కవిత్వమొక తీరనితృష్ణ

  • 1072 Views
  • 20Likes
  • Like
  • Article Share

    సన్నిధానం నరసింహశర్మ

  • హైదరాబాదు
  • 9292055531
సన్నిధానం నరసింహశర్మ

పరమాద్భుతమైన భావాలను పలికించిన కవులను స్మరించుకుంటూ ... తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఆ సంపుటాల విశ్లేషణలను అందిస్తోంది ‘తెలుగు వెలుగు’. వీలువెంబడి ప్రచురితమయ్యే ఈ వ్యాస పరంపరలో మొదటిది ఇది...
రాళ్లున్న పెద్ద పెట్టెలకన్నా, రత్నాలూ వజ్రాలూ ఉన్న చిన్న మూటలు విలువైనవి. భావకవిత్వానికి బాటలు తీర్చిన దేవులపల్లి కృష్ణశాస్త్రి చిరుపొత్తం ‘కృష్ణపక్షం’ ఇలాంటిదే. ఊహా ప్రేయసిని తలచుకుంటూ, పొగిలిపోతూ ‘దిగిరాను దిగిరాను దివినుండి భువికి’ అంటూ స్వేచ్ఛాగానం చేసినా... ఆయన ఉద్దేశం మాత్రం మానవజాతికి ‘క్రౌర్య కౌటిల్య కల్పిత కఠినదాస్య/ శృంఖలములు తమంతనె చెదరిపోవడ’మే!
ఒక్కొక్క
గ్రంథం ఒక కాలీన ఉద్యమ సంకేతమై విజయస్తంభంగా నిలిచిపోతుంది. ఆలోచనల వెలుగులీనుతుంది. ఒక్కొక్క గ్రంథం ఉద్యమపు సిద్ధాంతాల ఎజెండాకు జెండాగా మారిపోతుంది. ఒక్కొక్క కావ్యం శాంతియుతంగా భావాల, భావుకతల రెక్కలు విప్పుకుంటూ, సమాజ రసజ్ఞ జన హృదయాలను సున్నితంగా - ఒక వస్తువులా కాక - ఒక మలయ మారుతంగా తాకుతుంది. చెప్పలేని, విప్పలేని భావాలను అనుభూతి ప్రదం చేస్తుంది. మానవుల్ని ఉన్నతులుగా చేస్తూ, ప్రేమికులుగా పెంచి వారిని మెత్తపరుస్తుంది. అలా చేసి మరిన్ని కావ్యాల సృజనకు మరికొందరు కవుల ఆవిర్భావాలకు దోహదం చేసిన కవిత్వ గ్రంథం ‘కృష్ణపక్షం’. ‘లావు ఒక్కింతయులేని’ ఆ భావకవిత్వ ఆంతరంగిక తత్త్వావిష్కరణం దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రీయమై ఒక కాలంలో కవితా ప్రేమికులకు రసరమ్య లోకాలను చూపింది. వాస్తవానికి ఇది శాశ్వత కాలీనతత్త్వానికి చిరునామా!
      కూడు, గుడ్డ, గూడు లాంటి భౌతిక అవసరాలు తీరాక ఉన్నత మానవ విహారాలకు కళలు అవసరం. వాటిలో కవిత్వ కళ మేధకు, హృదయానికి సంబంధించింది. అది ఆలోచనలు, అనుభూతులు పెంచి ఆనందాన్ని పంచుతుంది. ప్రకృతి పట్ల, ప్రేయసి పట్ల, దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలని భావకవిత్వం పరోక్షంగా ప్రబోధిస్తుంది. ‘ప్రేయసికి ప్రేమలేఖ రాయాలి ప్రొఫార్మా ఎక్కడ దొరుకుతుంద’ని ఒకవేళ ఎవరైనా అడిగితే ఏం చేయగలం! ఓ దణ్ణం పెట్టి కళ్లనీళ్లు పెట్టుకోవడం తప్ప. కవిత్వం ఒక ఔపయోగిక వస్తువు కాదు. అది హృదయ ఆవరణను విశాలం చేస్తుంది. ఆత్మానుభూతులను పంచుతుంది. ‘కృష్ణపక్షం’ అలా పంచింది. పంచిపెడుతూనే ఉంది. 
బాధే సౌఖ్యం
