వెంకయ్య వెలిగించిన దీపం

  • 799 Views
  • 0Likes
  • Like
  • Article Share

    మోదుగుల రవికృష్ణ,

  • గుంటూరు
  • 7396100173

చదువుతున్నప్పుడు ఏదైనా తెలియని పదం తారసపడితే వెంటనే అర్థం తెలుసుకునేందుకు ఉపకరించేవి నిఘంటువులు. తెలుగులోనూ మనకు తెలియనివి లక్షల పదాలు ఉంటాయి. వాటి అర్థాలు తెలుసుకునేందుకు పూర్వం పద్య నిఘంటువులు ఉండేవి. అవి కొందరికే అర్థమయ్యేవి. మరి ఆంగ్లభాషలోలా అకారాది నిఘంటువుల్లా తొలిసారి తెలుగుకూ ఓ శబ్దకోశాన్ని అందించిన వ్యక్తి మామిడి వెంకయ్య.
అన్నమయ్య
కళావేదికపై కట్టుబడి వారిపాలెం తోలుబొమ్మలాట కళాకారులు రామరావణ యుద్ధం ప్రదర్శిస్తున్నారు. అది లక్ష్మణస్వామి మూర్ఛ ఘట్టం. తెరపై పోరు భీకరంగా సాగుతోంది. నేపథ్యం నుంచి ఖంగున పాట, వచనం; వచనం, పాట వినిపిస్తున్నాయి.
      రాములవారు, మేఘనాథుడు ఒకరికొకరు బాణాలు వేసుకొంటూ యుద్ధం చేస్తున్నారు. అది ‘యుద్ధమంటే యుద్ధమా! యుద్ధం ఆయోధనం జన్యం ప్రథనం ప్రవిదారణమ్‌ సంఖ్యం సమీకం సాంపరాయకమ్‌...’ అని పళపళ ఏదో శ్లోకం ఏకరువు పెట్టి, ‘ఇత్యమరః’ అని నేపథ్యంలోని సూత్రధారుడు అన్నాడు.
      ఇక్కడ సూత్రధారుడు చదివిన ‘యుద్ధం, ఆయోధనం...’ యుద్ధానికి పర్యాయపదాలు. చివరన చెప్పిన ‘ఇత్యమరః’ అంటే ఇవి అమరకోశం చెప్పిందని. పూర్వం జనాన్ని చదువరులను చేసేందుకు ఇది ఓ మార్గంగా ఉండేది.
      పూర్వ నిఘంటువులన్నీ పద్యరూపంగా ఉండేవి. వాటిని కావ్యాల్లాగా, వేదంలాగా బట్టీ పట్టేవారు. ‘అమరం నెమరుకు వస్తే కావ్యాలెందుకు కాలరాయనా’ అని పెద్దలమాట. అష్టాధ్యాయి జగన్మాత, అమరకోశం జగత్పిత అని ప్రతీతి. ‘అమరం చదవనివానికి నేనమరను’ అని సరస్వతీదేవి అన్నదట! ఇవన్నీ నిఘంటు ప్రాశస్త్యాన్ని చెబుతాయి.
పలురకాలు: పద్య, అకారాది, ప్రత్యేక, ప్రకీర్ణాలని నిఘంటువులు నాలుగు రకాలు. అకారాది నిఘంటువులు- ద్విభాషా నిఘంటువులు, తెలుగు-తెలుగు నిఘంటువులని రెండు రకాలు. మళ్లీ ద్విభాషా నిఘంటువుల్లో కేవలం ద్విభాషా నిఘంటువులు (తెలుగు- కన్నడం; తెలుగు- తమిళం; తెలుగు- ఇంగ్లిష్‌ వంటివి), పదపట్టికలు, పారిభాషిక నిఘంటువులు అని మూడు రకాలు. తెలుగు- తెలుగు నిఘంటువులను బృహన్నిఘంటువులు, లఘుకోశాలు అని వర్గీకరించవచ్చు. వైద్యశాస్త్రం, తులనాత్మక, శాసన పదకోశాలు, పదబంధ కోశాల లాంటివి ప్రత్యేక నిఘంటువుల వర్గంలోకి చేరతాయి. సామెతలు, సూక్తులు, జాతీయాలు, సంస్కృత న్యాయాలు, పదసూచికలు, విద్యార్థి కల్పతరువు, పూర్వ గాథాలహరి వంటి విశేష రచనలది ప్రకీర్ణాల విభాగం.
