ప్రియమైన సోదరులారా.. ఓ మాట!

  • 233 Views
  • 0Likes
  • Like
  • Article Share

    నాయుడు వెంకటరావు

  • విశాఖపట్నం,
  • 9396831086
నాయుడు వెంకటరావు

కాలానికి అనుగుణంగా భాషలో కూడా మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. పాత పదాలు, అభివ్యక్తులు కనుమరుగై సామాన్య జన భాష వాడుకలోకి వస్తూ ఉంటుంది. తెలుగు బైబిల్‌లోకి కూడా మామూలు ప్రజల భాష రావాలని గట్టిగా ప్రచారం చేశారు డా।। నూకతోటి జయకుమార్‌ రావు. తెలుగులో తొలి అనువాద గ్రంథమైన బైబిల్‌లో, క్రైస్తవ ఆధ్యాత్మ సంబంధ అంశాల్లో చాలా వరకు పాత పదాలే కొనసాగుతూ వస్తున్నాయని, వాటిని సరళీకరించుకుంటేనే ప్రజలందరికీ క్రీస్తు బోధలు చక్కగా చేరువవుతాయని ఆయన చెప్పేవారు. 
ప్రకృతిలో
ప్రతిదాన్లో మార్పు అనివార్యం. భాషలో కూడా ఇది సహజం. గతంలో మనం ‘వ్రాయుడు’ అనే మాట వాడేవాళ్లం. ఆ తర్వాత అది ‘రాయుము’గా మారి, ప్రస్తుతం ‘రాయండి’గా స్థిరపడింది. ఒకప్పుడు పుస్తకాల్లో కనిపించిన ‘గైకొనుము, ఎద్ది, కొరకు’ లాంటి పదాలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఇతిహాసాలైన రామాయణ, భారత గ్రంథాల వ్యాఖ్యానాల్లో గతంలో గ్రాంథిక భాష, వ్యాకరణానికి అనుగుణంగా అరసున్నా, బండిర (ఱ) లాంటివి కనిపించేవి. కాలక్రమంలో ఇవి సరళ వ్యవహారిక భాషలోకి మారి.. ఇప్పుడు సులభ వచనంలోకి వచ్చేశాయి. క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథం బైబిల్‌ భాషలో కూడా ఇలాంటి మార్పులు అవసరమని వాడవాడలా ప్రచారం చేశారు జయకుమార్‌ రావు. ‘‘ప్రస్తుతం భాషాస్వరూపం మారిపోయింది. వాడుక భాష వచ్చేసింది. ఏది మాట్లాడుకుంటున్నామో అదే రాస్తున్నాం. సమాజం, భాష ఇంతలా మారుతున్నప్పుడు బైబిల్‌లో పాత పదజాలం ఎందుకు అలాగే ఉండాలి?’’ అని ప్రశ్నించేవారాయన. 
      జయకుమార్‌ రావు ప్రముఖ సంఘసేవకులు, క్రైస్తవ సువార్త ప్రచారకులు, కవి, రచయిత, సంపాదకులు. 38 ఏళ్లపాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆంగ్లోపన్యాసకులుగా, ప్రధాన ఆచార్యులుగా పనిచేశారు. ‘‘గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమం తర్వాత క్రమంగా సాహిత్యంలోకి వాడుక భాష వచ్చింది. ఆ మార్పులు క్రైస్తవ సాహిత్యంలోకి కూడా ప్రవేశించడానికి కొంత సమయం పట్టింది. ఎందరో ప్రసిద్ధ క్రైస్తవ రచయితలు వాడుక భాషలో పుస్తకాలు ప్రచురించారు. అయినా రాశి పరంగా అవి తక్కువే. దీనికి కారణం ఏంటా అని ఆలోచిస్తే, బైబిలు అనువాదంలో వాడిన రెండు వందల ఏళ్ల నాటి భాషకు క్రైస్తవులు అలవాటుపడిపోయారు. పైగా అది అనువాద భాష అనే విషయం మర్చిపోయి అవి దేవుడు మాట్లాడిన మాటలు అని ఒక బలమైన అభిప్రాయానికి వచ్చేశారు. మార్పులు చేయడం అపచారం, పాపం అనే భావనలోకి కొందరు వెళ్లిపోయారు’’ అనేవారు జయకుమార్‌ రావు.
అందరికీ అర్థంకావాలి 
తెలుగు బైబిల్‌లోని ‘కృపావరములు’ అంటే కృపతో దేవుడు అనుగ్రహించిన వరాలు అని అర్థం. దీన్ని ఇలా వివరంగా చెబితేనే అందరికీ సులువుగా అర్థమవుతుందని అనేవారు జయకుమార్‌ రావు. అలాగే ‘సువార్త’ అనే పదానికి బదులు శుభవార్త, మంచివార్త, మంచి కబురు లాంటి వాటిని ఉపయోగిస్తే బాగుంటుందనేది ఆయన సూచన. ‘నాకు దేవుడు సువార్త పిలుపునిచ్చాడు’ అని క్రైస్తవ ప్రసంగీకులు అంటారు. ఇతర మత విశ్వాసాల్లో దేవుళ్లకు మనుషులతో పని చేయించుకునే అలవాటు లేదు కాబట్టి ‘దేవుడి అనుగ్రహం వల్ల ఈ భాగ్యం కలిగింది’ అని చెబితే ప్రతి ఒక్కరికీ చక్కగా అర్థమవుతుందని అనేవారు. సామాన్యులకు సాధ్యంకాని అద్భుతకృత్యం చేయడం, దైవత్వ నిరూపణ కోసం చేసే క్రియ అనే అర్థంలో ‘సూచకక్రియ’ పదాన్ని వాడతారు. ఇతర మత విశ్వాసాల్లో ఇలాంటి భావం లేదు కాబట్టి ఈ పదాన్ని పూర్తి వివరణతో రాయాల్సిన అవసరం ఉందని చెప్పేవారు జయకుమార్‌. ‘నజరేయుడైన క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము’ అని చెబుతుంటారు. అందరికీ దేవుడైన క్రీస్తును నజరేతు అనే ప్రాంతానికి పరిమితం చేసి చెప్పడం సమంజసమా అని ప్రశ్నించేవారు. 
      తెలుగు క్రైస్తవ పరిభాషకు సంబంధించి వివిధ వేదికల మీద జయకుమార్‌ తన ఆలోచనలు పంచుకునేవారు ‘కృపామహదైశ్వర్యము, మహిమాతిశయము, కృపాసత్య సంపూర్ణుడు, ప్రేమాతిశయము’ లాంటి పదాలు సామాన్య ప్రజలకి ఎంత వరకు అర్థమవుతాయో ఆలోచించాలని చెప్పేవారు. తొలి బైబిల్‌ అనువాదాల్లో ఎవరో, ఎక్కడో అన్నదాన్ని గుడ్డిగా అనుసరిస్తూ రావడం ప్రస్తుత దేశకాల పరిస్థితులకు అనుగుణంగా లేదని బాధపడేవారు. ఇంకా ‘యదార్థవర్తనులు, యధార్థవంతులు’ పదాలకి ‘సత్యవర్తనులు, సత్యవంతులు’; ‘బైబిల్‌ గ్రంథంలో వ్రాయబడియునది, లేఖనములు సెలవిస్తున్నాయి’లకు ‘బైబిల్‌లో ఉంది’ అని, ‘విశ్వాసులు, అవిశ్వాసులు’ పదాలకి బదులు ‘నాస్తికులు, ఆస్తికులు’ లేదా ‘దేవుని మీద నమ్మకం ఉన్నవారు, లేనివారు’ అని, ‘పొందుకోవడం’ (కూడటం, కూడిక)కి మారుగా ‘సభ, సదస్సు’ అని, ‘ప్రియమైన వారలారా’ అనే సంబోధనకు ‘ప్రియమైన సోదరులారా, స్నేహితురాలా’, ‘కూటమి’కి బదులు సభ, సదస్సు, సమావేశం’; ‘స్తుతి, స్తోత్రము’ పదాలకి ‘నుతి, సన్నుతి, వందనం’ లాంటివి వాడితే అందరికీ సులభంగా అర్థమవుతుందని సూచించేవారు. బైబిల్‌లోని భాషకు సంబంధించి పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు జయకుమార్‌ రావు దీటుగా సమాధానం చెప్పారు. ‘‘రెండు వందల ఏళ్లుగా బైబిల్, సువార్తను ఈ పదజాలంతోనే ప్రకటిస్తున్నాం కదా. ఇప్పుడు మార్పు అవసరం ఏంటి?’’ అన్నారు కొంతమంది! ‘‘ఈ వాదనలో కొంతే నిజం ఉంది. పసిపిల్లల ముద్దుమాటలకు తల్లిదండ్రులు మురిసిపోతారు. అయితే, పాతికేళ్ల వయసున్న కొడుకు ‘అమ్మా, ఆమ్‌ పెత్తు’ అంటే అది కృతకంగా ఉంటుంది. నాబాధ కూడా అదే’’ అని బదులిచ్చారాయన.  
      ‘‘భాషలో మార్పు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒకదగ్గర ప్రారంభం కావాలి! దాన్ని ఇప్పటి నుంచే మొదలుపెడదాం. ఏళ్లుగా పాతుకు పోయిన పలుకులు ఒక్కసారిగా మారవు. గిడుగు వారి వాడుక భాషా ఉద్యమం గ్రాంథిక భాషకు ఉద్వాసన పలకలేదా! నేటితరం యువతకు గతించిన తరంలోని ఎన్నో పదాలకు అర్థాలు తెలియవు. ఇదేమీ విచిత్ర విషయం కాదు. మార్పు సహజం. అనివార్యం కూడా. ఇది నా ఆర్తి. ఈ ఉద్యమ స్ఫూర్తినందుకొని ఈ తరం వారు బైబిల్, సువార్త భాషలో మార్పు కోసం ప్రయత్నిస్తే, తర్వాతి తరాలవారు వాటిని అందిపుచ్చుకుంటారు’’ అని జయకుమార్‌రావు ఎప్పుడూ చెబుతుండేవారు. వాడుక భాషను ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వందల సంఖ్యలో సభలు నిర్వహించారాయన. ‘ప్రేమసాక్షి, శిష్యరికం, పరిపూర్ణ బహుమతి, పురుషోత్తమ చౌధరి చరిత్ర, మనసులోతుల్లోకి దూరి’ లాంటి గ్రంథాలు రచించారు. పత్రికలకు లెక్కకు మిక్కిలిగా వ్యాసాలు రాశారు. తన ఎనభయ్యో ఏట 2017 అక్టోబరు 2న ఈ లోకాన్ని విడిచిపెట్టిన జయకుమార్‌ రావు... క్రైస్తవ ఆధ్యాత్మిక సాహిత్యం, ప్రసంగాల్లో వాడుక తెలుగు కోసం తుదిశ్వాస వరకూ కృషిచేశారు. 
 


వెనక్కి ...

మీ అభిప్రాయం