ఓ సందర్భంలో విశ్వనాథ సత్యనారాయణ ప్రబంధ కవుల్ని ఒక్కొక్క రుతువుతో పోలుస్తూ, మనుచరిత్ర కవి పెద్దనను వసంత రుతువుతో పోల్చారు. ఆధునిక కవుల్ని ఆయన బాణీలో మన వాణితో రుతువులుగా పోలిస్తే కృష్ణశాస్త్రినే వసంత రుతువుతో పోల్చి తీరాలి మరి. ఈ వసంత రుతురాజు ప్రేమతో, విరహంతో, వేదనతో స్పష్టాస్పష్ట వ్యక్తావ్యక్త ప్రణయభావ పరంపరతో నవ్య నవ్యంగా, శబ్దదివ్యంగా రాసిన కవిత్వరాశి ‘కృష్ణపక్షం’. ఇది ‘బాధేసౌఖ్యమనే భావన రానీవోయ్‌’ అంటుంది. ఊహాశాలీనత కంటే అనుభవానుభూతి వాక్య మార్మికతగా మారుతుంది ఇక్కడ.
      ‘అనాటమీ ఆఫ్‌ క్రిటిసిజమ్‌’లో ఎన్‌.ప్రై... ‘కవి వైయక్తికమైన గొప్ప దృశ్యంతోకాక మరేదో వైయక్తికేతరమైన గొప్ప దృశ్యంతో ఆత్మస్వేచ్ఛతో మానవుణ్ని సేదదీర్చాలి’ అంటారు. అలాంటి సహృదయుణ్ని సేదతీర్చే కర్తవ్యాన్ని ‘కృష్ణపక్షం’ నిర్వహించింది. ఈ ‘కృష్ణపక్ష’ కవి కృష్ణశాస్త్రి అసామాన్యుడు. తెలుగు సాహిత్యంలో నవ్యకవిత్వంలో ఇద్దరు యుగకర్తలు గురజాడ, రాయప్రోలుల వెంబడి భావకవిత్వ ఉద్యమ శాఖాకోకిల అయిన పువ్వు ఎడదవాడు. 
      నినాదాలతోకాక రచనా సంవిధానాలతో భావకవిత్వం ఉద్యమమైంది. అది ఒక శాంతియుత కవితా కాంతియుత రసజ్ఞ హృదయ ఉద్యమం. భావకవిత్వాన్ని ‘కవి యొక్క ఒక అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ భావము, ఒక చిన్నవాక్యంలో ఊదబడినచో (చెప్పబడినచో అని అర్థం) అది భావకవిత్వం’ అని విశ్వనాథ నిర్వచిస్తే, శ్రీశ్రీ ‘హృదయాలను మానసాలను కలవరపరుస్తూ అల్లకల్లోలంగా ఘూర్ణిల్లే ప్రమాద ప్రాంతారాలలో కవికి నిరాఘాటంగా విహరించే అధికారం కలదు. అట్టి అతని సంచారాలలో ఏ సన్ముహూర్తాననో కావ్యపీఠం ఒకటి మెరుగులు తీరిన విలక్షణ రచనా ధోరణిలో వెలుగు చూస్తుంది. ఆ గీతం కవి అనుభవించిన రసస్థాయిని సమగ్రంగా పాఠకుడిలో ఆవిష్కరించగలుగుతుంది. ఉత్కృష్ట భావగీతానికి నా నిర్వచనం ఇది’ అన్నారు.
      ‘కృష్ణపక్షం’ హృదయాలను మానసాలను కలవరపరుస్తుంది. అల్లకల్లోలం చేస్తుంది. తెలియని కోరికలను తెలుపుతుంది. కవిబాధను తన్మయత్వంతో పాఠక సహృదయుడు తన బాధను చేసుకుంటాడు. ఆవరణ భంగం చేసుకుని కవి భావనాకాశ ఆవరణంలో విహరిస్తాడు. శాస్త్రిగారి ప్రవాసం, ఊర్వశి వంటి ఇతర భావ కవిత్వాలనూ చదవాలి. అయితే కృష్ణపక్షులమైతే భావకవిత్వాల్ని విహంగావలోకనే కాదు, ఆత్మావలోకనమూ చేసుకోగలం.
      కృష్ణపక్షంలో దేవులపల్లీయుడు ‘ఆకులో ఆకునై’ ఖండికలో ‘... ఈ అడవి దాగిపోనా/ ఎటులైన ఇచటనే ఆగిపోనా’ అంటూ గొప్ప గీతిక రాశారు. అడవి ప్రకృతిలో తాదాత్మ్యం చెందుతూ రాశారు కదా... మరి అడవిలో సింహాలూ, పులులూ ఉన్నాయి గదా! సింహాల్లో సింహమై, పులులలో పులిని అయి అని రాశారా? అంటే అలా అనలేదు. ఆకులో ఆకుగా, పువ్వుల్లో పువ్వుగా, చిరుగాలిలో కెరటంగా, పాటలో తేటగా, అయిపోతాననే అన్నారు. ఎందుకు? జంతుప్రవృత్తిని పెంచడం ‘కృష్ణపక్షం’ కవి లక్ష్యం కాదు. మనిషికి సహజంగా కావాల్సిన ప్రేమ ప్రవృత్తిని పెంచడమే ఆయన లక్ష్యం. సున్నితమైన ప్రాకృతిక రూపాలే ఆయన కవితాంశాలు. అందుకే కృష్ణశాస్త్రిది ప్రకృతి కవిత్వమే కాదు, ప్రాకృతిక కవిత్వమూ అయింది. 
కృష్ణశాస్త్రి భాష
తెలుగుభాష ప్రజల నాలుకలపైనా, గ్రంథాల్లోనూ విస్తృతమై స్థిరంగా ఉంటుంది. కానీ యుగకవుల వంటివారు రచనలు చేశాకా, మనం వాటిని చూశాకా, చదివాకా ఇదేమిటి ఈ కవి కొత్తబాసను పుట్టించాడా అని విభ్రాంతికి గురవుతాం. అందరరిదీ తెలుగుభాషే కానీ, కవిత్వ సృజనల్లో నన్నయ భాష, తిక్కన భాష, పోతన భాష, పాల్కురికి భాష అనిపిస్తాయి. సృజనశీలురు అలా చేయగలరు. సృజన శైలులు అలాంటివి.
      కృష్ణశాస్త్రి కూడా కృష్ణశాస్త్రి భాష అనేదాన్ని సృష్టించారనిపిస్తుంది. ‘ప్రణయకాల మహోగ్ర భయద జీమూతోరు గలఘోర గంభీర ఫెళపెళార్భటిలో మెరపేలా’ అని రాసిన ఆయన సంస్కృత ధిÅషణత్వాన్ని చూస్తే దానిలో ప్రత్యేకత అంతగా లేదు. కానీ... ‘స్వేచ్ఛాగానం’లో ‘మొయిలు దోనెలలోన పయనంబొనర్చి/ మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి/ పాడుచు చిన్కునై పడిపోదునిలకు/ నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అంటారు.
      మబ్బుదోనెలో ఆకాశ విహారం, మెరుపులా మెరవడం, పాడుతూ చినుకై పుడమి మీద పడటం... దీనిలో భావం, భాష అన్నీ కృష్ణశాస్త్రీయమే. కవుల్లో కృష్ణపక్ష కవి చిత్రంగా ఉన్నాడే... మనిషి అయిన ఈ కవి తన జన్మను మరచి పక్షినవుతాననీ, ఋక్షమవుతాననీ, మబ్బునీ, చందమామని ఇలా అవీ ఇవీ అవుతానంటాడే విచిత్రకవిలా ఉన్నాడే ఈయన అని అనుకునేలోపునే ఆయనంతట ఆయనే... ‘వింతగా దోచు నాదు జీవితము నాకె’ అంటారు. జిలుగు వెన్నెలతో చిమ్మచీకట్లలో మోహన సంగీతాన్ని వింటానంటారు. హృదయాన్ని కోసే దారుణమైన ఏడుపు సవ్వడుల్ని వింటానంటాడు. ఇక ‘మహాకవి’లో... ‘గుత్తునాయని జాతిముత్యాల్‌/ గుచ్చినాడే మేలిసరముల/ ఇత్తునాయని తెలుగుతల్లికి/ ఇచ్చినాడే భక్తితో’ అంటూ ముత్యాలసరాల ఛందస్సుకు ప్రాభవం కల్పించిన గురజాడను స్మరించుకున్నారు. ‘జాతిముత్యాల్, మేలిసరముల’ అని ప్రయోగౌచిత్యం పఠితను ఆకట్టుకుంటుంది. 
      ‘చితి- చింత’ అనే కావ్యాన్ని రాసిన వేగుంట మోహనప్రసాద్‌ ఒక రకమైన అస్పష్ట కవిత్వం రాశారు. దానికి కొన్ని దశాబ్దాల కిందట ఎప్పుడో అదోరకమైన అస్పష్ట కవిత్వాన్ని కృష్ణపక్షం వంటి వాటి ద్వారా దేవులపల్లి ఇచ్చారనేది స్పష్టం. ‘పక్షం’లో తేటివలపు పద్యాలున్నాయి...
అలరుచు మల్లికా పరిణయం బనివచ్చిరి పూవుబోండ్లు, కో
యిల సవరించెగొంతు, తమ యేలికకై విరితేనె పానకం
బళితతి గూర్చె, పుప్పొడుల నత్తరులం బవనుండు చేర్చె కో
మల జలజాత పత్రముల మాటున నేటికి దాగినాడవో! 

      ఈ పద్యం చదివితే అస్పష్ట భావ కవిత్వంలోనూ ఒక విస్పష్ట భావుకత్వమూ ఉందనిపిస్తోంది. దీని జీవభావం... ‘మల్లికకు పెళ్లి అని, పువ్వులు అనే స్త్రీలు వచ్చారు. పెళ్లిలో పాటలు పాడుకోవడం సంస్కృతిలో భాగం కదా. మల్లిక పెళ్లిలో కోయిల గొంతు సవరించింది. పెళ్లిళ్లలో పానకం కావాలి కదా. విరుల తేనె పానకాన్ని తుమ్మెదలు ఏర్పాటు చేశాయి. సెంటు రాయడం, పన్నీరు చిలకడం పెళ్లికే ఓ పరిమళం కదా! గాలి- పుప్పొడుల అత్తరుల్ని మల్లిక దగ్గరకు చేర్చాడు’! ఇలాంటి కవిత్వ పద్యాల్ని మననం చేసుకోవాలి. భవిష్యత్తరాలకు అందించాలి. 
      ‘లోకము’ ఖండికలో సెలయేరుతో కృష్ణశాస్త్రి ఇలా అంటారు... ‘తోయముల తీయనైన పానీయ మొసగి/ వలపు నునులేత గాలి వీవనల విసరి/ ప్రబలనై దాఘతీ వ్రాతపంబు వలన/ ఇట్టులైతివె సెలయేర, తుట్టతుదకు’! ఇక్కడ ‘వలపు నునులేత గాలి వీవనలు’ అనడం సహజ భావ ప్రకటన. పద్యకవితా ధర్మం నాలుగు పాదాలా నడవాల్సి ఉన్నా భావం నాలుగు పాదాల లోపుగానే అయిపోతే ఏదో పెట్టి పూరించడానికి ఆయన వ్యతిరేకం. నిర్మాణ లక్షణాలను పాటించినా భావ ప్రధానంగా కవిత్వం ఉండాలంటారు.
ప్రణయగీతం
‘ఇదె వచ్చుచున్నాను ప్రియులారా/ ఇక నిలువలేను ప్రియురాలా!’... నేను చిరకాలంగా ఎడద చెరలో ఇమిడిపోయాను, ఇప్పుడు పొరలిపొంగే దుఃఖ ప్రవాహాలపై పరిగెత్తి వస్తున్నా! ‘శూన్యలోకము దాటి శుష్కదేహము దాటి’ అంటూ రాసిన ప్రణయ కవిత్వం ప్రేయసి అనే పదానికే ఒక పదవిని ఇచ్చినంత పనిచేస్తోంది. భావకవిత్వం స్త్రీలని తక్కువగా ఎప్పుడూ చూడలేదు. దేవతగానో, రాణిగానో ఇంకా ఎక్కువగానో చెప్పింది. తాజ్‌మహల్‌ అనే హిందీ చలనచిత్రంలో కథానాయిక నాయకుడితో తాజ్‌మహల్‌ ముందు ‘చూడు... షాజహాన్‌ ముంతాజ్‌ స్మృతిగా తాజ్‌మహల్‌ నిర్మించాడు. నువ్వు నా మరణం తర్వాత ఏం నిర్మిస్తావు’ అంటుంది. అప్పుడు నాయకుడు ‘షాజహాన్‌ రాళ్లతో తాజ్‌మహల్‌ కట్టాడు. నీకు నేను నా రక్తంతోనే రెండో తాజ్‌మహల్‌ కడతా’నంటాడు. రక్తంతో కడతారా అని ఎవరైనా అడిగితే అవాక్కవడం తప్ప చేసేదేమీ లేదు. సంకోచ రహితమైన స్వేచ్ఛ నిండిన కవిత్వం భావకవిత్వం.
      భావకవిత్వంలో ప్రకృతి కవిత్వం, ప్రణయ కవిత్వం, దేశభక్తి కవిత్వం, స్మృతి కావ్యాలు, భక్తి కవిత్వం కొన్ని తేడాలతో ఒకటైనా... ప్రజలు భావకవిత్వమంటే ప్రణయ కవిత్వమనే ఒక అప్రకటిత నిశ్చయానికి రావడానికి ‘కృష్ణపక్షం’ వంటి కావ్యాలే కారణమనిపిస్తుంది. భావకవిత్వం కొన్ని దశాబ్దాలే ఉద్యమంగా ఉన్నా భావకవులు ఇంకా కొందరున్నా- ‘కృష్ణపక్షం’ భావుక రసజ్ఞ జనపక్షమైంది. అందులోని కవిత్వం ‘కృష్ణశాస్త్రిగారూ మీరు అమరులు’ అంటూనే ఉంటుంది రసనాగ్ర నర్తకిగా ‘కృష్ణపక్షం’ ఉన్నంత వరకూ!


వెనక్కి ...

మీ అభిప్రాయం