      సంస్కృత భాషకు నిఘంటువులు ప్రాచీన కాలంనుంచే ఉన్నాయి. తెలుగులో నిఘంటు రచన ఆలస్యంగా ప్రారంభ మైంది. 17వ శతాబ్దపు కవి చౌడప్ప తొలి తెలుగు నైఘంటికుడు. చౌడప్ప నిఘంటువుకు ప్రత్యేకంగా పేరేమీ లేదు. ఇది సీస పద్యాల్లో ఉన్నందువల్ల ఎవరో వీటిని ‘చౌడప్ప సీసాలు’ అన్నారు. ఆ పేరే ఖాయమైంది. వీటి సంఖ్య 30. దీని తరువాత వచ్చిన పద్య నిఘంటువులు గణపవరపు వేంకటకవి (17వ శతాబ్దం) కూర్చిన ‘వేంకటేశాంధ్రము’; పైడిపాటి లక్ష్మణకవి (17వ శతాబ్దం) సంగ్రహపర్చిన ‘ఆంధ్రనామ సంగ్రహము’, దీనికి అనుబంధంగా అడిదము సూరకవి (18వ శతాబ్దం) నిర్మించిన ‘ఆంధ్ర నామశేషము’. ఇవికాక నుదురుపాటి వెంకన్న (18వ శతాబ్దం) సమకూర్చిన ‘ఆంధ్ర భాషార్ణవము’ కూడా ఉంది.
      ఇవి పద్య నిఘంటువులు కనుక వీటిని కంఠస్థం చేయాల్సిందే. మనకు కావాల్సిన పదానికి అర్థాన్ని చటుక్కున పట్టుకోలేం. పైగా ఇవి ఒక పదానికుండే పర్యాయ పదాలనే ఇస్తాయి కానీ, నానార్థాలను, ప్రయోగాలను ఇవ్వవు.
      తెలుగు అకారాది నిఘంటువు కాకపోయినా అకారాది నిఘంటువులో తెలుగును చేర్చిన ఘనత విలియం బ్రౌన్‌కు దక్కుతుంది. విలియం బ్రౌన్‌ 1807లో ‘ఎ వొకాబులరీ ఆఫ్‌ జెన్‌టూ అండ్‌ ఇంగ్లిష్‌’ అనే ఒక తెలుగు- ఇంగ్లిష్‌ కోశాన్ని తయారుచేసి 1818లో ప్రచురించాడు. ‘జెన్‌టూ’ అంటే తెలుగు భాష. 1810 ప్రాంతంలో ఎ.డి.కాంబెల్‌ ‘ఎ డిక్షనరీ ఆఫ్‌ తెలుగు లాంగ్వేజ్‌’ అనే నిఘంటువును మొదలుపెట్టి 1821లో ప్రచురించాడు. ఈ రెండు నిఘంటువులు తరువాతి ద్విభాషా కోశాలకు మార్గదర్శకాలయ్యాయి.
దీపిక అదే... 
తెలుగులో తొలి అకారాది నిఘంటువు ‘ఆంధ్ర దీపిక’. దీనిని రూపొందించింది మామిడి వెంకయ్య (1764-1834). పూర్వీకుల నివాసం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. వెంకయ్య తల్లిదండ్రులు వెంకన్న, విజయలక్ష్మి. వెంకన్న కాలంలోనే వాళ్లు బందరుకు వచ్చి స్థిరపడ్డారు. వెంకయ్య చిన్ననాటి నుంచీ చురుకైనవారు. తర్క కర్కశంగా మాట్లాడే స్వభావం కలవారు. ధర్మశాస్త్రాలు, స్మృతులు అవలోడన చేశారు. కొన్ని విషయాల్లో ఆయన ఆలోచనలు విప్లవాత్మకం. వైదికాధికారాల కోసం ఆ అధికారం తమకే ఉందనే వారితో ఢీకొన్నారు. కోర్టులకెక్కారు. లండన్‌ ప్రీవీ కౌన్సిల్‌ వరకూ వెళ్లారు. గెలిచారు. ఇవి ఆయన జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే. ఆయన తలకెత్తుకొని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తెలుగు నిఘంటు నిర్మాణం భాషా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. 
      దేశంలో బ్రిటిష్‌ వాళ్లు వ్యాపారం మీదే కాక పాలన మీద కూడా దృష్టిపెడుతున్న రోజులు. వాళ్లు తొలిరోజుల్లో స్థానిక భాషల ద్వారానే పరిపాలన చేశారు. సివిల్‌ సర్వెంట్స్‌ తప్పనిసరిగా రెండు భారతీయ భాషలు నేర్చుకోవాలి. అప్పటికి పరిపాలనా వ్యవహారాల్లో మొగల్‌ సామ్రాజ్య ప్రభావం వల్ల, దక్షిణాదిలో కుతుబ్‌షాహీల పాలన వల్ల, హిందుస్థానీ, ఫారసీ, ఉర్దూ పదాల వాడుక ఎక్కువ. దీంతో ఆంగ్లేయులకు భాషతో చిక్కులు ఏర్పడ్డాయి.
      పరిస్థితిని అర్థం చేసుకొన్న వెంకయ్య తనకూ, వారికీ ఉపయోగపడే విధంగా నిఘంటు నిర్మాణానికి పూనుకున్నారు. పాత నిఘంటు నిర్మాణ పద్ధతికి కాలం చెల్లిందని తెలుసుకొన్నారు. ఫోర్ట్‌  సెయింట్‌ జార్జి కళాశాలలోని ఆంగ్ల విద్యావేత్తలతో ఏర్పడిన పరిచయాల ద్వారా ఎలాంటి నిఘంటువు అవసరమో గుర్తించి మరీ నిఘంటు నిర్మాణానికి పూనుకున్నారు. అలా రూపుదిద్దుకున్నదే ‘ఆంధ్రదీపిక’.
      ఆంధ్రదీపిక రచనాకాలం గురించి బ్రౌన్‌ దొరవల్ల ఒక సందిగ్ధత కొన్నాళ్లు నెలకొంది. తన బ్రౌణ్య నిఘంటువు ఉపోద్ఘాతంలో 1816లో ఈ గ్రంథం పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇది పొరపాటు. ఆయనే చేయించుకున్న ఆంధ్రదీపిక రాతప్రతిలో దీనిని 1806లో ముగించినట్లు స్వదస్తూరితో రాశారు. రాతప్రతి చివరలో వెంకయ్య చెప్పుకున్న గద్యప్రకారం కూడా 1806లోనే ఆంధ్రదీపిక రాతపని పూర్తయినట్లు తెలుస్తోంది. దీని తరువాత వచ్చినవే విలియం బ్రౌన్, కాంబెల్‌ నిఘంటువులు. కాంబెల్‌ తనకు ఆంధ్రదీపిక ప్రధానాధారమైనట్లు పేర్కొన్నాడు కూడా.
      ఆంధ్రదీపిక 1806లో పూర్తయినా చాలాకాలం వరకు అచ్చుకాలేదు. అచ్చవలేదా అంటే అయ్యింది. కానీ కంపెనీ ఉద్యోగి చుండూరి రంగనాయకులు శ్రేష్ఠి పేరుతో నాలుగుసార్లు ముద్రితమైంది. ఎందుకు అలా జరిగిందంటే ఊహాపోహలే శరణ్యం తప్ప నిజం తెలియదు. ఏదేమైనా తొలి అధికారిక నిఘంటువు ‘ఆంధ్రదీపిక’. దాని కర్త మామిడి వెంకయ్య అన్నది మాత్రం నిజం. దీపిక తరువాత నిఘంటుకారులందరికీ దీపంలాగే దారి చూపిందన్నదీ నిజం. తరువాత బహుజనపల్లి సీతారామాచార్యుల ‘ఆంధ్ర శబ్దరత్నాకరము’, ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’లు ప్రసిద్ధి చెందినవి.
      దొరికిన రెండు రాతప్రతుల ఆధారంగా శుద్ధచైతన్య స్వాముల సంపాదకత్వంలో శ్రీవాసవీ గ్రంథ ప్రచురణ సమితి ఆంధ్రదీపికను 1965లో ప్రచురించింది. ప్రతుల లభ్యత లేమి వల్ల బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ (గుంటూరు) 1965 నాటి ప్రతిని కొన్నాళ్లక్రితం యథాతథంగా ప్రచురించింది.
      సంస్కృతంలో కూడా మొదటి అకారాది నిఘంటువు తయారు చేసిన ఖ్యాతి మామిడి వెంకయ్యదే. దాని పేరు ‘శబ్దార్థ కల్పతరువు’. ఇది దేశంలోనే మొదటి అకారాది సంస్కృత నిఘంటువు. దీనిలో సంస్కృత పదాలు సంస్కృత లిపిలో, తెలుగు అర్థాలు తెలుగు లిపిలో ఉంటాయి. దేవనాగరి లిపితో పరిచయం ఉన్నవారే దీనిని వినియోగించగలరు. కల్పతరువును ఆదర్శంగా తీసుకొని పరవస్తు శ్రీనివాసాచార్యులు ‘సర్వశబ్ద సంబోధిని’ అనే సంస్కృతాంధ్ర కోశాన్ని నిర్మించారు. కల్పతరువుని, సర్వశబ్దను ఆధారం చేసుకొని శ్రీనివాసాచార్యుల కుమారుడు పరవస్తు వేంకట రంగాచార్యులు ‘శబ్దార్థ సర్వమ’నే సర్వతోముఖ నిఘంటువును సంతరించారు.
      ఇలా మామిడి వెంకయ్య తెలుగు, సంస్కృత నిఘంటువుల నిర్మాణానికి ఎందరికో మార్గదర్శకులై ఉరవడి దిద్దారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం