ప్రభావ కవిత్వ ప్రసవవేది

  • 209 Views
  • 0Likes
  • Like
  • Article Share

    - రామతీర్థ

‘‘నన్నెవ్వరాపలేరీవేళ నా ధాటికోపలేరీ వేళ/ నోట పలికేదంత పాటగా మోగేను కోటివరహాలెత్తు కెత్తుగా తూగెను/ గుండు ఠా ఠా మంటు కొట్టినట్టుగ నేటి పండితులు ఠారెత్తి పరుగుచ్చుకోవాలి’’.. ఇలా ఒక సుడిగాలిలా కవితా రంగప్రవేశం చేసిన వారు బసవరాజు అప్పారావు. గురజాడ మరణం తర్వాత పాటగా మోగిన కవి ఆయన. ఇది ఆయన 125వ జయంతి వత్సరం.
గురజాడ
ముత్యాలసరాల కవితల కాలం 1910 - 1915. తాను ద్రష్ట కాబట్టి వర్తమానంలో ఒక ఉన్నత కవిత్వస్థాయి అవసరం అని భావించారు. దాన్ని ‘పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు జిమ్మగా’ అని నిశ్చయపరిచారు. పాత, కొత్త రెండూ కలవాలి, అదీ వాటి మేలిమి అంశాల కలబోత నుంచి కొత్త కాంతులు మెరుగులీనుతూ రావాలి అన్నది ముత్యాలసరాల్లో గురజాడ మొదటి నియమం. జాతీయతా చైతన్యం సాంఘిక సంస్కరణగా, సంఘంలో అంటరాని వివక్ష పోవాలని, తాను ‘ముత్యాలసరము’ గీతంలో చెప్పినది, తర్వాతి కవిత్వ కథానిక ‘డామస్‌ - పితియస్‌’లో కూడా ఇంకా బలంగా చెప్పారు గురజాడ. ‘‘ఆకులందు అణిగి మణిగి కవిత కోయిల పలకవలెనోయి- ఆ పలుకులను విని దేశమందభిమానములు మొలకెత్తవలెనోయి’’ అన్నది ఆయన దృష్టిలో కాంతాసమ్మితంగా ఉండాల్సిన కవిత్వ కర్తవ్యం. అయితే ఇది 1915లో ఆగిపోయింది, దీనికి వారసుడు అంటే పద్దెనిమిదేళ్ల తర్వాత 1933లో మహాప్రస్థాన రచన మొదలుపెట్టిన శ్రీశ్రీనే అని చాలామంది చెబుతూ వచ్చారు. ఇది పరిశీలన చేయాల్సిన అంశం.
      ‘‘ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ కలుగక బతుకు చీకటి’’ అని గురజాడ రాస్తే, 1920ల్లో ‘‘ప్రేమకన్నను ఎక్కు/ వేముందిరా ఎల్ల/ కామ్య పదవులకన్న/ ప్రేమ ఎక్కువరా... ప్రేమించు సుఖముకై/ ప్రేమించు ముక్తికై/ ప్రేమించు ప్రేమకై/ ఏమింక వలయురా’’ అని రాసింది అప్పటికి పాతికేళ్ల వయసులోని బసవరాజు అప్పారావు. కొమ్మలో కోయిల గురజాడ కవితా శాఖల మించి సరాసరి బసవరాజోద్యానవనాల్లోకి ఎగిరి వెళ్లింది. కోయిల పాటలకు, గురజాడ తర్వాతి తక్షణ కవి బసవరాజు అప్పారావు. గురజాడ అస్తమయం తర్వాత 1920-30 మధ్య గీతాలు రాసింది ఈయనే. 1894 డిసెంబర్‌ 13న జన్మించిన ఈ కవిత్వ తేజోనిధికి ఇది నూట పాతికేళ్ల సందర్భం. కేవలం ముప్ఫైతొమ్మిదేళ్లు మాత్రమే బతికి, అపార కవిత్వావేశంతో ఎలుగెత్తి పాటలు పాడి చెలరేగిన కవిత్వ ఝంఝ పేరు బసవరాజు అప్పారావు. నండూరి సుబ్బారావు, బసవరాజు అప్పారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వీరు ముగ్గురూ భావకవులుగా పేరొందారు. ముగ్గురిలోకి పెద్ద నండూరి (1884- 1957), తర్వాత బసవరాజు (1894- 1933), చిన్నవారు దేవులపల్లి (1897- 1980). దురదృష్టవశాత్తూ వీరిలో బసవరాజు చిన్న వయసులో మరణించారు. అప్పటికి ఆయన కవితల సంపుటం రాలేదు. 1934లో బసవరాజు మిత్రులు ‘అప్పారావు మెమోరియల్‌ కమిటీ, బెజవాడ’ పేరిట స్మృతి ముద్రణంగా ‘బసవరాజు అప్పారావు గీతాలు’ మొత్తం రచనలను ప్రచురించారు. దాదాపు రెండు వందల కవితల సంపుటి.
భావకావ్య జగత్తుకు ప్రవేశిక
‘‘సుబ్బారావు పాట నిభృత సుందరం. అప్పారావు పాట నిసర్గ మనోహరం’’ అంటారు కృష్ణశాస్త్రి. ‘బసవరాజు అప్పారావు గీతాలు’ పొత్తానికి ఆయన రాసిన ‘మధురస్మృతి’లో తమ కవిమిత్రుని కవితాత్మను బొమ్మ కట్టించారాయన. బసవరాజు చదివింది బియ్యే. చదువుతుండగానే రాజ్యలక్ష్మమ్మతో (ఈవిడ సౌదామని పేరుతో రాసిన కవయిత్రి) పెళ్లి. తర్వాత న్యాయశాస్త్రం చదువు. ఈలోగా భారతి పత్రికలో ఉద్యోగం, అన్నీ కొంతకాలమే. 1921 కల్లా ‘ఆంధ్ర కవిత్వ చరిత్ర’ అని తెలుగు కవిత్వ సింహావలోకనం చేసి, రాబోయే నవయుగం తప్పక వ్యవహారిక భాషదే అని ఉద్ఘోషిస్తూ, ఇందుకు, మన భాషా సాహిత్యాలతో బాటు అన్య భాషా, విజాతీయ సాహిత్య పరిజ్ఞానం కూడా అవసరం అని తేల్చిచెప్పారు బసవరాజు.
      గాంధీజీ భారత స్వాతంత్య్రోద్యమ నాయకత్వం చేపట్టిన 1920-21 నాటికి అప్పారావు సరిగ్గా పైలాపచ్చీసు వయసువాడు, అయితే బ్రహ్మచారి మాత్రం కాదు, విద్యావంతుడు, కవి, పత్రికా రచయిత, న్యాయవాది, సాహిత్య పరిశీలకుడు. కృష్ణశాస్త్రి మాటల్లో అయితే ‘‘బసవరాజు మొట్టమొదటి భావకవి. అంటే భావకవిత్వానికి త్రోవ చూపినవాడనే కాదు; తరువాత వచ్చిన భావకావ్య జగత్తుకు ప్రవేశిక వంటివాడు. ముందు ఇతని గీతాల శ్రేణిఎక్కు, తరువాత భావకావ్య లోకంలో పరిచితంగా విహించవచ్చునన్నట్టు’’! ‘‘కోయిలా కోయిలా కూయబోకే, మామిడి చెట్టును అల్లుకున్నదీ మాధవి లతొకటీ, ఎద మెత్తనౌటకై సొబగొందరా, రాబోకు రాబోకురా చందమామ’’.. ఇలా జనం మెచ్చిన గీతాలకు ఊపిరిపోసిన కవి బసవరాజు.
స్వాతంత్య్రోద్యమ కవి
సెప్టెంబర్‌ 1921లో గాంధీజీ కొల్లాయి దుస్తులకు మారిపోయారు. ఇది జరిగింది మన దక్షిణభారతదేశంలోనే, మదురైలో. తర్వాతే, వచ్చింది బసవరాజు ప్రఖ్యాత గీతం ‘‘కొల్లాయిగట్టితేనేమి మా గాంధీ కోమటై పుడితేనేమి’’. ఇది రెండు రకాల పల్లవితో తెలుగు సాహిత్యంలో ఉన్నది. బసవరాజు గాంధీజీని కలిసి సన్నిహితంగా కొంతకాలం ఉన్నారని అంటారు. బహుశా 1927లో మహాత్ముడి బెంగళూరు యాత్రలో భాగంగా ఇది జరిగి ఉండొచ్చు. స్వాతంత్య్ర పోరాటంలో జాతీయావేశంతో కవితలు చెప్పారు బసవరాజు. దేశమంటే మనుషులని నమ్మినప్పుడు, ఎంత ఆవేశంతో గురజాడ గీతాలను పాడేవారో, అంతే ఆవేశంగా ‘గాంధీ ప్రభ, స్వరాజ్యలక్ష్మి పెండ్లి, బాపూజీ మా బాప్, జాతీయ పతాకం, రాట్నము’ తదితర కవితలు రాసిన స్వాతంత్య్రోద్యమ కవి ఆయన.
      సాంఘిక సంస్కరణంతో కూడిన రాజకీయ సాహిత్యం రావడానికి జాతీయోద్యమం సందర్భం అయితే, తెలుగు సాహిత్యంలో ఆ అవసరానికి నిలబడిన కవి బసవరాజు అప్పారావు. మరొక కవి గరిమెళ్ల సత్యనారాయణ. వీరి పరిణామ దశలు 1920- 35 కాలానికి చెందినవి. 1921 కాంగ్రెస్‌ సహాయ నిరాకరణోద్యమం, గరిమెళ్ల ముప్పయి అయిదు చరణాల గీతం ‘‘మాకొద్దీ తెల్లదొరతనం దేవా!’’లో సంపూర్ణంగా ప్రతిఫలించింది. అలాగే ‘కొల్లాయిగట్టితేనేమి మా గాంధీ’ అనే బసవరాజు గీతం కూడా లోక ప్రసిద్ధం అయింది. శ్రీశ్రీ కవిత్వ వికాసం 1933 తర్వాత మొదలైతే, 1915-1933 మధ్య కాలంలో జాతీయోద్యమ కవిత్వధారలో వీరిద్దరూ త్యాగధనులే కాక పేరెన్నిక గన్న కవులు. గురజాడ జాతీయ భావావేశ వారసులుగా, మొదటి లెక్కలోని వారు బసవరాజు, గరిమెళ్ల.
పాతికేళ్లకే అంతటి పరిణతి!
బసవరాజు 1921లో వెలువరించిన ‘ఆంధ్రకవిత్వ చరిత్ర’లో.. ప్రగతిశీల దృష్టితో తెలుగు, సంస్కృతం మధ్య బంధం ఎలా ఉండాలో చెప్పారు. ఈ విస్తార రచన, ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య ధోరణుల పరిశీలన కలిగిన అధ్యయనవేత్తగా సైతం ఆయన్ను నిలబెడుతుంది. తెలుగు సాహిత్యంలో వచనంలో రసచర్చ చేసిన తొలి రచనల్లో బహుశా ఇది ఒకటి. ఈ రచనను కట్టమంచి రామలింగారెడ్డి ‘కవిత్వ తత్వ విచారము’లోని గ్రాంథిక భాషానుకూల సంప్రదాయ మొగ్గుకి సమాధానంగా భావించవచ్చు. ఆమేరకు, ఇది వాడుక భాషోద్యమానికి మద్దతుగా నిలిచిన రచన కూడా.
      ఇటు భారతీయ సాహిత్య సంప్రదాయాన్ని వివరిస్తూ, పాశ్చాత్య సాహిత్య విమర్శకులు ప్లేటో, అరిస్టాటిల్‌ లాంటి పూర్వికుల మతంతో బాటుగా, మాథ్యూ ఆర్నాల్డ్, రస్కిన్, కార్లైల్, జేమ్స్‌ లాంగ్, థియోడర్‌ వాట్స్‌ డంటస్, షేక్స్పియర్, కోల్‌రిడ్జ్‌.. ఇలా వీరి దృక్పథాలకు, మన సాహిత్య పద్ధతులను కలగలిపి చూసిన ధీశాలి బసవరాజు అప్పారావు. సంస్కృతాంధ్ర కవులు, సంస్కృత స్నేహాభిలాషులు, సంస్కృత దాసులుగా మనం ఉన్నామని, వీటిని అధిగమించి ఆంధ్ర భాషలో రచనలు చేసే స్వాతంత్య్రం ఉండాలని ఆయన కోరారు. అదే కాలపు స్వభావంగా చాటి చెప్పారు. పాతికేళ్లకే, ఇంతటి విశాల దృష్టి కలిగి రాసిన వారు ఆధునిక యుగంలో మరొకరు కనిపించరు. 
అలా గుర్తుంచుకుందాం
నండూరి, కృష్ణశాస్త్రి కన్నా ముందరే కవిత్వ రచన మొదలు పెట్టిన వారు బసవరాజు. ‘కుతుబ్‌ మినార్‌’ అని 1932లో దిల్లీలో రాసిన కవిత పాద సూచికలో ‘భావకవి సమ్రాట్‌’ అని తనను తానే సంబోధించుకున్నారు! ఆయన కూతురు, కొడుకూ పసిదనంలోనే రాలిపోయారు. ఈ దురదృష్టం గురించి చెబుతూ ‘‘పాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు’’ అని రాశారు బసవరాజు. ఆయన కవిత్వమే జీవనమైన వాడు. రైలు పెట్టెలు దాటిపోయేలా ఉచ్ఛస్వరంతో గోదావరి వంతెన మీద ఆగిన బండిలో పాటలు పాడుతుంటే, పక్క పెట్టెలోకి వినిపిస్తున్న పాట విని, ‘ఎవరది మా బసవరాజులా ఉన్నాడని’ ఆ పెట్టెలో ప్రయాణిస్తున్న కృష్ణశాస్త్రి వచ్చారట. చివరిసారి రైలులో భార్యాసమేతంగా బసవరాజు కనిపించిన క్షణాలవే. అడిగారట కృష్ణశాస్త్రి- పాట పాడమని. ‘‘బ్రతుకు బరువు మోయలేక/ చితికి చివికి డస్సివాడి/ పికరు పుట్టి పారిపోయి/ ఒకడనె ఏ తోటలోనొ/ పాట పాడుతుండగ నా ప్రాణి దాటి యేగేనా/ ప్రాణి దాటి యేగుచుండ పాట నోట మ్రోగేనా’’! అంటూ అప్పారావు పాడారు. ‘‘తరువాత మరి అతణ్ని చూడలేదు. పాటపాడుతూ పోయాడు మా బసవరాజు. పోతూ పాట పాడాడు. రాగద్వేషాలు దాటి శ్రీశైల మల్లికార్జున స్వామి చరణ సన్నిధాన చివరకు మజిలీ దొరికింది. తానూ మంగళప్రదమ్మా, పాపాయీ ఉన్నారు అక్కడ. ఇక్కడ అతని ప్రాణానికి ప్రాణమైన రాజ్యలక్ష్మమ్మ, ప్రాణమిత్రులమైన నండూరీ నేనూ ఉన్నాము’’ అంటూ రాశారు దేవులపల్లి.
      గురజాడ కన్నుమూశాక జరిగిన 1915-33 కాలం శ్రీశ్రీ ఆవిర్భావానికి ముందరిది. దీన్ని భావకవుల ఆవిర్భావం మినహా ఒక ఖాళీగానే చెబుతూ వచ్చిన తెలుగు సాహితీ అధ్యయన పద్ధతిలో మార్పు రావాలి. జాతీయ స్ఫూర్తి గీతాలు రాసిన రాయప్రోలు లాంటి వారి పంథా వేరే ఉండగా- ఉద్యమ గీతాలు రాసిన కవులుగా మంగిపూడి వెంకటశర్మ, బసవరాజు, గరిమెళ్ల తదితరులకు సముచితమైన చరిత్ర ఉంది. దీన్ని గుర్తించి, బసవరాజు అప్పారావు నూట పాతిక జయంతి వత్సరంలో, అసమాన ప్రతిభ కలిగిన అగ్రేసర కవిగా, ఆవేశ బసవరాజుగా, గాంధీ మార్గప్రవర్తకునిగా, సంగీత ధర్మంతో ఎన్నో పాటలు మిగిల్చి వెళ్లిన సున్నిత హృదయునిగా, ‘కొల్లాయిగట్టితేనేమి’ లాంటి గీతం మరే భారతీయ భాషలోనూ లేనట్టుగా మనకు అందచేసిన ప్రజాకవి సత్తముడుగా బసవరాజు అప్పారావును తలచుకుందాం. ఇరవయ్యో శతాబ్దంలో తనకంటూ ఒక కవిత్వశాఖనూ, కొన్ని కోయిలలను శాశ్వతం చేసుకున్న ప్రభావశీల కవిగా ఆయన్ను గుర్తుంచుకుందాం. 

- రామతీర్థ
(‘తెలుగువెలుగు’ కోసం ప్రత్యేకంగా రాసిన వ్యాసం)
 


వెనక్కి ...

మీ అభిప్రాయం