హేతువాద సేతువు

  • 170 Views
  • 0Likes
  • Like
  • Article Share

    షేక్‌ ముర్తుజా

  • విజయవాడ
  • 8008574648
షేక్‌ ముర్తుజా

సర్వమూ భగవదాధీనమే అనేది ఆస్తికత్వం. మానవుడే మహనీయుడంటూ... మనిషి సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా దేవుడి అస్తిత్వాన్ని ప్రశ్నించేది నాస్తికత్వం. ఈ సిద్ధాంతం బుద్ధుడి కాలం నుంచీ ఉన్నదే. నాస్తికవాదం అనేది మనిషి మనిషిగా బతికేందుకు దారిచూపే ప్రత్యామ్నాయ జీవితవిధానం. అలాంటి దాన్ని తెలుగునేల మీద ఉద్యమస్థాయికి తీసుకెళ్లింది గోరా. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సమాజ సేవ, అభ్యుదయాలే తన శ్వాస ధ్యాసలుగా జీవించిన వ్యక్తి లవణం.
గోపరాజు
సరస్వతి, రామచంద్రరావు (గోరా) దంపతుల రెండో సంతానం లవణం. 1930 అక్టోబర్‌ 10న విజయనగరంలో జన్మించారు. ఆయన మీద చిన్నతనం నుంచే తండ్రి గోరా ప్రభావం ఉంది. తండ్రి తలపెట్టిన ప్రతి ఉద్యమంలోనూ క్రియాశీలంగా పాల్గొన్నారు. ఆయన మీద గాంధీజీ ప్రభావమూ ఎక్కువే. అందుకే ఆంగ్ల ప్రభుత్వ అధీనంలో నడిచే బడిలో చేరలేదాయన. తనకు తానుగానే చదవడం, రాయడం నేర్చుకున్నారు. విజ్ఞానాన్ని ఒడిసిపట్టారు. ఆంగ్లం, హిందీ భాషలు నేర్చుకున్నారు. గుజరాతీ, మరాఠీ, మలయాళాల్లో ప్రవేశం ఉంది. 
స్వరాజ్యం నుంచి సంస్కరణ వరకు... 
లవణం తన పన్నెండో ఏట క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తెల్లవాళ్ల బెత్తం దెబ్బలు తిన్నారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సేవాగ్రాం ఆశ్రమానికి వెళ్లి కొంతకాలం గడిపారు. ఆ సమయంలో గాంధీజీతో సన్నిహితంగా మెలిగి, ఆయన భావాలను ఆకళింపు చేసుకున్నారు. 1955లో భూదాన, సర్వోదయ ఉద్యమాలు, 1960లో సాంఘిక సమానత్వ సాధన, 1962లో ప్రపంచ శాంతియాత్ర, 1966- 67లో అమెరికా శాంతి ఉద్యమం, పౌరహక్కుల ఉద్యమం లాంటివాటిలో పాల్గొన్నారు. జోగినీ దురాచారం, కులవివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. నేరస్థుల సంస్కరణకు కృషిచేశారు. సంఘ సంస్కరణ కార్యకలాపాల్లో ఆయన భార్య హేమలత తనవంతు సహకారాన్ని అందించారు.
      సమాజ పరివర్తన, నాస్తికవాద వ్యాప్తికి అలుపెరగని కృషిచేసిన లవణం... మతాన్ని- సంస్కృతిని, మతాన్ని- విద్యను విడదీసేందుకు ఉద్యమస్థాయిలో శ్రమించారు. సుమారు ఏడు దశాబ్దాలపాటు విజయవాడ కేంద్రంగా నాస్తికోద్యమాన్ని నడిపారు. తండ్రి ఆశయాలే తన ఆశలుగా జీవించిన లవణం ఆగస్టు 14, 2015న తుదిశ్వాస విడిచారు. 
చైతన్య పరిచేదే సాహిత్యం 
సమాజ పరివర్తనకు రచనలు ఒక సాధనమని భావించేవారు లవణం. రచన సంఘంలో సదాలోచనలు పెంచడానికి, వ్యక్తిత్వ వికాసానికి తద్వారా సామాజిక మార్పునకు దోహదం చేయాలన్నది ఆయన మాట. అసలు రచనల ప్రధాన బాధ్యత సాంస్కృతిక విప్లవం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే అంటారాయన. ఈ దిశగా ఆకాశవాణి మద్రాసు స్టేషన్‌ నుంచి బాలలు, వయోజనుల కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. సాహితీ సృజనలో భాగంగా శరత్‌ నవలలను తెలుగులోకి అనువదించారు. లవణం రచనా శైలిని, సరళమైన భాషలో స్పష్టంగా రాసే వ్యాసాలను గమనించిన నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామ్మోహన్‌రావులు ఆయనను ప్రోత్సహించారు. సమానత్వ భావాలు, స్వేచ్ఛ గురించి చెబుతూ అనేక నాటకాలు రాశారు. 1949లో ‘సంఘం’ వారపత్రికను ప్రారంభించి నాస్తికత్వాన్ని వివరిస్తూ వ్యాసాలు రాశారు. 1953 నుంచి ‘ఆర్థిక సమత’ పత్రికలో కొన్ని వందల వ్యాసాలు రాశారు. ఇన్‌సాన్‌ (హిందీ), ఎథీస్ట్‌ (ఆంగ్ల), నాస్తిక మార్గం (తెలుగు) పత్రికల్లో దాదాపు 5వేల వ్యాసాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంచేందుకు శాస్త్రవేత్తలు, ప్రముఖుల జీవితాలు అందరికీ తెలిసేలా ఉండేవి ఆయన వ్యాసాలు. వాటిలో తన ఆశయాలను నిర్భయంగా చెప్పేవారు. ఎవరినీ నొప్పించకుండానే యథార్థాన్ని కళ్లకుకట్టేవారు. నాస్తికత్వం ప్రగతి, వినోబా జీవితం, జోగిని, నేరస్థుల సంస్కరణ, మనకు తెలిసిన గాంధీ... తదితరాలు ఆయన పుస్తకాలు. ‘మానవత్వ ప్రాంగణాన మోగింది నగారా’ అంటూ ఆర్థిక సమానత్వంపై ఆయన రచించి ఆలపించిన పాట సర్వోదయ సమ్మేళనాన్ని ఆలోచింపజేసింది.
      లవణం సాన్నిహిత్యం ఆచార్య వినోబా భావే అంతటివాణ్ని మత ప్రార్థనల నుంచి మౌన ప్రార్థనలకు మళ్లించిందట! అయితే లవణం ఏ సమస్యల మీద పోరాడారో అవి అలాగే ఉన్నాయి. అవి నిర్మూలనమై... సమాజం హేతుబద్ధ ఆలోచనలతో, విశాల హృదయంతో నడిచినప్పుడే ఆయన కన్న కలలు సాకారమవుతాయి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం