‘ఉప’యను రెండక్షరాలు

  • 663 Views
  • 7Likes
  • Like
  • Article Share

    వడలి వేంకట అనంతరామ్‌

  • విశాఖపట్నం
  • 9393103317
వడలి వేంకట అనంతరామ్‌

ఉపకారికి ఉపకారము’ విపరీతము కాదు సేయ అపకారికి ఉపకారము నెపమెంచక చేయమన్నాడు సుమతీ శతకకారుడు. ‘ఉప’ అనే రెండక్షరాలే తెలుగుకు ఎంతో వన్నెలను అద్ది వెన్నెలలు కురిపించి, వెలుగులు విరజిమ్మి మన భాషకు పుష్టిని,  సంపూర్ణతను ఇచ్చాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. 
ఉపకారం, ఉపవాసం, ఉపాఖ్యానం, ఉపాయం, ఉపధ, ఉపమానం, ఉపాధ్యాయుడు, ఉపదేశం, ఉపరాష్ట్రపతి ఇలా ఎన్నో పదాల్లో ముందు వరుసలో కూర్చుంటుంది. వ్యాకరణ, సాహిత్య, ఆధ్యాత్మిక, రాజకీయాలు... ఇలా ఏ రంగమైనా సరే ‘ఉప’అనే రెండక్షరాలు దర్శనమిస్తూనే ఉంటాయి. 
      భారతదేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ‘ఉప రాష్ట్రపతి’తో మొదలు పెడితే... ఉపప్రధాని, ఉప ముఖ్యమంత్రి, ఉప సభాపతి, ఉప సంచాలకుడు, ఉపకులపతి వంటి పదాల్లో ‘ఉప’ కనిపిస్తుంది. వీటికే ఆంగ్లంలో డిప్యూటీ, వైస్‌ అనే రెండు పదాలు తేడాలు చూపిస్తాయి. కానీ తెలుగులో హోదాను, గౌరవాన్ని, పరపతిని సమానంగా ఇచ్చి అందరికీ ఒకే ‘ఉప’తో ఆదరించి, అంతా సమానులే అనే భావాన్ని కలిగిస్తాం.
సాహిత్యంలో ‘ఉప’విన్యాసం
‘ఉపనయనం’ అంటే ద్వితీయశ్రేణి కన్ను కాదండోయ్‌. ‘వడుగు’ అని అర్థం. వడుగు అంటే వటువు రూపంలో వచ్చిన వామనమూర్తి గుర్తుకు వస్తాడు. పొట్టి వామనుడు త్రివిక్రముడై భూమి, ఆకాశాలను ఆక్రమిస్తున్నపుడు పోతన...
      ‘రవి బింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై...’ వటుడు బ్రహ్మాండం నిండిపోయాడన్నారు. (రవిబింబము+ఉపమింప)
      మరికొన్ని సాహిత్య ప్రయోగాల్లో గమనిస్తే ‘ఉప’ల పదానికి మెరిసే రత్నమని అర్థం ఉంది.
‘ముదితాపసి వెనువెంటను 
వదలక చనుదెంచునట్టి వడిరాముని శ్రీ
పదరజము సోకి చిత్రం
బొదవగ గనుపట్టె నెదుటనొక ‘యుపలమటన్నన్‌’ 

      శ్రీరాముని పాదరజం సోకి ఆ ప్రదేశం  మెరిసే రత్నంలా భాసించిందని మొల్ల రామాయణంలో కనిపిస్తుంది.
      పంచతంత్రం అంతా కథలు, ఉప కథలతోనే సాగుతుంది. మహాభారతంలో శమంతకోపాఖ్యానం, ఉదంకోపాఖ్యానం, నలోపాఖ్యానం, హరిశ్చంద్రోపాఖ్యానం వంటి ఉపాఖ్యానాలెన్నో ఉన్నాయి. 
      ‘క్రియా సిద్ధిః సత్వేభవతి మహతా నోపకరణే’ - మహాత్ములు తమ ఆత్మశక్తి ప్రభావంతోనే కార్యాలను సాధిస్తారు. వారికి ‘ఉపకరణాలు’ అక్కర్లేదని అర్థం. అగస్త్యుడు ‘వింధ్యాచల గర్వాన్ని అణచడం, శ్రీరాముడు చంచలబుద్ధి గల వానరులతో స్నేహం చేసి వారధి నిర్మించి లంకను జయించడం, సూర్యుడు తొడలు లేని అనూరుడు రథసారథిగా తన రథానికి ఒకే చక్రంతో, సప్తాశ్వాలతో ప్రతిరోజు క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉదయించడం’ వంటివి ఆత్మశక్తితోనే సాధ్యమవుతాయి.
      జాషువా ‘ఊయలతొట్టి ఏముపదేశమిచ్చెనో కొసరి ఒంటరిగా ఊకొట్టుకొనును’ అని తన ‘శిశువు’ కవితా ఖండికలో అన్నారు. ఊయలలో ఉన్న చిన్నారికి ‘ఉపదేశం’ ఎవరిస్తారో కానీ, ‘ఊఁ కొట్టుకుంటుంది కదా?’
      ‘రాజా! నీ కీర్తి హంసవలె తెల్లనైనది’ అని వ్యాకరణంలో ఉపమాలంకారాన్ని విశదీకరించినప్పుడు తెల్లని హంస ‘ఉపమానమని’, రాజు ‘ఉపమేయమని’ చిన్నప్పుడే చదువుకున్నాం.
      ఉమాదేవిలో ‘ఉ’, పరమేశ్వరుడిలో ‘ప’ ఈ రెండు పదాలు కలిపి పలికితే సంతోషంతో పొంగిపోతాం.
      అందుకే రుచిగా శుచిగా నోరూరించేదిగా మారి ‘మా’ ఉప - మా ఉప కాస్తా ‘ఉప్మా’గా మారిపోయిందని సరదాగా అంటుంటారు!
      గుణింతాలతో మరింత సొబగులద్దుకొని తన ఉపవనంలోని పరిమళాలను దశదిశలా వ్యాప్తి చెందించి, తన స్థానాన్ని మరింత స్ఫుటంగా, దిట్టంగా, దృఢంగా చేసుకొని ‘గుణిజాలు’గా తన ఉనికిని మరింతగా చాటుకుంది. 
      ఉదాహరణకు: ఉపాధ్యాయుడు.
      శ్రీకృష్ణునికి, రుక్మిణికి పెండ్లి జరుగుట తథ్యమని ‘మా ఉపాధ్యాయుల ఆన’ అని అగ్నిద్యోతనుని నోటి వెంట పోతన మందారమకరంద తోటలో విన్నవించారు.
      ఉప్పుకప్పురంబు- ఒక్క పోలికే అయినా రుచులు మారతాయని చెప్పినా- ఉపయేగా ‘ఉప్పు’గా మారి ఉపకరించిందని ‘ఉప’ గొప్పలు పోతోంది.
      ‘ఉపనిషత్తుల’ సారం భగవద్గీత అని, ‘ఉపదేశసారం’- భజగోవిందమని ఉపన్యాసమిస్తోంది- ‘ఉప’. 
      అన్నమయ్య కూడా ‘సర్వోపాయముల జగతినాకితడే’ అని వేంకటేశ్వరుని కీర్తించారు. ‘ఉపమింప’ బహువృక్షాల దర్శనమే పుణ్యపురుషుల దర్శనమని ఆ కీర్తనలో పొందుపరిచారు. 
      పుస్తకాలకు, గ్రంథాలకు - ఉపక్రమణిక ముఖ్యమని, లేకుంటే ఏయే అంశాలు ఏయే పుటల్లో ఉటంకించారో అంత సులభంగా తెలియదని చెబుతోంది ఉప.
      పితృతర్పణాల సమయంలో ‘ఉపవీతి’యని యజ్ఞోపవీతాన్ని ‘కుడి ఎడమలుగా’- ఎడమ నుంచి కుడికి మార్చమంటారు పురోహితులు. అలా చేస్తేనే తర్పణాలతో పెద్దలు తరిస్తారని నమ్మకం.
      ప్రతీ వ్యాసానికీ ఉపోద్ఘాతం- ఉపసంహారం (ముగింపు) ఉంటాయని ఉప గారాలు పోతోంది.
      ఉపసంహారమంటే ఉప పాండవులు గుర్తుకు వస్తారు. అశ్వత్థామకు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించడమే కానీ ఉపసంహారం తెలియదనీ, పరీక్షిత్తుని జననం, శ్రీకృష్ణానుగ్రహం అన్నీ ఒక్కసారి మన ముందు కదలాడతాయి. 
      అలాగే ఉప పాండవుల్ని (ప్రతివింధ్యుడు - ధర్మరాజు పుత్రుడు; శ్రుతసోముడు- భీముని పుత్రుడు; శ్రుతకర్ముడు - అర్జునుని పుత్రుడు; శతానీకుడు - నకులుని పుత్రుడు; శ్రుతసేనుడు - సహదేవుని పుత్రుడు) అశ్వత్థామ సంహరించడం, ద్రౌపది ఆగ్రహించడం, చివరికి గురువు గారి కుమారుడని క్షమించి వదిలిపెట్టడం మన మనసులో మెదులుతుంది. 
హోదాలు వేరైనా భేదాలు లేవన్నా
పంచాంగ శ్రవణంలో రవి, చంద్రుడు వంటి నాయకులతోపాటు పురోహితుడు, వస్త్రాధిపతి, రత్నాధిపతి ఇత్యాదులు 21 మంది ఉపనాయకులున్నారు. మన సినిమాల్లో కూడా ఉపనాయకులు ఉంటారు. ఉపనదులు, ఉప రాష్ట్రపతి, ఉపప్రధాని ఇలా ద్వితీయ శ్రేణిగా స్ఫురించినా, ‘అగ్రశ్రేణి’ భాగం తనదే అంటోంది ‘ఉప’. ఉపగ్రహాలు, ఉపశకలాలు ఉపభాగాలే.
      పల్లెలను విడిచి, ‘ఉపాధి’ కోసం పట్టణాలు వలస వచ్చిన జనం కోకొల్లలు గదా! పాపకర్ములు హీనమైన ‘ఉపాధు’లు పొందుతారని, నీ దేహం కూడా ఒక ‘ఉపాధి’ మాత్రమేనని నువ్వు నిర్మలమైన, నిశ్చలమైన ‘ఆత్మస్వరూపానివి మాత్రమే’ అని భగవద్గీత ఉవాచ.
      పురాణాలు ఉన్నట్టే ఉప పురాణాలూ ఉన్నాయి. అందులో ‘గణేశ పురాణం’ ఒకటి. ఉపాంగాలుగా కూడా ‘ఉప’ గణుతికెక్కింది. ఉపసర్గలనీ, ఉపశ్రుతులనీ పలువిధాలుగా ‘ఉప’ విస్తరించి భాషకు మనోజ్ఞమైన, అర్థవంతమైన భావాల పందిరిని అల్లింది. ఇలా ‘ఉప’ తెలుగు భాషా భవనాన్ని తన పదజాలంతో అందంగా అర్థవంతంగా తీర్చిదిద్దింది.
      ఉపతో ప్రయోగాలు భాషను సుసంపన్నం చేశాయి. రావణుణ్ని అడ్డుకోబోయి గాయపడ్డ జటాయువు, వాలి చేతిలో దెబ్బతిన్న సుగ్రీవుడు శ్రీరాముని కరస్పర్శతో ‘ఉపశాంతి’ని పొందారని రామాయణం చెబుతోంది.
      ఒకప్పుడు తెలుగు పద్యానికి దండాన్వయం, ప్రతిపదార్థం, ఉపపత్తి, తాత్పర్యం అనే విభాగాలుండేవి. 
      భగవంతుని సన్నిధిని చేరడానికి, కృప పొందడానికి దగ్గర మార్గం ‘ఉపవాసం చేయడం, ఉపచారాలు ఆచరించడ’మేనని అంటోంది ఉప.
      కేదార్‌నాథ్‌లో సంభవించిన మహా ఉపద్రవానికి మానవాళే తగిన ఉపచర్యలు తీసుకోవాలని ‘ఉప’ కోరుతోంది.
      ఆధ్యాత్మికంలో ఉపాసనా పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. దేవీ ఉపాసనా, హనుమత్‌ ఉపాసనా వంటివి.
      శ్రీకృష్ణ పాండవీయంలో ‘అపాయాన్ని దాటడానికి ఉపాయమ్ము’ కావాలని శ్రీకృష్ణుడు పాటపాడుతూ భీముణ్ని హెచ్చరిస్తాడు.
      ‘రఘుపతిని, రవిసుతుని కలిపెను హనుమ, నృపుజేసెను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేయమని కోరెను కపుల హనుమంతుడు లంకజేరి...’ ‘లవకుశ’ లోని పాట సముద్రాల కలంలో నుంచి జాలువారింది.
‘‘ఉపయను రెండక్షరములు
ఉద్దీపింపజేయు భాషను ఉప్పెనవోలె
ఉపశమింపజేయు ఉపద్రవములెల్ల
ఉమాపతియు సంతసించు
ఉప లోన దాను ఒదిగియుండి
ఉపకరించు నెల్లరకు ఓ ఉపకరణమువోలె
ఉపలబ్ధినొంది ఉపశాంతికందురు
నెపమెన్నక నేర్చినచో నేర్పరులౌదురు.’’

      ఉప ఎన్నికలు, ఉపవనాలు, ఉపశ్రుతులు, ఉపచారాలు ఓహ్‌ ఉపమయమేనోయ్‌ అన్నినూ. 
      ఇలా ఎందులోనైనా ‘ఉప’ ఇమిడి అందరికీ ‘ఉప’యోగకరంగా ఉంటుంది. ‘ఉపలబ్ధి’ చేకూరుతోంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం