ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా

  • 565 Views
  • 331Likes
  • Like
  • Article Share

    శాంతి జలసూత్రం

  • పెదపాడు, పశ్చిమగోదావరి shanti.rfc@gmail.com
శాంతి జలసూత్రం

అసలు పాటకి పరవశించని జీవి ఈ ప్రపంచంలో ఉంటుందా! నిస్సత్తువ నుంచి ఉల్లాసంలోకి, జడత్వం నుంచి చైతన్యంలోకి నడిపించుకుపోగల శక్తి పాటకుండబట్టే అనాది నుంచి అది స్థిరంగా నిలబడగలిగింది. పాట మానవవికాస క్రమాన్ని తేటపరుస్తుంది. జనజీవన సంవేదనను ప్రస్ఫుటం చేస్తుంది. మనిషి మానసిక స్థితిని కుదుటపరచడమే కాదు కార్యశీలతవైపు నడిపిస్తుంది. అలాంటి పాటలు మన చలనచిత్రాల్లో ఎక్కువగానే కనిపిస్తాయి. జీవన వేణువులూదిన ఆ సలక్షణ గీతాలందించే సందేశాల సారాంశమిది!
పిల్లలే
కాదు పెద్దలు కూడా నీతులు బోధిస్తే ముఖం మాడ్చుకుంటారు. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే చిన్నబుచ్చుకుంటారు. చెప్పకూడనివీ.. చెప్పి ఒప్పించలేనివి కూడా సున్నితంగా లలితంగా చెప్పి ఫలితం సాధించవచ్చు. దానికి ఒకటే సాధనం పాట. చెప్పేదేదైనా పాటలాగా వినిపించాలంతే! ఉపదేశం కూడా అందులోనే ఇమిడిపోతేనే విషయం గుండెకి తగులుతుంది. పాట మనిషి ఆనందస్థాయితో ముడిపడి ఉంటుంది కాబట్టి దాని ద్వారా అందే సందేశం కలకాలం మనసులో నిలబడిపోతుంది.
      నలుగురి మధ్య బతుకీడుస్తూ.. నలుగురి బాగూ చూస్తూ ఆ నలుగురి మెప్పూ పొందడంలో ఆనందముంది. అందులో జీవిత పరమార్థం కనిపిస్తుంది. అందరిలో ఒకడిగా జీవిస్తున్నందుకు ఎప్పటికైనా సంఘరుణం తీర్చుకోవాలి. ఆ కనీస బాధ్యతను గాలికొదిలేసి తన కడుపు తాను చూసుకునే స్వార్థజీవుల చెంప ఛెళ్లుమనిపించేలా సామాజిక బాధ్యతను గుర్తుచేస్తుంది సిరివెన్నెల గీతం.
నువ్వుతినే ప్రతి ఒక మెతుకు 
ఈ సంఘం పండించింది
గర్వించే యీనీ బతుకు 
ఈ సమాజమే వలచింది
రుణం తీర్చు తరుణం వస్తే 
తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే

      ‘రుద్రవీణ’ చిత్రం కోసం ‘‘చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా!’’ అంటూ సీతారామశాస్త్రి రాసిన ఈ పాట సమాజ పోకడలను కాస్త గమనిస్తూ వెళ్లమని చెబుతుంది. ఇలా సమాజంతో అనుబంధం కొనసాగిస్తూనే బతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలన్నారు సినారె. అంటే, ఉల్లాస కిరణమై నినదించేందుకు సమాయత్తమవ్వమన్నారు. ఇది లోలోపల అంతశ్చేతనని మేల్కొలుపుతూ అచంచల ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవడమెలాగో చెప్పడమే. ‘‘ఆశయాలు గురిగా సాహసాలు సిరిగా/ సాగాలి జైత్రరథం వడి వడిగా/ మలుపులెన్ని ఉన్నా గెలుపునీదేరన్నా/ సాధించు మనోరథం మనిషిగా’’ అంటూ వేటూరి ‘మగమహారాజు’ చిత్రం ద్వారా నిస్తేజంగా జీవించేవారికి గొప్ప స్ఫూర్తిగీతం అందించారు.
      చెట్లు యోగ నిద్రలో ఉన్న మహారుషుల స్వరూపాలు అన్నాడు ఒక మహాకవి. చెట్టు జీవితమే ఒక స్ఫూర్తిగీతం. దాన్ని అణువణువు పరికించడంలోనే జీవన సూత్రం అవగాహనకొస్తుంది. ఉన్నదానికీ లేనిదానికీ ఎగిరెగిరిపడక మొక్కలా మౌనంగా ఎదగాలని, అలా ఎదుగుతూ ఒదిగి జీవించమని చెబుతూ ‘నా అటోగ్రాఫ్‌ చిత్రానికి రాసిన పాటలో చంద్రబోస్‌ ఇంకా ఇలా అంటారు 
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుంది
తెలుసుకుంటె సత్యమిది
తలచుకుంటె సాధ్యమిది

      ఏదీ సులభంగా సాధ్యపడదు.. శోధించి సాధించాల్సిందే అన్నది గొప్పవాళ్ల మాట. కొన్నిసార్లు కష్టాలూ.. కడగండ్లూ కార్యసాధనకి అడ్డంకిగా మారతాయి. స్వయంశక్తితో సంకల్పబలంతో వాటిని అధిగమించి ముందుకు పోవాలనే స్వయం ప్రేరణశక్తికి ఈ పాట నిదర్శనం. మలినాలన్నీ తొలగిపోతేనే నీటి స్వచ్ఛత తెలుస్తుంది. సమస్యలకి ఎదురునిలిస్తేనే మానసిక దృఢత్వం మీద అవగాహన ఏర్పడుతుంది. ఏటికి ఏదురీదే చేపలా జీవితంలో పోరాటదిశను అలవరచు కోకపోతే ముందడుగు వేయలేం! ఓడినా చతికిలపడినా మళ్లీలేవగలననే ధీమా ఉండాలి. మళ్లీ జీవించగలననే ఆశతోనే ఉదయాలని ఆహ్వానించాలంటారు సిరివెన్నెల ‘వసంతం’ చిత్రంలో...
మొలకెత్తె పచ్చని ఆశే 
నీలో ఉంటే చాలుసుమా
కలకాలం నిన్ను అణచదు మన్ను 
ఎదిగే విత్తనమా సాగిపో నేస్తమా!
నిత్యమూ తోడుగా నమ్మకం ఉందిగా
ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా..! 

      ‘‘గాలీ చిరుగాలీ! నిను చూసిందెవరమ్మా!’’ అనే పల్లవితో సాగే ఈ పాట తన శక్తేంటో తెలుసుకోకుండా నిస్తేజంలో కూరుకుపోయిన స్నేహితుడి కోసం ఒక అమ్మాయి పాడే చైతన్యగీతం. 
      సూర్యుడు కూడా ఎప్పుడూ ఒక్కలాగ ఉదయించడు. నిన్నటి ఛాయలని అసలు కనిపించనీయడు. రోజుకొక తీరులో కొత్తశక్తితో తన విభిన్నతను చాటుకుంటాడు. గతాన్ని నెమరేసుకుంటూ రాబోయే రోజుల పట్ల దిగులుచెందుతూ ఉంటే బతుకు భారంగా తోస్తుంది. దిగులుచీకట్లను నవ్వులతోనే తరిమెయ్యాలి. మున్ముందు మరిన్ని వసంతాలు ఆగమిస్తాయనే ఆశతోనే జీవించాలని.. ‘‘సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా!’’ అంటూ పాడుకోవడంలోనే కొత్తజీవితానికి ద్వారాలు తెరచినట్టు అంటారు సిరివెన్నెల ‘చిరునవ్వుతో’ చిత్రంలో..
ఆశలురేపినా అడియాశలు చూపినా 
సాగే జీవితం అడుగైనా ఆగదుగా
నిన్నరాత్రి పీడకల నేడు తలచుకుంటూ నిద్రమానుకోగలమా
ఎంతమంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా
కలతలనీ నీ కిలకిలతో 
తరిమెయ్యాలే చిలకమ్మా.. 

      ఎవరైనా సరే, కాలంతో పాటూ ప్రయాణిస్తూ ప్రభావపూరితంగా జీవించగలగాలి గాని కాలాన్ని నిందిస్తూ కూర్చోకూడదు. కదిలే కాలానికి అన్నీ మార్పు చెందాల్సిందే! అంతటి చీకటి కూడా బండరాతిలా ఘనీభవించి కూర్చోదు.. వెలుతురు చినుకులకి అది కూడా కరిగిపోవాల్సిందే కదా! బతుకు దుర్భరమనిపించినప్పుడు కాలగమనాన్ని బట్టి పరిష్కారం వెతుక్కోవాలి. దాని నుంచే స్ఫూర్తిపొందాలంటారు వేటూరి. ‘‘కన్నీట తడిసిన కాలాలు మారవు/ మనసారా నవ్వుకో పసిపాపల్లే/ ప్రేమకన్నా నిధులులేవు నీకన్నా ఎవరయ్యా మారాజులు/ నిన్నెవరూ ఏమన్నా నీ దాసులూ/ జరిగినవీ జరిగేవి కలలే అనుకో!’’ అని ఓదార్చాలంటే కాలం విలువ తెలియాలి మరి! చేద్దాం చూద్దాం అంటే కాలం ఊరుకోదు కదా! ఎప్పటి పని అప్పుడు చేసెయ్యాలి. లేకపోతే జీవించిన కాలంలోగానీ తర్వాత తరంలోగాని ఏ ప్రభావమూ మిగల్చకుండా వెళ్లిపోతాం. ‘‘సాహసం నా పథం రాజసం నా రథం’’ అంటూ క్రియాశీలకంగా మనగలిగితేనే మనిషిగా జీవించినందుకు తృప్తి అంటూ ఉంటుంది. కాబట్టి ‘‘ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహవెంట/ నే మనసుపెడితే ఏ కళననైనా/ ఈ చిటికె కొడుతూ నే పిలవనా!’’ అని సిరివెన్నెల చెప్పినట్టు ఉల్లాసంగా పాడుకుంటూ సాగిపోవాలంతే! గ్రహణం వీడిన సూర్యుడిలా.. కొత్త వెలుగుని నింపుకోవాలేగాని బతుకును భారంగా తలచుకోకూడదు. ‘‘ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు/ మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు/ కష్టమనేది లేని రోజంటూ లేదు కదా/ కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా’’ అని అంటారు రామజోగయ్య శాస్త్రి ‘మిస్టర్‌ నూకయ్య’ చిత్రంలో! అవును మరి.. ఉన్నది ఒకటే జీవితం! దాన్ని సుఖమయం చేసుకోవాలి. ఏదో వెతుకుతూ ఏదేదో పావుకుందామనీ చిన్నచిన్న ఆనందాలని దూరం చేసుకోకుండా జీవన మధురిమను చవిచూడాలి. అందుకే వెనిగళ్ల రాంబాబు రాసిన ఈ మాటలు సినిమా కోసం రాసినట్టుండవు. బతుకుబాట  వీడిపోతున్న వాళ్లకి మేల్కొలుపు గీతం పాడినట్టుంటాయి.
నేస్తం చూడు! జీవితమంటే నిత్యం సమరమే
సమరంలోనే మరణిస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఏ ఓటమికీ ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళానికీ బతుకుబాట మరచి
వరదలా మృత్యువే తరుముతున్నా.. 
ఆరని అగ్నిజ్వాలే జీవితం
 
      నిరాశ- నిస్పృహల్లో కూరుకుపోయి, ఇక లోకాన్నుంచి రాలిపోదామనుకునే బేలజీవుల్లో ధైర్యం నింపే ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రంలోని ఈ పాట ఒక స్ఫూర్తిశిఖరం. అయినా ఒకానొక దశలో రాక్షసబొగ్గులే రత్నాలుగా మారతాయి. మనుషులూ అంతే! కాకపోతే జీవితమనే కొలిమిలో ఆ ఒరిపిడికి తట్టుకోవాలి. ఈ సందేశాన్నే వేటూరి ‘అడవిరాముడు’తో ఇలా చెప్పించారు...
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు మహాపురుషులవుతారు
తరతరాలకీ తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు
 
      ఏ అలలూ లేని సంద్రం అందంగా ఉండదు. కలతల్లేని కాపురం రంజుగా ఉండదు. కష్టాల్లేని జీవితంలో మాధుర్యం ఉండదు. కాలంలో ప్రతీ రుతువునీ అనుభంలోకి తెచ్చుకోవాలి. అనుభూతి చెందాలి. పిట్టమనసు పిసరంతైనా ప్రపంచమంతా దాగుందని దాశరథి అన్నట్టుగా ఈ జీవనయాత్ర సాగించాలి. కలిమిలేముల కావడిని మనిషి ఒక్కడే మోయగలడు. అందుకే కవి కాకపోయినా మాటల రచయితగా జంధ్యాల ‘సాగరసంగమం’లో మనిషి విలువను పెంచుతూ ఇలా అంటారు
పంచేద్రియాలనే కాదు 
ప్రపంచాన్నే రాయిలా నిలిపేవాడు ఋషి
రాయిలా పడి ఉన్న 
ప్రపంచాన్ని అహల్యగా మలిచేవాడు మనిషి

      ఒకటారెండా తెలుగు సినీ సాహిత్యంలో ఇలాంటి చైతన్యగీతాలు, స్ఫూర్తిప్రబోధాలు బోలెడన్ని ఉన్నాయి. వింటూ ఆనందించడానికే కాదు ఆలోచనకీ, వివేచనకీ పదునుపెట్టే సుస్వరాల స్ఫూర్తి సుధా జల్లులివి.


వెనక్కి ...

మీ అభిప్రాయం