తెలుగు కథకు ‘అ’ అంట ఆచంట

  • 269 Views
  • 14Likes
  • Like
  • Article Share

నేను గ్రంథాలయం ఏర్పాటు చేసుకుంటే అందులో తప్పక ఉంచాల్సిన చిత్రపటం తొలి తరం కథా రచయిత ఆచంట సాంఖ్యాయన శర్మది’. ఈమాటన్నది అభ్యుదయ కవిత్వ దిక్సూచి శ్రీశ్రీ. ఇంతటి మహా కథకుణ్ని నేటి తరం తలచుకుంటోందా అంటే ప్రశ్నార్థకమే..!
కాలం
నిరంతరం పరిణామాన్ని కోరుకుంటుంది. సంస్కృతి, సంప్రదాయం, వస్తువు, ప్రక్రియ, భాష, సాహిత్యం, ఆలోచనలు ఎప్పటికప్పుడు ఆధునికత్వాన్ని ఆహ్వానిస్తాయి. అది అవసరం కూడా! ఆ క్రమంలో ఒకనాటి విషయం నేటికి ప్రాచీనమైనా ఆనాటికది ఆధునికమే. తెలుగు సాహిత్యంలో తొలి తరం కథా రచయితల్లో ఆచంట సాంఖ్యాయన శర్మ ఒకరు. విశాఖపట్నంలో 1864 అక్టోబరు 19న జన్మించారు. తల్లిదండ్రులు నరసమాంబ, బాపిరాజు. ఆచంట రాసిన ‘విశాఖ’ (1904)  తొలి తెలుగు కథ అని సమగ్రాంధ్ర సాహిత్య నిర్మాత ఆరుద్ర పేర్కొన్నారు. అది కాదు, ‘లలిత’ (1902) ఆచంట మొదటి కథ అని పురిపండా అప్పలస్వామి చెప్పారు. తెలుగులో కథకు శ్రీకారం చుట్టింది సాంఖ్యాయన శర్మ అని గిడుగు సీతాపతి అభిప్రాయపడ్డారు. సాంఖ్యాయన శర్మ విజయనగరం జిల్లా చినమేరంగి సంస్థాన పండితులు. శతావధానాలు చేస్తూనే కథా రచయితగానూ, పత్రికా నిర్వాహకుడిగాను ప్రసిద్ధిపొందారు. తన రచనలను ప్రచురిస్తూ 1881లో ‘సుజన ప్రమోదిని’, 1903లో ‘కల్పలత’ పత్రికల్ని నడిపారు. శర్మ తెలుగు సాహిత్యంలో పండితుడైనప్పటికి శాస్త్రవిజ్ఞాన విషయాలతో నడిపిన పత్రిక ‘కల్పలత’. 
      తెనాలిలో 1929 జూన్‌ 19, 20, 21 తేదీల్లో జరిగిన సభల్లోంచి ఆంధ్ర నాటక కళాపరిషత్తు పురుడుపోసుకుంది. ఆ సభల్లో మూడోరోజు అధ్యక్షుడు సాంఖ్యాయన శర్మ. ప్రాచీన సాహిత్యాన్ని ఆపోసన పడుతూ అవధానాలు చేసినా ప్రజల భాషకు కీర్తికిరీటాన్ని అలంకరించిన ఆధునిక సాహిత్య పథికుడు ఆచంట. 
      లలిత కథానిక ఇతివృత్తం పరిశీలిస్తే.. ‘లలిత’ ఒక రాజవంశానికి చెందిన అందమైన యువతి. గోదావరి ప్రాంతంలో తండ్రి రామవర్మతో కలసి చిన్న ఇంటిలో నివసిస్తుంటుంది. చిన్నతనంలోనే తల్లి చనిపోవటంతో తండ్రి సంరక్షణలో మంచి విద్యావంతురాలిగా తయారవుతుంది.  తండ్రి నిత్యం తల్లి చిత్తరువునే చూస్తూ కన్నీళ్లు పెట్టడం ఆమెకు అలవాటై పోతుంది. వయసు పెరిగిన కొద్దీ అచ్చం తల్లి చిత్తరువులో ఉన్నట్టే తన రూపం ఉండటం చూసి తండ్రి బాధను అర్థం చేసుకుంటుందామె. వేరే ఊరి నుంచి వచ్చిన బాలాంబ అనే ప్రౌఢ స్త్రీ భవనాన్ని కొంటుంది. దాన్ని ఉద్యానవనాలతో రాజభవనంలా తీర్చిదిద్దుతుంది. కారణాంతరాల వల్ల పెళ్లి చేసుకోదు బాలాంబ. అందమైన, తెలివైన స్త్రీ, పురుషులను గౌరవిస్తుంటుంది. గ్రామస్థులందరిలాగే రామవర్మ, లలితలు కూడా బాలాంబ భవనాన్ని సందర్శించాలని వెళ్తారు. లలిత అమాయకత్వాన్ని, సౌందర్యాన్ని చూసి స్నేహితురాలిగా చేసుకుంటుంది బాలాంబ. రోజులు గడిచేకొద్దీ వీరి స్నేహం ఒకర్ని విడిచి మరొకరు ఉండలేనంతగా బలపడుతుంది. బంధువులతో నిత్యం జన సందోహంతో నిండి ఆనందంలో తేెలియాడుతుంటుంది బాలాంబ. మరోవైపు గ్రామంలో వలపు, వయ్యారాలతో కులికే వారిని చూస్తూ కూడా ఎందుకలా చేస్తున్నారో తెలియనంత అమాయకురాలు లలిత. తెలుసుకోవాలని మాత్రం కుతూహల పడుతూంటుందామే. జయపురంలో ఉండే చంద్రవర్మ బాలాంబకు మేనల్లుడు. తన భవనాన్ని చూడటానికి రమ్మని అతణ్ని ఆహ్వానిస్తుంది. అయితే సుకుమారి అయిన లలిత తనకు స్నేహితురాలని, ఆమె దగ్గర వలపు పాఠాలు వల్లించటానికి అనుమతించనని ముందుగానే హెచ్చరిస్తుంది. బాలాంబ భవనానికి చేరిన చంద్రవర్మ ఓరోజు లలితను చూసి ముగ్ధుడవుతాడు. అత్తయ్య మాటలు గుర్తుచేసుకుని ఈమె విషయంలో చలించకుండా ఉండాలని నిశ్చయించుకుంటాడు. కానీ మనసును అదుపు చేసుకోలేకపోతాడు. చంద్రవర్మ, లలిత స్నేహంగానే మెలుగుతుంటారు. కొన్నాళ్లు గడచిన తర్వాత తన స్వగ్రామం జయపురం వెళ్లిపోతానని లలితతో చెప్పటమే తప్ప వెళ్లే ప్రయత్నం చేయడు చంద్రవర్మ. తన మీద అతనికి వలపు కలిగిందని గ్రహంచిన లలిత వర్మతో అతిచనువుగా వ్యవహరిస్తుంటుంది. కొన్నాళ్లకు ఆ విషయాన్ని గ్రహించిన బాలాంబ చంద్రవర్మను నిలదీస్తుంది. తను ఇప్పటికే కుముద్వతిని పెళ్లి చేసుకున్నాననీ, ఈ సమయంలో లలితను పెళ్లి చేసుకోవటం తనకు తగదంటాడు. కోపగిస్తుంది బాలాంబ. మరుసటి ఉదయం లలిత ఇంటి వద్ద ఉద్యానవనంలో ఉండగా చంద్రవర్మ వెళ్తాడు. జయపురం వెళ్లిపోతానని చెప్తాడు. ఆ మాటకు లలిత ‘నన్ను ప్రేమించానన్నావు. ఇప్పుడు నావాడివి కనుక నవ్వు వెళ్లటానికి నా అంగీకారం ఉండాలి’ అంటుంది. ‘‘నిన్ను ప్రేమించిన మాట నిజమే కానీ నాకిదివరకే పెళ్లయ్యింది. కాబట్టి నిన్ను వివాహం చేసుకునేందుకు అనర్హుణ్ని’’ అంటాడతను. ‘‘అవేమీ నాకు తెలీదు. నీ ప్రేమ మాత్రమే తెలుసు. ఊరికిపోయి వచ్చి నన్ను అనురాగంతో పెళ్లిచేసుకో’’ అంటుంది లలిత. అలాగే చేస్తాడు చంద్రవర్మ. వారు అన్యోన్య దంపతులుగా జీవిస్తారు. 
      ఇదీ కథ! వస్తువు సాంఘికం. కథను ముగించిన తీరు పట్ల పాఠకులకు అభ్యంతరాలూ ఉండవచ్చు. అయితే, కథావస్తువు ఎంపికలో రచయితకు స్వేచ్ఛ ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. ఇక  ఏది మొదటి కథ అని పరిశీలించాల్సి వచ్చినప్పుడు కాలం, ప్రక్రియ, వస్తువు, శిల్పం, భావజాలం లాంటి విషయాలను పరిగణించాల్సి ఉంటుంది. ఆచంట కథలతో పాటు ‘సుధానిధి, మనోరమ, పార్థపరాజయం, అవదాత కలభకం, విక్రమోర్వశీయం, ఉత్తరరామచరిత్రం, రహస్య దర్పణం, ఆంధ్రపద్యావళి’ తదితర రచనలు చేశారు. ‘సుధానిధి’లో ఇలా రాశారాయన...
పట్టిన దెల్ల బైడియగు భంగిని పల్కిన పల్కు పద్యమై
యుట్టి పడంగ జెప్పినదె యొప్పిన వేదముకాగ సత్కథల్‌
కొట్టిన పిండిగా గవిత గూర్చిన ధన్యుల లోకమాన్యులన్‌
బుట్టను దిప్పనుం బొడమి పూజ్యతగాంచినవారి నెన్నెదన్‌

      ఆచంట పద్య రచన సరళంగా ఉంటుందనటానికి ఇది తార్కాణం. పుట్టలో పుట్టిన వాల్మీకి, గుట్టన పుట్టిన వ్యాసుడూ పట్టిందంతా బంగారంగానే తోచింది. పలికిన ప్రతి పలుకూ పద్యమైంది. చెప్పిన ప్రతి విషయమూ వేదంగానే భాసిల్లింది. వారికి మంచి కథలు చెప్పటం కొట్టిన పిండి. అలాంటి వారిద్దరికీ గౌరవిస్తానని చెప్పారు సాంఖ్యాయనశర్మ. మానవ నైజాన్నీ తెలుపుతూ ఇలా రాశారాయన..
మనసెటులుండనీ పయికి మాటల జేతలచేత లోక రం
జన మొనరింపుచున్‌ దనరు స్వల్పపు దోషములైన దాచుచున్‌
జనులను మోసపుచ్చి యొరుచాడ్పున నేర్పరి తా దటస్థుడై
తనపని చక్కబెట్టుకొను దాల్చును బిమ్మట మౌనముద్రయున్‌

      లౌక్యుడి మనసు ఏవిధంగా ఉండనీ, పైకి మాత్రం మాటల్లోనూ, చేతల్లోనూ లోకానికి ప్రియం కలిగేటట్లు ఉంటాడు. తను చూసిన తప్పు చిన్నదైనా, పెద్దదయినా బయటకు తెలియజేయకుండా, తటస్థంగా ఉంటాడు. తన పని చేయించుకుంటూ జనాన్ని మోసం చేసి మౌనంగా ఉంటాడట!
      తన ‘కల్పలత’ పత్రిక ముఖపత్రంలో సంచిక విడుదలైన మాస కాలసూచి, విషయసూచిక ముద్రించేవారు సాంఖ్యాయన శర్మ. లోపలి పుటల్లో విజ్ఞాన విషయాలు హిందువుల పండగలు, చాటువులు, పద్యాలు, పురాణ, ప్రబంధ, ఇతిహాస వివరణ, వార్తలు, వినోద వల్లిక, కల్పలతా పారితోషిక ప్రశ్నలు ఉండేవి. పత్రికలో ప్రకటనలకు స్థానాన్ని కల్పిస్తూ ఏ పుటకు ఎంత చెల్లించాలో వివరాలూ ఉండేవి. కల్పలత పాఠకులను ఆకర్షించడానికి నిర్వహించిన ప్రశ్నోత్తరాలకు పారితోషికం మొదటిది ఒకరికి రూ.50, రెండోది ఒకరికి రూ.20, మూడోది ఒకరికి రూ.10, అయిదేసి రూపాయల పారితోషికాలు ఇద్దరికి, ఇరవైమందికి మూడు రూపాయల పారితోషికం, వీటిన్నిటి మొత్తం రూ.150 పారితోషికాలు ఇచ్చేవారు. తెలుగుతో పాటు కొన్ని శీర్షికలు ఆంగ్లంలో ఉండటం ‘కల్పలత’ విశేషం. ఈ పత్రికలో భాష సరళ గ్రాంథికంలో ఉండేది. కల్పలత 1903 నుంచి రెండేళ్లు నడిచి ఆగిపోయింది. తర్వాత 1919లో కొన్నాళ్లు నడిచింది. 
      సాంఖ్యాయన శర్మ కవిత్వంతో పాటు చిత్రలేఖనం, సంగీతం, వక్తృత్వంలోనూ విశేష ప్రతిభావంతులు. సుమారు రెండు శతాబ్దాలకు పూర్వమే సాంఘిక ఇతివృత్తాలతో కథలు రాస్తూ తెలుగు భాషను పరిపుష్టం చేసిన విశిష్ట సాహీతీవేత్త. మరోవైపు.. తెలుగు సాహిత్యంలో ఎవరు కథా ప్రక్రియకు ఆద్యులన్నది పరిశోధకుల మేధకు, శ్రమకు పరీక్షగా నిలిచింది. ఇది తేల్చాల్సిన విషయం. అయితే.. తెలుగు కథాసౌథానికి పునాదులు వేసిన మహనీయుల్లో ఆచంట తొలివరసలో ఉంటారన్నది మాత్రం నిర్వివాదాంశం.


వెనక్కి ...

మీ అభిప్రాయం