెరాగం, ఆకేసి పప్పేసి, తప్పెట్లోయ్‌ తాళాలోయ్‌ తదితర ఆటపాటలనూ ఇందులో వీక్షించవచ్చు. అంతేకాక రామలాలీ మేఘశ్యామ లాలీ, జో అచ్యుతానంద, చందమామ రావే, ఏడవకు ఏడవకు నా చిన్ని తండ్రి వంటి జోల పాటలకూ దృశ్యరూపమిచ్చారు. 
      ఈ చిన్నారి చిట్టిగీతాలను తన విద్యార్థులకు చూపించిన ఓ ఉపాధ్యాయుడి స్పందన... ‘‘ఈ గీతాలు మా పిల్లలకు చాలా బాగా నచ్చాయి. వాళ్లు రోజూ వీటిని వింటూ ఆస్వాదిస్తున్నారు’’. తెలుగునాట ఉపాధ్యాయులందరూ ఈ మాత్రం శ్రద్ధ తీసుకుంటే పిల్లలకు భాష మీద ప్రేమ దానంతటదే పెరుగుతుంది.  
https://www.youtube.com/results?search_query=ed+telugu+rhymes
ఫెయిరీటూంజ్‌ తెలుగు 
ఈ సంస్థ చిన్నారులకు అర్థమయ్యేలా చక్కటి యానిమేషన్‌ వీడియోలతో కథలను అందిస్తోంది. కథ కథకీ నీతుంది. ప్రతి కథకీ అర్థముంది. మాయా అద్దం, గంటల దెయ్యం, మాయా తివాచీ, మాట్లాడే చెట్టు వంటి కథలన్నీ తమాషాగా ఉంటాయి. ఇవేకాకుండా తర్కం, లోభి, మంత్రి తెలివి, నమ్మకద్రోహం, మార్జాలంవంటి కథలన్నీ చిన్నారుల్లో విలువలు పెంచుతాయి. 
https://www.youtube.com/results?search_query=fairy+toonz+telugu+stories
      బాలమిత్ర, టూనియార్క్స్, రైమ్స్‌ ఫర్‌ చిల్డ్రన్, మాజూనియర్స్, ఎడ్యుకేట్‌ వంటి మరికొన్ని సంస్థలు కూడా చిన్నారులకు సంబంధించిన ఆట పాటల, కథల యానిమేషన్‌ వీడియోలను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇంట్లో కంప్యూటర్‌ ఉంటే సరే. లేకపోయినా చరవాణిలోనైనా వీటిని పిల్లలకు చూపించవచ్చు. సాయంత్రం బడి నుంచి వచ్చాకో, రాత్రి పడుకునే ముందో కాసేపు వీటిని చూపిస్తే పిల్లలకు భాష మీద ఆసక్తి పెరుగుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం