అవధాన దిగ్గజం పౌరాణిక రత్నం

  • 271 Views
  • 13Likes
  • Like
  • Article Share

    పాణ్యం దత్తశర్మ

  • విశ్రాంత ప్రధానాధ్యాపకులు
  • హైదరాబాదు
  • 9550214912
పాణ్యం దత్తశర్మ

తెలుగు నేల గర్వించదగ్గ దిగ్గజ పండితులు పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. స్వీయ ప్రతిభతో సంస్కృతాంధ్రాల్లో అద్భుత పాండిత్యాన్ని సంపాదించిన ఆయన అష్టావధానాలు, శతావధానాలు చేశారు. రామాయణ, భారత, భాగవతాలను తన గంభీర గళంతో ప్రవచనాల రూపంలో వేలమందికి పరిచయం చేశారు.
మల్లెపూవులాంటి
తెల్లటి ధోవతి, జుబ్బా, నుదుటన విభూతిరేకలు, గంధాక్షతలు, కుంకుమ ధరించి పుంభావ సరస్వతిగా వెలుగొందేవారు లక్ష్మీనరసింహశాస్త్రి. స్వస్థలం కర్నూలు జిల్లా వెల్దుర్తి. 1923లో జన్మించారు. తండ్రి సుబ్బరామయ్య వ్యవసాయం, పౌరోహిత్యం చేసేవారు. అమ్మ రామక్కమ్మ. లక్ష్మీనరసింహశాస్త్రి కూడా తర్వాతి కాలంలో వ్యవసాయం, పౌరోహిత్యం చేపట్టినా, అవధానాలు, ప్రవచనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. అలా రాయలసీమ ప్రాంతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, సంస్కృతాల్లోని మహాకావ్యాలన్నీ ఆయన నాలుక మీద నర్తిస్తూ ఉండేవి.
      లక్ష్మీనరసింహశాస్త్రిని ప్రజలు ‘గుండెెయ్య స్వామి’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. వెల్దుర్తికి సమీపంలో బ్రహ్మగుండం క్షేత్రం ఉంది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఆయన్ని పినతల్లి వెంకటలక్ష్మమ్మ పెంచారు. ఆమె ఆ క్షేత్రం పేరుమీదుగా శాస్త్రిని ఆప్యాయంగా ‘గుండెయ్య’ అని పిలిచేవారు. తర్వాతి కాలంలో ఆ పేరుతోనే ఆయన ప్రఖ్యాతి పొందారు. లక్ష్మీనరసింహశాస్త్రి తన తొలి అవధానాన్ని 1945 డిసెంబరులో డోన్‌ తాలూకాలోని ఉడుములపాడులో నిర్వహించారు. అవధానాలు చేసేటప్పుడు ఒకేచోట కూర్చోకుండా వేదిక మీద అటూ ఇటూ కలియతిరుగుతూ పద్యాలను గుప్పించడం ఆయన ప్రత్యేకత. అవధాన పద్యాలు ఛందస్సు ప్రకారం అల్లేవేగానీ వాటిలో కవిత్వం, భావసౌకుమార్యం మృగ్యమనే విమర్శను లక్ష్మీనరసింహశాస్త్రి తిప్పికొట్టారు. ఓ సభలో కందపద్యాన్ని గురించి కందంలో వర్ణించమన్నప్పుడు, ‘‘అందము చిందగ కందము/ పొందికగా చెప్పినపుడె పో కవియౌ తాన్‌/ మందులకు చెప్పనలవియె/ కొందరు చెప్పంగ లేరు కోవిదులైనన్‌’’ అని చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. మరోసారి కాళిదాసు మహాకవి గొప్పతనాన్ని ‘అర్థాంతరన్యాసాలంకారం’లో వర్ణించమని ఎవరో అడిగారు. ‘‘అసముండయ్యును కాళిదాసుడు విశిష్టానేక శాస్త్రంబులన్‌/ ఇసుమంతేని యహంకృతిన్‌ బడయ కనల్పుండనంచున్‌ తగన్‌/ లసి తోదంచిత వైఖరిన్‌ నుడివె; ధీలక్ష్మీ కృపాపాత్రులీ/ వసుధన్‌ గర్వముపొంద నేరరుగదా ప్రఖ్యాతులై యొప్పినన్‌’’ అన్న లక్ష్మీనరసింహాశాస్త్రి జవాబుకు సభలో చప్పట్ల వర్షం కురిసింది. 
      లక్ష్మీనరసింహశాస్త్రి పూరించిన సమస్యలు కూడా ఆలోచింపజేసేవిగా ఉండేవి. ఓసారి ఆయనకు ‘‘విద్యాగంధ]ము లేని వారలిలలో విద్వాంసులై చెల్లరే’’ అనే సమస్య ఎదురైంది. దాన్ని ‘‘సద్యోజాతముగాదు జ్ఞానము విశిష్టంబైన సత్సాధనా/ వేద్యం బావిధిగాక హీనతరమౌ విద్యల్‌ ఉపార్జించుచున్‌/ ఆద్యంతంబులు గానలేక కుమతుల్‌ అజ్ఞాన గర్వాత్ములై/ ....’’ అంటూ పూరించారు. మొత్తమ్మీద శాస్త్రి.. 16 అష్టావధానాలు, రెండు శతావధానాలు నిర్వహించారు. పుట్టపర్తి నారాయణాచార్యులు, గడియారం వేంకట శేషశాస్త్రి లాంటి ఉద్దండులు ఆయన పాండిత్యాన్ని శ్లాఘించారు. డాక్టర్‌ దివాకర్ల వెంకటావధాని లక్ష్మీనరసింహశాస్త్రికి మంచిమిత్రులు. కర్నూలులో జరిగిన దివాకర్ల సాహిత్య సభకు శాస్త్రి అధ్యక్షత వహిస్తూ, ‘‘అమరాంధ్ర విదేశ ముఖ్య భాషావద సాహిత్యమహో! దివాకరైర్వై’’ అని స్వాగతించగా ఆయన ఆనందభరితులయ్యారు. 
పద్యాలకు రాగాలు
ఇరవై ఏడవ ఏట నుంచి లక్ష్మీనరసింహశాస్త్రి ప్రవచనాలు ఇవ్వడం ప్రారంభించారు. మైకులు అందుబాటులో లేని ఆ కాలంలో వెయ్యీ పదిహేనువందల మందికి స్పష్టంగా వినబడేలా గంభీర స్వరంతో ఆయన ఉపన్యసించేవారు. కుటుంబంతో సహా నెలల తరబడి గ్రామాల్లో పర్యటిస్తూ ప్రవచనాలను కొనసాగించేవారు. సంగీతంలోనూ ఆయన నిష్ణాతులే. ప్రవచనాల మధ్యలో స్వయంగా స్వరపరచిన రాగాల్లో పద్యాలను పాడుతూంటే శ్రోతలు మైమరచిపోయేవారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఎడ్లబండ్లు కట్టుకొని వచ్చిమరీ లక్ష్మీనరసింహశాస్త్రి ప్రవచనామృతంలో మునిగిపోయేవారు. సాహిత్య ఉపన్యాసాలు ఇవ్వడంలోనూ లక్ష్మీనరసింహశాస్త్రి దిట్టే. నంద్యాలలో సూరన సాహిత్య సంఘం తనను సన్మానించిన సందర్భంలో విశ్వనాథ ‘రామాయణ కల్పవృక్షం’ మీద ఉపన్యసించి, అందరినీ మంత్రముగ్ధం చేశారు. 
‘‘ఏది రస స్వరూపమొ? మరేది భూర్భువరాది లోకమం/ దాదరువొ? మరెయ్యది పరాది చతుష్టయమూర్తి దాల్చి/ నాదము రూపముం దనరి నాట్యము సల్పునొ?...’’ అంటూ సాహిత్యాధిదేవతను స్తుతించారు లక్ష్మీనరసింహశాస్త్రి. ఇది ఆయన పద్యాలన్నింటిలో తలమానికమైంది. ప్రముఖ ఆంగ్ల కవి జాన్‌ మిల్టన్‌ తన ‘ప్యారడైజ్‌లాస్ట్‌’ అవతారికలో స్తుతించే స్వర్గాధిదేవతను ఇది గుర్తుకు తెస్తుంది. ‘ప్రభాతరేఖలు, వీరకంకణం’ ఖండ కావ్యాలు, నేత్రోన్మీలనం సంస్కృత కావ్యం లక్ష్మీనరసింహశాస్త్రి కలం నుంచి జాలువారాయి. రచనా ప్రౌఢత్వం, ధారాశుద్ధి, భావనైశిత్యం ఆయన సొంతం. లక్ష్మీనరసింహశాస్త్రి రచనల్లో మరొక అనర్ఘరత్నం ‘భీష్మ పరశురామ యుద్ధం’ పద్యనాటకం. ఇది అముద్రితం. బలిజేపల్లి, కందుకూరి, వెంకటపార్వతీశ కవుల నాటకీయత, సంభాషణాత్మకత, రసపోషణల పోహళింపు ఇందులో కనిస్తాయి. లక్ష్మీనరసింహశాస్త్రి అన్న పాణ్యం నరసరామయ్య కూడా మహాపండితులే. వీళ్లిద్దరూ ‘పాణ్యం సోదరులు’గా రాయలసీమలో వినుతికెక్కారు. నరసరామయ్య ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర’ రాశారు. ఇది ధార్వాడ విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా ఉంది. రాయలసీమ రత్నమని పేరుగాంచిన రంగస్థల నటులు వెల్దుర్తి వెంకటనర్సునాయుడు లక్ష్మీనరసింహ శాస్త్రి శిష్యులే. ‘‘రాగాన్ని, అభినయాన్ని సమన్వయం చేస్తూ పద్యనాటకాలను రక్తికట్టించే కళను శాస్త్రిగారే నేర్పించార’’నేవారాయన. శాస్త్రి కూడా మొదట్లో రెండు మూడు పద్యనాటకాల్లో దుర్యోధనుడి పాత్ర పోషించారు. ఈతరం అవధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ కూడా లక్ష్మీనరసింహశాస్త్రి దగ్గర అవధానంలో మెలకువలు నేర్చుకున్నవారే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డికి శాస్త్రి గురుతుల్యులు. ఒకసారి ముఖ్యమంత్రి వాహన శ్రేణి డోన్‌ నుంచి కర్నూలు వైపు వస్తోంది. ఉడుములపాడు అనే గ్రామం వద్ద ఎందుకో ఆ వాహనశ్రేణి ఆగింది. శాస్త్రి ఆ ఊరికి ఏదో పనిమీద వచ్చి, బస్సు కోసం రోడ్డు పక్కన ఎదురుచూస్తున్నారు. విజయభాస్కరరెడ్డి ఆయన్ను చూసి కారు దిగి నమస్కరించి, వెల్దుర్తి వరకు తనతోపాటు తీసుకెళ్లి దింపారట. అల్లసానివారి ‘‘ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి...’’ పద్యాన్ని గుర్తుకు తెస్తుందీ సంఘటన. 
      చివరిదశలో యోగాభ్యాసం, ఆధ్యాత్మిక విద్య వైపు మళ్లారు లక్ష్మీనరసింహశాస్త్రి. హైదరాబాదు మలక్‌పేటలోని తన గురువు శ్రీనివాస శివసచ్చిదానంద ఆశ్రమంలో ‘ఆత్మవిజ్ఞాన కళాశాల’ను స్థాపించి.. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, యోగవిద్యను పంచారు. ‘ఆధ్యాత్మ దర్శన అభ్యాసయోగం’ గ్రంథాన్ని రెండు భాగాలుగా ప్రచురింపజేశారు. మారుమూల పల్లెల్లోని ఎన్నో జీర్ణ దేవాలయాలను ఉద్ధరింపజేశారు. వెల్దుర్తి హరిజనవాడలో మారెమ్మ దేవాలయాన్ని నిర్మింపజేసి నిత్యపూజలకు ఏర్పాటు చేశారు. తన గురువును స్తుతిస్తూ ‘నక్షత్రమాల’ అనే 27 శ్లోకాల గ్రంథాన్ని రచించారు. మేటి పాండిత్యంతో ‘పౌరాణిక రత్న’గా చిరకీర్తిని అందుకున్న ఆయన 2000 మేలో స్వర్గస్థులయ్యారు. లక్ష్మీనరసింహశాస్త్రి, లక్ష్మీనరసమ్మ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, అయిదుగురు అబ్బాయిలు. 
      బమ్మెర పోతనామాత్యుని స్ఫూర్తితో లక్ష్మీనరసింహశాస్త్రి.. వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించారు. అరటి, ద్రాక్ష, నిమ్మ తోటలను పెంచుతూనే సాహితీసేవ చేశారు. డోన్‌ తాలూకాలో పట్టుపురుగుల పెంపకాన్ని తొలిసారి విజయవంతంగా చేపట్టిన ఘనత కూడా ఆయన సొంతం. తెలుగు భాషా సంస్కృతులను వెలిగించిన లక్ష్మీనరసింహశాస్త్రి లాంటి ఎందరో మహాపండితులు చరిత్ర పొరల్లో దాగి ఉన్నారు. వాళ్లందరినీ వెలుగులోకి తెచ్చి నేటి తరానికి పరిచయం చేయాలి.


వెనక్కి ...

మీ అభిప్రాయం