ఆహా!! నోరూరగాయానమః

  • 1317 Views
  • 2Likes
  • Like
  • Article Share

    జ్యోతి వ‌ల‌బోజు

  • ప్ర‌ముఖ బ్లాగ‌రు
  • హైద‌రాబాదు
  • 8096310140
జ్యోతి వ‌ల‌బోజు

తెలుగువారి వంటకాలన్నింటిలో ఊరించే ఊరగాయల రుచేవేరు. ఎర్రగా, వర్రగా, కంటికింపుగా ఊరిస్తూ నోటికి జివ్వుమనిపించే ఆవకాయ ఉంటే మిగతావన్ని దిగదుడుపే. ఈ మాట అబద్ధమని ఏ తెలుగువాడూ అనడు... అనలేడు కూడా! పంచభక్ష్య పరమాన్నాలు ముందున్నా కంచంలో కాస్త ఊరగాయ లేకపోతే ముద్ద దిగని వాళ్లెందరో. అందుకే మన కవులూ ఆ ఊరగాయ ప్రశస్తిని ప్రశంసించకుండా ఉండలేకపోయారు. 
అన్నదాతా సుఖీభవః...

      రుచికరమైన భోజనం తిన్న తరువాత ఈ మాట అనుకోని వ్యక్తి ఉండడు. ఆ భోజనం పది, ఇరవై రకాలతో కన్నులకింపుగా ఉండనక్కరలేదు. రుచిగా అన్నం, ఒక ఆదరువుతో వడ్డించినా చాలు. అందుకేనేమో ‘‘భోజనం దేహి రాజేంద్ర! ఘృత సూప సమన్వితమ్‌’’ (ఓ రాజా! నెయ్యి, పప్పుతో కూడిన భోజనం ఇవ్వు) అన్న ఓ కవి మాటకు మహాకవి కాళిదాసు ‘‘మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి: (పండువెన్నెల వంటి తెల్లని పెరుగుతో అన్నం పెట్టవయ్యా)’’ అని పూరించాడు. ఉత్త అన్నం, కమ్మటి పెరుగు లేదా ఆవకాయతో కడుపునిండుగా, ఆప్యాయంగా భోజనం పెడితే ఎవరైనా మనసారా దీవించకుండా ఉండలేరు.
      ఊరగాయలు మన ప్రాచీనుల ఆరోగ్య రహస్యం. ప్రతీ పదార్థంలో మనకు మేలు, కీడు కలిగించే అంశాలు ఉంటాయి. ప్రతీ హానికి విరుగుడు కూడా అదే పదార్థంలో ఉంటుంది. ఉదాహరణకు పచ్చిమామిడి వల్ల కలిగే హానికి మందు మామిడి తొక్కలో ఉంది. నిమ్మరసంలో ఉండే పులుపు వల్ల కలిగే మంటకు విరుగుడు నిమ్మతొక్కలో ఉంది. అందుకే మన పెద్దలు ఈ కాయలను తొక్కతో సహా నిలవ ఉంచి (ఊరబెట్టి) అన్ని కాలాల్లో ఆహారంలో చేర్చుకునేవారు. ఇలా ఊరబెట్టినవి అనారోగ్య సమయంలో పథ్యానికీ వాడతారు.
      ఎండాకాలం వచ్చిందంటే ‘మామిడి కాయల కాలం’ మొదలవుతుంది. మామిడి పళ్లతోపాటు ఆవగాయ/ ఊరగాయలకు ఇది అసలైన కాలం. ఈ ఊరగాయలు (ముఖ్యంగా ఆవకాయ, మాగాయ, గోంగూర) తయారీని తెలుగువారే కనిపెట్టారు. ఊరగాయలు ప్రాచీన కాలం నుంచే తెలుగునాట వాడుకలో ఉన్నాయి.
చారెరుగనివాడును, గో
దారిన తా నొక్కమారు తడవని వాడున్,
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు, ఆంధ్రుడు కాడోయ్‌!

      ...చారు రుచి ఎరుగనివాడు, గోదావరి నదిలో ఒక్కసారైనా తడవనివాడు,  ఆవకాయ రుచి చూడనివాడు అసలు ఆంధ్రుడే కాదు అన్నది కవి మాట. గోదావరి వైశిష్ట్యం, ఆవకాయ రుచి ప్రాముఖ్యత అంతటిది మరి.
ఎన్ని ఊరగాయలో!
అయ్యలరాజు నారాయణామాత్యుడి హంసవింశతిలో శృంగార రసభరిత పద్యాలే ఉంటాయని చాలామంది అపోహపడుతుంటారు. వాస్తవానికి ఈ గ్రంథం ఒక విజ్ఞాన సర్వస్వం. ఇందులో ఎన్నో విషయాల మీద వివరణాత్మక పద్యాలు ఉన్నాయి. అందులో ఊరగాయల గురించి ఓ ప్రస్తావన...
మామిడికాయయు, మారేడుగాయయు,
గొండముక్కిడికాయ, కొమ్మికాయ
గురుగుకాయయు, మొల్గుకాయ, యండుగుకాయ,
లుసిరికెకాయలు, నుస్తెకాయ,
లెకరక్కాయయు, వాకల్వికాయయు,
జిఱినెల్లికాయయు, జిల్లకాయ, 
కలబంద గజనిమ్మకాయ, నార్దపుకాయ,
చిననిమ్మకాయయు, జీడికాయ,
కుందెనపుకొమ్ము, మామెనకొమ్ము, బుడమ
కాయ, యల్లము, మిరియంపుకాయ, కలివి
కాయ, కంబాలు, కరివేపకాయ లాది
యైన యూరుగాయలు గల వతని యింట

      రెండు శతాబ్దాల కిందటే నుంచే తెలుగువాళ్లు ఎన్నో రకాల ఊరగాయలను తినేవారని దీన్నుంచి తెలుస్తుంది. అయితే అంతకంటే ముందే 16వ శతాబ్దపు శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోనూ ఊరగాయ ఊరింపులున్నాయి. విష్ణుచిత్తుడు తన ఇంటికి వచ్చిన అతిథులకు ఆయా కాలపు వాతావరణానికి అనువైన ఆహారాన్ని తయారు చేయించి వడ్డించేవాడట. చలికాలంలో కమ్మని రాజనాల బియ్యంతో వండిన వేడివేడి అన్నం, మిరియాల పొడితో తిరగమోత పెట్టిన కూరలు, ముక్కులోని జలుబును కూడా తక్షణమే వదలగొట్టగల ఆవపిండి ఊరగాయతో సుష్టుగా భోజనం పెట్టేవాడట. చలికాలంలో బాధించే జలుబుకు ఆవకాయ మంచి మందని శతాబ్దాల కిందటే చెప్పారు పెద్దలు. వేసవిలో మామిడికాయలు కాపునకు వస్తాయి. వాటితో ఊరగాయలు పెట్టుకునే సంప్రదాయం అనాదిగా కొనసాగుతున్నట్టూ దీంతో అర్థమవుతుంది. అన్నట్టు, ఓ మహాకవి శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన విద్వాంసులను ఎలా వర్ణించాడో చూడండి.. 
అధిపాన్న రాయలే ఆస్థాన పండితుల్‌
ఘనుడగు పెద్దన్న కందిపప్పు
అష్టదిగ్గజములే అష్టావకాయలు
ఆ రామలింగంబు చారు పులుసు
అప్పడాల్‌ వడియాలు ఆ చోపుదారులు
రమ్య పచ్చళ్లు పారా జవాన్లు
పరమాన్న పాత్రంబు భట్టు మూరితి కవి
ఆ తిమ్మకవిరాజు నేతిదొన్నె...

      ఇలా అంటూ చివర్లో అప్పాజీ గురించి ‘‘మేలు అప్పాజి ఊరిన మిరపకాయ’’ అని చెప్పారు. ఆహా!! ఈ పద్యం చదువుతుంటేనే నోరూరిపోతోంది కదా! 
చవులూరించే చల్దులు
పోతన భాగవతంలో గోపాలురు చల్దులారగించే ఘట్టంలో ఊరుగాయల ప్రసక్తి వస్తుంది. గోవులు కాసిన తర్వాత ఆకలితో చల్దులు తినే ఆ పిల్లల సరదాలూ, కొంటెచేష్టల గురించి పోతన ఎంత మనోజ్ఞంగా వర్ణించాడో! 
మాటిమాటికి వ్రేలు మడచి యూరించుచు
నూరుగాయలు దినుచుండు నొక్క
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి
చూడ లేదని నోరు సూపు నొక్క
డేగురార్గుర చల్దు లెలమిఁబన్ని దమాడి
కూర్కొని కూర్కొని కుడుచు నొక్కొక
డిన్ని యునుఁదగ బంచి యిడుట నెచ్చెలి
తనమనుచు బంతెన గుండులాడు నొకడు
కృష్ణుఁజూడు మనుచుఁగికురించి పరు మోల
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు
నవ్వు నొకఁడు సఖుల నవ్వించు నొక్కడు
ముచ్చటాడు నొకఁడు మురియు నొకడు

      ఒక పిల్లవాడు మాటిమాటికి వేలు ముడిచి పక్కవారిని ఊరిస్తూ ఊరగాయలు తింటున్నాడు. ఒకడేమో పక్కవాడి కంచంలో నుంచి కొంత చల్ది లాక్కుని గుటుక్కున మింగేసి, అబ్బే! నేను తినలేదు కావాలంటే చూసుకో! అని నోరు చూపిస్తున్నాడు. పందెం కట్టి అయిదారుగురి చల్దులను కూరుకుని కూరుకుని మరొకడు తింటున్నాడు. ఇంకొక గోపాలకుడు ఒకరిదొకరం పంచుకుని తినడం స్నేహలక్షణం అంటూ నచ్చచెబుతూ తింటున్నాడు. ఒక పిల్లవాడేమో అదిగో చూడు కృష్ణుడు! అంటూ చూపు మరల్చి పక్కవాడి కంచంలోని చల్దులలో మేలైన భక్ష్యరాశిని వాడు చూడకుండా లాక్కుని తింటున్నాడు. ఇలా ఒక పిల్లవాడు నవ్వుతుంటే, ఇంకొకడు అందరినీ నవ్విస్తున్నాడు. మరొకడు ఏవో ముచ్చట్లు చెబుతుంటే ఇంకొకడు మురిసిపోతున్నాడు. ఇలా బాల్యాన్ని పోతన ఎంత అందంగా, కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించాడో కదా.
కారం తగలని ఊరగాయ
ఊరగాయలు అచ్చంగా భారతీయులవే. అందులోనూ ఈ పచ్చళ్లు, ఊరగాయలు/ ఆవకాయలు ఎక్కువగా పెట్టుకునేది, తినేది మన తెలుగువారే. కాలానుగుణంగా పండే కూరగాయలను నిలవ ఉంచి, అవి దొరకని రోజుల్లో వాటిని రుచికరంగా తినడానికని ఈ ఊరగాయ ప్రక్రియ మొదలైంది. ఒకరకంగా ఇవి ఆరోగ్యదాయకమే. కాని ఈ ఊరగాయలు ఇప్పుడు మనం కారం, నూనె, మసాలాలతో తయారు చేసుకునే ఆవకాయల్లాంటివి కావు. శ్రీనాథుడి కాలంలో అసలు మిరపకాయల వాడకమే లేదు. కారానికి ఎక్కువగా మిరియాలనే ఉపయోగించేవారు. పోర్చుగీసు వర్తకులు మిరపకాయలను తీసుకొచ్చారని ప్రతీతి. 
      అప్పట్లో చింతకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, దబ్బకాయ వంటివి తొక్కి (నలక్కొట్టి) కాని, తరిగికాని తగినంత ఉప్పు, పసుపు వేసి కలిపి నిలవ ఉంచేవారు. కావాల్సి వచ్చినప్పుడు తిరగమోత పెట్టుకునేవారు. ఇప్పుడంటే తిరగమోత పెట్టేటప్పుడు కారం, ఆవ, మెంతిపొడులు కలుపుకుంటున్నాం కాని, అసలు మిరపకాయలే లేని సమయంలో ఉప్పు, పసుపులో ఊరబెట్టినవే అసలైన ఊరగాయలు. అలా ఊరడం వల్ల బాగా మాగే ఒకరకం ఊరగాయకి మాగాయ అని పేరు వచ్చిందేమో. కారానికి మిరియాలు వాడే కాలంలో క్రీ.శ.1370-1450 నాటికంటే ముందునుంచే) శ్రీనాథుడు వర్ణించిన ఊరగాయలు ఇవేనేమో. శృంగార నైషథంలో శ్రీనాథుని పద్యం... 
మిసిమిగల పుల్లపెరుగుతో మిళితములుగ
ఆవపచ్చళ్లు చవిచూచి రాదరమున
జుఱ్ఱుమని మూర్దములదాకి యెఱ్ఱదనము
పొగలు వెడలంగ నాసికాపుటములందు

      పెరుగు పచ్చళ్లలో ఆవపెట్టి, మిరియపు ఘాటు తగిలిస్తే ఎలా ఉంటుంది... ఒకసారి శ్రీనాథుడికి ద్రావిళ్ల విందులో అనుభవమైనదట. బంగారు రంగులోకి మారిన పుల్లటి పెరుగులో ఆవపిండి, మిరియాల ఘాటు కలిసిన ఆకుపచ్చడిని బావుందని జుర్రుకుని తింటే ఆ మంట మూర్ధానికి (నషాళానికి) తాకి, ముక్కులోంచి పొగలు వచ్చాయట. పుల్లటి పెరుగులో ఆవ కలపడానికి ఓ కారణం ఉంది. పెరుగులోని దోషాలకు విరుగుడు ధనియాలు, జీలకర్ర, శొంఠి, ఆవాలు అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇలా రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఆనాటి వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు మరి.
ఆంధ్రదేశమ్మె తానొక్క ఆవకాయ
ఆవకాయ ప్రియుడైన ఓ కవి మాటల్లో చెప్పాలంటే... ‘‘మధురం మధురం ఆవకాయ మధురం/ పాతదీ మధురం - కొత్తదీ మధురం/ ఊటా మధురం - పిండీ మధురం/ ముక్కా మధురం - టెంకీ మధురం’’! ఇక గరికిపాటి నరసింహారావు అయితే... ‘‘ఆపదల నాదుకొను కూర ఆవకాయ’’ అంటూ ‘‘ఆంధ్రమాత సింధూరమే ఆవకాయ/ ఆంధ్రదేశమ్మె తానొక్క ఆవకాయ’’ అని ఆవకాయని ఆకాశానికెత్తేశారు. 
      భానుమతి రామకృష్ణ తన అత్తగారి కథల్లో ఆవకాయకు చోటిచ్చారు. ఆవకాయ పెట్టడంలో ఓనమాలు తెలీకపోయినా నిమ్మకాయ పెట్టినట్టే ఇది కూడా చాలా సులువు అనుకుని అయిదువేల మామిడికాయలతో ఊరగాయ పెట్టే ప్రహసనాన్ని ‘అత్తగారు - ఆవకాయ’ అంటూ మొదటి కథలోనే రాశారు. ఆవకాయ పెట్టడం కన్న యజ్ఞం చేయడం తేలిక. యజ్ఞం చేస్తే ఫలం అన్నా దక్కుతుంది. కొంతమంది ఆవకాయ పెడితేనో ఫలితం కూడా దక్కదు. అసలు ఆవకాయ పెట్టడం అన్నదే ఓ పెద్ద ప్రహసనం. అందునా నూజివీడు చిన్నరసాలకు అలవాటుపడ్డ ప్రాణానికి వేరేకాయతో ముద్ద దిగదు. 
      కొద్దిరోజుల కిందటే ఫేస్‌బుక్‌ ‘ఛందస్సు’ బృంద సభ్యులు ఇరవై నాలుగు గంటలలో ఆవకాయ అనే అంశం మీద 190 పద్యాలు రాశారు. దీనివల్ల అర్థమయ్యేది ఏంటంటే... నాడైనా, ఈనాడైనా ఆవకాయ మన అందరిదీ అని. రుచి, కొలతలు కాస్త మారినా ఆహారంలోనూ, సాహిత్యంలోనూ ఇప్పటికీ ఇదే ఆదరణ పొందుతోందని. 
కొసమెరుపు...
మల్లాది రామకృష్ణశాస్త్రి... కృష్ణాతీరంలోని అన్నప్ప వాళ్లావిడకు చుట్టాలొచ్చారని ఎక్కువ హైరానా పడకు అంటూ ఇదిగో ఇలా కానిచ్చేయమన్నాడట.
      ‘‘పెందలాడే కాస్త పప్పూ అన్నం బెడుదూ. చుట్టాలొచ్చారని, నవకాయ పిండివంటలు జేసేవ్‌. వంకాయ నాలుగు పచ్చళ్లు చేసి పోపులో వేసి, ఆనపకాయ మీద యింత నువ్వుపప్పు చల్లి, అరటిదూట మొఖాన ఇంత పెట్టి, తోటకూర కాడల్లో యింత పిండిబెల్లం పారేయ్‌. కొబ్బరీ, మామిడి, అల్లం యీ పచ్చళ్లు చాల్లే... పెరుగులో తిరగమోత పెట్టి దాన్లో పది గారెముక్కలు పడేయ్‌. రవంత శెనగపిండి కలిపి మిరపకాయలు ముంచి చమురులో వెయ్‌. సరే క్షీరాన్నమంటావా? అదో వంటా? ములక్కాయలు మరి కాసిని వేసి పులుసో పొయ్య మీద పడేయ్‌. ఈ పూటకు ఇల్లా లఘువుగా పోనీయ్‌. ఇదిగో నేను స్నానం చేసి వస్తున్నాగాని, ఈ లోగా, ఓ అరతవ్వెడు గోధుంపిండి తడిప్పెట్టూ, రత్తమ్మొస్తే నాలుగు వత్తి అలా పడేస్తుంది. మధ్యాహ్నం పంటి కిందకు వుంటాయ్‌...’’
      హైరానా పడకుండా ఇవి చేస్తే చాలట...!!


వెనక్కి ...

మీ అభిప్రాయం