గుంటూరు తెలుగు తేనెలూరు

  • 1225 Views
  • 51Likes
  • Like
  • Article Share

    డా।। పాపినేని శివశంకర్‌

  • గుంటూరు
  • 8500884400
డా।। పాపినేని శివశంకర్‌

కారంపూడిలో కలియదిరిగిన పాతరాతి యుగపు మానవుడు... భట్టిప్రోలులో రాజ్య పతాకాన్ని ఎగరేసిన యశోధరుడు... చరిత్ర గుర్తులెన్నో! పౌరుషానికి ప్రాణం పెట్టే పల్నాడు... కళల కాణాచి తెనాలి... విస్మరించలేని ఊళ్లెన్నో! సిరుల వరాలనిచ్చే వరి... ఘాటెక్కించే మిరప... దుగ్గిరాల పసుపు... పలకరించే పైరులెన్నో! మంగళగిరి పానకాల నరసింహుడు... కోటప్పకొండ కోటేశ్వరుడు... అభయమిచ్చే దేవరలెందరో! అన్నింటికీ మించి అమరావతి! అందరినీ దాటి అక్కడి బుద్ధుడు; అమరలింగేశ్వరుడు. వేల సంవత్సరాల తెలుగుజాతి ప్రస్థానానికి సజీవ సాక్ష్యం ఆ నేల. అదే గుంటూరు. ఆ మట్టి గుండెల్లో ప్రతిధ్వనించే తెలుగు... తులసికోట ముందు ప్రమిద వెలుగు!   
అకట! తెల్గునేల, అందున గుంటూరు
మండలమున బుట్టు మానవుండు
కొసరి కొసరి యింత గోంగూర దిననిచో
ఏమి బ్రతుకు వానిదేమి మెతుకు

      అన్నారు తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి. ఆ గోంగూర రుచే గుంటూరు మాండలికంలోనూ చేరింది. గుంటూరు మండల చరిత్ర శాతవాహనులతో మొదలవుతుంది. క్రీ.శ.రెండో శతాబ్దంలో ధాన్యకటకం (ధరణికోట) వాళ్ల రాజధాని. ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు, వెలనాటి చోళులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు పాలించారు. ఆ కాలంలో ఇది వెలనాడు, పాకనాడు పేర్లతో ప్రసిద్ధికెక్కింది. తళ్లికోట యుద్ధానంతరం నవాబుల వశమైంది. తర్వాత ఆంగ్లేయుల పాలనలోకి వచ్చింది. 1904లో కృష్ణాజిల్లా నుంచి విడిపోయి గుంటూరు జిల్లా ఏర్పడింది. 1971లో కొంతభాగం ప్రకాశం జిల్లాలో కలిసింది. ప్రస్తుతం ఉత్తరాన కృష్ణానది హద్దుగా గుంటూరు మండలం 12 వేల చ.కి.మీ. విస్తీర్ణంలో వంద కి.మీ. సముద్రతీరంతో అలరారుతోంది. ఒక ప్రత్యేక భాషావ్యవస్థ కూడా ఇక్కడ రూపుదిద్దుకొంది. తిక్కన, నారాయణ తీర్థులు, జాషువ, తుమ్మల, ఏటుకూరి, జంధ్యాల పాపయ్యశాస్త్రి, ఉన్నవ, స్థానం మొదలైన మహనీయులు పుట్టిన గడ్డ ఇది.
      గుంటూరు జిల్లాలో ప్రాంతాన్ని బట్టి తెలుగు మాటలో మార్పు కనిపిస్తుంది. పల్నాడు ప్రాంతం భాష తీరు కొద్దిగా కరుకుగానూ, గుంటూరు ప్రాంతంలో ఆ కరుకుదనం కొద్దిగా తక్కువగానూ, తెనాలికొస్తే అది మృదువుగానూ అనిపిస్తుంది. పల్నాడు వాసి అక్కడి పౌరుషానికి తగ్గట్టుగా ‘‘ఆ ఏందంట ఏంది’’ అని అంటే, గుంటూరు వాసి ‘‘ఏంటి చెప్పు నువ్వు చెప్పేదేదో’’ అంటాడు. ఇక తెనాలి వాళ్లయితే ‘‘ఎలా, ఏమిటి, ఎట్టా’’ అని అంటుంటారు. ముంగల- ముందర, గాబు- తొట్టి,  చేంతాడు- చేద, ఇయ్యి- ఇవ్వు, ఆవజాన- ఆ తీరులో, లగెత్తు(లగువబట్టు)- పరిగెత్తు లాంటి మాటలు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్నాయి.  
ఆ ఎత్తిపొడుపు... ఆ పుల్లవిరుపు
ప్రజల వాడుకే రచనల్లో ప్రతిఫలించాలనే అభిప్రాయం వ్యావహారిక భాషావాదంగా బలపడింది. అయితే, ప్రజలు పలికేది పలికినట్టుగా రచయితలు రాయలేరు. ఒకవేళ రాసినా చదవలేరు. ఎందుకంటే, మాట్లాడే భాషలోని ‘యాస’ని రచనలో పట్టుకోవడం కష్టం. యాసే కాదు, నుడికారంలోని వెటకారం, ఎత్తిపొడుపు, పుల్లవిరుపు వంటివి రచనలో ధ్వనించవు. ‘మా బాగా చెప్పావే’ అంటాడు గుంటూరు మనిషి. దాన్ని సంభాషణలో రాయవచ్చు. కాని అందులో వెటకారం ఉందా? లేదా? ‘ఆహా అట్టాగా! నాకు తెలీదులే’ అన్న మాటలో పుల్లవిరుపు ఉందా? ఆ సంగతి రాతలో తెలియదు. 
      ఏ మాండలికానికైనా తనదైన పదజాలంతో పాటు పలుకు తీరు కూడా వేరుగా ఉంటుంది. అదే ‘యాస’ (ఏస). గుంటూరు మాండలికానికి పైకి విడిగా వినపడే యాస తక్కువ. అందుకే కవికోకిల జాషువ ‘ఏస కొంచెము లేని హృదయంగమంబైన సిసలైన తెలుగు రంజిల్లు చోటు’ అని గుంటూరు సీమని మెచ్చుకున్నారు. ‘వీర భాషాభిరామ’ అన్నారు. ఒక ప్రాంతపు ప్రజలకు, అందునా కవులకు స్వస్థాన వేష భాషాభిమానం సహజమే.
శానా బాగుంటది
శానా, మల్లె, బొవు, కుశాల, ఉచ్చిలి, ఆమైన, మయాన, దబ్బున, దానికల్లె, ఓ పాలి, పెడద్రం, కాత్తెలెక్క - ఇలాంటి ప్రత్యేక పదజాలం గుంటూరు జిల్లాలో పుష్కలంగా దొరుకుతుంది. క్రియాపదాల్లో బాగుంటది, వచ్చిద్ది, ఇప్పిచ్చు, తీసకపో, లెగిశాడు, పెట్టమాకు, కొనబాకు, కొట్టవాకు, అడగ్గాకు వంటి రూపాలుంటాయి. వికృత రూపాలుగా శాపలు, గేనం, గెప్తి, కూకో, కట్టం, ఇట్టం, నట్టం వంటివి కనపడతాయి. నిందార్థక వాక్యాల్లో గుంటూరు ప్రత్యేకత గుంటూరుదే. ‘దీని మొదులార!, నీ పుటమార! ఆడి జిమ్మదియ్య!, తిత్తిదీస్తా, తల్లి ముండమొయ్య! తస్సదియ్య!’ వంటి గమ్మత్తయిన వాక్యాలెన్నో. ఇవిగాక ధ్వన్యనుకరణ శబ్దాలు - లటిక్కిన, గబిక్కిన, దభీల్న, సెరసెరా, క్లె! క్లె!, వార్నీ! - ఇలాంటివన్నీ సామాన్య జన జీవనంలో వినపడేవే.
      జనసామాన్య భాషణలో మహాప్రాణాక్షరాలు పలకవు. ఒత్తులు ఎగిరిపోతాయి. పలుకు సౌమ్యంగా, మృదువుగా వినపడుతుంది. ‘‘దనం ఎంత గనంగా వున్నా గునం ముక్కెం’’, ‘‘నీల్లల్లో శాప తలుక్కుమంది’’... ఇలాగన్న మాట!  పదాదిని ఉన్న చకారం సకారంగా మారటం గుంటూరుతోపాటు తక్కిన మాండలికాల్లోనూ ఉండవచ్చు. దీనివల్ల గూడా మాటలు మృదువుగా మారతాయి. ‘‘సాల్లే సంబడం, సూశావ్‌గా, సల్లగా, సెట్టుగ్గాదు, నీకే సెప్పేది’’ తదితర మాటల రుచే వేరు. ఇక ‘‘యాపారం, యవ్వారం రెండూ జూసుకునే యవదానం లేదు నాకు’’ అని ఓ వ్యాపారి మృదువుగా అన్నాడనుకోండి... పదాదిని ఉన్న సంయుక్తాక్షరాల్లో (వ్‌+య్‌+అ) మొదటిది ఎగరగొడుతున్నట్లు ఆయనకి తెలియదు. 
      గుంటూర్లో అనుమంతు, యెంకటేశ్వర్లు, యీరాస్వాములకు కొదవలేదు. వీళ్లకు తోడుగా అయగ్రీవాచారి కూడా ఉన్నాడు. కాకపోతే వాళ్లంతా తమ పేర్లలో తొలి హల్లులు ఆ పైవాడికి సమర్పించుకున్నారు! హల్లులే ఏంటి? మాటల మధ్య అక్షరాలకి అక్షరాలే మాయమైపోతాయి. ఆతలికి (అవతలికి), తరాత (తర్వాత), లేపోతే (లేకపోతే), చించెట్టు (చింతచెట్టు) వంటి పదాల్లో మధ్య వర్ణాలు లోపిస్తాయి. మాట్లాడేటప్పుడు మనిషి బుద్ధి అసంకల్పితంగా, సహజంగా సౌలభ్యం కోసం చూస్తుంది. దాని ఫలితమే ఇలాంటి మార్పులన్నీ.
      శిష్టేతర వ్యవహారంలో ఉన్న ఒత్తులు ఎగిరిపోతుంటే శిష్ట వ్యవహారంలో లేని ఒత్తులు చోటు చేసుకుంటాయి. ‘‘వీరభ్రద్రయ్య గారూ! త్రుంగభ్రద్రలో మ్రోకాటి లోతు వ్రుదకం ఉందండీ!’’ అన్నాడట వెనకటికి ఒకాయన. ఆ మధ్య ఒకింటి దగ్గర ‘భామ్మగారూ! మీ భొక్కెన భావిలో పడిందండీ!’ అనే వాక్యం వినపడింది. అంత ఒత్తి చెప్పకపోయినా బొక్కెన బావిలోనే పడుతుంది గదా! 
మేవ్‌ఁ వచ్చావ్‌ఁ
ఇక్కడి శిష్టేతరుల భాషలో క్రియాపదాల్లో ఉత్తమ పురుష ప్రత్యయం ‘ను’ లోపిస్తుంది. ‘బెజవాడెల్లా(ను), ఇప్పుడే వచ్చా(ను), నీ కోసం గొలుసు కొన్నా(ను)’... ఇలాగన్న మాట. ఇక నిశ్చయార్థక క్రియాపదాల చివర ఇకారం అకారమవుతుంది. కొట్టాల, చెయ్యాల, తినాల - ఇలా వినపడతాయి. అలాగే వ్యతిరేక క్రియల్లో తుది అక్షరం లోపిస్తుంది.  ‘ఇంకా నూర్పిళ్లు కాలా, అన్నం దినలా, ఊరికి పోలా’... ఇలాంటి మాటలు ఇక్కడ సహజం. పదాంత మకారం ‘వ్‌ఁ’ కారంగా మారటం గుంటూరు తెలుగులో మామూలు. ఉదాహరణకు... ‘ఇదిగో, మేవ్‌ఁ (మేం) వొచ్చావ్‌ఁ (వచ్చాం)’, ‘రావుఁడూ! పాలెవ్‌ఁ (పాలెం) బొయ్యొచ్చావా?’. ఈ మార్పుని ‘ము > ం > వ్‌ఁ’ గా సూత్రీకరించవచ్చు.
      రెండు మాటలు కలిసే చోట రెండోమాట మొదట్లో ఉన్న వకారం లోపించి సంధి జరుగుతుంది. ఒక్కోసారి ‘ఓ’ ఆదేశమవుతుంది. ‘తలాకిలి (తల+వాకిలి) తీసే వుంది’, ‘సందేలప్పుడు  కూతురొచ్చింది పిల్లోళ్లతో’, ‘ఈ పుచ్చొంకాయలు పిచ్చోడైనా కొనడు’ లాంటి వాక్యాల్లో ఈ మార్పును గమనించవచ్చు. 
      ‘ప్రథమమీది పరుషములకు ‘గ స డ ద వ’ లు బహుళముగా నగు’ అని చిన్నయసూరి బాలవ్యాకరణం చెబుతుంది. కానీ గుంటూరు వాళ్లు ‘గ జ డ ద బ’లు బహుళంగా వాడతారు. ‘అమాస రేపు గద్దనంగా (కద్దు+అనంగా) వొచ్చాడు’, ‘ఎట్ట జావాలంట నీతో? తిత్తి దీస్తా’, ‘చెప్పింది జాల్లే, తుమ్మల గుంట మీనగా కర్లపూడి బోవాల’... ఇవన్నీ దీనికి ఉదాహరణలే. 
      ఇక్కడి శిష్టేతర వ్యవహారంలో అనుబంధ ప్రత్యయాలు ప్రత్యేకంగా కనపడతాయి. ‘నాలుగు దన్నే తలికి పందల్లె గీపెట్టాడు’, ‘ఎంత కాడికి ఎండలే దప్ప మా తట్టు సినుకే లేదు’, ‘ఈ వారం గడిసినాక నీ కాడ కొత్తా’... ఇలాంటి మాటలు ఇక్కడ వినపడతాయి. చాలా మాటల్లో వర్ణ సమీకరణం జరుగుతుంది. సామీప్యం వల్ల ఒక ధ్వని దాని పక్క ధ్వనిగా మారిపోవటమే వర్ణ సమీకరణం. ‘అద్దరేత్రి దాక యాడ పెత్తనాల కెల్లా?’, వడ్డ (వడ్ల) గింజలో బియ్యం గింజ’, ‘సెనక్కాయలు సెరుగ్గడ మల్లే తియ్యగా వుంటయ్యా యేంది?’... తదితరాల్లో ఇది కనిపిస్తుంది. ఇక కొన్ని మాటల్లో వర్ణ వ్యత్యయం జరుగుతుంది. అంటే అక్షరాలు అటుదిటు, ఇటుదటు తారుమారు కావటం. ‘కాలికి రాయి తలిగింది’, ‘పలక పలిగింది’... ఇలా మార్చి మాట్లాడేస్తుంటారు. 
రాటం రాటం
రెండు టకారాలు పక్కపక్కనే వచ్చినప్పుడు అవి డకారంగా, తకారంగా మారటం కూడా కద్దు. ఉదాహరణకు ‘కొడతం కొడతం వాడు బొయ్యి నాపరాయి మీనబడ్డాడు. అయినా వాడెవుర్నీ తిడటం లేదు’. ఇక్కడే మరో గమ్మత్తు ఏమిటంటే ‘తక్షణం’ అనే అర్థంలో క్రియారూపాలు పునరుక్తి చెందుతాయి. ‘కొడతం కొడతం’ అంటే కొట్టగానే అని అర్థం. ‘రాటం రాటం (రావడం రావడం) మీద బడ్డాడు’ అన్నప్పుడూ అదే విధం. 
      భూతకాల విషయం ప్రస్తావించేటప్పుడు విచిత్రంగా ఒక్కోసారి పుంలింగ ప్రత్యయానికి బదులు స్త్రీలింగ ప్రత్యయాన్ని ఉపయోగిస్తారిక్కడ. మాండలిక భాషావేత్తలు ఇప్పటిదాక ఈ సంగతి గుర్తించలేదు. ‘సుబ్బయ్య మావ శానా కలుపుగోలు మనిషి. ఎవురవపడ్డా నవ్వుతా పలకరిచ్చేది. యివరాలన్నీ అడిగేది’... ఇందులో కనిపిస్తోంది కదా ఆ మార్పు.  ‘నిందయం దామ్రేడితంబు నాద్యక్షరములకు హ్రస్వ దీర్ఘంబులకు గిగీలగు’ అని బాలవ్యాకరణం సూత్రం. (ఉదా: రావణుడు గీవణుడు) అయితే నిందా సందర్భంలో ఈ ప్రాంతంలో వేరే అక్షరాలు కూడా వినిపిస్తాయి. ‘మాకేవన్నా ఏసీలా బోసీలా?’, ‘యివరం దవరం లేకుండా మాట్లాడమాక’... ఇలాగన్న మాట. 
ఎన్ని మాటలో
ఆణిముత్యాల్లాంటి తెలుగు పదాలు కూడా ఇక్కడ వ్యవహారంలో ఉన్నాయి. మొత్త- మూల, అప్పెసం- అనుక్షణం, ఇలంబ్రం- విశాలం, కట్టుమట్టు- పశువులను కట్టేసే స్థలం, గరువు- ఇసుకనేల లేదా ఎర్రనేల, చిప్పరలు- వర్షాలు తగ్గిన తర్వాత అక్కడక్కడ ఆరుబయలు ప్రాంతంలో కనిపించే గడ్డిమొలిచిన భాగాలు, గనికె- తవ్వేందుకు ఉపయోగించే చిన్న గడ్డపలుగు, గమిడి/ గవిడి- ఊరు చివర లేదా సరిహద్దు, చంగనాలు- పరుగులు, దారకం- ఆధారం, ఏగిలి- పొలంలో ఓ పంటవేసి ఇంకో పంట వేయటం కోసం వదిలిన భాగం.... ఇలాంటి పదాలు కోకొల్లలు. ఇవన్నీ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ... చలం, కొడవటిగంటి వంటి ఇక్కడి చెయ్యిదిరిగిన రచయితలు కూడా స్థానికభాషని పట్టించుకోలేదు. అయితే మాధవపెద్ది గోఖలే ‘సన్న జీవాలు’, ‘బల్లకట్టు పాపయ్య’ కథాసంపుటుల్లో గుంటూరు జీవద్భాషకి అద్భుత కథారూపమిచ్చారు. ఆ తర్వాత అందే నారాయణస్వామి. అదే ఒరవడిలో కొలకలూరి ఇనాక్, పాపినేని, వల్లూరు శివప్రసాద్, విజయరామరాజు, ఎంవీ రామిరెడ్డి, బండ్ల మాధవరావు వంటి రచయితలు ఈ మాండలికాన్ని తమ రచనల్లో పదిలపరుస్తున్నారు.
      ఏ సంస్కృతి అయినా స్థిరంగా ఉండదు. ఎల్లప్పుడూ మారుతుంటుంది. అందులో భాగమైన భాష కూడా ఎల్లకాలం కుదురుగా, నిలకడగా ఉండదు. ఆదాన ప్రదానాల వల్ల కొత్త మాటలు చేరతాయి. జన జీవనం వ్యాప్తి చెందే కొద్దీ, ఇతర ప్రాంతాలతో సంబంధాలు పెరిగే కొద్దీ, ప్రాంతీయ ప్రత్యేక పదజాలం వెనకాడి, సామాన్య పదజాలం పెరుగుతుంది. కాబట్టి ప్రాంతాల మధ్య విభజన రేఖలు గీసినట్టు భిన్న మాండలికాల మధ్య కచ్చితమైన విడిగీత గియ్యలేం. గుంటూరు మాండలికానికి, కృష్ణ, ప్రకాశం జిల్లాల మాండలికాలకి చాలా పోలికలుంటాయి. ఓ ప్రాంతపు మాండలికాన్ని పరిశీలించేటప్పుడు ఈ అతివ్యాప్తిని (ఒక పరిధి దాటి మరొక దానికి కూడా అన్వయించటం) కూడా దృష్టిలో పెట్టుకోవాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం